Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమ ఎంత మధురం

prema enta madhram

గత సంచికలోని ప్రేమ ఎంత మధురం   సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి... http://www.gotelugu.com/issue321/821/telugu-serials/prema-enta-madhuram/prema-enta-madhram/

 

(గత సంచిక తరువాయి)... గంట తరువాత అబ్బాస్ మిత్రవింద ఇంట్లోంచి బయటపడ్డాడు. చుట్టు చూశాడు. అంతా నిశబ్ధంగా ఉంది. ఎవరు బయట కనిపించ లేదు. ఉగ్రవాదుల దాడి తరువాత బారముల్లాలో జనం తిరిగటం తగ్గించేశారు. ఎంతో పని ఉంటే కాని ఎవరు బయటకు రావటం లేదు. కొంత మంది భయంతో ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. కొన్ని రోజులకు ముందు జరిగిన సంఘటన నుంచి ఇంకా జనం పూర్తిగా కోలుకోలేదు. జరిగిన దారుణం విని పాకిస్ధాన్ ప్రభుత్వం కూడా నిర్ఘాంత పోయింది. ఈ పరిణామం వాళ్ళు ఎంత మాత్రం ఊహించలేదు. చివరి క్షణంలో ఉగ్రవాదులు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరు ఊహించ లేదు. అసలు బారముల్లాను టార్గట్ చేస్తారని ఎవరు అనుకోలేదు. ఆ దాడిలో దాదాపు మూడు వందల మంది చనిపోయారు. ఇంకా చాల గాయపడ్డారు. వాళ్ళంతా హాస్పటల్ ల చికిత్స తీసుకుంటున్నారు.

ప్రపంచ దేశాలన్ని జరిగిన దారుణం విని చాల బాధపడ్డాయి. తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశాయి. పాకిస్ధాన్ కూడా తన విచారాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు జహీర్ అబ్బాస్ బారముల్లా పంపించింది. అక్కడ పరిస్ధితులు ఎలా ఉన్నాయో చూసి రిపోర్ట్ చెయ్యమని చెప్పింది. అందుకే తన సిబ్బందితో బారముల్లా వచ్చాడు. ఈ సారు అతను చుట్టు తిరిగి రాలేదు. బార్డర్ క్రాస్ చేసి వచ్చాడు. అది ప్రభుత్వ అనుమతితో.

దారిలో చాల మందిని కలుసుకున్నాడు. జరిగిన సంఘటన గురించి అడిగాడు. వాళ్ళు చెప్పిన మాటలను నోట్ చేసుకున్నాడు. అదంతా ఒక రిపోర్ట్ గా తయారు చేశాడు. ఎలాగు ఇంత దూరం వచ్చాడు మిత్రవిందను కూడా కలుసుకున్నాడు. జరిగిన దాడిలో ఆమె కూడా తన వాళ్ళను పొగోట్టుకుంది. అది తెలిసి చాల బాధపడ్డాడు అబ్బాస్. కాని అంతకంటే వసంతసేన విషయం తెలుసుకుని ఇంకా రియాక్ట్ అయ్యాడు.

