Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> వంశీకి నచ్చిన కథ - తాతయ్య వాచి

taatayya wath telugu story

ఇది నా తిరుగు ప్రయాణం... తిరుగు ప్రయాణమే... ఎంతటి అలజడి కయినా, అనుభూతికైనా మెలికపడని లోహపు నాళాలలో ప్రవహిస్తూ ఉండిపోయిన స్తబ్దతపైన మృత్యువు చేవ్రాలు... తునాతునకలౌతున్న కుడ్యాల ఆవల ఆవిష్కృతమవుతున్న అలౌకిక ప్రపంచం.

ఇది నా తిరుగు ప్రయాణం. రెండు రోజులపాటు నానమ్మ దగ్గర గడిపిన తరువాత నాలోకి నేను చేస్తున్న తిరుగు ప్రయాణం.

చెంపమీద నానమ్మ పెదాల తడి. నోటినిండా నానమ్మ కలిపి పెట్టిన చక్కర పెరుగన్నం రుచి. గోదావరి సైకతాలపై నడుస్తూ ఆసరాకోసం నా భుజంపైన చేయివేసి ఆమె అంటించిన వెన్నెల మరక. అర్ధరాతిరి వరకూ వెన్నెల వాకిట్లో మేలుకుని నా గుండె వాకిట్లో పేల్చిన మాటల ముగ్గులు.

అన్నింటినీ మించి నా చేతికి నానమ్మ తొడిగిన రిస్ట్ వాచీ. అది తాతయ్యది. అది ఒక వాచీ మాత్రమే కాదు... ఒక బాధ్యత, ఒక కమిట్ మెంట్, ఒక సైరన్ ఒక వేదశాల... నాకు తాతయ్యకు మధ్యనున్న బంధాన్ని దృడం చేసిన అలౌకిక ఆవిష్కారం.


****    ****    ****    ****


ఇంటిలో నేను నా నిర్ణయాన్ని తెలిపినప్పుడు ప్రళయం ఎలా ఉంటుందో చూపించాడు నాన్న.

ముఫ్ఫై మూడేళ్ళ ఈ వయసులో నేను తీసుకున్న ఈ నిర్ణయం కాదు. పెళ్ళయిన కొత్తలోనే తీసుకున్నది.

ఒక సంతానాన్ని తాము కనాలని మరొకరిని అనాధాశ్రమం నుంచి తీసుకొచ్చి పెంచుకోవాలని.

దానిని మేమెప్పుడూ ఒక సామాజిక బాధ్యతగానో, మేము చేస్తున్న సేవగానో భావించలేదు. మేము ముందరే అనుకున్నాం. అది సంసారంలో జరిగే అత్యంత సహజ ప్రక్రియలాగే జరిగిపోవాలని. దానికి మేము మానసికంగా సిద్ధమైపోయాము.

పెళ్ళి జరిగి ఏడాదికి 'జ్ఞాపిక' పుట్టినప్పుడు మా ఇంటి కాంక్రీట్ ఫ్లోర్ లోంచి ఒక అద్భుతం మొలకెత్తినట్లుగా ఫీలయ్యాం.

ఆ అద్భుతం దినదినం శాఖోపశాఖలుగా విస్తరిస్తూ మమ్మల్ని నిలువెల్లా విస్మరిస్తూ మమ్మల్ని నిలివెల్లా ఆవరిస్తూ ఉంటే ఆ అలౌకిక అనుభూతికి తట్టుకోవడమే మావల్లకాక ఉక్కిరిబిక్కిరయ్యామెన్నోసార్లు.

పాప పుట్టినాక మా ఇంటిలోకి ఎన్నో వస్తువులొచ్చాయి. టీ.వి., సి.డి. ఫ్లేయర్, మ్యూజిక్ సిస్టం, ఫ్రిజ్, కంప్యూటర్... ఎన్నెన్నో... కాని ఏ వస్తువుకూడా పాప ఇచ్చిన ఆనందంలో వెయ్యోవంతు కూడా ఇవ్వలేకపోయాయి. నా ఈ ఫీలింగ్స్ కు ఆశ్చర్యపోయాడు మా నాన్న. నా వయసు వాళ్ళంతా కంప్యూటర్ ముందు కూచుని ఇంటర్ నెట్ లో చాటింగ్ చేస్తూనో... మరో పనిలో బిజీ అవ్వాలి. కాని ఇలా భార్యాపిల్లలతో గడపడమేంటి? ఇది ఆయనకో ఫజిల్.

