Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Patashala

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో నాకు స్నేహితులు లేరు! - మోహ‌న్ బాబు

Interview with Mohan Babu

మాట క‌ర‌కు... మ‌న‌సు వెన్న - మోహ‌న్‌బాబు గురించి రెండే రెండు ముక్క‌ల్లో చెప్ప‌మంటే, ఎవ‌రైనా ఇలాగే అంటారు. కానీ ఆయ‌న ప్ర‌స్థానం, సాధించిన విజ‌యాలు, పాటించిన క్ర‌మ‌శిక్ష‌ణ‌... ఇవ‌న్నీ రెండు ముక్క‌ల్లో చెప్పేవి కావు. అంచెలంచెలుగా ఎదిగి, ఈ స్థాయికి చేరుకొన్న ఆయ‌న ప్ర‌యాణం రెండు మాట‌ల్లో వివ‌రించేది కాదు. భ‌క్తవ‌త్స‌లం నాయుడు నుంచి మోహ‌న్‌బాబు వ‌ర‌కూ - మోహ‌న్ బాబునుంచి క‌లెక్ష‌న్ కింగ్ వ‌ర‌కూ ఎదిగిన వైనం, ఈత‌రానికి ఓ అమూల్య‌మైన పాఠం. స్వ‌ర్గం న‌ర‌కం నుంచి మొద‌లైన ఆయ‌న న‌ట ప్ర‌స్థానం 38 యేళ్లుగా కొన‌సాగుతూనే ఉంది. స్వ‌ర్గం న‌ర‌కం విడుద‌లై ఈనెల 24తో 38 యేళ్లు. ఈ సంద‌ర్భంగా న‌ట ప్ర‌పూర్ణ‌, ప‌ద్మ‌శ్రీ మోహ‌న్ బాబు మ‌న‌సులోని భావాలివి...

అప్పుడే 38 యేళ్లు అయిపోయాయి...
- అవును. నిన్నో, మొన్నో కెమెరా ముందుకు వ‌చ్చిన‌ట్టు అనిపిస్తోంది. ఇన్నేళ్ల ప్ర‌యాణం అస‌లు ఊహించ‌లేదు. సినిమాలే ప్రాణంగా, సినిమాలే జీవితంగా బ‌తికా. ఏం చేసినా సినిమాల్లోనే చేయాల‌ని... ముందే అనుకొన్నా. బ‌హుశా... ఆ ఆలోచ‌నే ఇన్నాళ్లు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఉండేలా చేసిందేమో..?

ప‌రాజ‌యాలెప్పుడైనా బాధించాయా?
- బాధ‌ప‌డ‌లేదు... అని చెబితే అది అబ‌ద్ధ‌మే. ఓ సినిమా తీశామంటే అందులో ఎంతో క‌ష్టం ఉంటుంది. డ‌బ్బు ఉంటుంది. అవి వృథా అయితే ఎవ‌రికైనా బాధే క‌దా. కానీ నేను న‌మ్మేది ఒక్క‌టే. క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం. జ‌యాప‌జ‌యాలు మ‌న చేతుల్లో లేని విష‌యాలు. ఫ్లాప్ అయినంత మాత్రాన మ‌న బండి ఆగిపోయిన‌ట్టు కాదు. హిట్ ఉంటే ప్ర‌తిభావంతులం అని కూడా కాదు. ఇక వీడి ప‌ని అయిపోయింది అనుకొన్న‌ప్పుడు ఒక్క హిట్ ద‌క్కితే చాలు... మ‌నం ఎక్క‌డికో వెళ్లిపోతాం. కాబ‌ట్టి... ప‌నిచేస్తూ ఉండాలి. ఫ‌లితాల గురించి బెంగ ప‌డ‌కూడ‌దు. నేనూ అంతే. నా ప‌ని నేను చేసుకొంటూ పోయా. జ‌యాప‌జ‌యాల్ని స‌మానంగా స్వీక‌రించా.

ఈ సుదీర్ఘ న‌ట ప్ర‌స్థానంలో మీకు చేదోడు వాదోడుగా ఉన్న‌దెవ‌రు? ఒక‌వేళ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలంటే ఎవ‌రికి చెప్పుకొంటారు?
- క‌చ్చితంగా మా గురువు దాస‌రి నారాయ‌ణ‌రావు గారికే. భ‌క్త‌వ‌త్స‌లం నాయుడిగా ఉన్న నా పేరు... మోహ‌న్‌బాబుగా మార్చారు. జీవితం, న‌ట జీవితం రెండూ ఆయన ప్ర‌సాదించిన‌వే. అక్క దాస‌రి ప‌ద్మ‌గారిని ఎప్పుడూ మ‌ర్చిపోలేను.