రాహుల్ ఆమెను మోసం చేశాడని తెలుసుకుని తట్టుకోలేకపోయాడు. అలాంటి నీచుడిని ఉరికే వదలకూడదు. తగిన శిక్ష వెయ్యాలి. లేకపోతే ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడు.  ఫలాన నేరం ఖచ్చితంగా నేరస్ధుడు చేశాడని రుఢీగా తెలిసినప్పుడు శక్ష వెంటనే అక్కడికి అక్కడే వెయ్యాలి. అప్పుడే ప్రజలకు భయం వేస్తుంది. ఎవరు నేరం చెయ్యటానికి సాహసించరు. ఈ విధానాన్ని అబ్బాస్ పూర్తిగా నమ్ముతాడు. అందుకే పనిగట్టుకుని అబ్బాస్ దగ్గరకు వెళుతున్నాడు. భారత ప్రభుత్నం కాని చట్టం కాని అతనికి శిక్ష వెయ్యదు. వెయ్యలేదు. కారణం అతని తండ్రికి రాజకీయంగా గొప్ప పలుకుబడి ఉంది. పోలీసు డిపార్ట్ మెంట్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ పరిస్ధితిలో వసంతసేనకు న్యాయం జరగదు. కోర్టులు కాని అధికారులు కాని రాహుల్ దరిదాపులకు వెళ్ళరు. అందుకే ఆ శిక్ష ఏదో తనే వెయ్యాలని అనుకున్నాడు అబ్బాస్. మిలిట్రిలో పెద్ద నేరం చేసినవాడికి ఒకటే శిక్ష. ఫైరింగ్ స్క్వాడ్ తో కాల్పించి చంపటం. ఇప్పుడే అదే చెయ్యబోతున్నాడు అబ్బాస్. కాకపోతే ఒక్కటే తేడా. ఇక్కడ ఫైరింగ్ స్క్వాడ్ లేదు. అబ్బాస్ మాత్రం ఉన్నాడు. అతనే ఫైరింగ్ స్క్వాడ్.
పావుగంట తరువాత రాహుల్ ఇంటికి చేరుకున్నాడు అబ్బాస్. మెయిన్ గేటు దగ్గర వాచ్ మెన్ కూర్చుని ఉన్నాడు. సిగరెట్ తాగుతూ సెల్ లో ఏదో బూతు విడియో చూస్తున్నాడు. తన దగ్గరకు వస్తున్న అబ్బాస్ ను అతను కొంచం కూడా గమనించలేదు. దీక్షగా విడియోను చూస్తూ అదో లోకంలో విహరిస్తున్నాడు.

“రాహుల్ ఉన్నాడా”అడిగాడు అబ్బాస్.

ఉన్నట్టుండి ఎవరిదో గొంతు వినిపించటంతో ఉలిక్కిపడ్డాడు వాచ్ మెన్. ఎవరా అన్నట్టు మెల్లగా తలఎత్తి చూశాడు. ఎదురుగా పూర్తి మిలిట్రి యూనిఫారమ్ లో అబ్బాస్ కనిపించాడు. ఆ యూనిఫారమ్ లో ఏదో తేడా కనిపించింది వాచ్ మెన్ కు. అయిన అతను ఏం మాట్లాడలేదు. సెల్ ఆఫ్ చేసి మర్యాదగా లేచి నిలబడ్డాడు.

“రాహుల్ ఉన్నాడా”మళ్ళి అడిగాడు అబ్బాస్.

“ఉన్నారు సార్. తన గదిలో పడుకన్నాడు”అన్నాడు వాచ్ మెన్. పిలుచుకుని రమ్మంటరా.?

“అవసరం లేదు. నేనే వెళ్ళి కలుస్తాను”అని చెప్పి లోపలికి నడిచాడు అబ్బాస్. వాచ్ మెన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతకు ముందు అతను అబ్బాస్ ను ఎప్పుడు చూడలేదు. అతను మిలిట్రి అధికారి అని యూనిఫారమ్ బట్టి తెలుస్తోంది. కాని అబ్బాస్ వేసుకున్న యునిఫారమ్ కొంచం విచిత్రంగా కనిపించింది వాచ్ మెన్ కు. అయిన అతనికి కొంచం కూడా అనుమానం రాలేదు. అబ్బాస్ నడకలో ఠీవి దర్జా వాచ్ మెన్ ను పూర్తిగా మెస్మరైజ్ చేశాయి.

