Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue324/827/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి)... అదృష్టవంతులు’ సంసార జీవితం లోని మాధుర్యాన్ని మనసారా ఆస్వాదిస్తున్న ప్రణయ జీవులు. అటువంటి భాగ్యవంతులు ఈలోకంలో ఏ కొద్దిమందో ఉంటారు.

పెళ్ళై రెండేళ్ళు దాటినా ఇంకా నిన్న గాక మొన్న పెళ్ళైన కొత్తజంటలా ఎంతో అన్యోన్యంగా అతుక్కుని ఉంటారు. నిశ్శబ్దమైన ఆవాతావరణంలో వాళ్ల ఉఛ్వాస నిశ్వాసాలు పాము బుసల్లా వినిపిస్తున్నాయి. మౌక్తిక మది బరువుగా మారింది. మనసు ఏదో ఆవేదనతో విలవిలలాడింది. అంతసేపూ లేని ఒంటరితనం ఒక్కసారిగా తన కబంధ హస్తాలు చాచి ఆమెను ఆలింగనం చేసుకుంది.

దాన్ని తరిమి కొట్టడానికి టి.వి. ఆన్ చేసింది అందులోనూ అంటే ఏదో శృంగార భరిత చిత్రం వస్తోంది. సంసారంలోని సరాగాలన్నీ ప్రోది చేసి, దానికి సరసాన్ని మిక్స్ చేసి, చిరు చిరు ప్రణయ కలహాలను అద్ది, అన్నిమసాలాలను సమ పాళ్లలో రంగరించి ప్రేక్షకుల మీదకు ఎక్కుపెట్టి
వదిలిన సకుటుంబ కథా చిత్రం అది.

తాను దేనిని అవాయిడ్ చేయడానికి టివి పెట్టిందో…అక్కడా అదే కనబడుతూ ఉండడంతో ఒకింత అసహనానికి గురైంది మౌక్తిక. ఏ ఛానల్ మార్చినా అదే పరిస్థితి. లేట్ నైట్ కావడం మూలాన అన్నిఛానల్స్ లో నూ మిడ్ నైట్ మసాలా వస్తోంది.

పక్క వాటాలో నుంచి వినబడుతున్న లైవ్ కంటే ఈ సినిమానే మేలు అనుకుని ఇందాకటి సినిమానే చూడడం కంటిన్యూ చేసింది మౌక్తిక.
అపార్ధాలు- అలకలు, విరహాలు- వేడికోళ్లు, హీరో హీరోయిన్స్ మధ్యన చోటు చేసుకుంటూ, మాంచి రసవత్తరంగా సాగుతూ ఏక బిగిన కన్నార్పకుండా చూసేటట్లు చేసింది ఆ సినిమా.

అప్పుడప్పుడు పంటి కింద రాళ్లలా వ్యాపార ప్రకటనలొకటి! సినిమా పూర్తయ్యే సరికి ఒంటి గంట దాటింది. టివి ఆఫ్ చేసింది మౌక్తిక.
రమ్య వాళ్ళింట్లో ఏ అలికిడీ లేకుండా ప్రశాంతంగా ఉంది. అప్పుడు వచ్చింది మౌక్తిక కంటి మీదకు నిద్రా దేవత. వెంటనే సర్వం మరచి నిద్ర లోకి జారుకుంది.

******

తలుపు బద్దలయ్యేంతగా దబదబ బాదుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటే కళ్ళు తెరిచి అయోమయంగా దిక్కులు చూసింది మౌక్తిక. ఒక్క క్షణం సేపు తానెక్కడుందో అర్ధం కాలేదు.

నిద్ర మత్తులో కూరుకు పోయి స్తబ్దుగా మారిన మెదడుకి పదును పెట్టి చుట్టూ పరికించి చూసింది. మొద్దు బారి పోయిన మెదడుకి కాస్త చైతన్యం కలిగింది.

