Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pratapabhavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

( రాహుకేతు మందిరం తిరుపాంపురం)

తమిళనాడులోని మరో మహిమాన్విత క్షేత్రం తిరుపాం పురం , కాలసర్పదోషం ( మారకం , వివాహం కాకపోవడం ) , నాగదోషం ( సంతానం కలగకపోవడం ) వున్నవారు యీ మందిరంలో దోషనివారణ పూజలు చేసుకుంటారు .

ఈ వారం ఈ మందిరం యెక్కడవుంది , యెలా వెళ్లాలి వివరాలతో బాటు స్థలపురాణం మొదలయిన వివరాలు తెలుసుకుందాం . ముందుగా యీ వూరిపేరు తెలుసుకుందాం . ఇక్కడ వున్న కోవెల పేరుమీదే ఈ వూరుని ” తిరుపాంపురం ” అని పిలుస్తారు . తమిళంలో ‘ తిరు ‘ అంటే శ్రీ అని అర్దం . శ్రీ పాంపురం అనగానే నాగులకు సంబంధించిన కోవెల అని తెలుస్తూనే వుందిగా! తమిళనాడులోని కావేరీ నది తీరాన వున్న 108 స్వయంభు శివలింగాలలోనూ 59 వ స్థానంలో వున్నట్లు జ్ఞానసంబందార్ చే స్థుతించబడ్డ తీర్థం . చరిత్రకు అందిన ఆధారాల ప్రకారం గత మూడువేల సంవత్సరాల నుంచి పూజలందుకుంటున్న మందిరం .

తమిళనాడులోని కుంభకోణం నుంచి పాండిచేరి రాష్ట్రంలోని కారైక్కాల్ కి వెళ్లే రోడ్డుమీద వున్న ‘ పేరలం’ కి ఏడు కిలోమీటర్ల దూరంలో వుంది యీ ‘ తిరుపాంపురం ‘ . ‘ పేరలం ‘ నుంచి ఆటోలు , మినీబస్సులూ తిరుపాంపురం వెళ్లడానికి దొరకుతాయి .కావేరీ నదీ తీరాన వున్న చిన్న పల్లె కావడంతో యీ వూరు పచ్చని పంటపొలాలు , కొబ్బరి తోటలతో కళకళ లాడుతూ వుంటుంది . కనుచూపుమేరవరకు పరచుకొన్న పొలాల మధ్య వున్న కోవెల . కుంభకోణం చుట్టుపక్కల వున్న కోవెళ్లతో పోలిస్తే చాలా చిన్న కోవెల అనే చెప్పుకోవాలి .ముఖ్యద్వారం కి యెదురుగా వున్న కొలను ని ‘ ఆదిశేష తీర్ధం ‘ అని అంటారు .ముఖ్య ద్వారం నుంచిలోనికి వెళితే యెదురుగా శివకోవెల , యెడమవైపున స్థల వృక్షమైన “జమ్మి” చెట్టు దానికి కట్టబడ్డ యెర్ర దారాలు , యెర్ర దారాలతో వ్రేలాడదీసిన చిన్న కర్ర వుయ్యాలలు , పసుపు బట్టలు కనిపిస్తాయి . స్వయంభూగా వెలసిన యీ ఈశ్వరుడు ‘ పాము నాధుడు ( పాంబునాధార్ ) అనే పేరుతో పూజలందుకుంటున్నాడు . ఈ మందిరంలో పార్వతీదేవి ‘ ప్రియసతి అమ్మ ‘ గా పూజలందుకుంటున్నది .

శివుని దర్శించుకొని బయటికి వచ్చేక బయటి ప్రాంగణంలో ఈశాన్యాన చిన్న కోవెలలో రాహుకేతులు ఒకే శిలపై వున్న విగ్రహం వుంటుంది . ఈ కోవెల చుట్టూరా నాగప్రతిష్టలు వుంటాయి . ముఖ్యంగా పురాతనమైన రావి చెట్టుక్రిందన నాగ ప్రతిష్టలు యెక్కువగా వున్నాయి . కోవెల ప్రాంగణంలో రాహుకేతు హోమాలు , కాలసర్ప దోష పూజలు జరుగుతూ వుంటాయి . సంతానంకోసం కూడా యిక్కడ మొక్కుకుంటారు . మందిరంలో ఉత్సవ విగ్రహాలు , నటరాజుని దర్శించుకోవాలి . నటరాజు శివుని ప్రసన్నరూపం కాబట్టి నటరాజుకు దండం పెట్టుకుంటే కోరిన కోర్కెలు త్వరగా తీరుస్తాడట ఈశ్వరుడు .