హాలులో కుడి వైపు పైకి వెళ్ళటానికి మెట్లు కనిపించాయి. అబ్బాస్ మెట్లు ఎక్కి పైకి చేరుకున్నాడు. పాతకాలం లాగా పొడుగాటి నడవ కనిపించింది. నడవకు రెండు వైపుల వరుసగా గదులు ఉన్నాయి. ఎడం వైపు గది లోంచి పెద్దగా ఇంగ్లీష్ సంగీతం వినిపిస్తోంది. తరువాత దబ్ దబ్ మంటు చప్పుడు వినిపించింది. బహుశా అదే రాహుల్ గది అయిఉంటుంది. మెల్లగా ఆ  గది లోకి అడుగుపెట్టాడు అబ్బాస్. అతను ఊహించింది నిజమే. అది రాహుల్ గది.  లోపల పెద్ద పిచ్ లో ఇంగ్లీష్ సంగీతం వినిపిస్తోంది. దానికి అనుగుణంగా మంచంమీద నిలబడి నాట్యం చేస్తున్నాడు రాహుల్.  చెప్పాపెట్టకుండ లోపలికి వచ్చిన అబ్బాస్ ను చూసి అప్రయత్నంగా డాన్స్ చెయ్యటం ఆపేశాడు.
“ఎవరు నువ్వు. ఇక్కడికి ఎందుకు వచ్చావు”అడిగాడు రాహుల్.

అతని గొంతులో కొంచం కూడా మర్యాద గౌరవం లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళను ఎలా పలకరించాలో కూడా తెలియదు. నరనరాన్న డబ్బుతో జీర్ణించుకుపోయిన అహంకారం కనిపిస్తుంది.

“నా పేరు అబ్బాస్. సంగీతం సౌండ్ తగ్గిస్తే నేను వచ్చిన పని చెప్తాను”అన్నాడు అబ్బాస్.

రాహుల్ వెళ్ళి టేప్ రికార్డర్ వాల్యుమ్ తగ్గించాడు.

“నేను వసంతసేన మామయ్యను”అన్నాడు అబ్బాస్.

ఆ మాటలు వినగానే కొంచం కూడా భయపడలేదు రాహుల్. పైగా నిర్లక్ష్యంగా చూసి అన్నాడు.

“నా ఉద్దేశం ఆమెకు అప్పుడే చెప్పాను. అయిన ఇంకోసారి చెప్పుతున్నాను. నేను ఆమెను పెళ్ళిచేసుకోను. ఆమె అక్క మీద పగ తీర్చుకోవటానికే ఆమెతో స్నేహం చేశాను. ప్రేమించినట్టు నటించాను. మంచి వాడిలా నాటకం ఆడాను. నా కోరిక తీరంది. ఇక ఆమెతో నాకు పనిలేదు. ఈ విషయం వసంతకు ఆ రోజే చెప్పాను. మళ్ళి నువ్వు రావటంలో అర్ధంలేదు”అంటు ఏకవచన ప్రయోగం చేశాడు.
ఆ విషయం అబ్బాస్ గ్రహించాడు.

“నువ్వు చేసిన మోసం భరించలేక తను నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యచేసుకుంది.ఒక రకంగా ఆమె చావుకు పరోక్షంగా నువ్వే కారకుడివి. నువ్వు చాల పెద్ద తప్పుచేశావు. దానికి నీకు ఖచ్చితంగా శిక్షపడి తీరాలి”అన్నాడు అబ్బాస్.

“శిక్ష ఎవరు వేస్తారు. ఈ పోలీసులా లేక కోర్టులా. ఇద్దరి వల్ల కాదు. నా వెనుక కొండంత మా నాన్నగారు ఉన్నారు. అయనకు తెలియకుండ పోలీసులు మా ఇంటి చుట్టు పక్కల కూడా రారు. ఇక కోర్టుల సంగతి. ఆ కోర్టులలో పనిచేసే జడ్జిలు అందరు మాకు తెలుసు. అయిన పోలీసులు కేసు ఫైలుచేస్తే కాని కేసు కోర్టుకురాదు. కాని పోలీసులు కేసు ఫైలు చెయ్యరు. కేసు కోర్టు కు రాదు. నాకు శిక్షపడదు. అలాంటప్పుడు నాకు శిక్ష వేసేది ఎవరు”అన్నాడు రాహుల్ ఎగాతాళిగా. అతని కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి. తనని ఎవరు ఏం చెయ్యలేరన్న ధీమా అహంకారం అతని కళ్ళలో కనిపిస్తోంది.