హమ్మయ్య! తానున్నది తన గది లోనే’ ముందు రోజు కాలేజ్ స్టాఫందరూ కలిసి పికినిక్కి వెళ్లడం, అర్ధరాత్రప్పుడు ఇంటికి తిరిగి రావడం అన్నీ వరసగా జ్ఞాపకం వచ్చాయి. బధ్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. ఇంతలోమరో సారి దబదబ…

తప్పనిసరై లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురు గారమ్య. చేతిలో పాలగిన్నెతో నిలబడి ఉంది. తలారా స్నానం చేసి, పూజాదికాలు ముగించుకుని, నుదుట అగ్నిశిఖలా వెలుగుతున్నఎర్రని కుంకుమతో, నిండైన నవ్వు ముఖంతో…సాక్షాత్తు లక్ష్మీదేవిలా వెలిగి పోతోంది.“ఏమిటి తల్లీ … అంత మొద్దు నిద్ర! ఇప్పటికి నాలుగు సార్లు తలుపు కొట్టాను. పాలబ్బాయి కూడా యధాశక్తి బాదేసి, చివరకు మా ఇంట్లో పాలు పోసేసి పోయాడు.’’ అంది రమ్య చొరవగా లోపలికి వస్తూ.

“సారీ రమ్యా… తెలివి రాలేదు.’’ పక్కకు జరిగి ఆమెకు దారిచ్చింది మౌక్తిక.

తన చేతి లోని పాల గిన్నెను టేబుల్ మీద ఉంచుతూ “సర్సరే…నువ్వు స్నానంచేసి తయారవు… నేను టిఫిన్ తెస్తాను.’’ చెప్పింది రమ్య.
మౌక్తికకి ఎందుకో మొహమాటంగా అనిపించింది. ఎప్పుడూ రమ్యే ఏదో ఒకటి చేసి తినడానికి ఇస్తుంది. తను ఒక్కతే కాబట్టి ఏ ‘రెడీ టు కుక్’ ప్యాకింగ్ లో, ఫ్రోజెన్ చపాతీలో తెచ్చి ఉడకేసుకు తింటుంది. కాని రమ్య అలా కాదు. అన్నిరకాలూ ఇంట్లోనే తయారు చేస్తుంది.
తనకి రాని వంటలు లేవు. శరత్ భోజన ప్రియుడు. ఇంట్లో చేసిన వంటకాలంటేనే ఇష్టం.

ఆఖరుకి సాంబారు పొడి కూడా బయట కొన్నది నచ్చదు అతడికి. చక్కగా ఇంట్లో దంచిన సాంబారు పొడైతేనే మిరియాల ఘాటుతో, ఘమఘమలాడుతూ ఉంటుందని అతడి ఉద్దేశ్యం. అది కూడా నిలవుండకూడదు. అప్పటికప్పుడు తాజాగా దంచాల్సిందే. “అటు ఉద్యోగం చేస్తూ, ఇటు ఇంట్లో ఇలా కష్ట పడడానికి నీకు ఇబ్బందిగా లేదూ! నువ్వు కూడా తనతో సమానంగా ఉద్యోగం చేస్తూ, శ్రమ పడుతున్నప్పుడు కొంచెం సర్దుకుపోతే తప్పేముంది!’’ రమ్యతో చనువు ముదిరాక ఓ సారి ప్రశ్నించింది మౌక్తిక.

రమ్య చిరునవ్వు నవ్వింది.

“శరత్ ని నువ్వు తప్పుగా అర్ధం చేసుకున్నావు ముక్తా…అతడు అందరి లాంటి మగవాడు కాదు. నాకు అన్నిపనుల్లో సాయం చేస్తాడు. అది లంగానా, లుంగీనా అని చూడకుండా ఉతికి ఆరేస్తాడు. మగాడు చీపురు పట్టుకో కూడదు అన్న నిబంధనలేమీ లేకుండా ఇల్లు తుడిచేస్తాడు. నేను వంట చేస్తూంటే కూరగాయలు కోసిస్తాడు. ఇలా… ఇన్ని పనుల్లో అతడు నాకు సహకరిస్తున్నప్పుడు, ఆఫ్ట్రాల్…అతడికి నచ్చిన రీతిలోవండి పెట్టడానికి నాకేం ఇబ్బంది చెప్పు!

అతడు భోజన ప్రియుడు. అన్ని రుచులూ కావాలి. అమ్మ తరువాత భార్యగా నేనతడి కడుపు నింపితేనే కదా…నా ఈ ‘భార్య’ స్థానానికి అర్ధం.’’ రమ్య మాటలలో శరత్ పట్ల ప్రేమ గంగలా ఉప్పొంగి పోతూ కనిపించింది.

