Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ఇరవై ఎనిమిదవ భాగం

anubandhalu telugu serial twenty eighth Part

"ఇది జోక్ కాదమ్మా! సీరియస్. ఇంతకాలంగా మీకు ఏ కష్టం రాకుండా కష్టపడి పనిచేసి మిమ్మల్ని పెంచుకున్న తండ్రిని. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను. కొద్దిరోజులు నన్ను పోషించలేరా? నా అవసరాలు తీర్చలేరా? మీరు సామాన్యులనుకుంటున్నారా? మేనేజ్ మెంట్ చదివారు. అమెరికాలో పెరిగారు కాబట్టి ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఫ్రెంచ్, జర్మనీ భాషలు వచ్చు. అవును మీరు పని చేయాలి. చేయలేరా?"

"ఇప్పటికప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు?"

"అవును కదూ. ట్రై చేసి చూద్దాం. ముందు మనకి డబ్బు అవసరం కదా! కాసేపు కూర్చోండి ఇప్పుడే వస్తాను." వాళ్ళిద్దర్నీ వదిలి గోపాల్ బయటకెళ్లాడు.

సుమారు అరగంట తర్వాత తిరిగి వచ్చాడు. వచ్చి ఉత్సాహంగా ఇద్ద్దరి మధ్యన కూర్చున్నాడు. "మనం బయల్దేరిన వేలావిశేషం మంచిదనుకుంటా. ఈ హోటల్ మేనేజర్ తో మాట్లాడాను. మీకు ఉద్యోగాలివ్వడానికి వాళ్లు ఒప్పుకున్నారు. అనంత్ సూపర్ వైజర్ పోస్ట్. నెలకి పదివేలు జీతం. శివానీకి రిసెప్షన్ అండ్ కంప్యూటర్ ఎనిమిది వేల జీతం. ఐదు వేలు అడ్వాన్స్ అడిగాను. రేపట్నుంచి మీరు డ్యూటీలో చేరుతున్నారు. మేనేజర్ కి చెందిన త్రీ బెడ్ రూమ్ ప్లాట్ ఒకటి ఇక్కడికి దగ్గర్లోనే ఉందట. అద్దె నెలకి ఐదువేలు. ఫర్నీచర్ తెచ్చుకోనక్కర్లేదు. ఏ.సి. తో సహా అన్నీ ఉన్నాయట. రాత్రికి మనం ఆ ఫ్లాట్ లోకి వెళ్ళిపోతున్నాం." అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు గోపాల్.

అంతలో సర్వీస్ బాయ్ చిన్న ట్రాలీని లోనకు తీసుకొచ్చాడు. ట్రాలీ మీద ముగ్గురికీ భోజనాలు. వాటితో పాటు స్కాచ్ బాటిల్, ఇతర సరంజామా ఉంది. వాటిని టేబుల్ మీద నీట్ గా సర్ది వాడు వెళ్ళిపోగానే అంతలో మేనేజర్ వచ్చి అడ్వాన్స్ డబ్బు పెట్టి అందర్నీ పలకరించి వెళ్ళిపోయాడు.
ఉత్సాహంగా స్కాచ్ బాటిల్ ని అందుకుంటున్న తండ్రిని చూస్తూ ఇదంతా ఏమిటో అర్ధంకాక తలలు పట్టుకొని నీరసంగా కూర్చున్నాడు అనంతసాయి, సాయిశివానీ.

గోపాల్ ఒక నిర్ణయం తీసుకుంటే అందులో ఎంతమాత్రం మార్పు ఉండదు. ఆ విషయం అన్నా చెల్లెళ్లిద్దరికీ బాగా తెలుసు. తండ్రి తమని హోటల్లో ఉద్యోగానికి నియమించడం ఇద్దరికీ ఇష్టంలేదు. చాలా బాధగా ఉంది. ఇంతకాలం ఆడింది ఆటగా, పాడింది పాటగా సర్వ స్వతంత్రంగా పెరిగారు వాళ్లు. ఇప్పుడు ఒకరి చేతికింద ఉద్యోగం చేసి జీతాలు తీసుకునే పరిస్థితి రావడం ఇబ్బందిగా ఉంది. అనంతసాయికీ మరీ కష్టంగా ఉంది. కానీ వెంటనే ఎదురించలేకపోయాడు.

రాత్రి గోపాల్ హోటల్ సూట్ వదిలేసి దగ్గర్లోని అద్దె ప్లాట్ లోకి మారిపోయాడు. చక్కగా ముగ్గురికీ మూడు గదులతో చాలా వసతిగా ఉంది ఫ్లాట్. ఆ రాత్రి గడిచింది.

