Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cini churaka by cartoonist bannu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrydayam

డా. డి.రామానాయుడు గారు
ఈయన పేరు హెడ్డింగ్ గా పెట్టి రాయడం మొదలు పెడితే, కాలం కాలువై, కాలువ చెరువై చెరువు నదై, నది సంద్రమై, తెలుగు సినిమా గ్రంధమవుతుంది. తెలుగు సినిమా నిఘంటువులో 'నిర్మాత అని వెతికితే నిర్వచనంగా ఈయన పేరు ఉండొచ్చు. ఎన్ని విశేషణాలు రాసినా సరిపోని విలక్షణ నిర్మాత నాయుడుగారు. అందుకని వాటి జోలికి పోకుండా ఆయన్నిలా తయారు చేసిన గుణగణాలని విశ్లేషించుకుందాం. కొంతమందికైనా స్పూర్తి రావచ్చు.

మేధస్సుని నమ్మి సినిమా నిర్మించి, ప్రేక్షకుడి మెప్పు పొంది, తద్వారా డబ్బు సంపాదించి, ఆ డబ్బుని మళ్ళీ సినిమా పరిశ్రమ మీదే పెట్టుబడిగా పెట్టి తామెదుగుతూ, పరిశ్రమని ఎదగనిచ్చిన మంచి లక్షణం ముందు తరం నిర్మాతలది. ఇప్పుడలా కాదు - ఎక్కువ డబ్బు పెట్టి సినిమా తీసి, ఎక్కువ థియేటర్లలో వేసి, డబ్బులు చేసుకుని, రాజకీయాల్లోనో, రియల్ ఎస్టేట్ లోనొ, క్రీడల్లోనో పెట్టుబడులు పెట్టడం ఈ తరం నిర్మాతల నిర్మాణ శైలి. ఈ పద్ధతిలో మేధస్సుతో పని లేదు. హీరోని తెచ్చుకునేవాడే దర్శకుడు. లేదా నిర్మాతే హీరోని తెచ్చుకుంటే, చెప్పు చేతల్లో ఉండే వాడే దర్శకుడు. 'మేధస్సూ అన్న కాన్సెప్టు సినిమా మేకింగ్ ప్రాధాన్యతలో అయిదోదో, ఆరోదో - అది కూడా మొహమాటంకొద్దీ. ఆ తరంలో శిక్షణ పొంది, ఈ తరంలో కూడా క్రమశిక్షణ కోల్పోకుండా, అప్పుడప్పుడు కఠిన శిక్షలు పడుతున్నా లొంగిపోకుండా ఉన్న నిర్మాత నాయుడుగారొక్కరే.

 

కథని బట్టి కాస్టింగ్, కాస్టింగ్ ని బట్టి ప్రాజెక్ట్ కాస్ట్(బడ్జెట్) నిర్ధారించుకొని సినిమా మొదలుపెట్టడం ఆరోగ్యకరమైన నిర్మాణం. అడ్వాన్సిచ్చి, డేట్స్ తీస్కోవడం, ఆ డేట్స్ లోపల కథలల్లడం, బడ్జెట్లు పెరిగిపోతున్నాయని గుండెలు బాదుకోవడం, మీటింగ్ లు పెట్టి, షూటింగ్ లు మానెయ్యడం, చివరికి క్యారావాన్ లు కూడా కంట్రోల్ చెయ్యలేక చేతులెత్తేయడం - ఇది ఇప్పటి తొంభై శాతం చిత్రాల నిర్మాణ శైలి.

 

నాయుడి గారి గురించి రాయాలంటే కేవలం ఆయనలో ఉన్న మంచిని మాత్రమే కాదు, ఆయన శైలికి భిన్నంగా పరిశ్రమలో జరుగుతున్న చెడుని కూడా ప్రస్తావించాలి. ఆ తేడాయే ఆయన గొప్పతనం - ఆయన పద్ధతి.

వందకు పైగా చిత్రాలు నిర్మించడం,అన్ని అధికార భాషల్లోనూ చిత్రాలు నిర్మించడం, స్టూడియోలు కట్టడం, రాజకీయాల్లో చేరి ఎం.పి. గా పుట్టిన ఊరిని ఇతోధికంగా అభివృద్ధి చేయడం - ఇవన్నీ మనకు తెలిసినవే. పెద్ద కొడుకుని సమర్ధుడైన నిర్మాతగా, రెండో కొడుకుని అగ్రహీరోల్లో ఒకరిగా, ఇద్దరు మనవల్నీ స్టార్ హీరోలుగా తీర్చి దిద్దడం కూడా తెలిసిందే.
 