ప‌రిశ్ర‌మ‌లో మీకు స్నేహితులు ఎవ‌రు?
- తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో నాకు స్నేహితులు ఎవ‌రూ లేరు. ఎందుకంటే ముక్కు సూటిగా పోయే నా వైఖ‌రి ఎవ‌రికీ న‌చ్చ‌దు. దాంతో మోహ‌న్‌బాబుకి దూరంగా ఉందాం... అనుకొంటుంటారు. అయినా ఫ‌ర్లేదు. నాకంటూ స్నేహితులున్నారు. ర‌జ‌నీకాంత్ తో నా బంధం... అంద‌రికీ తెలిసిన‌దే. అంబ‌రీష్ కూడా మంచి స్నేహితుడు.

మీ ముక్క‌సూటిత‌నం మిమ్మ‌ల్ని ఎప్పుడూ ఇబ్బందికి గురి చేయ‌లేదా?
- నా వైఖ‌రి వ‌ల్ల నేనే బాధ‌ప‌డ్డా. కానీ ఎవ్వ‌రినీ బాధ పెట్ట‌లేదు. ఏవండీ... ఓ వ్య‌క్తి క్ర‌మశిక్ష‌ణ‌గా ఉండ‌డం త‌ప్పా..? ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్ప‌డం నేర‌మా? నెవ్వ‌ర్‌... మోహ‌న్‌బాబు కోపిస్టి అనుకొన్నారు, అనుకోనివ్వండి. నేను ఇలానే ఉంటా. ఎవ‌రి కోస‌మో నా వ్య‌క్తిత్వాన్ని మార్చుకోను.

త‌న‌యుల కెరీర్ మీకు ఎలాంటి సంతృప్తి ఇస్తోంది..?
- న‌న్ను ఎలా ఆశీర్వ‌దించారో, ప్రేక్ష‌కులు నా బిడ్డ‌ల‌ను కూడా అలానే ఆశీర్వ‌దించారు. ఒక్కొక్క‌రిదీ ఒక్కో మార్గం. మనోజ్ ప్ర‌తీదీ వెరైటీగా ప్ర‌య‌త్నిస్తుంటాడు. రిస్క్ చేయ‌డం అంటే ఇష్టం. ల‌క్ష్మి ప్ర‌స‌న్న... త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డాలి అనే ప‌ట్టుద‌ల ఉన్న అమ్మాయి. ఇక విష్ణు బాధ్య‌త గ‌లిగిన వ్య‌క్తి. ముగ్గురూ విజ‌యాల బాట‌లో న‌డుస్తున్నారు. ఓ తండ్రిగా చాలా సంతోషిస్తున్నా. `కెరీర్ ఎప్పుడు ఎలా ఉన్నా స‌రే. క్ర‌మ‌శిక్ష‌ణ మ‌ర్చిపోవ‌ద్దు` అని చెబుతుంటా. వాళ్లూ అదే పాటిస్తున్నారు.

చేయాల్సిన పాత్ర‌లేమైనా మిగిలిపోయాయా?
- బాబా ఆశీస్సుల వ‌ల్ల‌, గురువు దాస‌రి నారాయ‌ణ‌రావుగారి ప్రోత్సాహం వ‌ల్ల‌... అన్ని ర‌కాల పాత్ర‌లూ చేయ‌గ‌లిగా. ఎన్టీఆర్ త‌ర‌వాత ఆ స్థాయి డైలాగులు చెప్ప‌గ‌లిగే న‌టుడిగా గుర్తింపు సంపాదించా. నిర్మాత‌గా యాభైకి పైనే సినిమాలు తీశా. ఓ న‌టుడు ఇన్ని సినిమాలు తీయ‌లేద‌ట‌. ఇదో రికార్డ్ అంటున్నారు. ఇంకేం కావాలి??  అయితే న‌టుడికి ఎప్పుడూ సంతృప్తి ఉండ‌దు. వైవిధ్య‌మైన పాత్ర‌లొస్తే చేయాల‌నే అనిపిస్తుంటుంది.

