Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
All eyes on Anushka

ఈ సంచికలో >> సినిమా >>

ఏవీఎస్ కి నివాళి

tribute to AVS

‘అదో తుత్తి..’ అనే డైలాగ్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఏవీఎస్ . కమెడియన్ గా, దర్శకుడిగా తెలుగు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఏవీఎస్ , రెండుసార్లు నిజజీవితంలో జన్మించారు. ఓసారి కాలేయం పాడయితే, తన కడుపున పుట్టిన కూతురే ఆయన్ను ఆదుకుంది. పునర్జన్మనిచ్చింది. రెండోసారి మాత్రం దేవుడు ఏవీఎస్ పక్షాన నిలవలేదు.

ఏవీఎస్ లేని లోటు పూడ్చలేనిదని తెలుగు సినీ పరిశ్రమ కన్నీరు పెట్టింది. ఏమంత వయసయిపోయిందని.? అని ఏవీఎస్ సన్నిహితులు ఆ దేవుడిపై చిరు కోపం ప్రదర్శించారంటే ఏవీఎస్ పై వారికి వున్న స్నేహ సంబంధాలెలాంటివో అర్థం చేసుకోవచ్చు. తోటి కమెడియన్లు తమ కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయామని ఆవేదన చెందారు.

దర్శకుడిగా పలు సినిమాలు తీసినా, విజయవంతమైన దర్శకుడిగా నిరూపించేందుకోసం తహతహలాడుతున్న ఏవీఎస్ , మన మధ్య లేరు అన్న విషయం జీర్ణించుకోవడం అంత సులభం కాదు. తెలుగు సినిమా పరిశ్రమపై దేవుడు శీతకన్నేసినట్టున్నాడు. మొన్న శ్రీహరి, నిన్న ఏవీఎస్ .. ఇద్దరు ప్రముఖుల హఠాన్మరణంతో తెలుగు సినీ ప్రముఖులు దేవుడ్ని ప్రశ్నించకుండా వుండలేకపోతున్నారు మరి.

ఏవీఎస్ .. మీరు లేకపోయినా, మీ నవ్వులు మీ సినిమాల రూపంలో మాతోనే వున్నాయి.. మీరెక్కడున్నా నవ్వులే.. స్వర్గంలోనూ మీ నవ్వులతో పైనున్నవారిని సంతోషపెట్టడం మానరుకదా!

మరిన్ని సినిమా కబుర్లు
charmi lose weight