ఎలక్ట్రానిక్ వస్తువును అవసరమున్నంతవరకు వాడుకుని పనయ్యాక స్విచ్చాఫ్ చేయాలి. అదే ఓ వ్యక్తితో అయితే అవసరాలతో నిమిత్తం లేకుండానే అనుబంధం పంచుకుంటూనే పోవాలనేది నే నేర్పరుచుకున్న సిద్ధాంతం. అందుకే ఏ యంత్రమైనా నాకది అవసరాల మేరకు ఉపయోగపడే యంత్రంలాగే కనిపిస్తుంది గానీ నా జీవితాన్ని, కాలాన్ని, వాంఛల్ని, అనుభూతుల్ని, జీవనశైలిని హైజాక్ చేసేంత బలమైన వస్తువుగా నేనేనాడూ భావించలేదు.

అందుకే మా నాన్న నాతో తరచుగా అనేమాట.

"వీడిని చిన్నప్పుడు మా నాన్న దగ్గిర వదిలేసి చాలా తప్పుచేశాను." ఆయన అలా అన్న ప్రతిసారీ నాలో ఒక రకమైన పులకింత.

నా బాల్యమంతా తాతయ్య నీడలో... పల్లెతల్లి చెంగుచాటున గడిపినప్పటి పులకరింత. అందమైన స్మృతి విహంగాలన్నీ రెక్కలు విప్పుకుని కనురెప్పల లోపలి అంచులో బారులుబారుగా విహరిస్తాయి. అలాని తాతయ్యకు నాన్నమీదగానీ, నాన్నకు తాతమీదగానీ ప్రేమలేదని కాదు. వారిరువురూ ఒకరినొకరు విడిచి ఉండడాన్ని అతి కష్టంగా భావించేవారు. మరో ఇద్దరు బాబాయ్ లున్నా నాన్న అంటే తాతయ్యకు ప్రాణం. నాన్న ఇంటికి మొదటి సంతానం.


****    ****    ****    ****


"ఏమండీ ఇలా రండి" పిలిచింది అనునయ.

"ఏమయింది?" అంటూ వెళ్ళాను.

చేతిలోని డైలీ పేపరు చూపెడుతూ... "ఈ వార్త చదవండి" అంది. చదివాను.

ఒక పాశ్చాత్యనగరంలో ఒక తల్లి షాపింగ్ కోసం వెళుతూ పార్కింగ్ ప్లేసులో కారును పార్క్ చేసి తన చిన్నారి పాపను అందులో ఉంచి కారు డోర్ లన్నీ లాక్ చేసి వెళ్ళింది. చాలా సేపటిదాకా ఆమె షాపింగ్ చేసి వచ్చేసరికి, కారులోపలి వేడికి ఆ పసిపాప చచ్చిపోయింది. కన్నకూతుర్ని ఆ స్థితిలో చూసి విసుకున్న ఆ తల్లి ఆ పాప శవాన్ని ఓ కాలువలో విసిరేసి వెళ్ళిపోయింది. తాను కొన్న సామాను మాత్రం భద్రంగా ఇంటికి తీసుకుపోయింది.

ఆరోజు రాతిరి అనునయ నేను ఇద్దరమూ నిద్దురపోలేదు. గుండెను కలిచివేసినట్లుగా అనిపించింది. జ్ఞాపికకు అటోవేపు ఇటోవేపు చేతులు వేసుకుని పడుకుని ఉండిపోయాము.

పెరుగుతున్న వస్తు సంస్కృతి, మారుతున్న ప్రాధాన్యాలక్రమం, మృగ్యమైపోతున్న మానవత్వం.

కొన్నాళ్ళు గడిచాక ఈ లోకంలో పడుతున్న సమయంలో మరో దారుణమైన వార్త చదివాము. అదీ ఈసారి మనదేశంలోనే జరిగిన సంఘటన.

"నా మూడో కూతురును చంపడానికి అనుమతినివ్వండి." అనేది ఆ వార్త టైటిల్. ఉదయంపూట టీ తాగుతూ పేపర్ చదువుతున్న నేను ఆ వార్త చదవగానే ఉలిక్కిపడ్డాను. బుర్రలో ఆలోచనలు గిర్రున తిరిగాయి. కారణాలేమై ఉంటాయి? అయితే పేదరికమైనా అయుండాలి లేదా వివక్షత అయినా అయుండాలి. కానీ నేనావార్తను పూర్తిగా చదివి అందులోని విషయాన్ని చూసి విస్తుపోయాను.