“వాళ్ళు ఎవరు నీకు శిక్ష వెయ్యకపోవచ్చు. కాని నేను వేస్తాను”అంటు మెరుపు వేగంతో తన సర్వీస్ తుపాకి తీశాడు అబ్బాస్. దాన్ని సూటిగా అబ్బాస్ వైపు గురిపెట్టాడు.

రాహుల్ షాక్ తగిలినట్టు చూశాడు. అబ్బాస్ ఇంత సాహసం చేస్తాడని అతను అనుకోలేదు. లేకపోతే అతనితో సామ్యరసంగా మాట్లాడి బయటకు పంపించేవాడు.

“చాల పెద్ద తప్పు చేశావు. ఒక అమాయకురాలు అయిన అమ్మాయిని మోసం చేశావు. ఆమె జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేశావు. నీలాంటి వాడు బతికి ఉండటానికి వీలులేదు. లేకపోతే వసంతసేన లాంటి ఇంకో అమ్మాయిని నాశనం చేస్తావు. ఆ అవకాశం నీకు ఇవ్వను. గుడ్ బై “అంటు ట్రిగ్గర్ నొక్కాడు.

తుపాకి రెండు సార్లు పేలింది. మొదటి గుండు రాహుల్ చాతిలో దిగబడింది. రెండో గుండు అతని గొంతులోంచి దూసుకుపోయింది. రాహుల్ అరవలేదు. కనీసం మూల్గలేదు. చాపచుట్టలా నేలమీద పడిపోయాడు. క్షణంలో అతని ప్రాణం గాలిలో కలిసిపోయింది.

అబ్బాస్ తుపాకిని జేబులో పెట్టుకున్నాడు. రాహుల్ శవం వైపు నిర్లిప్తంగా చూసి గదిలోంచి బయటకు నడిచాడు.

పాకిస్ధాన్ ఇస్లామాబాద్

ఇండియన్ ఎంబసి లైట్ల వెలుగులో దేదిప్యమానంగా వెలిగిపోతుంది. ఇండియన్ అంబాసిడర్ ఆయన భార్య మెయిన్ గేటు దగ్గర నిలబడి ఉన్నారు. లోపలికి వస్తున్న ఆహుతులను సాధరంగా లోపలికి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళకు కొంచం దూరంలో మిత్రవింద నిలబడిఉంది. ఆమె కళ్ళు ఆత్రంగా అబ్బాస్ కోసం చూస్తున్నాయి.

రెండు రోజులకు ముందు ఇస్లామాబాద్ చేరుకుంది మిత్రవింద. బయలుదేరేముందు అబ్బాస్ కు కాల్ చేసింది. తను ఏ ప్లైట్ లో వస్తుందో ఏ సమయంలో బయలుదేరుతుందో అంతా వివరంగా చెప్పింది. తనని రిసివ్ చేసుకోవటానికి ఏయిర్ పోర్ట్ కు ఖచ్చితంగా రమ్మని చెప్పింది. సరే అన్నాడు అబ్బాస్. అనుకున్నటుగానే షెడ్యుల్ టైం ప్రకారం విమానం ఇస్లామాబాద్ చేరుకుంది. మిత్రవింద ఆత్రంగా అబ్బాస్ కోసం చూసింది.
కాని అతను ఎక్కడ కనబడలేదు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని ఉండవచ్చని భావించింది. అందుకే మరికొంత సేపు కాచుకుంది. కాని అప్పటికి అబ్బాస్ జాడలేదు. గత్యంతరంలేక అతనికి కాల్ చేసింది. రింగ్ పోతుంది కాని అతని వైపు రెస్పాన్స్ లేదు. ఒకసారి కాదు చాల సార్లు ట్రై చేసింది. కాని ఫలితం మాత్రం శూన్యం.

