Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి..... http://www.gotelugu.com/issue329/838/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి).... బయట వానజోరు ఊపందుకుంది. రమ్య, శరత్ లు ఊళ్ళోలేరు. శరత్ వాళ్ల చిన్నాన్న కూతురికి డెలివరీ అయిందని చూడడానికి వెళ్లారు.

మరునాడు పొద్దున్నకి గాని రారు.ఒక్కతీ ఉండడానికి భయమైనా తప్పదు. వానతోపాటు గాలివేగం కూడా పెరిగింది. ఆ తీవ్రతకి విరిగి పోతాయేమోన్నంతగా కొట్టుకుంటున్నాయి కిటికీ రెక్కలు. తలుపులు మూసేద్దామని కిటికీ  దగ్గరకు వెళ్ళినదల్లా ఆగిపోయింది ఒక్కసారిగా. అక్కడ… అక్కడ… సన్ షేడ్ కింద గడగడ వణుకుతూ నిలబడి ఉంది ఒక ఆకారం. కొంపదీసి దొంగ కాదు కదా! భయమేసింది మౌక్తికకు.

“ఎవరూ!?’’ అడిగింది బింకంగా.

సమాధానంలేదు. దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటూ వరండాలో లైట్ స్విచ్ వేసి”మిమ్మల్నే … ఎవరంటే మాట్లాడరేం?’’ స్వరం పెంచి విసుగ్గా అడిగింది మౌక్తిక.

ఆ ఆకారం ఇటువైపుకి తిరిగింది. లైటు వెలుగులో అతడెవరో పోల్చుకుంది మౌక్తిక. అతడు… ఈ మధ్యనే వాళ్ళ కాలేజ్ లో చేరిన ఫ్లోర్ ఇన్ ఛార్జ్ శివాజీ.

అతడికి ‘రాముడు మంచిబాలుడు’ అని నామకరణం చేసింది రమ్య. జుట్టుకి కుంచెడు నూనె రాసుకుని నున్నగా తల దువ్వుకుంటాడు. పూర్వకాలంనాటి నారోకట్ ప్యాంట్ వేసుకుంటాడని    ‘ గొట్టాంగాడు’ అని ఇక్ నేమ్ కూడా తగిలించేసింది.

రమ్య అంతే… తనెవరినైనా ఏమన్నా అనేస్తుంది. తనని ఎవరేమన్నా పట్టించుకోదు. అంతా జాలీటైప్.కిటికీలోచి ఆసక్తిగా చూస్తున్న మౌక్తికను చూసి “మేడమ్ గారూ… ఇదేనా మీఇల్లు?’’ అడిగాడు శివాజీ ఎంతో ఆశ్చర్యంగా.అతడికంత ఆశ్చర్యం దేనికో మౌక్తికకు అర్ధంకాలేదు. అవునన్నట్లుగా తలూపి ఉఉరుకుంది.

ఎంత సన్ షేడ్ కింద నిలుచున్నా, ఫోర్సుగా ఏటవాలుగా కురుస్తున్న వానధాటికి తడిసి మ్దాయ్యాడు అతడు.తడిసిన బట్టలు శరీరంలో చలి పుట్టిస్తున్నాయేమో… గజగజ వణుకుతున్నాడు కూడానూ.

మౌక్తికకు జాలివేసింది. తలుపుతీసి లోపలికి రమ్మని పిలిస్తేనో!

అంతలోనే భయంవేసింది. తాను చూస్తే ఒంటరిగా ఉంది. వాతావరణం చల్లగా ఉండి కోరికలను ప్రేరేపిస్తోంది. ఇలాంటప్పుడు అతడిని లోపలికి ఆహ్వానిస్తే…అతడు అడ్వాంటేజ్ తీసుకుని తననేదైనా చేస్తే…దిక్కా…దివాణమా!

ఛీ…తానేమిటి ఇలాంటి ఊహాగానాలు చేస్తోంది. అతడు అందరిలాంటివాడు కాదని  తెలుసు. అనవసర ప్రసంగాలు చేయడు. వెకిలిదనం ప్రదర్శించడు. ఆడవాళ్ళకి ఆమడదూరంలో ఉంటాడు. ఇంకా తనకు దేనికి భయం!

మనసులో స్వఛ్ఛత, ప్రవర్తనలో హుందాతనం , ప్రవృత్తిలో నిగ్రహం ఇవన్నీ ఉంటే ఎవరిని ఎవరూ ఏమీచేయలేరు.మెల్లగా వీధి తలుపు తెరిచి “తడిసిపోతున్నారు… లోపలికి రండి’’ అంది మౌక్తిక లోస్వరంతో. మరోసారి ఆశ్చర్యపోతూ లోపలికి వచ్చాడు శివాజీ.

‘మాటిమాటికీ ఆశ్చర్యపోవడం ఇతడి మానరిజంలా ఉంది.’ నవ్వుకుంది మౌక్తిక. అల్మారాలోనుంచి ఇస్త్రీ తువ్వాలు తీసి ఇచ్చింది. మొహమాటపడుతూనే అందుకున్నాడు శివాజీ.

“అలా కూర్చోండి. తాగడానికేమైనా తీసుకొస్తాను.’’ వంటింట్లోకి వెళ్ళింది మౌక్తిక. పర్కొలేటర్ లో డికాక్షన్ తీసి, పాలు కలిపి స్ట్రాంగ్ గా కాఫీ కలిపి తీసుకొచ్చింది.

“అబ్బే ఇవన్నీ దేనికండీ…’’ ఇంకా మొహమాటం వీడలేదు శివాజీలో.

