Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrydayam

ఈ సంచికలో >> సినిమా >>

ఏవీ బాలల చిత్రాలు?

Where is Children Films

ప్రతి రెండేళ్ళకొకసారి జరుపుకునే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఈసారి కూడా హైదరాబాద్ లో జరుగుతున్నది. నవంబర్ 14 నుండి 20 వరకు జరుగుతున్న ఈ బాలల చలన చిత్రోత్సవం పద్దెనిమివది. ఎంతో ఖర్చుపెట్టి చాలా గొప్పగా ఈ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతటి గొప్ప ఉత్సవంలో మన తెలుగు చిత్రాలు ఎన్ని? అవి ఏవి? అంటే దాదాపుగా లేవనే సమాధానం వస్తుంది. ఎందుకంటే బాలలకోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఫిలిం ఫెస్టివల్ లో తెలుగు చిత్రపరిశ్రమకు విధిగా బాలల చిత్రాలు నిర్మించాలన్న నియమం ఏదీ విధించడం లేదు మన రాష్ట ప్రభుత్వం. పరాయి భాషల్లో వచ్చిన చిత్రాలు, ఇతర దేశాల బాలల చిత్రాలపై ఆధారపడి బాలల చిత్రోత్సవాన్ని జరుపుతున్నది.

'పాపం పసివాడు', 'మరో ప్రపంచం', 'లేత మనసులు', 'బాలరాజు కథ', 'రేపటి పౌరులు', 'తేజ', 'లిటిల్ సోల్జర్స్', 'పొదరిల్లు', 'భాల భారతం', 'భారతి', 'కొట్టు', 'భద్రం కొడుకో', 'ధోనీ', తదితర ఎన్నో సినిమాలు బాలలకోసం, బాలలే ముఖ్యపాత్రధారులుగా నటించినవి తెలుగులో అనేకం వచ్చాయి.

బాలల చిత్రాలను పరిశ్రమ ఎప్పుడో మర్చిపోయింది. వారికి లాభాలను తెచ్చిపెట్టే కమర్షియల్ చిత్రాలు మాత్రమే కావాలి. విదేశాల్లో బాలల కోసం అనేక సినిమాలను నిర్మిస్తున్నారు. కొన్ని కొన్నిసార్లు బాలలే వీటిని తీస్తున్నారు. ఇరాన్ దేశంలో పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీసే చిత్రాలు అనేకం తీస్తున్నారు. ఆ సినిమాలు మనపిల్లలకు భాషాపరంగా అర్ధంకాకపోయినా, దృశ్యప్రధానంగా, కథలో ఉన్న నీతి, ధర్మం, మొదలైనవి పిల్లలను ఆకట్టుకుంటున్నాయి. అనేక బహుమతులు కూడా గెలుచుకుంటున్నాయి. ఇటువంటి బాలల చిత్రాలు మన తెలుగులో కనీసం ఊహించనైనా ఊహించలేం. అంత అట్టడుగు స్థాయిలో ఉంది మన చిత్ర పరిశ్రమ.

భారతదేశంలో తొలి త్రీడీ సినిమా వచ్చింది మలయాళంలో. ఆ సినిమా 'మై డియర్ కుట్టి చేతన్' (తెలుగులో 'చిన్నారి చేతన' గా డబ్బింగ్ చేయబడింది). ఈ సినిమా బాలలకోసమే తీసారు. భారతదేశంలో గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన కూడా దాదాపుగా అందరూ పిల్లలతోనే 'అంజలి' సినిమా తీసి విజయం సాధించారు. 'యాదోంకి బారాత్' సినిమాలో బాలనటుడిగా చేసిన అమీర్ ఖాన్ తర్వాతి కాలంలో సూపర్ స్టార్ గా ఎదిగి ఈ మధ్యనే 'తారే జమీన్ పర్' అనే సినిమా మానసిక పిల్లవాడి నేపధ్యంలో తీసి ఘనవిజయం సాధించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. మరి మన తెలుగు హీరోలు, దర్శకుల్లో ఎంతమంది ఇలా బాలలకోసం చిత్రాలను నిర్మిస్తున్నారు అంటే ఫలితం శూన్యమే!

బాలల సినిమాలకు తెలుగులో సరైన ఆదరణ లేదా లేక ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల సినిమా కథలనే నమ్ముకొని చిత్రాలు తీయాల్సివస్తుందని బాలల సినిమాలు తీయడం లేదా? 'నేటి బాలలే రేపటి పౌరులు'. అలాంటి బాలల కోసం సంవత్సరానికి కనీసం పది సినిమాలన్నా తీయవలసిన అవసరం లేదా మన తెలుగు చిత్ర పరిశ్రమకు? రేపటి పౌరులకు ఓ చక్కని సినిమాన్ని అందించవలసిన బాధ్యతను మన పరిశ్రమ మరచిపోతున్నది. ప్రతి రెండేళ్ళకోసారి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంను జరుపుకుంటున్నాం. కానీ బాలల కోసం ఒక్క సినిమాను కూడా అందించలేకపోతున్నాం. కనీసం కొన్ని బాలల చిత్రాలను మనం కూడా నిర్మించి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో పాల్గొనేటట్లుగా ప్రయత్నం చేయాలి. బహుమతులు ఏవీ రాకున్నా ఫర్వాలేదు. కనీసం పరువు అన్నా దక్కుతుంది. ఆ విధంగా మన దర్శక నిర్మాతలు ఆలోచిస్తారని మనసారా ఆశిద్దాం!

మరిన్ని సినిమా కబుర్లు
thodikodallu - mrugaraju, rambabu