Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - MASALA

ఈ సంచికలో >> సినిమా >>

జీవితంలో న‌టించ‌డం చేత‌కాదు! - రామ్‌

Interview with Ram

హుషారుకి నిలువెత్తు నిదర్శనం రామ్. అతని చలాకీతనం చూస్తే ముచ్చటేస్తుంది. ఆ వయసులో మనం అలా ఎందుకు ఉండలేకపోయామే... అని బాధ కూడా వేస్తుంది. పాత్రల్లో దూసుకుపోయే తత్వం, అతని ఎనర్జీ... ఇవన్నీ రామ్ ని ఈతరం ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఒక హిట్టూ, ఒక ఫ్లాపూ అంటూ రామ్ సినీ ప్రయాణం సమ తూకంలోనే సాగుతోంది. తన పరాజయాన్ని దాచుకోడు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోడు... అది రామ్ లోని గొప్పదనం. చిన్నవాడైనా పరిణితితో ఆలోచిస్తాడు. మీ నటన పవన్ కళ్యాణ్ కి కాపీలా ఉంది.. అన్నా దాన్ని ఓ కాంప్లిమెంట్లా స్వీకరిస్తాడే తప్ప కామెంట్ అనుకోడు. ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త పరాజయాల తరవాత రామ్ చేసిన సినిమా మసాలా ఈ చిత్రం విడుదల సందర్భంగా రామ్ చెప్పిన సంగతులు...

చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారు..?
- (నవ్వుతూ) అలాఉన్నానా..?  లోపల మాత్రం చాలా టెన్షన్ ఉందండీ బాబూ.

మసాలా గురించేనా..?
ఎస్.. కష్టపడి చేసిన సినిమా. చాలా ఆశలు పెంచుకొన్నా. అందుకే రిజల్ట్ ఎలా ఉంటుందా?? అని టెన్షన్!!

అంత కష్టం ఏం పడ్డారు?
నిజానికి ఆ పాత్ర ఒప్పుకోవడమే ఓ సాహసం. ఇప్పుడున్న యువ కథానాయకుల్లో ఆ పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఎందుకంటే కాస్త తేడా తేడా గా (నవ్వుతూ) ఉంటుంది కదా..? అందుకు.

మరి మీరెందుకు ఒప్పుకొన్నారు..?
మన శైలిని మనమే బ్రేక్ చేయాలి కదండీ..? ఎప్పుడూ ఒకే తోవ పోతే కొత్తదనం ఏముంటుంది? అందరూ చేసే పాత్రనే, అందరూ ఎంచుకొనే కథలనే నేనూ ఎంచుకొంటే ఇక నా ప్రత్యేకత ఏం తెలుస్తుంది?

ఇద్దరు హీరోలున్నారు. హీరోయిజాన్నీ, సన్నివేశాల్ని సమానంగా పంచుకొన్నారా?
ఆ పంపకాల గురించి ఆలోచిస్తే ఈ సినిమా మొదలయ్యేదే కాదు. వెంకటేష్ గారికీ ఈ ఆలోచనలు లేవు, నాకూ లేవు. ఇద్దరికీ సినిమా బాగా రావాలనే ధ్యాస తప్ప మరోటి లేదు. నిజానికి `బోల్ బచ్చన్ చేద్దాం` అంటూ వెంకీనే ముందు అడిగారు. అంత పెద్ద కథానాయకుడు అడిగే సరికి నేను కాదనలేకపోయా. ఇక కొలతల ప్రస్తావన ఎందుకు వస్తుంది?

వెంకటేష్తో నటించడం కంఫర్ట్ గా ఫీలయ్యారా?
చాలా. మా బ్యానర్లో ఆయన రెండు సినిమాలు చేశారు. అప్పట్లో సెట్కి నేనూ వెళ్లేవాడిని. ఎలాంటి భేషజాలూ లేకుండా మాట్లాడతారు. ఆయన దగ్గర నేను చాలా ఫ్రీగా మూవ్ అయ్యేవాడిని. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ... పరిశ్రమకు నాలుగు స్థంభాల్లా నిలిచారు. అందులో ఒకరితో నటించే అవకాశం రావడం మామూలు విషయమా?

