Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ చిత్రసమీక్ష

agent sai srinivas atreya movie review

చిత్రం: ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ 
నటీనటులు: నవీన్‌ పోలిశెట్టి, శృతి శర్మ, సుదీహాస్‌, సందీప్‌ తదితరులు 
కథనం: నవీన్‌ పోలిశెట్టి, స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె 
సంగీతం: మార్క్‌ కె రాబిన్‌ 
ఎడిటింగ్‌: అమిత్‌ త్రిపాఠి 
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి 
నిర్మాత: రాహుల్‌ యాదవ్‌ నక్కా 
నిర్మాణం: స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
దర్శకత్వం: స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె 
విడుదల తేదీ: 21 జూన్‌ 2019 

క్లుప్తంగా చెప్పాలంటే.. 
శ్రీను అలియాస్‌ ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ (నవీన్‌ పోలిశెట్టి), ఫాతిమా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బిఐ) పేరుతో ఓ డిటెక్టివ్‌ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసుల్ని తేలిగ్గా ఛేదించడం ద్వారా డబ్బులు బాగానే సంపాదిస్తుంటాడుగానీ, ఒక్క పెద్ద కేసు తగిలితే లైఫ్‌ సెటిలైపోతుందన్నది ఆయన ఆలోచన. అతని దగ్గర అసిస్టెంట్‌ స్నేహ (శృతి శర్మ) వుంటుంది. అనుకోకుండా వీరికి ఓ పెద్ద కేసు దొరుకుతుంది. కానీ, దురదృష్టవశాత్తూ ఆ సమయంలో సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ జైలులో వుంటాడు. ఇంతకీ, ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ జైలుకు ఎందుకు వెళ్ళాడు? వచ్చిన ఆ పెద్ద కేసు ఏంటి? దాన్ని ఛేదించే క్రమంలో ఎఫ్‌బిఐ పడ్డ పాట్లు ఏంటి? ఇంతకీ ఆ కేసుని ఎఫ్‌బిఐ టీమ్‌ ఛేదించిందా? లేదా? అన్నది తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే.. 
నటుడిగా నవీన్‌ పోలిశెట్టి చాలా మంచి మార్కులేయించుకుంటాడు. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోశాడు. అద్భుతమైన నటనతో సినిమాకి వెన్నెముకలా వ్యవహరించాడు. కామెడీ టైమింగ్‌ కావొచ్చు, సెంటిమెంట్‌ సీన్స్‌లో కావొచ్చు నవీన్‌ పోలిశెట్టి అదరగొట్టేశాడు. ఆయనే ఈ సినిమాకి స్క్రీన్‌-ప్లే కూడా అందించాడు. 

స్నేహ పాత్రలో శృతి శర్మ బాగా చేసింది. హీరోతోపాటే సినిమా అంతా దాదాపుగా కన్పిస్తుంది శృతి శర్మ. ఆమె నటనకీ మంచి మార్కులు పడతాయి. మిగిలిన పాత్రధారులంతా కొత్తవారే. తమ తమ పాత్ర పరిధి మేర వారంతా బాగా చేశారు. 

డిటెక్టివ్‌ కథలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. ఈ సినిమాలో కథతోపాటు, కథనం కూడా ఇంట్రెస్టింగ్‌గా అన్పిస్తాయి. ఆద్యంతం ఉత్కంఠ రేపడంలో దర్శకుడు పరిణతి సాధించాడు. కథనం కూడా బావుందిగానీ, అక్కడక్కడా హిక్కప్స్‌ చోటు చేసుకుంటాయి. మాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కూర్‌ కూడా సినిమా మూడ్‌కి తగ్గట్టుగానే వుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగానే వున్నాయి. 

కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌, కొంచెం ఎమోషన్‌, మరికాస్త థ్రిల్లింగ్‌ కంటెంట్‌.. ఇలా సినిమాని దర్శకుడు పక్కాగా ప్లాన్‌ చేసుకున్నాడు. నవీన్‌ పోలిశెట్టి రూపంలో మంచి నటుడు దొరకడం ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. హీరోయిన్‌ కూడా తన నటనతో సినిమాకి హెల్పయ్యింది. నటీనటుల ఎంపికతోనే దర్శకుడు తనదైన ముద్ర వేయగలిగాడు. కథనం బావుంది, కథ కూడా ఆకట్టుకునేలా వుండడంతో సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందే అవకాశం ఎక్కువే. సెకెండాఫ్‌లో మలుపులు ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో కొంత కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. ఓవరాల్‌గా చూస్తే ఓ మంచి సినిమా చూశామన్న భావన కలుగుతుంది. డిటెక్టివ్‌ సినిమాల్ని ఇష్టపడేవారికి ఈ సినిమా మరింతగా నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకులూ మెచ్చేలానే దర్శకుడు సినిమాని తీర్చిదిద్దాడు. 
అంకెల్లో చెప్పాలంటే : 3/5 

ఒక్క మాటలో చెప్పాలంటే: ఏజెంట్‌ శ్రీనివాస ఆత్రేయ.. విషయం వున్నోడే సుమీ.. 
మరిన్ని సినిమా కబుర్లు
Is she all 'that' movies