ఇక గత్యంతరం లేక ఒంటరిగా ఎంబసికి బయలుదేరింది మిత్రవింద. ఎంబసి చేరుకుని అంబాసిడర్ ను కలుసుకుంది. తన అపాయింట్ మెంట్ ఆర్డర్ చూపించింది. అదే రోజు డ్యూటిలో జాయిన్ అయింది. ఆమెలాగే అంబాసిడర్ కూడా ఇస్లామాబాద్ లో కొత్తగా చార్జ్ తీసుకుంటున్నాడు.  ఆ శుభసందర్భం పురస్కరించుకుని ఆయన ఒక పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ పార్టికి మిలిట్రి అధికారులతో పాటు రక్షణమంత్రిని కూడా అహ్వానించారు. ఎవరెవరిని పిలువాలో మిత్రవింద స్వయంగా లిస్ట్ తయారుచేసింది. అందులో అబ్బాస్ పేరు కూడా చేర్చింది.
ఆమె చేర్చకపోయిన అతను తప్పకుండ వచ్చేవాడు. భారత్ తో సమావేశం అయిన తరువాత ప్రభుత్వం అతన్ని రక్షణమంత్రికి సెక్యురిటి చీఫ్ గా నియమించింది. అంబాసిడర్ రక్షణమంత్రిని పిలిచాడు.  అతనికి సెక్యురిటిగా వ్వవహరిస్తున్న జహీర్ అబ్బాస్ కూడా తప్పకుండ వస్తాడు. రావాలి. పార్టికి కావల్సిన ఏర్పాట్లు కూడా మిత్రవింద స్వయంగా చేసింది. అన్ని అనుకున్నట్టుగానే పూర్తయ్యాయి. పార్టీ మొదలైంది. అహుతులు ఒక్కోక్కోరే వస్తున్నారు. వాళ్ళను చిరునవ్వుతో లోపలికి ఆహ్వానిస్తున్నారు అంబాసిడర్ దంపతులు.  దూరంగా నిల్చున్న మిత్రవింద అహుతులను లోపలికి ఎలా వెళ్ళాలో డైరక్ట్ చేస్తోంది. పైకి చిరునవ్వు నవ్వుతూ ఎంతో చలాకిగా ఉంది మిత్రవింద. కాని లోపల మాత్రం బాధతో రగిలిపోతుంది. ఆ రోజు బారముల్లాకు వచ్చి ఆమెను ఓదార్చాడు అబ్బాస్. తరువాత వెళ్ళిపోయాడు. ఆ తరువాత అతని వైపు నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. మిత్రవింద స్వయంగా కాల్ చేసి తన అపాయింట్ మెంట్ సంగతి చెప్పింది.

“నువ్వేం కంగారుపడకుండ బయలుదేరు. ఇస్లామాబాద్ ఏయిర్ పోర్ట్ లో నిన్ను రిసివ్ చేసుకుంటాను”అని అబ్బాస్ ఖచ్చితంగాచెప్పాడు. ఆ మాటలను నమ్మింది మిత్రవింద. దాంతో ఆమె భయం ఆందోళన పూర్తిగా పోయింది.

కాని చెప్పినట్టు అబ్బాస్ ఏయిర్ పోర్ట్ కు రాలేదు. అంతేకాదు ఆమెను ఫోన్ లో కూడా కాంటాక్ట్ చెయ్యలేదు. మిత్రవింద కాల్ చేసిన రెస్పాన్స్ లేదు. చెప్పినట్టుగా అబ్బాస్ ఏయిర్ పోర్ట్ కు రాలేదు. ఫోన్ చేసిన రెస్పాన్స్ ఇవ్వలేదు. దాంతో కొంచం ఆందోళన చెందింది మిత్రవింద.
ఆహుతులంతా దాదాపు వచ్చేశారు. కాని ఇంకా రక్షణమంత్రి రాలేదు. ఆయన కోసం ఎదురుచూస్తున్నారు ఇండియన్ అంబాసిడర్ దంపతులు.