మరునాడు ఉదయం తన అయిష్టతను తండ్రి ముందు వెల్లడించాడు అనంతసాయి.

"అయితే ఏమంటావురా? ఉద్యోగం చెయ్యనంటావా?"

"తప్పదంటే నేను చేస్తాను. చెల్లాయిని మున్నలూరు లోనే ఉంచండి."

"అయితే నేనేమైనా మీకు పరవాలేదు. మీరు మాత్రం పనీపాటా లేకుండా తిని తిరుగుతారు. నా మనసు బాగాలేదు. కొద్దిరోజులు నేను ప్రశాంతంగా ఉంటేగాని కోలుకోలేను. అమెరికా వెళ్లలేను. మున్నలూరులో ఉండాలంటే వాళ్ల సూటిపోటి మాటలు భరించే శక్తి నాకులేదు. ముఖ్యంగా మీ అత్తయ్య, మావయ్యలు తమ పిల్లలకు వల వేయడానికే మిమ్మల్ని అక్కడ ఉంచానని తెగ బాధపడిపోతున్నారు. ఈ పరిస్థితిలో ఎక్కడుండాలి. మనిషికి డబ్బు పోవచ్చు. కానీ మానాభిమానాలు పోకూడదు. నాకు రోషం, అభిమానం ఉన్నాయి. కాబట్టే వచ్చేసాను. మీకు అవి లేకుంటే అక్కడే ఉండండి. నా ఖర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది" అన్నాడు బాధగా. "అది కాదు డాడీ! అని చెబుతున్న అనంత్ ని వారించాడు. నిర్ణయం మీది. ఆలోచించుకోండి.

నో మోర్ ఆర్గుమెంట్స్ అన్నాడు స్థిరంగా.

అంతవరకూ మౌనంగా వింటూ కూర్చుంది శివానీ.

చివరకు తను కల్పించుకుంటూ "మీరే బాధపడనక్కర్లేదు డాడీ! మేం ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తాం. మీరు కోరినట్టే మీకు ఏం కావాలో అన్నీ సమకూరుస్తాం. డోంట్ వర్రీ అన్నయ్యా! పదా హోటల్ కెళ్లి డ్యూటీలో జాయినవుదాం" అంటూ బయల్దేరింది. వాళ్ళిద్దరూ హోటల్ కి వెళ్లగానే తమ ప్లాట్ కి తాళం పెట్టి కారులో మున్నలూరు వెళ్ళాడు గోపాల్.

ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు. తనతో పాటు అనంత్ శివానీల బట్టలు మూడు సూట్ కేస్ లల్లో సర్ది అదే కారులో విజయవాడ వస్తూ అన్న రామలింగేశ్వర్రావును తీసుకొచ్చాడు. తమ లగేజ్ ఫ్లాట్ లో పెట్టాక కారుని రామలింగేశ్వర్రావుకి అప్పగించేశాడు.

తమ్ముడికి నచ్చజెప్పాలని చూసిన రామలింగేశ్వర్రావు ప్రయత్నాలు ఫలించలేదు. చేసేదిలేక కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడతను.

నిజానికి గోపాల్ ఇంటికెళ్ళిన సమయానికి నవీన్ ఇంటిదగ్గర లేడు. డాబా ఇల్లు ఖాళీ చేసి తమ లగేజీ తీసుకుని గోపాల్ వెళ్ళిపోవడం అతనికి తెలియదు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చేసరికి చెల్లెలు మహేశ్వరి మూలంగా విషయం తెలిసింది. అప్పటికే కారు తీసుకుని ఇంటికొచ్చేసిన పెదమావయ్య రామలింగేశ్వర్రావుని ఏం జరిగిందంటూ అడిగాడు.

"అదే అర్ధం కావడం లేదు. ఇక్కడ పవర్ కట్ కాబట్టి ఉండలేక పోతున్నాడనుకున్నాను గాని మనసులో ఏదో పెట్టుకుని బెజవాడకు మకాం మారుస్తాడని అనుకోలేదు." అంటూ అంతకుమించి తనకేమీ తెలియదన్నట్టు పెదవి విరిచాడాయన.

"మీరేదో దాస్తున్నారు. కారణం లేకుండా ఎలా వెళ్తారు?"

"ఎలా అంటే నేనేం చెప్పన్రా? వీళ్ళ ధోరణి చూస్తే నాకే చిరాకేస్తోంది. ఎక్కడోచోట ఉండనీ అంతకుమించి ఏం చేయగలం?"