కానీ నిర్మాతగా ఒక కథని ఓకే చేసాక దానిని చెయ్యటానికి ఇంటా, బయట హీరోలు కాదంటే వేరే ఎవరన్నా అయితే కథ మారుస్తారు. నాయుడు గారు మాత్రం ఆర్టిస్టు ని మారుస్తారు. మారిన ఆర్టిస్టుల ప్రకారం బడ్జెట్ ని నియంత్రిస్తారు. కానీ ఏ దశలోనూ కాగితం మీద రాసుకుని ఓకే అనుకున్న సీన్ ని డబ్బుకి కక్కుర్తిపడి అక్షరం కూడా మార్చమనరు. బడ్జెట్ కోసం ఆలోచనల్లో భావ దారిద్ర్యాన్ని అంగీకరించరు. సినిమా హిట్ అవ్వాలి అనకుండా సినిమా బాగా రావాలి అని రోజూ అనే ఏకైక నిర్మాత పరిశ్రమలో నాయుడు గారే. తాపీ చాణక్య, కే. ఎస్. ప్రకాశరావు గారు, దాసరి గారు, రాఘవేంద్ర రావు గారు, సింగీతం గారు, జంధ్యాల గారు, బి. గోపాల్ గారు, సురేష్ కృష్ణ గారు లాంటి ఇంకా ఏందరో పెద్ద దర్శకులతో చిత్రాలు నిర్మించినా కూడా మాలాంటి చిన్న దర్శకులతో వర్క్ చేసేప్పుడు కూడా డైరెక్టర్ కి అంతే వాల్యూ ఇస్తారాయన. ఇప్పటికీ కథ అంటే హీరో బ్రహ్మానందాన్ని ఇరికించడమో, ఏడిపించడమో కాదు. నవరసాలు నిండిన సంఘటనల సమాహారం అని, సినిమా అంటే లడ్డు లాగ ఉండాలి అని, ప్రతి ఫ్రేమ్ రిచ్ గా, కన్నుల పండువుగా వుండాలని తాపత్రయపడతారాయన.

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన దగ్గర చేరటానికి ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో లక్కీగా మాధవపెద్ది సురేష్ గారు ఆ సంస్థలో తాతా - మనవడు చిత్రానికి పనిచేస్తున్నారు. అంతక్రితమే బృందావనం, భైరవ ద్వీపం, శ్రీ కృష్ణార్జున విజయం, మూడు సినిమాలకి ఆయనే సంగీత దర్శకులు కాబట్టి నాకు రామానాయుడు గారిని కలవటం చాలా తేలికైంది. తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసి, చెన్నై లో వున్న బాబ్జీ గారికి ఫోన్ చేసి, నా గురించి అడిగి ఆ తర్వాత నాకు చెప్పారిలా... ''నాకు క్లాప్ కొట్టి, ఎడిటింగ్ రిపోర్ట్ రాసే అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి. నెలకి వెయ్యి రూపాయల కట్నం ఇస్తాను (1995 లో). అన్ని పనులు తెలిసిన కో - డైరెక్టర్లు అక్కర్లేదు, ఆల్రెడీ ముగ్గురున్నారు (కాశీ గారు, చంద్రమహేష్ గారు, తాడి రంగవరప్రసాద్ గారు) వీళ్ళల్లో ఎవరైనా దర్శకుడయ్యాక నిన్ను పిలుస్టాలే" అన్నారు. ఒక్క సెకన్లో ఆలోచించాను. నేను డబ్బుల కోసం ఆయన దగ్గర పనిచేయట్లేదు. కేవలం కెరీర్ కోసం చేస్తున్నాను. నా అసిస్టెంట్ డైరెక్టర్ నేనే అయిపోతే బెటర్ కదా! తర్వాత పై ముగ్గురిలో ఎవరు దర్శకులైనా నాకు ప్రమోషన్ వస్తుంది కదా - అని, వెంటనే క్లాప్ కొట్టడానికి ఒప్పేసుకున్నాను. ఆయనే జాలిపడి నెలకి రూ. 1500/- ఇచ్చారు బాగోదని. తాతా మనవడు ఆఖరి షెడ్యూలు - రోజూ ఎడిటింగ్ రూముకొచ్చి సురేష్ బాబు ఆ సీన్ బాలేదు, ఈ షాట్ బాలేదని తిడుతుండేవాడు. ప్రతిసారీ అప్పుడు నేను లేనండి అనేవాణ్ణి. ఆయనకే చిరాకొచ్చి, నువ్వుంటే పెద్ద బాగా తీయనిచ్చేవాడివేంటి? డైరెక్టర్ తియ్యాలి కదా! అన్నారు. కనీసం ఇక్కడిదాకా రాకుండా అక్కడే బాలేదని చెప్తాం కదండీ అన్నాను.