మిత్రవింద మాత్రం ఉద్వేకంతో ఊగిపోతుంది. ఇంకా అబ్బాస్ రాకపోవటంతో ఆమె ఆందోళన ఇంకా ఎక్కువైంది. ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తే మెయిన్ గేటు దగ్గర కలకలం వినిపించింది. అంబాసిడర్ దంపతులు హడావిడిగా గేటు దగ్గరకు వెళ్ళారు. వాళ్ళ వెనుక మిత్రవింద వెళ్ళింది.

మెయిన్ గేటు దగ్గర ఒక పెద్ద విదేశీ కారు ఆగింది. దానిమీద పాకిస్ధాన్ రక్షణ సంస్ధ గుర్తు ఉంది. అదే పాకిస్ధాన్ రక్షణమంత్రి కారు. ముందు కారులోంచి జహీర్ అబ్బాస్ దిగాడు. అలవాటు ప్రకారం చుట్టు ఒక సారి చూశాడు. తరువాత కారు తలుపులు తెరిచాడు. అందులోంచి రక్షణమంత్రి దిగాడు.

అంబాసిడర్ దంపతులు ఆయనకు ఎదురు వెళ్ళారు. సాధరంగా లోపలికి ఆహ్వానించాడరు. రక్షణమంత్రి ముందు అబ్బాస్ ఉండటం మిత్రవింద గమనించింది. ఆమె శరీరం సంతోషంతో ఊగిపోయింది. అంతవరకు ఆమెను ఆవహించిన ఉద్వేకం టెన్షన్ పోయింది. శరీరం దూదిపింజలా గాలిలో ఎగురుతున్న అనుభూతి కలిగింది ఆమెకు.

మిత్రవింద ఆత్రంగా అబ్బాస్ వైపు చూసింది. అతను ఆమె వైపు చూడలేదు. రక్షణమంత్రిని గమనిస్తూ ముందుకు దారితీస్తున్నాడు. తన వైపు చూస్తాడని మిత్రవింద ఎంతో ఆశపడింది. కాని అబ్బాస్ ఆమెను ఒక్కసారి కూడా చూడలేదు. ఆమె ఉన్నా లేనట్టుగానే ప్రవర్తించాడు. అవమానంతో రగిలిపోయింది మిత్రవింద. అతికష్టంమీద తన కోపాన్ని అణుచుకుని మొహంమీద నవ్వు పులుముకుంది.
అందరు విశాలమైన మీటింగ్ హాలులోకి వచ్చారు. హాలులో  రెండు వైపుల పొడుగాటి టేబుల్స్ అమర్చారు. వాటిమీద ఖరీదైన హాట్ డ్రింక్స్ అమర్చారు. ఇంకో వైపు అలాంటి టేబుల్ మీద సాఫ్ట్ డ్రింక్స్ ఏర్పాటుచేశారు. జ్యూక్ బాక్స్ లోంచి సన్నగా విదేశీ సంగీతం వినిపిస్తోంది. రక్షణమంత్రి రావటంతో పార్టీ మొదలైంది. తెల్లడ్రస్సు వేసుకున్న స్టీవర్డ్స్ అందరికి డ్రింకులు సర్వ్ చేస్తున్నారు. రక్షణమంత్రి విస్కీ సిప్ చేస్తూ అంబాసిడర్ దంపతులతో మాట్లాడుతున్నాడు. అంబాసిడర్ వేసిన జోక్ కు పగలబడి నవ్వుతున్నాడు. అబ్బాస్ కూడా దూరంగా నిలబడిఉన్నాడు. అతని చుట్టు కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళంతా ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.

ఒక్క మిత్రవింద మాత్రమే ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె చేతిలో సాఫ్ట్ డ్రింక్ ఉంది. అది తాగుతూ మాటిమాటికి అబ్బాస్ వైపు చూస్తుంది. కనీసం ఒక్కసారి అయిన తన వైపు చూస్తాడని ఆమె ఆశపడుతోంది. కాని అబ్బాస్ మాత్రం ఆమెను గమనించటం లేదు. రెండు నిమిషాలు గడిచాయి. అబ్బాస్ ఏదో పని ఉన్నట్టు ఒక స్టివర్డ్ ను పిలిచాడు. చిన్న కాగితం మీద ఏదో రాసి అతనికి ఇచ్చాడు. తరువాత అతన్ని దగ్గరకు పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. స్టీవర్డ్ అలాగే అనితలూపి అవతలకు వెళ్ళిపోయాడు.