మ‌రి న‌టుడిగా మ‌ళ్లీ బిజీ అయ్యేందుకు ఆలోచిస్తున్నారా?
-  నాకు న‌చ్చిన క‌థ‌లు, పాత్ర‌లూ వ‌స్తే న‌టించ‌డానికి సిద్ధంగానే ఉన్నా. `వీడెంత కాలం న‌టిస్తాడ్రా బాబూ...` అని ప్రేక్ష‌కులుఎప్పుడూ అనుకోకూడ‌దు. మోహ‌న్ బాబు మ‌ళ్లీ న‌టిస్తే బావుణ్ణు. పెద‌రాయుడులాంటి సినిమాలు చేస్తే బాగుణ్ణు. అనుకోవాలి. నా విష‌యంలో అలా అనుకొంటున్నారు కాబ‌ట్టే... ఇంకా న‌టిస్తున్నా.

ఈత‌రం క‌థానాయ‌కులు ఎలా ఉన్నారు. వారి స్పీడు చూస్తే మ‌మ‌నిపిస్తోంది?
- అంద‌రూ పోటాపోటీగా ప‌నిచేస్తున్నారు. పైగా చేతిలో ఎప్పుడూ రెండు మూడు సినిమాలుండేలా చూసుకొంటున్నారు. అది వాళ్ల‌కే కాదు, ప‌రిశ్ర‌మ‌కు కూడా చాలా అవ‌స‌రం. కాక‌పోతే ట్రెండ్‌ని ఫాలో అవ్వ‌కూడ‌దు. ఎవ‌రి శైలి వాళ్లు సృష్టించుకోవాలి. ఎవ‌రికి న‌ప్పే క‌థ‌లు వాళ్లు చేయాలి. ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ లాంటి వాళ్ల‌తో ప‌నిచేశా. వారి జోరు క‌ళ్లారాచూశా. త‌ప్ప‌కుండా అంద‌రికీ మంచి భ‌విష్య‌త్తు ఉంది.

రాజ‌కీయాల విష‌యానికొద్దాం... రాష్ట్రం విడిపోతుంది క‌దా? ఏమ‌నిపిస్తోంది?
- తెలుగువాళ్లంతా ఒక్క‌టిగా ఉండాల‌న్న‌దే నా భావ‌న‌. విడిపోయి క‌ల‌సి ఉందాం... అంటే ఇంకా మంచిది.

ఇటీవ‌ల మోడీని క‌లుసుకొన్నారు. ఈ క‌ల‌యిక‌లోని ఆంతర్యం ఏమిటి?
- మోడీ మంచి నాయ‌కుడు. ఎదుటివాళ్ల‌లో స్ఫూర్తి నింప‌గ‌ల‌రు. అందుకే ఆయ‌న్ని క‌ల‌సి... అభినంద‌లు చెప్పాల‌నిపించింది.

రావ‌ణ సినిమా చేస్తార‌ని అంటున్నారు. అది ఎంత వ‌ర‌కూ వ‌చ్చింది?
-  స్ర్కిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాని తీసుకురావాల‌ని విష్ణు చాలా కష్ట‌ప‌డుతున్నాడు.

పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద ఎలా ఉండ‌బోతోంది?
- అయిదుగురు హీరోలుంటే ఎలా ఉంటుంది?  సంద‌డి సంద‌డిగా ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. థియేట‌ర్లో పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. నా సినిమాకి న‌లుగురు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌డం ఇదే తొలిసారి. విష్ణు, మ‌నోజ్‌లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో నాది మ‌ర్చిపోలేని పాత్ర‌.

హిందీ సినిమాకి రీమేక్ అంటున్నారు...
- కాదు. సినిమా టైటిల్‌లో ఎంత తెలుగుద‌నం ఉందో... క‌థ‌లోనూ అంతే ఉంటుంది. ఇది మ‌న క‌థే. ఏ సినిమాకీ రీమేక్ కాదు.

ఈ వయస్సులో కూడా నటించగలగడం, నటించే అవకాశం ఈ రెండిటికీ కారణం?
- ఇంకేముంది. ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహమే. వారు ప్రోత్సహిస్తున్నారు. అది ఉత్సాహాన్ని ఇస్తోంది.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Movie Review - VARNA