ఒక వ్యక్తి తన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇ- మెయిల్ పంపిస్తూ తన మూడో కూతుర్ని చెంపేయడం కోసం అనుమతినివ్వాల్సిందిగా అభ్యర్ధించాడు. ఆ వ్యక్తికి ముందుగా ఇద్దరు పిల్లలు పుట్టారట. భార్యకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించాడు. కాని కొద్ది సంవత్సరాల తరువాత ఆ ఆపరేషన్ ఫెయిలయ్యి మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది.

అతని అభిప్రాయం ఏమిటంటే తాను తన సంపాదనతో మొదటి ఇద్దరు పిల్లలను సంతృప్తికరంగా అంటే పిల్లలను మంచి లగ్జరియస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో చదివించడం. ఏ వస్తువులకూ లోటు లేకుండా పెంచడం. తన సంపాదన ఇద్దరు పిల్లలను సంతృప్తికరంగా పెంచడానికే సరిపోతుంది కాబట్టి మూడో అమ్మాయిని మామూలు సర్కారు బడికి పంపాలి.

కాని తన పిల్లను అలా మామూలుగా పెంచడమనేది తనకు ఇష్టం లేదు కాబట్టి ఆమెను చంపేయడానికి అనుమతీయమని ముఖ్యమంత్రిని వేడుకుంటూ పంపిన మెయిలది.

ప్రభుత్వ యంత్రాంగం హడలిపోయింది. ఆ ఇ - మెయిల్ పంపించిన వ్యక్తితో నిరంతరం సంభాషణలు జరుపుతూ కౌన్సిలింగ్ చేయడానికి ఒక జిల్లా కలెక్టరుకు బాధ్యతలను అప్పగించింది.

వస్తు సంస్కృతి మహాసర్పం కక్కిన విషపు సంస్కృతికి పరాకాష్ట ఆ సంఘటన. పిల్లల్ని చంపుకోవడానికి ఎవరూ ఊహించని ఓ కొత్త కారణం.

జ్ఞాపికకు అయిదేళ్ళు వచ్చాక మేము మరో పాపను లీగల్ అడాప్షన్ చేసుకుందామనుకున్నాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మేము ఆ ప్రయత్నంలో ఉండగానే విషయం నాన్నకు తెలిసింది. అదే అతను సృష్టించిన తుఫానుకు కారణం.


****    ****    ****    ****


"అలా చేయడానికి వీల్లేదు" అన్నాడు నాన్న.

"ఎందుకని?" అడిగాను నేను.

"చాలా కారణాలున్నాయి?"

"అవేమిటో చెప్పొచ్చుకదా" అన్నాను.

"నీకు తెలియదా సైకాలజీ ప్రకారం ప్రతి వ్యక్తిపైన అనువంశికత ప్రభావముంటుంది. నీవు తెచ్చుకోబోయే పాప యొక్క పేరెంట్స్... వాళ్ళ పూర్వీకుల గత చరిత్ర గురించి నీకేం తెలుసు?... ఒక నేర మనస్తత్వం ఉన్న పిల్లను మన కుటుంబంలో ప్రవేశపెడితే రేపేదయినా అనర్ధం జరిగితే"

"కానీ అదే సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసంలో అనువంశికతతో పాటు అతను పెరిగిన పరిసరాల ప్రభావమూ ఉంటుంది. మన కుటుంబంపైన, పరిసరాల పైన నాకు నమ్మకముంది"

"అసలు నువ్వు అలా చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు అంతగా పిల్లలు కావాలనుకుంటే బ్రహ్మాండంగా నువ్వే కనవచ్చు కదా... ఎంత మందినంటే అంతమందిని"

"మేము ఒక్కరినే కనాలనుకున్నాం"

"మరి సరిపుచ్చుకోవచ్చుగా"

"కానీ నాకు ఇద్దరిని పోషించే స్తోమత ఉంది"

"ఇట్లాంటి తిక్కతిక్క వాదాలతో చంపుకుతింటున్నావ్. రేపు నువ్వు సంపాదించిన ఆస్తి విషయంలో నీ తోబుట్టువులే కాదు నీ స్వంత కూతురు కూడా కోర్టుకెక్కవచ్చు"

"మీరు మరీ దూరం ఆలోచిస్తున్నారు. నాకంతగా అవసరం లేదు. నా గమ్యం పట్ల, నా గమనం పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది"

"నీ నిర్ణయాన్ని నేను ఆమోదించను. బహుశా అది నీకూ నాకూ మధ్యన ఉండే అనుబంధాన్ని విచ్చిన్నం చేస్తుందేమో" అన్నాడు నాన్న.

