Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - మసాలా

Movie Review - MASALA

చిత్రం: మసాలా
తారాగణం: వెంకటేష్‌, రామ్‌, అంజలి, షాజన్‌ పదమ్సీ, ఎం.ఎస్‌. నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, కోవై సరళ, పోసాని కృష్ణమురళి తదితరులు
ఛాయాగ్రహణం: ఐ ఆండ్రూ
సంగీతం: తమన్‌
నిర్మాణం: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్రవంతి మూవీస్‌
నిర్మాతలు: సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్‌
దర్శకత్వం: విజయభాస్కర్‌
విడుదల తేదీ: 14 నవంబర్‌ 2013

 

క్లుప్తంగా చెప్పాలంటే:
నమ్మినోళ్ళ కారణంగా మోసపోయి, అన్నీ కోల్పోయి అక్క సానియా (అంజలి)తో కలిసి బతుకు తెరువు కోసం భీమరాజపురం అనే ఊరికి వెళతాడు రెహమాన్‌ (రామ్‌). తప్పనిసరి పరిస్థితుల్లో తను ముస్లింని కానని, హిందూ అని తన పేరుని రామ్‌గా చెప్పాల్సి వస్తుంది రెహమాన్‌కి. ఒక అబద్ధానికి తోడు ఇంకో అబద్ధం, అలా అబద్ధాలతోనే రామ్‌, ఆ ఊరి పెద్ద బలరామ్‌ (వెంకటేష్‌) దగ్గర ఉద్యోగంలో చేరతాడు రామ్‌. బలరామ్‌ చెల్లెలితో రామ్‌ ప్రేమలో పడటం, రామ్‌కి తన చెల్లెలినిచ్చి, రామ్‌ అక్కని తాను పెళ్ళాడాలని బలరామ్‌ అనుకోవడం జరుగుతుంది. రామ్‌ బండారం బయటపడిందా? కథ సుఖాంతమైందా? అనేది మిగతా కథ. అది తెరపై చూడాలి.

 

మొత్తంగా చెప్పాలంటే:
బాలీవుడ్‌ సినిమాని తెలుగులోకి రీమేక్‌ చేశారు యధాతథంగా. పెద్దగా కష్టపకుండా, యాజిటీజ్‌గా తెలుగులోకి అనువదించేయగా, వెంకటేష్‌, రామ్‌ల ఇమేజ్‌ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమైంది. వెంకటేష్‌, రామ్‌ ఇద్దరూ తమకు కొట్టిన పిండి లాంటి పాత్రల్లో రాణించారు. ఇద్దరూ తెరపై హుషారుగా వుండటంతో ఇరువురి అభిమానులూ ఖుషీ అవుతారు. కొంచెం వెరైటీగా రామ్‌ ఈ సినిమాలో అటూ ఇటూ కాని గెటప్‌లో కన్పించాడు. ఆ పాత్ర చేయడం ద్వారా కొత్త దనాన్ని చాటుకున్నాడతడు. ప్రతి సన్నివేశంలో కామెడీ పండించడంలో వెంకటేష్‌, రామ్‌ పోటీ పడ్డారు. అంజలి, వెంకటేష్‌కి జోడీగా సరిపోయింది. అయితే ఫిజిక్‌ పరంగా ఆమె జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కెరీర్‌ గాడి తప్పొచ్చు. షాజాన్‌ పదమ్సీ ఫర్వాలేదు. నటన పరంగా చాలా మెరుగవ్వాలి. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.

 

వెంకటేష్‌ ఇంగ్లీష్‌లో చెప్పే డైలాగులు బాగుంటాయి. అయితే అది కొంతవరకే. మొదట్లో బాగా అనిపించినా, పదే పదే అదే ఇంగ్లీషు డైలాగులతో కొంచెం బోర్‌ అనిపిస్తుంది. థమన్‌ సంగీతం ఏమంత ఆకట్టుకోదు. రెండుపాటలు బాగుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇబ్బంది పెడుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో సినిమాటోగ్రఫీ పనితనం బాగా బయటపడింది. ఎడిటింగ్‌ ఓకే. యాక్షన్‌ సన్నివేశాలు అదనంగా కొన్ని జోడించారు తెలుగులో అంతే. మాస్‌ని మెప్పించే అంశాలవి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ముందే చెప్పినట్టు దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తన పనితనం చూపించి వుంటే సినిమాకి మైలేజ్‌ ఇంకా పెరిగేది.

 

మాటల్లో చెప్పాలంటే: ఈ మసాలా... గొప్పగాలేదు, కానీ తక్కువేం కాదు.

 

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with Ram