ఇక నుంచీ మల్టీస్టారర్లకు సిద్దమేనా..?
నేనెప్పుడో సిద్ధం. సినిమా అంతా నా చుట్టూనే తిరగాలి అనే క్యాలిక్లేషన్స్ నా దగ్గర లేవు. అంతిమంగా సినిమా ఫలితం బాగుండాలి. ఏ హీరోతో అయినా కలసి నటించడానికి సిద్ధమే. కానీ కథ నచ్చాలి. ఆ విషయంలో నేను ప్రయోగాలు చేయలేను.

మరి దర్శకులు మీ దగ్గరకు కొత్త కథలతో వస్తున్నారా?
నా శైలి అందరికీ అర్థమైపోయింది. వీడి దగ్గర కథ ఓకే చేయించుకోవాలంటే మేటర్ ఉండాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేశారు.

మీకు కథ నచ్చాలంటే దానికి ఎలాంటి అర్హతలు ఉండాలి?
ఆ కథ కోసం నేనేం చేసినా ఫర్లేదు అనిపించాలి.. అంతే!

మరి హిట్లూ, ఫ్లాపు పట్టించుకోరా?
అది కూడా చాలా ముఖ్యం. కానీ యేడాది పాటు కష్టపడి ఓ సినిమా చేయాలంటే.. అందులో అంత స్టఫ్ ఉండాలి అనుకోవడంలో తప్పులేదు కదా..?  సినిమా వచ్చిన తరవాత ఫలితం ఎలా ఉంటుందో మనం ఊహించలేం. కనీసం సినిమా చేస్తున్నప్పుడైనా ఎంజాయ్ చేయాలి కదా..?

ఒంగోలు గిత్త చేస్తున్నప్పుడు ఒళ్లు హూనమైపోయింది. కానీ ఫలితం రాలేదు. బాధ పడ్డారా?
ఆ సినిమా విషయంలో కష్టపడిన మాట వాస్తవమే. అయితే మాకు మేమే కొన్ని తప్పులు చేశాం. దానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో ప్రేక్షకులు చూపించారు.

ఫ్లాపులను బాగానే ఒప్పుకొంటారే....?
నేను సినిమాల్లోనే నటిస్తానండీ. బయట నటించలేను.

కథ నచ్చి, సెట్స్పైకి వెళ్లిన తరవాత కూడా వదులుకొన్నారు కదా..?
అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంత్య నిష్టూరం కంటే, ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా?  అందుకే ముందే తప్పుకోవడం మేలు అనుకొని కొన్ని సినిమాల్ని వదులుకొన్నా. అయితే ఆ విషయంలో ఎప్పుడూ బాధ పడలేదు. చేతిలో ఉన్న సినిమాకి ఏం చేయగలనో ఆలోచిస్తా తప్ప, ఒక్కసారి జారిపోయిన సినిమా గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోను.

మీ కెరీర్లో ఫ్లాపులూ, హిట్లూ సమానంగా ఉన్నాయి కదా..?
ఫ్లాప్లు ఉంటేనే కదా, హిట్ విలువ తెలిసేది.

ఇంతకీ మసాలా ఎలాంటి సినిమా..?
కంప్లీట్ ఎంటర్టైనర్. నవ్వీ నవ్వీ మీ పొట్ట ఉబ్బిపోతుందన్న భయంతో మధ్యలో విశ్రాంతి కార్డు వేశాం. లేదంటే అలాగే కంటిన్యూ చేసేవాళ్లం. అంత హాయిగా ఉంటుంది. లాజిక్లను వెతుక్కోకుండా సినిమా చూస్తే, తప్పకుండా ఎంజయ్ చేస్తారు. ఆ గ్యారెంటీ నాది.

తరవాతి సినిమా ఏంటి?
ఇంకా ఏమీ అనుకోలేదు. 2013లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లదు. కొత్త యేడాది, కొత్త నెలలో... కొత్త సినిమా ఉంటుంది.


--కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cini churaka by cartoonist bannu