‘తల్లి కడుపు చూస్తుంది…పెళ్లాం జేబు చూస్తుంది’ అని ఎవరన్నారో గాని, ఆ అభిప్రాయం మార్చుకోవలసిందే రమ్యను చూశాక.

“అబ్బ! మళ్ళీఆలోచనలా? ఎదురుగా ఇంత మనిషిని… నీ ప్రియసఖిని నేనుండగా  నీ లోకంలోకి వెళ్ళిపోతే ఎలా!?’’ సుతారంగా మౌక్తిక నెత్తిన మొట్టింది రమ్య.

“సారీ రమ్యా” అంది మౌక్తిక నొచ్చుకుంటూ.

“త్వరగా స్నానం చేసిరా…ఇప్పటికే బారెడు పొద్దెక్కింది. టిఫిన్ చల్లారి పోతుంది’’ చనువుగా ఆమెను బాత్రూమ్ లోకి నెట్టింది రమ్య.

“ఇప్పుడు టిఫినెందుకులే రమ్యా… స్నానం చేసొచ్చి కుక్కర్ పెట్టేసుకుంటాగా!’’ అంది మౌక్తిక. రమ్య ఆమెకేసి సూటిగా చూసింది. అదోలా చూసింది. ‘ ఇన్నేళ్ల మన స్నేహ బంధంలో మన నడుమ ఇంతటి ఎడం ఇంకా మిగిలుందా!’ అని నిలదీస్తున్నాయామె చూపులు.
మౌక్తిక చేతిలో తన చేతిని వేసి బిగిస్తూ‘ ముక్తా…నువ్వంటే నాకిష్టం…మాటల్లో చెప్ప లేనంత ఇష్టం. అది ఎందుకో చెప్పలేను. తోబుట్టువులు లేకుండా ఒంటరిగా పెరిగాను. అందుకే… నీతో స్నేహం నాకెంతో అపురూపం. నువ్వు –నేను వేరు వేరు అన్న భావన నాకెప్పుడూ కలగ లేదు.’’ అంది రమ్య ఆప్యాయంగా.

మౌక్తిక కళ్లలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. తన జీవితంలో తననింత ప్రీతి పాత్రంగా భావించే అతి కొద్ది మంది ఆత్మీయులలో రమ్య ఒకతె. తన తోడ బుట్టిన అక్క చెల్లెళ్ళైనా రమ్యంతగా ప్రేమించరేమో!

“సారీ రమ్యా…’’ కళ్ళ నీళ్ళు తుడుచుకుంది మౌక్తిక.

“అప్పుడే ఇది రెండో సారి… నువ్వు నాకు సారీ చెప్పడం.’’ నవ్వింది రమ్య. ఆ నవ్వు పున్నమి వెన్నెల కురిసినంత ఆహ్లాదంగా ఉంది. చల్లని పిల్లతెమ్మెర వీచినంత హాయిగా ఉంది.

“ఆ(…నువ్వు వంట ప్రయత్నాలేమీ తల పెట్టకు…అన్నీమా ఇంట్లోనే.’’ చెప్పేసి వెళ్లింది రమ్య. తలారా స్నానం చేసి తయారయింది మౌక్తిక. రమ్య తెచ్చిన హాట్ ప్యాక్ ముందుంచుకుని టిఫిన్ లాగించేసింది. దూదుల్లా…మెత్తగా ఉన్నమల్లెపూవుల్లాంటి ఇడ్లీలని… కారప్పొడి, కొబ్బరి చట్నీలతో నంచుకుని తింటూంటే చచ్చి స్వర్గాన ఉన్నబామ్మ జ్ఞాపకం వచ్చింది మౌక్తికకు.

“ఒసేయ్ శకుంతలా…కాస్త పప్పు నానేసి నాలుగు గారె ముక్కలు చేసి పెట్ట కూడదూ…ముక్తమ్మకి ఇష్టం.’’ అంటూ తల్లికి పురమాయించేది.
ఆవిడేమో ‘ఆ పాటి ప్రేమ నాకు లేదా!’ అన్నట్లుగా కొర కొర చూసేది.

తల్లి ఉత్తర ధృవమైతే బామ్మది దక్షిణ ధృవం. ఏ విషయంలోనూ పొసగేది కాదు. తల్లివి కొంచెం పురాతన భావాలు. బామ్మ మాత్రం సినిమాల్లో బామ్మలా ఎంతో మాడ్రన్. ఇద్దరూ ప్రతి విషయంలోనూ రగడ పడే వారు. ఆవిడ ‘యతి’ అంటే ఈవిడ ‘ప్రతి’ అనేది. అనుక్షణం పోట్లాడుకునే వాళ్ళ మధ్యన బధ్ధ వైరం ఉంటుందని ఎవరైనా భావిస్తే అది పొరబాటే. ఒకరంటే ఒకరికి ప్రాణం. తల్లి ఎటన్నా వెళ్ళి ఒక అరగంట సేపు కనబడక పోతే చాలు ‘’శకుంతలా…శకుంతలా…’’ అంటూ వెతికేసుకునేది బామ్మ.

ఏ రోజైనా బామ్మకి కాస్త ఒళ్ళు వెచ్చ చేసి ఏ జ్వరమో తగిలిందంటే తల్లి తెగ హడావుడి పడి పోయి, జావలు కాచిచ్చి, పథ్యాలు చేసి పెట్టి అవిడకి తగ్గే వరకు కంటికి రెప్పలా కాపాడుతూ నానా హైరానా పడేది.

“మొన్నఆవ పెట్టిన పనస పొట్టు కూర తినద్దంటే మొండితనంగా తిన్నారు. పైత్యం చేసినట్లుంది’’ అనేది తల్లి బామ్మని మందలిస్తూ.

“నీది మరీ చోద్యమే శకుంతలా…నేనెంత కూర తిన్నాననీ…ఏదో జిహ్వ చాపల్యం కొద్దీ ఓ చెంచెడు కూర వేసుకున్నానంతేగా! అయినా నీ కళ్ళు పడిన తరువాత నాకెలా అరుగుతుందీ!’’ దీర్ఘాలు తీసేది బామ్మ.

అంతే! మళ్ళీ అకారణ రణం మొదలు. దానికి అంతం ఎప్పుడో…ఎక్కడో… తమకెవరికీ అంతు చిక్కేది కాదు. ఇంతగా వాదులాడుకునే వాళ్ళ మధ్య అంతు లేని అనురాగం ఎలా వెల్లివిరుస్తుందో తమకెవరికీ అర్ధం అయ్యేది కాదు.

‘ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ఈచ్ అదర్’ అన్న సూత్రం తలపుల్లో మెదులుతుంది అప్రయత్నంగా. భిన్న మనస్త్వత్వాలు కలిగిన వాళ్లిద్దరూ ఈ సూత్రం ప్రకారమే ఒకరినొకరు అభిమానించుకునే వారేమో! తల్లి, నాయనమ్మ జ్ఞప్తికి రాగానే మౌక్తిక మనసు బరువెక్కింది. కళ్లుచెమర్చాయి.

‘ ఈ మమతానుబంధాలు విచిత్రమైనవి. ఎప్పుడెవరిని కలిపి ముడేస్తాయో!’ అనుకుంది భారంగా.

“ముక్తా…ఎంతసేపింకా? జలకాలాటలు పూర్తవ లేదా!’’ కేక పెట్టింది రమ్య తన వాటాలో నుంచే.

ఎప్పుడైనా శరత్ ఇంట్లో లేక పోతే మధ్య తలుపు తెరిచేసి పెట్టుకుని ఇష్టా రాజ్యంగా గడిపేస్తారు. ఆదివారం కావడం మూలాన అతడు ఇంట్లోనే ఉన్నట్లున్నాడు. తన వాటాకి తాళం పెట్టి చుట్టు తిరిగి రమ్య ఇంటికి వెళ్లింది మౌక్తిక.

అప్పటికే తయారైన శరత్ హాల్లో సోఫాలో కూర్చుని షూ లేసులు ముడేసుకుంటున్నాడు. అతడి తల్లిదండ్రులు పక్కనే ఉన్న పల్లెలో ఉన్న పెద్ద కొడుకు దగ్గరుంటున్నారు. అప్పుడప్పుడు శరత్ వెళ్ళి చూసొస్తూ ఉంటాడు. వరస రెండు మూడు రోజులు సెలవొచ్చినప్పుడు రమ్య కూడా వెళ్తుంది. అత్తమామలు కూడా ఆమెని ఎంతో ప్రేమగా చూస్తారు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
prema enta madhram