Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
adigedimeere answericchedi meere

ఈ సంచికలో >> శీర్షికలు >>

హ్యూమరసం - వారణాసి రామకృష్ణ

లీకులు- లింకులు

లీకులకి లింకులకి లింకేంటి అని ముందుగా మన బాడి లోంచి అనుమానం లీకవుతుంది. ఐతే కాస్త ఇవరంగా ఇసయాల్ని ఇన్నాక అవును  సుమీ, లీకుకి లింకుకి తెగ పెద్ద లింకు దాగి ఉందీ అన్న విషయం మనకి అర్ధం అవుతుంది! లింకులు సామాన్యమైనవి కావు అవి ఎక్కడెక్కడి లింకుల్ని లీక్ చేస్తాయి. లీకులు అంత తేలిగ్గా కొట్టిపారేసేవి కావు, అవిఎక్కడెక్కడి లింకుల్ని లాగి బైట పెడతాయి. అంచేత సెప్పోచ్చేదేoటంటే .. అమ్మో చెప్పను! ఇప్పుడు అస్సలు చెప్పను, విషయం బైటికి లీకయిపోతుంది. ఆఖర్లో చూద్దాం!

 

శాసనసభ సమావేశాల ముందు సీఎం లకి ఆవేశం వస్తుంది.ఎందుకూ అంటే సమావేశo పదంలో ఆవేశం లింకయి వుందని కాదు సమావేశాల్లో ఏమి చర్చించారో ఆ చర్చలు లీక్ అయి పత్రికల్లో వార్తల్లా లింకయి పోతాయి. మంత్రి వర్గం లోనే ఎవరో వార్తని లీక్ చేసారని అర్ధం అవుతుంది. అంతే! ఇంటి దొంగ లింక్ ఎక్కడుందో ఎవరికీ లీక్ చేసాడో ఆరా తియ్యమని ఇంటలిజెన్స్ కి ఆదేశం వెళ్తుంది. రాజకీయాల్లో లింకు రాజకీయాలు లీకు రాజకీయాలు అని వేరు వేరుగా వుండవు. అవి రెండు చక్కగా పడుగు-పేకలా పెనవేసుకుని నిత్యం లీక్ అవుతుంటాయి. అందుకే తాత ఒక పార్టీలో ఉంటే మనవడు ఇంకో పార్టీలో చేరి ఇరు పార్టీల ఇసయాల్ని లీక్ చేసుకుంటారు. అట్లాగే తండ్రి అధికార పార్టీలో కూతురు ప్రతిపక్ష పార్టీలో చేరి ఎక్కడికక్కడ ఏం జరుగుతోందో రేపు ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ లో ఎవరు చేరితే ఎలాంటి రాజికీయం చెయ్యొచ్చో తరచూ ఇంట్లో బోయినాల దగ్గర చర్చల్లో లీక్ చేసుకుని లింకుని సదా జాగర్తగా కాపాడుకుంటారు.

***    ****   *****

అభివృద్ధి చెందిన దేశాలని పేరుకే గానీ నిజానికవి వెర్రిపప్పు వెనకబడిన దేశాలు! అస్సలు లీకుల బుద్ది లేదు వాళ్లకి! ఎలా సంపాయించుకోవాలి అనే లింకులు కూడా తెలీని వాజమ్మలు! ముఖ్యం గా మున్సిపాలిటీ ఉద్యోగాల్లో మనం ఇలాంటి యవ్వరాలు గమనించొచ్చు. మచ్చుకి మనం వాష్ బేసిన్ దగ్గర ఫేసు కడుగుదామని నల్లా తిప్పితే గోదారీ బ్యారేజీ నీళ్ళురాక మూసీ డ్రైనేజీ నీళ్ళు బోటబొటా లీకవుతాయి. కంగారు పడి ఏంటి విషయం అని కనుక్కుంటే వీధిలోతాగునీటి గొట్టం డ్రైనేజీ గొట్టం రెండూ చక్కగా రామలక్ష్మణుల్లా కలిసి మెలిసి పోయాయని వార్త లీక్ అవుతుంది. అసలు మంచి నీటి గొట్టం, డ్రైనేజీ గొట్టం వాలి సుగ్రీవుల్లాంటివి కదా ఎప్పుడూ అవి రోడ్డుకి కుడివైపు ఒకటి ఎడమ వైపు ఒకటి వెయ్యాలి కదా అలాంటిది అన్నదమ్ముల్లా కలిపి వేసేరు ఏంటని మనం అమాయకంగా లాజిక్ లింకు చేసుకుని జుత్తు పీక్కుంటాం కానీ లోన అధికారుల మధ్య వున్న లింకులు మరిచి పోతాం! రెండు చోట్ల తవ్వకాలు దేనికి దండగ రోడ్డు మజ్జిలో ఒక చోట తవ్వి రెండు గొట్టాలు వేసేసి కాంట్రాక్టు పూర్తి అయినట్టు చూపించుకుంటే పైసలు మిగులుతాయి. ఈ మాత్రం బుద్ది లేక అభివృద్ధి చెందిన దేశాల్లో అనవసరంగా రెండు గొయ్యిలు తవ్వి రెండు గొట్టాలు వేసి లింకులు పాడుచేసుకుంటారు. డ్రై నేజీ నీళ్ళు లీకు కాకుండా చిలక్కొట్టుడు అర్ధం చేసుకోక వెర్రిపప్పు దేశాలని మనం చెప్పుకునేలా పేరు తెచ్చుకుంటారు! 

