Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

హిప్పి చిత్రసమీక్ష

hippy movie review

చిత్రం: హిప్పీ 
నటీనటులు: కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జెడి చక్రవర్తి, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌, జజ్బా సింగ్‌ తదితరులు 
ఎడిటింగ్‌: కెఎల్‌ ప్రవీన్‌ 
సినిమాటోగ్రఫీ: ఆర్‌డి రాజశేఖర్‌ 
సంగీతం: నివాస్‌ కె ప్రసన్న 
నిర్మాణం: వి క్రియేషన్స్‌ 
దర్శకత్వం: టి.ఎన్‌.కృష్ణ 
నిర్మాత: కలైపులి ఎస్‌ థాను 
విడుదల తేదీ: 6 జూన్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే

హిప్పీ దేవదాస్‌ అలియాస్‌ దేవ (కార్తికేయ) వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అయితే, తనకుఏదనిపిస్తూ అది చేయడం, తనకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం, స్నేహితులతో కలిసి సరదాగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేయడం హిప్పీకి ఇష్టం. హిప్పీ, అముక్త మూల్యద (దిగంగన సూర్యవంశీ)తో సహజీవనం చేస్తుంటాడు. తనను ప్రేమిస్తోన్న స్నేహ (జజ్బా సింగ్‌)ని కాదని, అముక్త వెంట తిరిగి, ఆమె తనను ప్రేమించేలా చేసుకుంటాడు. అయితే అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అముక్త ప్రేమని ఇబ్బందిగా ఫీలవుతాడు హిప్పీ. ఈ పరిస్థితుల్లో హిప్పీ ఏం చేస్తాడు? స్నేహ వైపు తిరుగుతాడా? అముక్త, స్నేహల ప్రేమలో ఏది నిజమైన ప్రేమ? ఎప్పటికప్పుడు మనసు మారిపోయే హిప్పీ ఎవరితో ఫైనల్‌గా సెటిలవుతాడు? ఈ కథలో హిప్పీ బాస్‌ అరవింద్‌ (జేడీ) పాత్ర ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే

తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు హీరో కార్తికేయ. తొలి సినిమా ఆర్‌ఎక్స్‌100 ఇచ్చిన జోష్‌, అతని బాడీ లాంగ్వేజ్‌లో స్పష్టంగా కన్పిస్తుంది. అయితే, నటుడిగా ఇంకా కొన్ని లోపాలున్నాయి, వాటిని కవర్‌ చేసుకోవాల్సి వుంది. నటన కంటే ఎక్కువగా ఫిజిక్‌నే చూపించాల్సి వచ్చింది కార్తికేయకి. పదే పదే సిక్స్‌ ప్యాక్‌ చూపించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఏమో.

హీరోయిన్లలో దిగంగన మంచి మార్కులు కొట్టేసింది. ఆమె అందం ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. జజ్బా సింగ్‌ అందాల ప్రదర్శనకే పరిమితమయ్యింది. జెడి చక్రవర్తి చాన్నాళ్ళ తర్వాత వెండితెరపై కన్పించినా, అతని పాత్ర వల్ల, అతని నటనా ప్రతిభ వల్ల సినిమాకి ఉపయోగం ఏమీ లేదు. పైగా, జేడీ 'అతి' సినిమాకి మైనస్‌గా మారింది. కామెడీ పెద్దగా పండలేదు. మిగతా నటీనటులంతా జస్ట్‌ ఓకే. 
కథలోనే పూర్తి గందరగోళం కన్పిస్తుంది. కథనం ఇంకా గందరగోళంగా తయారైంది. డైలాగులంటే అందులో బూతులు తప్ప, పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. ఎడిటింగ్‌ ఇలాంటి సినిమాలకి కష్టమే. ఇంకా చాలా కష్టపడినా ప్రయోజనం వుండకపోవచ్చు. నిర్మాణపు విలువలు బావున్నాయి. పాటలు జస్ట్‌ ఓకే. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ తమ పని తాము చేసుకుపోయాయి.

ఆర్‌ఎక్స్‌100 సినిమాతో హీరో కార్తికేయకి వచ్చిన ఫేమ్‌ని మాత్రమే వాడుకుని, కొన్ని బూతు డైలాగులు, ఇంకొన్ని అసభ్యకరమైన సన్నివేశాలని పేర్చి, దాన్నే కథగా అనుకోమన్నట్లుంది సినిమా. కాన్‌ఫ్లిక్ట్‌ అనేది సరిగ్గా లేకుండా అలా అలా నడిపించేయడం సినిమాకి పెద్ద మైనస్‌. సిక్స్‌ ప్యాక్‌ లాంటి ఫీచర్స్‌ అరుదుగా వాడుకుంటేనే బావుంటుంది. కానీ, ఇందులో అది వెగటుపుట్టించేసే స్థాయికి వెళ్ళిపోయింది. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు కూడా అంతే. వాటిని ఇష్టపడేవారు కూడా చెవులు మూసుకునే పరిస్థితి తెచ్చాడు దర్శకుడు. మాస్‌ ఆడియన్స్‌నో, యూత్‌నో టార్గెట్‌ చేయాలనే ప్రయత్నంలో పూర్తిగా అదుపు తప్పేశారు. చివరికి, అర్థం పర్థం లేని సినిమాగా హిప్పీ మిగిలిపోయింది.

అంకెల్లో చెప్పాలంటే

1.5/5

ఒక్క మాటలో చెప్పాలంటే

అచ్చంగా బూతుల పిప్పి

మరిన్ని సినిమా కబుర్లు
churaka