"నా నిర్ణయం మీకు ఎలాంటి ఇబ్బందినీ కలిగించనప్పుడు దాని గురించి మీరెందుకంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? మీ మాట వినడం మాత్రమే మీకూ నాకూ మధ్యనున్న
అనుబంధానికి కారణం అనుకోవడం మరీ దారుణం"

ఇంక నేనక్కడ ఉండలేదు. గుండెలో దేవినట్లయింది. మౌనంగా ఉండిపోయింది అనునయ. ఆమె మౌనం ఎప్పుడూ అనంత అనురాగ పరిమళాల్ని నావైపు ప్రసరింపజేస్తాయి.

సాయంత్రం తయారయ్యి బయల్దేరుతుంటే అడిగింది అనునయ "నానమ్మ దగ్గరికేనా?"

"అవును" అని కదిలాను.


****    ****    ****    ****


నానమ్మ దగ్గరకు వెళుతున్నానంటే నా బాల్యం లోకి, నాలోకి నేను ప్రయాణిస్తున్నట్లే.

నా బాల్యం మొత్తం అక్కడ గడిచిపోయింది మరి. ఉద్యోగరీత్యా నాన్న ఊళ్ళు తిరుగుతుంటే ఏడాది నిండగానే నన్ను తనదగ్గరే ఉంచేసుకున్నారు తాతయ్య, నానమ్మలు. ఏడో తరగతి పూర్తయ్యేదాకా అక్కడే ఉన్నాను. తాతయ్య ఒక అద్భుత ప్రపంచం. అవుసుల వెంకటేశం మాట మాట్లాడితే దానికి ప్రామాణిత ఉంటుందనేది ఆ గ్రామంలో అందరి అభిప్రాయం. ఆ ఊరుకే కాదు చుట్టుప్రక్కల గ్రామాలన్నింటికీ కూడా తాతయ్య ఒక ప్రేమ...

ఒక నిలువెత్తు ఆత్మీయత. తాతయ్య, నానమ్మల దగ్గర గడిపిన జీవితమే నాకు గుర్తుంది. ఎందుకంటే అది మాత్రమే నేను నిజంగా జీవించిన కాలమనేది నా నమ్మకం. పంటపొలాలు, గుట్టబోరు, గోదావరి ఒడ్డు, చెరువులో మునకలేసే సూరీడు పాలకంకుల మీద వాలిన ఆకుపచ్చని మేఘాలు, వెన్నెలవాన, కోయిలపాట, పంటకాలువ, తాతయ్య... నానమ్మ ఇదే కదా జీవితం. ఇన్నేళ్ళు గడిచినా మనసు బాగా లేకపోతే బ్యాగు భుజానేసుకుని నానమ్మ దగ్గరకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. నానమ్మ... ప్రతి చుగురుటాకుకూ తానొక ఆలంబన. ఆమె ఎగరేసిన మానవత్వపు జెండా.

అకస్మాత్తుగా ముందుకొచ్చిన వరద నీటిలో గోదావరిలో పుట్టి బోల్తాపడి కొట్టుకుపోతున్న వాళ్ళను రక్షించడం కోసం అందరూ భయపడుతుంటే తాతయ్య మాత్రం నదిలోకి దూకి చివరి వ్యక్తిని కూడా ఒడ్డుకు నెట్టేసి తాను మాత్రం గోదావరిలో లీనమైనప్పుడు ఊరు ఊరంతా రోదిస్తూ ఉంటే ఏడవని ఏకైక వ్యక్తి నానమ్మ మాత్రమే.

"ఎందుకేడవలేదే" అని అడిగితే -

"మీ తాత నాకు ఏడ్వడం ఎలాగో నేర్పలేదు కదా" అంటుంది మోనాలిసాలాగా నవ్వుతూ.