 

అయితే నువ్వు నా సినిమాకి రా - జయంత్ డైరెక్షన్, వెంకటేష్ హీరో - చూస్తాను ఏం చేస్తావో - అన్నారు. మీరు సూపర్ హిట్ కొడతారు చూడండి అనుకున్నాను మనసులో - అదే జయంత్ గారి ప్రేమించుకుందాం - రా! కో-డైరెక్టర్ కాశీ గారితో మంచి స్నేహం, గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావు గారి ఆత్మీయ శిష్యరికం, సురేష్ దగ్గర మోడరన్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ నేర్చుకోవడం, జయంత్ గారి శుశ్రూష - వెరసి అన్ని యాంగిల్స్ లోనూ ఒక అసోసియేట్ డైరెక్టర్ నేర్చుకోవడానికి, నేర్చుకున్నది అప్లై చేయడానికి, అప్లికేషన్  బావుంటే నిష్పక్షపాతంగా అప్రిసియేషన్ పొందడానికి, తద్వారా నలుగురికీ తన ప్రతిభ తెలిసి మరిన్ని అవకాశాలు రావడానికి వేదిక - సురేష్ ప్రొడక్షన్స్. ప్రతిరోజూ ఆ కాంపౌండ్ లో నాకు పండగే. నాయుడిగారి సిద్దాంతాలకీ, సురేష్ బాబు ప్రాక్టికాలిటీకి వైరుధ్యం - ఆలోచనల యుద్ధం - నేర్చుకుంటే, ఏ ఫిల్మ్ ఇన్ స్టిట్యూటూ నేర్పలేని పాఠాలు - క్రియేటివిటీకి కూడా హద్దులెలా వుండాలి? ఎంతుండాలి ? ఎందుకుండాలి? విశృంఖలంగా ఎందుకుండకూడదు? ప్రేక్షకుల్లో రోజురోజుకీ వస్తున్న మార్పుల్ని ఎలా అధ్యయనం చేయాలి? సమయస్పూర్తితో వాటిని మనం, జరుగుతున్న సినిమాల్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇలాంటివెన్నో ముఖ్యమైన మైండ్ సెట్టింగ్ అండ్ ట్రెండ్ సెట్టింగ్ అంశాలమీద పూర్తి శిక్షణ ఆ కాంపౌండ్ లో పనిచేస్తేనే లభిస్తుంది. సినిమాని ప్రేక్షకుడి కోసం తీస్తున్నామన్న స్పృహ అణువణువునా నిండిన నిర్మాత డా॥ డి. రామానాయుడు గారు. అదే సంస్థలో దర్శకుడిగా 'ముగ్గురు' చిత్రానికి పనిచేయడం మధురానుభూతి.

 

కేవలం హిట్ సినిమాల వల్ల వ్యక్తిలోని ప్రతిభని అంచనా వేయకుండా ఆ వ్యక్తి పడే కష్టం వాళ్ళ అతన్ని ప్రోత్సహించే అరుదైన నిర్మాతలు రామానాయుడుగారు, సురేష్ బాబు. అదే జయంత్ గారికొచ్చింది, కాశీగారికొచ్చింది - పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ గారు, దీన్ రాజ్ గారు, బలభద్రపాత్రుని రమణి గారు, వెలిగొండ శ్రీనివాస్, 'అల్లరి'నివాస్, ఇంకా ఎందరో ప్రముఖ రచయితలు, రచయిత్రులు తమ సృజనకి నాయుడిగారిలాంటి ఆరోగ్యకరమైన పెత్తనాన్నే కోరుకుంటారు. సంగీత దర్శకులు, కెమెరామెన్ లు, దర్శకులు, నటీనటులు, అన్ని శాఖల్లోనూ సినిమాల్లో పనిచేసే వాళ్ళు ఆ సంస్థలో ఆయన సాన్నిహిత్యంలో కొంతకాలం పనిచేయడాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు.