పామునాధుని సన్నిధికి యెడమవైపున వున్న అమ్మవారిని దర్శించుకుని అనంతరం బయట ద్వారానికి దగ్గరగా యెత్తైన అరుగు మీద సూర్యుడు , చంద్రుడు , అగ్ని , కాలభైరవ విగ్రహాలను దర్శించుకోవాలి . వాటికి యెడమవైపున వున్న నారదుడు , జ్ఞానసంబందార్ , అప్పార్ , సుందరార్ విగ్రహాలను దర్శించుకోవాలి . తమిళనాడులో వుండే శివకోవెళ్లలో జ్ఞానసంబందార్ , అప్పార్ , సుందరార్ విగ్రహాలు తప్పకుండావుంటాయి , వీరు పరమ శివ భక్తులు , శివుని స్తుతిస్తూ అనేక మైన గ్రంథాలు ( పథిఘాం)తమిళంలో రచించిన ఋషులు . వీరిని నాయనార్లు అని అంటారు . అలాగే విష్ణు మందిరాలలో ఆళ్వారుల విగ్రహాలు వుంటాయి .

వారంలో కనీసం మూడు నాలుగు రోజులు ఈ కోవెలలో పాములు కనపిస్తాయట , అమ్మవారి సన్నిధిలో గాని ఈశ్వరుని సన్నిధిలో గాని తిరుగుతూ వుంటాయట . ఆదివారం ,

మంగళవారం , శుక్రవారం మందిరంలో మల్లెలు , మొగలి పువ్వుల వాసనలు వస్తాయట , అలా వాసనలు వచ్చిన తరువాత గర్భగుడిలో పాములు కనిపిస్తాయని యిక్కడి స్థానికుల కథనం .

ఈ గ్రామంలోను , మందిరంలోను అనేక మైన విషపాములు తిరుగుతూ వున్నా యెవరూ పాము కాటుకు గురి అవలేదని స్థానికుల చెప్పేరు కోవెల యొక్క స్థల పురాణం తెలుసుకుందాం .

పురాణ కాలంలో శివుని మెడలో అలంకారంగా వున్న నాగులు అనేక దివ్యశక్తులు కలిగి వుండేవారు . వినాయకుడు , దేవీదేవతలు , ఋషులు మునులు శివుని పూజించేటప్పుడు అతని మెడలో వున్న నాగులు తమనే వారు పూజిస్తున్నారని తలచి గర్వపడసాగేయి .శివుడు నాగుల గర్వభంగము కలిగించుటకు వారి దివ్యశక్తులు పోవునట్టుగా శాపమిస్తాడు . దివ్యశక్తులు పోవడంతో నాగులు వారి రాజైన ఆది శేషుని వద్దకు పోయి మొరపెట్టుకొనగా ఆదిశేషుడు భూలోకములో శివ నివాసములైన మూడు ప్రదేశాలను తన పరివారముతో సేవించుకొనెనట , ఆ క్రమంలో శేషుడు యిక్కడి కొలనులో స్నానమాచరించి ప్రాతఃకాలమున ” కుందంత్తై ” లోను మద్యాహ్నం ‘ తిరునాగేశ్వరం ‘ లోను సాయంకాలమందు ” తిరుపాంపురం ” లోను శివుని సేవించుకొని శివుని ప్రసన్నుని గావించుకొని తిరిగి తమ శక్తులను పొందెనట .