మౌక్తిక మాట్లాడలేదు. అతడు మౌనంగా కాఫీ తాగడం పూర్తిచేశాడు.

“థాంక్యూ మాడమ్ గారూ… వేడివేడి కాఫీ ఇచ్చారు. మరికాస్సేపుంటే చలిపట్టి చచ్చిపోయుండేవాడిని…’’ అన్నాడు శివాజీ చూపులనిండా కృతజ్ఞతను కురిపిస్తూ.

ఫరవాలేదన్నట్లుగా తలూపింది మౌక్తిక. బయట వర్షపు ఉధృతి ఎక్కువైంది. కంటికి వానధారలు తప్ప మరేమీ కనబడడంలేదు. ఎక్కడో…పిడుగు పడింది పెద్దశబ్దంతో. పరిసరాలన్నీ దద్దరిల్లాయి. మౌక్తిక గుండె గుభేల్ మంది.

“బంగాళాఖాతంలో అల్పపీడనంట. తుఫానుగా మారవచ్చునని వాతావరణ సూచనల్లో చెప్పారు’’ అన్నాడు శివాజీ తనలో తనే అనుకుంటున్నట్లుగా.

మళ్లీ తలాడించింది మౌక్తిక. ఇంతలో హఠాత్తుగా కరెంట్ పోయింది. చుట్టూ చిక్కటి చీకటి నల్లనికాటుక పులిమినట్లుగా ఆవరించుకుంది. అప్పుడప్పుడు మెరిసే మెరుపుల వెలుగులు తప్ప మరేమీ కానరానంత గాఢాంధకారం.

మౌక్తికకు చీకటంటే  చచ్చేంత భయం. ఎందుకంటే చీకటి చిచ్చు పెడుతుంది. మనిషిలో అంతర్లీనంగా అణగారి ఉండే దురూహలని తట్టిలేపి, ఊపిరులూదుతుంది చీకటి.

పైశాచికత జడలువిప్పి నర్తించేందుకు ప్రేరణ ఇస్తుంది చీకటి. పశుప్రవర్తన పంజా విసిరేందుకు దోహదపడుతుంది చీకటి. అందుకే చీకటంటే మౌక్తికకు భయం.

ఛార్జింగ్ లైట్ లో కూడా ఛార్జింగ్ అయిపోయినట్లుగా ఉంది. అందుకే కరెంట్ పోగానే వెలగాల్సింది వెలగలేదు. టేబుల్ మీదున్న సెల్ తీసి, ఫ్లాష్ లైట్ ఆన్ చేసి, ఆవెలుగులో వెళ్లి కొవ్వొత్తులు వెతికి తేవాలనుకుంది మౌక్తిక. మెల్లగాలేచి, అంచనా మీద తడుముకుంటూ టేబుల్ దగ్గరకు చేరి తన సెల్ కోసం తడిమింది మౌక్తిక. సెల్ దొరకలేదు కాని, మొరటుగా ఏదో స్పర్శ తగిలింది. అది… శివాజీ చేయని గ్రహించి” సారీ శివాజీ గారూ’’ అంది గభాలున చేయి వెనక్కు లాక్కుంటూ.

“సారీనా? ఎందుకు?’’ శివాజీ స్వరంలో అదోలాంటి మార్పు. విస్తుపోయింది మౌక్తిక. మనసేదో కీడుని శంకించింది. వెలుతురులో ఏమీ ఎరుగని అమాయకుడిలా ప్రవర్తించే అతడు చీకటిని చూడగానే చెలరేగిపోతున్నాడు. అంటే…చీకటికి వెలుగుకి నడుమనున్న తేడాలో మనిషిలో ఇన్ని భిన్నకోణాలు దర్శనమిస్తాయా? శివాజీ చేయి దవ్వకాడలా కోమలంగా ఉన్న మౌక్తిక జబ్బను ఒడిసిపట్టుకుంది.

“శివాజీ గారూ…ఏమిటిది? వదలండి. మీరెంతో డీసెంట్ అనుకున్నా…ప్లీజ్…’’ అతడి పట్టునుండి విడిపించుకోవాలని గింజుకుంది మౌక్తిక.“ఇప్పుడు నా డీసెన్సీకి వచ్చిన లోటేముంది? ప్లీజ్ ముక్తా… జస్ట్ ఒక్కసారి… ఏంకాదులే. చాలా బాగుంటుంది.’’ చీకట్లో కంటికి  కనబడని మౌక్తిక నడుముని కాంక్షగా తడిమాడు శివాజీ.

‘మేడమ్’ అన్న సంబోధన నుండి ‘ ముక్తా’ అని పిలిచేంత చనువు అతడికీ తనకీ మధ్యన ఎప్పుడేర్పడిందో మౌక్తికకు బోధపడలేదు. బహుశా… ఈ వాతావరణం అతడిలో ఆరకమైన చొరవని పెంచిందేమో! అతడి స్పర్శకి ఆమెలో పులకింతకి బదులు కంపరాన్ని కలిగించింది.

“ప్లీజ్… ఇది మీకు మర్యాదకాదు. మీరంటే నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. దాన్ని పోగొట్టుకోకండి.’’ అతడి చేతిని తోసేయడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. తన గొంతు తనకే బలహీనంగా వినిపిస్తోంది.

అనుకోకుండా వచ్చిన ఆపద రూపంలో దాడి చేయబోయిన శివాజీ బారినుండి మౌక్తిక తప్పించుకుందా? లేక అతడి దాష్టీకానికి బలైపోయిందా? తెలుసుకోవాలంటే వచ్చే శుక్రవారం ఒంటిగంట దాకా ఎదురుచూడాల్సిందే...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్