ఈ విషయం మిత్రవింద గమనించలేదు. అప్పుడే అంబాసిడర్ దంపతులు ఆమె ఉన్న వైపు వచ్చారు. దాంతో ఆమె అబ్బాస్ మీద నుంచి తనచూపు మరల్చుకుంది.

అయిదు నిమిషాలు గడిచాయి. అందరు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే ఒక స్టీవర్డ్ మిత్రవింద దగ్గరకు వచ్చాడు. విస్కీ గ్లాసు ఇవ్వబోతూ ట్రే మీద ఉన్న ఒక చిన్న కాగితాన్ని ఆమెకు ఇచ్చాడు. మిత్రవింద ఆశ్చర్యంగా చూసింది. ఏదో అడగబోయింది. కాని స్టీవర్డ్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఏదో పని ఉన్నట్టు హడావిడిగా దూరంగా వెళ్ళిపోయాడు.

ఒకవైపు ఆశ్చర్యపోతునే చీటి తీసి చూసింది. అందులో రెండు వాక్యాలు మాత్రం రాసి ఉంది.

“ఎంబసి వెనుకవైపు ఉన్న వేపచెట్టుదగ్గరకు రా. నీకోసం కాచుకుని ఉంటాను”అంతె అంతకుమించి ఆ చీటిలో ఏం లేదు. అది అబ్బాస్ రాసిందని ఆమెకు అర్ధమైంది. చీటిచేత్తోపట్టుకుని అటు ఇటు చూసింది. ఎవరు ప్రత్యేకంగా ఆమెను గమనించటం లేదు. అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.

చీటి తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది మిత్రవింద. మొహం కడుక్కుని చీటిని ముక్కుముక్కలుగా చింపి ఫ్లష్ అవుట్ చేసింది. తరువాత బాత్రూంలోంచి బయటపడింది. ఎందుకైన మంచిదని చుట్టు చూసింది. ఎవరు కనిపించలేదు. హాలులోకి వచ్చి అబ్బాస్ కోసం చూసింది. అతను అక్కడ లేడు. బహుశా చెట్టు దగ్గరకు వెళ్ళి ఉంటాడని గ్రహించింది మిత్రవింద.

మెయిన్ హాలులోంచి కుడివైపుకు తిరిగింది. వందగజాలు నడిచిన తరువాత ఆమె భవనం వెనుక వైపు చేరుకుంది. అక్కడ ఒక పెద్ద వేపచెట్టు కనిపించింది. అక్కడ ఆమెకోసం ఎదురుచూస్తూ అబ్బాస్ కనిపించాడు.

సుడిగాలిలా దూసుకుపోయి అతన్ని చుట్టుకుపోయింది మిత్రవింద. అబ్బాస్ అప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ముడురోజుల తరువాత అబ్బాస్ కనిపించటంతో ఆమెలో విపరీతమైన ఎమోషన్ కలిగింది. గట్టిగా ఏడ్చేసింది.

అబ్బాస్ ఓదార్చలేదు. కనీసం ఒక్క మాట కూడా అనలేదు. కొన్ని సమయంలో మాటల కంటే మౌనమే గొప్ప ఓదార్పును ఇస్తుంది. అందుకే ఆమె తలనిమురుతూ మౌనంగా ఉండిపోయాడు.

కన్నవారిని, తోబుట్టువుని కోల్పోయిన మిత్రవిందకు, అబ్బాస్ తోడుగా నిలిచి తన జీవితం లో వసంతం తీసుకువస్తాడా... విధి నిర్వహణ లో మునిగిపోతాడా.. తెలియాలంటే వచ్చే శుక్రవారం విడుదలయ్యే సంచికలో చూడండి.  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nee peru talachina chalu