హృదయం అంతా పచ్చి గాయంలా సలుపుతుంటే ఆలోచనలన్నీ శూన్యమవుతుండగా భారంగా నానమ్మ ఊళ్ళోకి అడుగుపెట్టాను.


****    ****    ****    ****


భోజనం చేస్తూ విషయం చెప్పాను నానమ్మకు.

"గోదావరి వైపు వెళదాం"

నానమ్మ కలిపి పెట్టిన చక్కెర పెరుగన్నం తినేసి చేతులు కడుకుతూ ఉంటే అడిగింది నానమ్మ.

గోదారి ఒడ్డున నా భుజం ఆసరాగా చేసుకుని ఆమె నడుస్తుంటే గర్వంగా అనిపించింది నాకు. ఆకాశంలో ఎగురుతున్న జెండాలాగా ఛాతి విరుచుకుని నడువసాగాను. నా భుజాన్ని ఆసరాగా చేసుకున్న ఆ చేతులు మామూలు చేతులు కావు. తెలంగాణా సాయుధ పోరాటంలో తుపాకులు ఎక్కుపెట్టిన చేతులవి... రజాకార్ల గుండెల్లో ముందు పాతరలై నిద్రించిన చేతులవి.

గోదావరిలోకి దిగి ఒకచోట ఇసుకపైన కూచున్నాం. నాకు తెలుసు అదే స్థలంలో తాతయ్య నీటి ప్రవాహంలా గిరగిరా తిరుగుతూ చేయి ఊపిన దృశ్యం నా కళ్ళ ముందర అలాగే ఉంది. చాలాసేపటి దాకా ఏం మాట్లాడకుండా ఉంది నానమ్మ.

"నేను నీకో వస్తువునిస్తాను" అంది హటాత్తుగా.

తన కొంగుకు వేసివున్న ముడిను విప్పి ఒక వస్తువును బయటకు తోసింది నానమ్మ. దానిని నేను తేలికగా గుర్తుపట్టగలను. అది తాతయ్య రిస్ట్ వాచి.

తాతయ్య బతికినంతకాలం అది తాతయ్య చేతికి ఉంది. గోదావరిలో మనుషులు కొట్టుకుపోతున్నప్పుడు దూరం నుండి చూసి అటువైపు పరిగెడుతూనే ఆ వాచీని తీసి నానమ్మ వైపు విసిరి వెళ్ళిపోయాడు. తాతయ్య శవం దొరకలేదు. గోదావరికి తాతయ్యకు మధ్యనున్న ప్రేమ అట్లాంటిది.

తాతయ్య చివరిగా ఇచ్చివెళ్ళిన వాచీని మాత్రం అతిభద్రంగా దాచుకుంది నానమ్మ. నా చేతికున్న వాచీని తీసేసి తాతయ్య వాచీని నా చేతికి పెట్టింది.

"ఏంటీ వాచీ పెట్టడంలో ఉద్దేశ్యం?"

"ఈ వాచీ మొదటిసారి మీ తాతయ్య ధరించినప్పుడు అప్పుడది కొత్త మోడల్. కాలక్రమంలో ఎన్నో రకాల గొప్పగొప్ప వాచీలు వచ్చినా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినా తాను మాత్రం ఈ వాచీని వదలలేదు"

"కానీ ఈ వాచీ చూడడానికి లేటెస్ట్ మోడల్ లాగే ఉంది?" అన్నాను.

"అదే దాని ప్రత్యేకత. మా తాతయ్య కొత్త మోడల్ ను ఏనాడూ ద్వేషించలేదు. మొదటిసారి మన ఊరిలోకి డాంబర్ రోడ్డు వచ్చినప్పుడు టిప్పర్ గోతిలో దిగబడితే దానిని పైకి లేపే సమయంలో ఈవాచీకున్న పాతబెల్ట్ తెగిపోయింది.

కానీ మీ తాతయ్య లేటెస్ట్ మోడల్ బెల్ట్ వేయించుకున్నాడు. ఆ తదుపరి గ్రామంలో ఎన్నో మార్పులు జరిగాయి. తాతయ్య వాచీలో కూడా కేస్, డయల్, గ్లాసు అన్నీ పాతవిపోయి కొత్తకొత్త మోడల్స్ వచ్చి చేరాయి. కాని లోపలి మూమెంట్ ని మాత్రం ఎప్పుడూ మార్చలేదు. అది సహజమైనది, ఎలాంటి మార్పుకూ లోనుకానిది.