****   *****    *******

‘గజ’ దంతాల గజదొంగ వీరా వీరప్పన్ ఘన సెరిత్ర అందరికీ తెలిసిందే! అడవి లో ఒక సామ్రాజ్జం ఏర్పాటు చేసి కలప ఎర్రచందనాలతో బాటు ఏనుగు దంతాలూ బైటి ప్రపంచానికి చేరవేశాడు.ఎక్కడికక్కడ లింకులు పెట్టుకుని తన స్తావరం ఎక్కడుందో లీక్ కాకుండా జాగర్తలు తీసుకున్నాడు. చివరికి వీరప్పన్ చావుకి కారణం కూడా లింకే! విషయం ఎక్కడా లీక్ కాకుండా రక్షకభటుల అధికారి పకడ్బంధీగా వీరప్పన్ లింకు పట్టుకుని విజయవంతంగా యమభటులకి అప్పగించాడు. అదో గొప్ప లీకు లింకుల సెరిత్ర!

***   ****    *****

సినీమాల్లో లీకులు సూపరుంటాయి. పాత కాలం విలన్ హీరొయిన్ ని డెన్ లో బందిస్తాడు. డెన్ ఎక్కడుందో కమెడియన్ కనిపెట్టి హీరో కి లీక్ చేస్తే హీరో లింకు పట్టుకుని గెడ్డంమీసాలు పెట్టుకుని డెన్ లో దూరుతాడు. తమాషా ఏంటి అంటే హీరొయిన్, విలన్ తప్ప మనందరం హీరోని గుర్తుపడతాం! వాళ్లిద్దరూ మాత్రం లింకు పట్టుకోలేక వచ్చి రాని హిందీకి తెలుగు లింకు చేసి పిచ్చపిచ్చ గా మాట్లాడుతూన్న హీరో ని అబ్బురంగా చూస్తారు. హీరో హీరోయిన్ కి కన్ను కొట్టి కొంచెం గడ్డం లాగి తానెవరో లీక్ చేస్తే హీరొయిన్ నవ్వుతూ ’తీస్తా నీ తోలు కోస్తా నీ వేలు’ ఓ పాటేసుకుని విలన్ని బఫూన్ చేస్తుంది. ఇద్దరూ డెన్ లోంచి బైట పడతారు.ఈ టైపు లింకులు –లీకులు కాన్సెప్టు తో కొన్ని లక్షల సినీమాలు వచ్చేయి. 

ఇంకొన్ని లింకు–లీకు సినిమాలు ఉంటాయి. ఒక నిర్మాత ‘పెళ్ళాన్ని చంపటమెలా?’ అనే సినిమా తీస్తుంటే, అది ఓ ఆంగ్ల చిత్రం కి కాపి అని వార్త లీక్ అవుతుంది, దాంతో ఇంకో నిర్మాత ‘పరలోకం లో పెళ్ళాం’ అనే సిన్మా స్టార్ట్ చేస్తాడు. ప్రెస్ మీట్ లో ఎవరైనా మీ కథ కి  ఆ సిన్మాకి పోలికలున్నాయని అంటే డైరెట్టరు ‘అబ్బే మా సిన్మా దేనికీ పోలిక కాదు కాకపోతే వాళ్ళు తీసే పిచ్చేర్ ‘హౌ టు కిల్ వైఫ్’ కి కాపీ అని లింకు తెగ్గొట్టి విషయం లీకు చేస్తాడు.

