Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Let's go back or else let's go

ఈ సంచికలో >> యువతరం >>

లిటిల్‌ రాస్కెల్స్‌తో స్వీట్‌ పెయిన్‌: మళ్లీ మొదలైంది.!

Sweet Pain With Little Rascals: Begins Again!

వీకెండ్స్‌లో శని, ఆదివారం రెండు రోజులూ సెలవులు కంటిన్యూస్‌గా వస్తేనే సోమవారం పిల్లలకు స్కూలుకు వెళ్లాలంటే ఎంతో బాధగా ఉంటుంది. అలాంటిది వేసవి సెలవులు. దాదాపు 45 రోజులు పైగానే. చదువుల్ని పూర్తిగా అటకెక్కించేసి, ఫుల్‌గా ఎంజాయ్‌మెంట్‌కే సమయం కేటాయించేశారు పిల్లలు. అలాంటిది ఇక మరికొద్ది రోజుల్లో స్కూళ్లు తెరిచేస్తున్నారు. స్కూలుకు వారిని సంసిద్ధం చేయడమంటే తల్లితండ్రులకు కత్తి మీద సామే. నచ్చిన సమయానికి నిద్ర లేవడం, నచ్చిన టైంకి, నచ్చిన ఐటెం తినడం, నచ్చిన టైంకి పడుకోవడం.. ఇక ఆటల సంగతి అంటారా.? మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఇతరత్రా ఒక్కటేమిటి.. ఇలా పూర్తిగా తమ టైమ్‌ టేబుల్‌ని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు ఈ సెలవు రోజుల్లో పిల్లలు. అలాంటి వాతావరణం నుండి ఇప్పుడు స్కూలు వాతావరణంలోకి సునాయాసంగా పిల్లల్ని లాక్కు రావడమెలాగో కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా తెలుసుకుందాం పదండి.

స్కూళ్లు తెరుస్తున్నారంటే, పిల్లల్లో ఎక్కడలేని ఆందోళన. ఆ ఆందోళనను తరిమికొట్టే ప్రయత్నం చేయాలి తల్లితండ్రులు. వారం రోజులు ముందుగానే, పిల్లలకు గత ఏడాది బుక్స్‌లోని కొన్ని పాఠాల్ని ఆడుతూ, పాడుతూ వారిచే చదివించాలి. తద్వారా బుక్స్‌ పట్ల అలవాటు ఏర్పడుతుంది. అలాగే మధ్యలో గతేడాది వారు తరగతుల్లో ఎదుర్కొన్న వింత అనుభవాల్ని, స్వీట్‌ మెమరీస్‌నీ రివైండ్‌ చేయాలి. తద్వారా వారిని స్కూల్‌ ఎట్మాస్పియర్‌లోకి తీసుకెళ్లినట్లవుతుంది. ఫ్రెండ్స్‌కి ఫోన్లు చేయించి, వారితో మాట్లాడించాలి. ఫ్రెండ్స్‌లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌, క్లాస్‌మేట్స్‌ ఇలా ఆ డిఫరెన్స్‌ తెలుసుకుని, వారికిష్టమైన స్నేహితులతో ముందే మమేకమయ్యే వీలు కల్పించాలి. ఇలా చేయడం వల్ల వారిని మెల్ల మెల్లగా స్కూలు వాతావరణానికి సిద్ధం చేసినట్లవుతుంది.

నెక్స్‌ట్‌ షాపింగ్‌. కొత్త సంవత్సరం అంటే జనవరి 1, ఉగాది పండగ కావచ్చు. కానీ పిల్లలకు మాత్రం కొత్త సంవత్సరం అంటే, వేసవి సెలవుల తర్వాతనే మొదలవుతుంది. కొత్త క్లాసులోకి అడుగుపెట్టడమంటేనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లు లెక్క పిల్లల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో. అంటే, అంతా కొత్త కొత్తగా ఉండాలనుకుంటారు. కొత్త యూనిఫామ్‌, కొత్త బుక్స్‌, కొత్త బ్యాగులు, కొత్త లంచ్‌ బాక్సెస్‌.. ఇలా అంతా కొత్తగా డిఫరెంట్‌గా ఉండాలనుకుంటారు. అందుకు అనుగుణంగానే వారితో కలిసి షాపింగ్‌ చేయాలి. వారు మెచ్చిన, తల్లితండ్రుల బడ్జెట్‌లో ఉండే స్టేషనరీని కొనుగోలు చేయాలి. వాటిని ఎప్పుడెప్పుడు తన ఫ్రెండ్స్‌కి చూపించుకోవాలా.? అనే ఉత్సాహంతో స్కూలు భయం పోయి, క్యూరియాసిటీ పెరుగుతుంది పిల్లల్లో.

ఇక ఫుడ్‌ విషయానికి వస్తే, వారికి ఏది ఇష్టమో, ఏది ఇష్టం కాదో ముందుగానే తెలుసుకోవాలి. ఇష్టంతో పాటు, ఆరోగ్యం కూడా తప్పనిసరి. మంచి పోషక విలువలున్న ఆహారాన్ని లంచ్‌ బాక్సుల్లో ఉంచేలా మాతృమూర్తులు మెనూ తయారు చేసి పెట్టుకోవాలి. అంతేకాదు, స్కూలుకు వెళ్లే కొద్ది రోజుల ముందే, లిమిటెడ్‌ టైంలో లంచ్‌ కంప్లీట్‌ చేయడం, పద్ధతిగా కూర్చొని తినడం అలవాటు చేయాలి. అన్నింటికీ మించి, స్కూలులో ఏ అవసరమున్నా, ఎలాంటి కష్టమెదురైనా అది టీచర్స్‌తో కావచ్చు, తోటి విద్యార్ధులతోనైనా కావచ్చు.. తామున్నామనే భరోసా కల్పించాలి పిల్లలకు వారి తల్లితండ్రులు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఫస్ట డేనే పిల్లలు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా చక్కగా బ్యాగులు సర్దుకుని ఎగ్జైట్‌మెంట్‌తో స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమయిపోతారు.

మరిన్ని యువతరం