ఈ వాచీని చెవిపై పెట్టుకుంటే మీ తాతయ్య గుండె చప్పుడు వినిపిస్తుంది. అదీ మీ తాతయ్య జీవనశైలి. ఆయన ఆధునికతను ఏనాడూ వ్యతిరేకించలేదు" గోదావరి ఒడ్డుమీద నానమ్మతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుంటే గాఢమైన నిశ్శబ్దం ఆవరించసాగింది.

చల్లని పిల్ల తమ్మెరలు మసక చీకటి తెరలు మమ్మల్ని అల్లుకోసాగాయి.

తాతయ్య ప్రతి సాయంత్రమూ నన్ను తనతో పాటు గోదావరి ఒడ్డుకు తీసుకోచ్చేవాడు. ప్రతి సంఘటననూ, ప్రతి అనుభూతినీ గోదావరి సాక్షిగా నా గుండెల్లో రికార్డ్ చేసేవాడు. ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ అదే గోదావరి ఒడిలో నానమ్మతో కలిసి నడుస్తుంటే తాతయ్య పదేపదే గుర్తుకు రాసాగాడు.

తాతయ్యతో నా జీవితం ఎంతగా ముడిపడి పోయిందంటే... ఆయన జ్ఞాపకాలు నన్ను తీవ్రాతి తీవ్రమయిన వేదనకు గురిచేశాయి.

హఠాత్తుగా ఆగిపోయింది నానమ్మ. నేనూ ఆగిపొయాను. తదేకంగా నాకేసి చూసింది నానమ్మ.

"ఒక అనాథను పెంచుకోవాలన్న ఆలోచన నీకెందుకొచ్చింది. ఎవరూ చెప్పారలా చేయమని"

"అలా అని ఎవరూ చెప్పలేదు. మొదటి నుండి నాకా ఆలోచన ఉండేది. అనునయతో పెళ్ళయిన తరువాత మరింత బలపడింది"

హఠాత్తుగా వచ్చి నా చెంపపైన ముద్దు పెట్టింది.

"మీ తాతయ్య అనేవాడు"

"ఏమని?" అడిగాను.

"తన ప్రతిరూపమే నువ్వని. నీ ప్రతి ఆలోచనా తనదేనని, నీ ప్రతికలా, ప్రతికదలికా తనదేనని" నానమ్మ కళ్ళల్లో జివ్వున చిమ్మిన నీళ్ళు.

"ఏంటే ఏడవడం ఎవరు నేర్పారు నీకు కొత్తగా" అన్నాను చాలా ఆశ్చర్యంగా.

"కంటి నుండి జారే ప్రతి కన్నీటి చుక్కా దుఃఖంతో వచ్చేదే అయిఉండదు"

ఇంటికి చేరేసరికి చీకటయ్యింది.

జొన్న రొట్టెలు తినేసరికి వెన్నెల వాకిలంతా పరుచుకుంది. వాకిట్లో పండువెన్నెల వానలో నానమ్మ పక్కనే పడుకున్నాను.

"నానమ్మా నా నిర్ణయం సరైనదేనా?"

నీకు ఒక రహస్యం చెబుతాను... ఇది కేవలం మీతాతయ్యకు నాకు తప్ప ప్రపంచంలో మరెవ్వరికీ తెలియని రహస్యం... నీ కడుపులో దాచికుంటావనే నమ్మకంతో చెబుతున్నాను. అదీ సందర్భం వచ్చింది కాబట్టి..." అంటూ ఆగింది -

"చెప్పు" క్యూరియస్ గా అడిగాను. నానమ్మ అంత సీరియస్ గా ఎప్పుడూ ఉపద్ఘాతం చెప్పదు. ఎందుకో కొద్దిగా భయమేసింది.

"ఇప్పుడు కాదు. రేపు ఉదయం నువ్వు వెళ్ళేప్పుడు చెబుతాను" అన్నది.

"సరే... అలాగే..." కొద్ది నిముషాల మౌనం.

"మీ తాత చెప్పేవాడు. 'దేర్ ఈజ్ నథింగ్ పర్మినెంట్ ఎక్సెప్ట్ చేంజ్' అని. సృష్టిలో ఆది నుండి మార్పుకు లోనుకాని వస్తువేదీ ఈ ప్రపంచంలో లేదు. ఆధునికతను, నూతన ఆవిష్కరణలను వ్యతిరేకించడం అనేది మన మేధస్సును మనం వంచించుకోవడమేనని..." అంది నానమ్మ.