 

రామానాయుడు గారికి సినిమా అంటే ఇష్టం - సినిమా అంటే పిచ్చి - సినిమా అంటే ప్రాణం - ప్రేమ్ నగర్ లో ఏ. ఎన్. ఆర్. గారు మందుకి ఎడిక్ట్ అయినట్టు, నాయుడు గారు సినిమాలకి ఎడిక్ట్ అయ్యారు. అన్ని శాఖల పనితీరు మీదా అవగాహన ఉంది. ఆయా శాఖలో శిఖరాగ్ర స్థాయి వ్యక్తులతో కలిసి వర్క్ చేసిన అనుభవం ఉంది. అయినా ఈ రోజు వరకూ దర్శకత్వం చేయలేదు - నటుడిగా సరదాగా ఓ నిముషం కనిపించడమే తప్ప తన మీద తనే సినిమా తీసుకోలేదు - ప్రేక్షకుణ్ణి, సినిమాని, తన వృత్తిని ఆయనెంత సీరియస్ గా తీసుకుంటారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మారుతున్న సమాజాన్ని బట్టి కంటెంట్ లో ఎన్ని మార్పులైనా రావచ్చు - అందుకోసం నిబద్ధతలోను, పనిమీద మమకారంలోను, మంచి వ్యక్తిత్వంలోను, వ్యాపారంలో ఆరోగ్యకరమైన ప్రణాళికల్లోను, క్రమశిక్షణలోను, కొత్తవారిని, ప్రతిభావంతులని ప్రోత్సహించడంలోను, పెద్దవారిని, సమకాలీనుల్ని గౌరవించడంలోను మార్పు రానక్కర్లేదు కదా! అలా మారని మనిషి రామానాయుడు గారు.

 

ఆయన అదృష్టం కొద్దీ విజయా సంస్థలో ట్రైనింగ్ అయ్యి నిర్మాతయ్యారు. నా అదృష్టం కొద్దీ విజయా సంస్థనుంచి ఆయన దగ్గరకొచ్చి ట్రైనింగ్ అయ్యాను. ఆయన తీసిన సినిమా సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుడిగా చూశాను. ఆ సూపర్ హిట్ సినిమాల వెనుక ఆయన కృషిని టెక్నీషియన్ గా చూశాను. ప్రతీ సినిమాకి ఒక పర్యాయం తనకు తాను పునరంకితమైపోవడం ఆయన దగ్గరే చూశాను. పదికాలాల పాటు నిలబడగలిగే దర్శకుడవ్వాలంటే ఓ మంచి దర్శకుడి దగ్గర కొన్ని సినిమాల కన్నా పనిచేయాలన్నది ఎంత నిజమో, మంచి నిర్మాత అవ్వాలంటే ప్రతి నిర్మాత నాయుడు గారి దగ్గర ఒక్క సినిమా కన్నా ప్రొడక్షన్ లో పనిచెయ్యాలి. ఒక్క సూపర్ హిట్ ఇచ్చి 'నేనే' ఇండస్ట్రీ అని ఎందుకనకూడదో తెలుస్తుంది.

 

పదేళ్ళకు పైగా ఆ సంస్థలో పనిచేస్తున్న మాధవరపు రాజాగారు, రమేష్ గారు, మూర్తి గారు, జగదీష్ గారు, ఎడిటర్లు మార్తాండ్ కె. వెంకటేష్, కె.వి. కృష్ణారెడ్డి గారు, కోటి గారు, శ్రీలేఖ గారు, చంద్రబోస్ గారు ఇంకా చాలా మంది... అందరూ అదృష్టవంతులే. పని చేసిన వారి ఫోటో స్టూడియోలో పెడతారు. ఆ ఫోటో కోసం వర్క్ చేశాను 'ముగ్గురు' సినిమా. నవదీప్, అవసరాల శ్రీనివాస్, రాహుల్ కూడా అంతే. ఆ స్టూడియోలో మన ఫోటో ఉంటే, మనం తెలుగు ఇండస్ట్రీలో 'సమ్ థింగ్' అని సర్టిఫికెట్ సంపాదించినట్లే. దటీజ్ రామానాయుడు గారు. రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా సాహెబ్ ఫాల్కే, ఎన్ టి ఆర్, ఏ ఎన్నార్ లలాగ, తానే తన పేర్న ఒక అవార్డై పరిశ్రమ ప్రముఖుల్ని అలరించే 'హాట్ టార్గెట్' రామానాయుడు గారు - ఆ అవార్డు స్వీకరించడానికే అందరూ కష్టపడే స్థాయి రామానాయుడు గారు - ఆయన మీద అభిమానంతో పొగడట్లేదు - ఆయన్ని అబ్జర్వ్ చేసిన అధికారంతో రాస్తున్నాను.

 

ఇందులో ఏ ఒక్క విషయంతో, ఎవ్వరు ఏకీభవించకపోయినా పబ్లిక్ గా చర్చకి సిద్ధం...

 

వచ్చేవారం... (అంజనా ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత శ్రీ కె. నాగబాబు గారి గురించి...)

మీ
వి.ఎన్.ఆదిత్య  

మరిన్ని సినిమా కబుర్లు
Where is Children Films