****    *****    *****

మన పిల్లకాయల పరీచ్చల లింకులు-లీకులు భలే గుంటాయి! దీన్లో బోలెడన్ని లీకులు లింకులు పెనవేసుకుని ఉంటాయి. టీచరమ్మ కుర్రాడికి పరీచ్చ పేపరు ఇవ్వబోతే వద్దులే టీచర్ మీరే ఉంచుకుని ఆన్సర్ షీట్ ఇవ్వండి చాలు అంటాడు.అదేంటని ఆశ్చర్య పోతే విద్యార్ధి జేబులోంచి ప్రశ్నాపత్రం తీసి చూపిస్తాడు. ఇదేక్కడిది అంటే నిన్నే వాట్సప్ లో వస్తే ప్రింట్ తీసిపెట్టుకున్నా టీచర్ అని పళ్ళికిలించి నవ్వుతాడు. పరీక్షకి ముందే ప్రశ్నాపత్రం ఎట్లా లీక్ అయ్యింది అని అడక్కూడదు. దానికి శానాలింకులు వుంటాయి. ఈ విషయం మీద మా సుబ్బారావు తెగ ఆవేశంగా ‘తూ దీనెమ్మ ఇదో క్లాసు నుంచి ఐ ఐ టి దాకా అన్ని పరిక్షా పత్రాలు ముందే లీకు అవుతాయి.మన ఇండియాలో టెంతు, ఇంటర్, ఇంజనీరింగ్ ఏ ఒక్క పరీక్ష అయినా లోపం లేకుండా సాఫీగా నిర్వహిస్తారా? విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది’ అని ఆయాసంతో వగరిస్తే మా అయోమయం అప్పారావు నవ్వి అన్నా ఎందుకన్నా బీపి తెచ్చుకుంటావు అన్ని డిపార్ట్ మెంట్లలో పని చేసేది మడుసులే! ఎక్కడన్నా ఉండేది లీకులే! నడిసేది లింకులే! అన్నాడు. నిజివే! ఎవడికి వాడు ఎదుటి డిపార్ట్ మెంటు సరింగా నడవట్లేదు అనుకుంటూ తన దగ్గరికొచ్చే సరికి లింకు పట్టుకుని తన పని సాఫీగా చేసుకుంటాడు. తనకి కావాల్సిన విషయం లీక్ అవటానికి మార్గం వెతుకుతాడు. అంచేత మనకి లీకులు లింకులు లేనిదే బతుకు నడవదు. వోల్ మొత్తం సిస్టం లో మార్పు రావాలి అంటాం గానీ ఆ మార్పు మనకి లింకు చేసుకుని మంచిని లీక్ చెయ్యం! ఇది జరగనంత కాలం లీకులు లింకులు ఉండనే ఉంటాయి. ఇవి వద్దు అని మనం అందరం ఒక్క తాటిమీద వుండి డిసైడ్ చేసుకుంటే గానీ కనిపించవు. చట్టాలతో లింకులు లీకులు పోవు! ఆ లింకుల్ని మనం లోపలే తెగ్గొట్టి ఫుల్లు గా లీక్ చేసెయ్యాలి!!

***   ****    *****

సరే ఆఖరికి వచ్చేశాం కాబట్టి ఒక ముఖ్యమైన విషయం లీక్ చేస్తాను. లింకు పట్టుకుని చదవండి! పైన ఆకాశంలో ఓజోను పొర అంటూ ఒకటి ఉందని అది సూరీడు (కొంపదీసి YSR అనుచరుడుఅనుకునేరు, కాదు) వదిలిన అతినీలలోహిత కిరణాల్ని(అల్ట్రా వయొలెట్ రేస్) నేరుగా మన నెత్తిన పడకుండా మజ్జిలో గొడుగులా పట్టి కాపాడుతుందని మనం బుక్కుల్లో సదివాం! అంతే కాక ఎక్కువ ఫ్యాక్టరీలు పెట్టి గాల్లోకి కార్బన్ డై ఆక్సైడ్ వదిలితే ఓజోను పొర కి సిల్లు పడి అది కిరణాల్ని లీక్ చేసి మనల్ని డై అనగా సంపుతుందనీ సదవటం వరకు సదివాము కానీ గాల్లోకి కాలుష్యం మాత్తరం వదలకుండా మానం! సాంబార్ కి తమిళియన్ కి లింకు వున్నట్టు బొగ్గుపులుసు వాయువుకి ఓజోన్ పొరకి అంత లింకు ఉందనీ పొర చిల్లు పడితే కిరణాలు లీక్ అవుతాయని అర్ధం చేసుకోకపోతే మానవాళి కి ముప్పు గ్యారెంటీ అనీ ఈ సందర్భంగా అందరికీ మరోసారి ఇసియం లీక్ చేస్తున్నాను! ఆనక ఏం జరిగినా ఎవడితోనూ లింక్ వుండదు అందరం చకచకా బాల్చీలు తన్నేస్తూ పరమాత్ముడిలో సింక్ అయిపోవటమే!

మరిన్ని శీర్షికలు
chamatkaaram