నిశ్శబ్దంగా ఉండిపోయాను.

"మార్పును ఆయన ఏనాడూ వ్యతిరేకించలేదు. ప్రతి ఆవిష్కరణను ఆయన పరిపూర్ణ స్థాయిలో వీక్షించేవాడు. అనుసరించేవాడు.

కాని గుడ్డిగా మాత్రం కాదు. తనను తాను కోల్పోయేంతగా నేనేం మాట్లాడలేదు అనుసరించలేదు. అనుసరిస్తూనే నిరంతరం తన ఆత్మను ఆవిష్కరించుకుంటూనే ఉండేవాడు"

"పొద్దున నువ్వు చెప్పిన రెండు సంఘటనలు అత్యంత హేయమైనవి. వస్తువుల పైన, ఆధునిక జీవన శైలి పైన మనిషి పెంచుకున్న వ్యామోహానికి పరాకాష్ట అది. ఈనాటి ప్రపంచంలో ఎలక్ట్రానిక్ రంగంలో చేయబడుతున్న ప్రతి కొత్త ఆవిష్కరణ మనిషిని వస్తు సంస్కృతివైపు తీవ్రంగా తీస్తోంది. ఇంట్లో రెండ్రోజులుగా పిల్లవాడు జ్వరంతో పడుకుంటే కోల్పోయే అల్లరిని ఏమంతగా పట్టించుకోని తల్లి రెండ్రోజులు టీ.వీ. పాడై మూలనపడి ఉంటే ఎంతో కోల్పోయినట్టు తల్లడిల్లిపోతోంది.

ఆధునికతలో ఏది స్వీకరించాలో దానిని వదిలేసి ఏది స్వీకరించకూడదో దాని స్వీకరిస్తున్నాడు మనిషి. తనది కాని పరాయి బతుకును బతుకుతున్నాడు. వాటికి అతీతంగా ఎవరో ఒకరు నీలాంటి వాళ్ళ ఆస్తిత్వం. ఇంకా మన మూలాల్ని సజీవంగా ఉంచుతోంది" సంతోషంగా అన్నది నానమ్మ.


****    ****    ****    ****


ఇది నా తిరుగు ప్రయాణం. నాలోకి నేను చేస్తున్న ప్రయాణం. చెంప పైని నానమ్మ పెదాల తడి కోసం తడుముకున్నాను. గుండె యవనిక పైన తాతయ్య జ్ఞాపకం కోసం తడుముకున్నాను. కళ్ళల్లో నీళ్ళు జివ్వున చిమ్మాయి.

నేను తిరుగు ప్రయాణానికి తయారవుతుంటే నన్ను ఒళ్ళోకి తీసుకుంది నానమ్మ.

"నానమ్మా... నిన్న చెప్తానన్న రహస్యం చెవిలో చెబుతావా?" అన్నాను గుసగుసగా.

"అదేం కాదుగానీ ఈ రహస్యం నీతోనే సమాధి అయిపోతుందని నాకు మాటివ్వు" అంది నా చేతిని తన తలపై ఉంచుకుని.

"నానమ్మా" అన్నాను కంగారుగా... నానమ్మను అలా ఎప్పుడూ చూడలేదు. "చూడు... నువ్వు తీసుకున్న నిర్ణయమే యాభై ఏళ్ళ క్రితం మేము కూడా తీసుకున్నాము. కాకపోతే నువ్వు ఒకరిని కన్న తరువాత దత్తత తీసుకుందామని అనుకున్నావ్. మేమేమో... కనేకన్నా ముందే ఒక అనాథను దత్తత చేసుకుందామనుకున్నాము. ఆచరించాము..." అంటూ ఆపేసింది.

నా కాళ్ళకింద భూమి కదిలిపోతుందేమో అనిపించింది. కళ్ళ నీళ్ళు జివ్వున చిమ్మాయి.

"సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను"

నానమ్మను గట్టిగా లాక్కుని హత్తుకుని ముద్దు పెట్టుకుని బయల్దేరాను. చేతికున్న వాచీలోంచి తాతయ్య గుండె చప్పుడు వినిపిస్తూనే ఉంది.
 


 

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు
chitti chilakamma aksharabhyaasam