Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pancharatnalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

శలభం

కొన్ని కళ్లు తెరిపించే(?) విషయాలు మీతో పంచుకోవాలని ఉంది.

మనిషిని ఆశ నడిపిస్తుంది. డబ్బు మీద వ్యామోహం ఊపిరిపోస్తుంది.

ఎక్కడో ఒకటి కొంటే మరొకటి ఇస్తున్నారంటే, అక్కడ గబుక్కున వాలడానికి తనకు రెక్కలెందుకు లేవా? అని విపరీతంగా చింతిస్తూ, పడుతూ లేస్తూ అక్కడికి చేరుకుని, దొరికితే ఎవరెస్ట్ ఎక్కుతాం. లేకుంటే కుమిలిపోతూ పాతాళానికి పడిపోతాం. రెంటికి డబ్బు చెల్లిస్తే మూడు ఫ్రీ అంటే వేలు తగలేసి బట్టలు పాలిథీన్ కవర్లో తెచ్చుకుంటాం. ‘గవర్నమెంట్ బ్యాంకుల కన్నా ఇంట్రస్ట్ ఎక్కువిస్తాం’ అని ప్రకటనలు గుప్పిస్తే, ఉన్న సొమ్మంతా గంపగుత్తగా వాళ్లకి ధారబోస్తాం.

ష్యూరిటీల గొడవుండదు చిట్టీ కట్టండి, పైగా మీకు కావలసినప్పుడు పాడుకుని డబ్బుతీసుకోవచ్చు అంటే ఎగిరిగంతులేస్తూ, సభ్యత్వ రుసుముతో సహా నెల చందా కట్టి పేరు రాయించుకుంటాం.

‘ఎక్కడో ఊరుచివర ప్లాట్లు వేస్తున్నాం. సరసమైన ధర. రెండు మూడేళ్లలో వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి’ అని ఉబ్బేస్తే ఉబ్బిపోయి నెల కిస్తులు కట్టడానికి సిద్ధపడిపోతాం.

ఇంటింటికి తిరుగుతూ ‘ఇవే వస్తువులు షాపులు, మాల్స్ లో కొంటే బోలెడంత రేటు..మీ ఇంటి ముంగిట్లోకి వచ్చాం కాబట్టి, షాపు రెంటు, డిస్ట్రిబ్యూషన్ లాంటివి ఉండవి కాబట్టి, ఇంత తక్కువ ధర. పైగా పది సంవత్సరాల వారంటీ’ అని నమ్మబలికితే, ఇమ్మీడియేట్ గా కొని ఇంట్లో అలంకరించుకుంటాం.

ఒక టెన్ థౌసండ్ ఉంటే ఇవ్వు బాస్, రెండ్రోజుల్లో ఒక అమౌంట్ వచ్చేదుంది, రాగానే నీకు ఇచ్చేస్తాను. అన్నట్టు 2% నెలమొత్తం ఇంట్రస్ట్ వేసి మరీ, జస్ట్ టూ డేస్ లో" అనేసరికీ ఒళ్లు తెలియక పర్సు తీసి పందేరం చేసేస్తాం.

కొన్ని ఉత్పత్తుల పేర్లకి ముందు ‘న్యూ’ అని చేరిస్తే చాలు, అది నిజంగా కొత్తదన్న భ్రమలో పడి సొంతం చేసుకుంటాం. అవసరమైనది ఒక్కటి మాత్రమే కొనాలని పెద్ద పెద్ద మాల్స్ లోకి ఎంటరై, పర పరా కార్డుల్ని గీయించుకుని బరువైన ట్రాలీల్ని తోసుకుంటూ బయటకొస్తాం. ఇహ ఇప్పుడు ఆసుపత్రులు కూడా డిస్కౌంట్ల పద్దతి మొదలెట్టాయి. ప్యాకేజీల మత్తులో పడేసి దండుకుంటున్నాయి. మన చేతిలో చక్కగా పనిచేసే సెల్ ఫోన్ ను వదిలించుకుని అవేవో ఫీచర్స్ ఉన్నాయని అవసరం లేకపోయినా నెలె నెల ఇ ఎమ్ ఐ లు కట్టడానికి సిద్ధపడిపోయి సొంతం చేసుకుని ఫ్రెండ్స్ కి టాం టాం చేస్తాం .

నా చిన్నప్పుడు వీధిలో ఒకటో రెండో షాపులు ఉండేవి. వస్తువుల ధర కాస్త హెచ్చుగా ఉంటే ఇహ ఆ షాపు ముఖం చూసేవారు కాదు. ఇప్పుడలా కాదు. రోడ్డుకి అటూ ఇటూ తామర తంపరగా షాపుల మయం. చెప్పనలవి కానన్ని చిత్ర విచిత్ర వస్తువులు, పదార్థాలు. కొనుగోలుదార్లతో గజి బిజీగా.

సినిమాకెళ్లడం దండగనుకునే రోజుల్నుంచి, సినిమాకెళ్లి, సినిమా చూస్తూ ఎక్కువ ఖరీదు దొబ్బపెట్టి తినిబండారాలు తింటూ సినిమా చూడ్డం ఒక కిక్కు అనుకునే దశకు చేరుకున్నాం.

వీటన్నిటి పర్యవసానం మనకు తెలుసు. మనం ఆకర్షణకు లోబడే శలభాలం. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

మరిన్ని శీర్షికలు
tamilnadu