"మీరు వెళ్ళేసరికి అనంత్, శివానీలు ఉన్నారా?"

"లేరు... షాపింగ్ కెళ్లారని చెప్పాడు."

"చేతిలో డబ్బులేదు. షాపింగేమిటి మావయ్యా?"

"ఏమో! అది వాళ్ళకే తెలియాలి."

"వాళ్ళు ఎక్కడ ఉన్నారు?"

చెప్పాడు రామలింగేశ్వర్రావు.

"నేను వెళ్లి ఏం జరిగిందో అడిగి వస్తాను." అంటూ వెనుతిరిగే సరికి ఎదురుగా భ్రమరాంబ నిలబడుంది. కోపంగా చూస్తోంది.

"ఏం జరిగింది? ఇక్కడ ఎవరూ ఎవరితోనూ గొడవపడినట్టు కూడా లేదు?" మనసులో ఆందోళనను అదిమిపట్టుకుంటూ తల్లిని అడిగాడు. "ఎవరూ చెప్పి గొడవపడరు. అకారణంగా నాతో గొడవ పెట్టుకున్నాడు. సమయం, సందర్భం లేకుండా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. బాధ్యతలేని అనంత్, శివానీ లకు మా పిల్లలనిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదని చెప్పాను. అందుకే తమ దారిన వెళ్ళిపోయారు. ఇక ఆ విషయం వదిలేయండి" అంది.

"ఊహు! నేను నమ్మను. అసలు ఇది నమ్మే విషయంలా లేదు. నీకు పెదమావయ్య దగ్గరకన్నా చినమావయ్య దగ్గరే చనువెక్కువ. మీ అన్నాచెల్లెళ్ళు గొడవపడ్డారంటే నేను నమ్మడానికి సిద్ధంగా లేను. పైగా ఇది పెళ్ళి సమస్య. ఇష్టమో, కాదో చెప్పాల్సింది మీరు కాదు, మేము. నిజంగానే వాళ్లకిష్టం లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు."

"అంటే మీకు ఇష్టమనేగా అర్ధం?"

"అదేమిటి? ఈరోజు మేం కొత్తగా ఇష్టపడుతున్నామా? చిన్నప్పట్నుంచి శివానీ నా పెళ్లాం అని, అనంత్ మహేశ్వరి మొగుడని మీరేగా తెలీని మా మనసులో ఆశలు రేపారు? ఇప్పుడు ప్రత్యేకించి అడగడం దేనికి?"

"దేనికో వేరే చెప్పాలా? అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. కాలం బాగున్న రోజుల్లో మీరు అక్కర్లేకపోయారు వాళ్లకి. ఇప్పుడు కాలం మారింది కాబట్టి మీతో స్నేహం పెంచుకోవాలని చూస్తున్నారు. మీకు బయటి సంబంధాలు చూస్తున్నాం. ఇక వాళ్ళ గురించి మర్చిపోవడం మంచిది." అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది భ్రమరాంబ.

తన తల్లే నా ఇలా మాట్లాడుతోందని కాసేపు నివ్వెరపోయాడు నవీన్.

"పెదమావయ్యా! ఏమిటిది? ఉన్నట్టుండి ఏమైంది అమ్మకి...? మాకు బయటి సంబంధాలు చూడ్డం ఏమిటి?" నమ్మలేనట్టు అడిగాడు.

పెద్దగా నిట్టూర్చి పేలవంగా నవ్వాడు రామలింగేశ్వర్రావు.

"ఏం చెప్పమంటావ్ రా? అంతా డబ్బు మహిమ. ఇప్పుడు మావాడి దగ్గర ఆస్థులు, డబ్బులు లేవుగదా? మీ అమ్మకు బంధుత్వం కన్నా డబ్బే ముఖ్యమనుకుంటాను. మీ మధ్యలో నేనేం మాట్లాడకూడదు. అయినా మీ అన్నాచెల్లెళ్ళు కూడా ఇష్టపడాలిగా? ప్రేమయినా, పెళ్లయినా మనసులు కలిస్తేనే. మీమధ్య ప్రేమ, దోమలాంటి వేమీ లేవుగాబట్టి మీ అమ్మా, నాన్న చెప్పినట్టు వింటే అందరికీ మంచిది." అన్నాడు.

"ఈ విషయం అమ్మమ్మకు తెలిస్తే ఊరుకుంటుందనుకుంటున్నారా?"

"ఊరుకోక ఏం చేస్తుంది? మా అమ్మకు వయసైంది ఏం చేయలేదు. మీరు కూడా అలాంటి ఆశలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. వెళ్లి పని చేసుకో."