వాయువు , అగ్ని , సూర్యుడు , చంద్రుడు , అగస్త్యుడు , దక్షుడు , గంగ , ఉమ , ఇంద్రుడు , బ్రహ్మ యీ ప్రదేశంలో ఈశ్వరుని సేవించుకొని తమ తమ శాపాలనుంచి విముక్తులయ్యారు .నారదుడు , జ్ఞానసంబందార్ మొదలయిన ఋషులు సేవించుకొని ఈశ్వరుని కృపను పొందారు .చోళులకాలంలో ” కుళోత్తుంగ చోళుడు ” తన రాజ్యకాలంలో కావేరీ తీరాన వున్న అనేక మందిరాలను రాతి నిర్మాణాలుగా మార్చేడు , యీ మందిరాన్ని కూడా రాతి కట్టడంగా ” కుళోత్తుంగ చోళుడు ” మార్చేడు . అతని కాలంలోనే యితర రాజ్యాల రాజులు ‘ తిరుపాంపురం ‘ వచ్చి శివుని దర్శించుకున్నట్లు చారిత్రిక ఆధారాలు వున్నాయి .యేక శిల నిర్మిత మైన రాహుకేతుల విగ్రహం గురించి క్రింది కథ ప్రచారంలో వుంది .

అమృతపానం చేసిన రాక్షసుడు పాము రూపంలో పారిపోతా వుండగా విష్ణుమూర్తి తన చక్రంతో పామును ఖండిస్తాడు , అమృతపానం వలన అమరుడైన ఆ రాక్షసుడు చక్రంతో రెండు ఖండాలుగా ఖండించబడి శిరస్సు భాగం రాహువు గానూ , తోక భాగం కేతువులా మారి నవగ్రహాలలో స్థానం సంపాదించుకున్నాడు . రాహుకేతువులు అర్ద శరీరాలతో వుండడంతో కించపడి , పామునాధుని సేవించుకొని అతనిని ప్రసన్నుని గావించుకుంటారు . ప్రసన్నుడైన శివుని తిరిగి యేక శరీరునిగా చేయమని ప్రార్ధించగా శివుడు రాహుకేతువులను యేకశరీరులను గావించి ఆ క్షేత్రం లో మాత్రమే యేక శరీరులుగా పూజలందుకొనేటట్లుగా షరతు పెడతాడు . ఈ క్షేత్రం లో యేక శరీరాన్ని పొందిన రాహుకేతువులు ప్రసన్నులుగా వుంటారు కావున యిక్కడ చేసుకొనే శాంతి పూజలు యెక్కువ ఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మకం .     ఇక్కడ ఈశ్వరుని , పార్వతీదేవిని , రాహుకేతువులకు అర్చనలు చేసుకున్నవారికి మనోవాంఛలన్నీ తీరుతాయని పూజారులు చెప్పారు .

సంతానం కొరకు చేసే హోమాలు , రాహుకేతు శాంతి పూజలు , కాలసర్ప దోష నివారణార్దం హోమాలు మందిర పురోహితులు నిర్వహిస్తున్నారు . పురోహితులకు ఓ గంట ముందుగా చెప్పి తగినంత రుసుము చెల్లిస్తే హోమాదులు చేసుకొనే వీలువుంది .        రాహుకేతు హోమాలు చేసుకొనే వారు ముందుగా మందిరానికి యెదురుగా వున్న ఆది శేష తీర్థంలో మూడుమునకలు మునిగి సాంప్రదాయ దుస్తులు ధరించి పూజలో కూర్చోవాలి . హోమం పూర్తయిన తరువాత పురోహితులు పూజచేసుకున్న వారి తలమీదుగా కలశలతో నీళ్లు పోసి స్నానం చేయిస్తారు తరవాత ఈశ్వరుని , అమ్మవారిని దర్శించుకోడంతో పరిహార పూజ పూర్తవుతుంది . మొత్తం పూజ సుమారు రెండుగంటల సమయం పడుతుంది .

ఇంట్లో చేయించుకొనే శాంతి హోమాలకన్నా యిలాంటి క్షేత్రాలలో చేయించుకుంటే క్షేత్ర మహిమ వల్ల వందరెట్ల ఫలితం దక్కుతుందనేది పెద్దల మాట . రాహుకేతు పూజలు యీ మందిరంలో రాహుకాలంలోనే చేస్తారు , కాబట్టి యెవరైనా రాహుకేతుపూజలు చేయించుకో దలిస్తే వారు ఆ రోజు రాహుకాలంలో అక్కడుంటేటట్టుగా వెళ్లాలి .

ఓపిక వుండి వెళ్లగలగాలే తప్ప మనదేశంలో యిలాంటి అద్భుత క్షేత్రాలకు లోటు లేదు .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam