Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kerala viharayatralu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

ఎంత చెట్టుకు అంతగాలి కాదు!

ఒకప్పుడు మనుషులు డబ్బుకెంత విలువిచ్చేవారో! రూపాయి కర్చు చేయడానికి ఎంతో ఆలోచించేవాళ్లు. రూపాయి కర్చు చేయకపోతే, రూపాయి సంపాదించినంతగా సంబరపడిపోయేవారు. పాల రేటు పావలా పెరిగినా గగ్గోలెత్తేవాళ్లు. నా చిన్నప్పుడు బట్టలు కొనుక్కోవడమన్నది ఓ పెద్ద ప్రణాళికతో కూడుకుని ఉండేది. నాన్నగారు నెలకింత అని డబ్బు దాచి పెద్ద పండగల ముందు మమ్మల్ని షాపుకు తీసుకెళ్లి, మాక్కావలసినవి (అనుకున్న ఖరీదులో ఉంటే) కొనిచ్చేవారు. ఆ తర్వాత టైలర్ షాపుకెళ్లడం, కుట్టుకూలీ మాట్లాడుకోవడం, అనేక జాగ్రత్తలు చెప్పి కుట్టించుకోడం జరిగేది. ఆ బట్టల్ని ఎంతో జాగ్రత్తగా వాడుకునేవాళ్లం. చాకలివాళ్లకి వేసేటప్పుడు, తీసుకునేప్పుడు లెక్క సరిగా చూసుకునేవాళ్లం.

మనకు పొట్టి అయినవి మరొకరికిస్తే కళ్లకద్దుకుని వాడుకునేవారు. నేను మానాన్నగారి ప్యాంటులు ఆల్ట్రేషన్ చేయించుకుని వేసుకునేవాణ్ని.
పై తరగతికి వెళితే, మన పుస్తకాలు ఇంకొకరికి ఇచ్చేవాళ్లం. తీసుకున్నవాళ్లూ, కొత్త పుస్తకాలు కొనుక్కునే అవసరం లేకుండా డబ్బు ఆదా అయిందని మురిసిపోయేవాళ్లు.

అరాగే సినిమాకెళ్ళాలన్నా ఓ పంచవర్ష ప్రణాళికతో సమానమే. ఏ సినిమా? ఇంటిల్లీపాదీ చూడదగ్గదేనా? ఏ టికెట్ కు వెళ్ళాలి? ఇలా తర్జనభర్జనల అనంతరం సినీ దర్శనం జరిగేది.

ప్రతినెలా ఒకే మార్వాడీ షాపులో సరుకులు తెచ్చుకునేవాళ్లం. అతను మన ఫ్యామిలీ పచారీ కొట్టతనన్నమాట! ఇప్పుడు మనుషుల ఆలోచనావిధానంలో మార్పువచ్చింది. పర్సులో కరెన్సీతోబాటు, కస కస గీకడానికి బోలెడన్ని కార్డ్ లుంటున్నాయి బయటకెళితే రా రమ్మని ఆహ్వానిస్తూ షాపులు, షాపింగ్ మాల్స్ కనిపిస్తాయి.

అలా రోడ్డు మీద వెళుతూ బ్రాండెడ్ షాపులో బట్టలు కొనుక్కుని, వేసుకుని వదిలేస్తున్నారు. ఆన్ లైన్ సినిమా బుకింగ్. ఇంటర్వెల్ లో రకరకాల ఖరీదైన తినుబండారాలు. ఇప్పుడు సంపాదించడం సంగతేమో కాని ఘనంగా కర్చు పెట్టాలనుకునేవాళ్లకి సవాలక్ష మార్గాలు. ఎవరు ధనవంతుడో, ఎవరు కాదో కనిపెట్టడం చాలా కష్టం.

ఎంత చెట్టుకు అంతగాలన్న నానుడి విలువ కోల్పోయింది. చిన్న చెట్టుకైనా పెద్ద ఎత్తున ఊగాలనిపిస్తోంది. ఆకాశానికి అర్రులు చాస్తూ మధ్యతరగతి ఛిద్రం అయిపోతోందన్నది చేదు వాస్తవం.

మరిన్ని శీర్షికలు
sarasadarahasam