"నాకు నచ్చలేదు మావయ్యా! నువ్వు కూడా ఏమిటి? మీవాళ్లు, మావాళ్లని విడదీసి మాట్లాడతావు? ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలా మాట్లాడారా?"

"అప్పటి దారివేరు. ఇప్పటి దారి వేరు. ఇక ఈ విషయం నువ్వు వదిలేయడం మంచిది." అంటూ లేచి లోనకు వెళ్లిపోయాడాయన.

నవీన్ కి ఏమీ అర్ధం కాలేదు. కుటుంబంలో ఇలా ఓ చిచ్చు రేగుతుందని ఊహించలేదు. ఇప్పుడిప్పుడే తనకు శివానీ దగ్గరవుతుంది. ఆ విషయం అర్ధమవుతూనే ఉంది. హైదరాబాద్ సంఘటన తరువాత నుంచే ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఒకరినొకరు అర్ధం చేసుకోగల్గుతున్నారు. సమస్య ఏమిటో అర్ధం కాలేదు. ఇక ఈ విషయాన్ని ఇక్కడ చర్చించి లాభం లేదు. ఓ సారి బెజవాడ వెళ్లిరావడమే మంచిదన్పించింది. అనుకున్నది తక్షణం చేసేయడం అతని అలవాటు. చూద్దాంలే చూద్దాంలే అని వాయిదా వేసే అలవాటు అతనికి లేదు. అందుకే అప్పటికప్పుడు ప్రయాణమై బైక్ తీసాడు. బైక్ స్టార్ట్ చేస్తుండగా వేగంగా వచ్చి అతని వెనుక కూర్చుంది మహేశ్వరి.

"నీ సమస్యే నాదీనూ. అంతా వింటూనే ఉన్నాగానీ, ముందు బైక్ పోనీయ్. అమ్మ చూస్తే గొడవ చేస్తుంది" అంటూ తొందర చేసింది మహేశ్వరి.

ఆమె భయపడినట్టే జరిగింది. భ్రమరాంబ బయటికి వస్తూ ఇద్దర్నీ చూసేసింది.

ఆమె అరుస్తున్నా విన్పించుకోకుండా బైక్ ను వేగంగా ముందుకు దూకించాడు నవీన్. బైక్ కనుమరుగు కాగానే లోపలికొచ్చి రిసీవర్ ఎత్తి ఒక నెంబర్ కి ఫోన్ చేసింది భ్రమరాంబ.

మున్నలూరు వదిలి విజయవాడ దిశగా బైక్ పరుగుతీస్తుండగా ఉన్నట్టుండి ఒక చెట్టు నీడన బైక్ ఆపేశాడు నవీన్.

"ఏమైందిరా అన్నయ్యా! బైక్ ట్రబులా? తను బైక్ దిగుతూ అడిగింది మహేశ్వరి.

"ట్రబుల్ బైక్ కి కాదు... మనకే... జరుగుతున్న పరిణామాలు నాకేం అర్ధం కావడం లేదు. ఓ మాట చెప్పు. చిన్నమావయ్య అమ్మ ఇద్దరూ గొడవ పడడం నువ్వు చూశావా?" ఆలోచిస్తూ అడిగాడు.

"మనింట్లో ఎవరైనా, ఎప్పుడైనా గొడవపడడం చూశామా? అలాంటిదేం లేదు. నేను ఇంట్లోనే ఉంటాను. నాకు తెలియకుండా ఎప్పుడు గొడవపడ్డారు. అదీ సంబంధం విషయంలో? ఆ గొడవ కాదుగానీ చిన మావయ్య, అమ్మా చాలాసేపు అమ్మమ్మ గదిలో ఏదోవిషయంగా చర్చించుకున్నారు. ఆ సమయంలో పెదమావయ్య, డాడీ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడేమన్నా అభిప్రాయబేధాలు వచ్చాయేమో తెలీదు."

"ఏం జరిగిందో పెద్దత్తకు తెలిసుంటుందా?"

"పెద్దత్త ఇలాంటి వేమీ పట్టించుకోదు అన్నయ్యా! తన పనేమిటో అంతే. ఒకవేళ తెలిసినా చెప్పదు. మావయ్య గీచిన గీటు దాటే అలవాటు ఆమెకెప్పుడూ లేదు."

"నిజంగానే మన పెళ్లి గురించే వీళ్లు గొడవపడుంటారా?"

"గొడవ పడకపోతే మావయ్య తన పిల్లల్ని తీసుకుని బయటికి ఎందుకు వెళ్లిపోతాడు."

"గొడవ కాదు. నాకెందుకో వీళ్ళంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నారన్పిస్తుంది."

"నాకేం అన్పించడం లేదు."

"నీదో మట్టిబుర్ర." అంటూ చెల్లెలి తల మీద చిన్నగా మొట్టాడు నవీన్. ఆలోచించు నీకే అర్ధమవుతుంది" అంటూ బైక్ వదిలి పక్కనే తిన్నె మీద కూర్చున్నాడు.

వచ్చి పక్కనే కూర్చుంది మహేశ్వరి. గోర్లు కొరుకుతూ ఆలోచించింది. తల విదిలించి అర్ధం కానట్టు చూసింది.

"అవునన్నయ్యా! నాది మట్టిబుర్రే. అందుకే ఏమీ అర్ధం కావడం లేదు. నువ్వే చెప్పు?" అంది.

"మావయ్య ఇక్కడికి రాగానే అమెరికాలో ఉన్న అత్తయ్యకు, అమ్మమ్మకు తాను వచ్చిన విషయం తెలియకూడదని మనందర్నీ హెచ్చరించాడు. అవునా?" అడిగాడు.

"ఆ మాట కరెక్టే కదా!"

"మావయ్య షేర్లలో కోట్ల రూపాయలు నష్టపోయిన సంగతి తెలిసి అమ్మ ఓ రోజంతా ఏడ్చింది. మావయ్య రాగానే ధైర్యం చెప్పింది. దగ్గరుండి ఏం కావాలో చూసుకుంది. అనంత్, శివానీలను మరింత మంచిగా చూసుకుంది. ఇప్పుడు సడన్ గా మారిపోయిందంటే ఇది నిజమైన మార్పు అంటావా?"

"కాదంటావా?"

"అదేగా చెప్తున్నాను. అనంత్, శివానీల విషయంలో మావయ్య మనసులో ఏదో ఉంది. దానికి మన వాళ్లు సహకరిస్తున్నారు. నా అంచనా కరెక్టయితే మనం వెళ్లేసరికి మావయ్య వాళ్ల ఫ్లాట్ కి తాళం పెట్టి ఉంటుంది."

"ఎందుకుంటుంది?"

"మనం వస్తున్నట్టు అమ్మ ఫోన్ చేసి ఉంటుంది?"

"అమ్మ ఫోన్ చేయడం ఏమిటి?"

"అదంతే వాళ్లు నిజంగా పోట్లాడుకుంటేగా ఫోన్ చేయకుండా ఉండడానికి."

"అయ్యాబాబోయ్ అన్నయ్యా! నీ మాటలు వింటుంటే నాకు బుర్ర తిరుగుతోంది. నేను బావను చూడాలి. అంతే! పద పోదాం" అంటూ తిన్నె దిగింది మహేశ్వరి.

"అబ్బ! ఎంత తొందరే బాబూ. అక్కడికేదో బావ నిన్ను ప్రేమిస్తున్నట్టు. బైక్ స్టార్ట్ చేసాడు."

"ఆ వెక్కిరింపే వద్దుమరి. శివానీ ఏమన్నా నీకు ఐ లవ్ యూ చెప్పిందా? అయినా నువ్వు చూడాలని తొందరపడ్డం లేదా?" అంటూ అతడి వెనుక కూర్చుంది.

"అవునులే. ఈ మధ్య బావతో చేరి నువ్వు ఎక్కువ మాటలు నేర్చావ్." అంటూ బైక్ స్టార్ట్ చేశాడు.

ఇద్దరూ విజయవాడ చేరుకున్నారు.

"అయ్యబాబోయ్ అన్నయ్యా! ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావ్ రా... నిజంగానే ఫ్లాట్ కి తాళం పెట్టి వీళ్లు ఎక్కడికో వెళ్లిపోయారురా..." అంటూ ఫ్లాట్ కు వేసిన తాళం చూసి పెద్దగా అరిచింది మహేశ్వరి.

"వెళ్లిన వాళ్లు రాకుండా ఉండరు. కంగారెందుకు? కింద వెయిట్ చేద్దాం రా..." అంటూ మెట్లు దిగి అపార్ట్ మెంట్ పార్కింగ్ దగ్గరకు చెల్లెల్ని తీసుకుని వచ్చేసాడు నవీన్.

సుమారు అరగంట ఎదురుచూసారు.

గోపాల్ జాడలేదు. అనంత్, శివానీలు ఏం చేస్తున్నారో తెలీదు. ఓపిగ్గా మరో అరగంట ఎదురుచూశారు.
 

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
duradrustapu dongalu