Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> మేడ్ ఫర్ ఈచ్ అదర్

made for each other

యాన్వి మనసంతా యశస్వి మీద కేంద్రీకృతమయివుంది. అతను తనను ప్రేమిస్తున్నాడో లేదో అర్ధం కాకుండా వుంది. కలిసినపుడు బాగా మాట్లాడుతాడు. తరువాత కనీసం మెసేజ్ కూడా చేయడు. ఫోన్ చేస్తే ముక్తసరిగా మాట్లాడి కట్ చేస్తాడు. అతనొక పెద్ద పజిల్ లా తయారయాడు తనకు.

యశస్వి, యాన్వి ఇద్దరూ మెడికోలు. ఈమె లేత తమలపాకులా ఉంటే, అతను హీ-మాన్ లా ఉంటాడు. అందంలోనే కాదు చదువులో కూడా ఇద్దరికీ ఇద్దరే. యాన్వి స్నేహితులంతా అంటారు వీరిద్దరూ ఒకటయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా వుంటారని. కొందరైతే ప్రపోజ్ చెయ్యమని యాన్విని ఎంకరేజ్ చేశారు కూడా. వారి మాటలే తనలోని ఆశల తలుపులు తట్టాయో లేక అతని అందానికే పడిపోయిందో గాని, పీకల్లోతు ప్రేమలో దిగబడి పోయింది యాన్వి. కాని ఇది ఒకవైపు నుంచి మాత్రమే. యశస్వి నుంచి ఎటువంటి స్పందన లేదు. అదే బాధ యాన్వికి. ఎంత అవకాశమిచ్చినా ఎక్కడా తన హద్దు దాటడు ప్రేమగా ఒక్క మాట మాట్లాడడు. ఎంతసేపు చదువు ధ్యాసే మానవుడికి అనుకునేది.

ఇంకొక నెలరోజులలో కోర్సు పూర్తయిపోతుంది. ఎలాగైనా రేపు యశస్వితో తన ప్రేమ గురించి చెప్పాలి. అతని మనసు తెలుసుకోవాలి. అతను ఒప్పుకుంటే అబ్బా ఎంత బాగుంటుంది. మా జంట చూసి కాలేజి మొత్తం కుళ్ళుకోదూ అని మురుసుకుంటూ నిద్రలోకి జారిపోయింది యాన్వి.

*******

"చెప్పు యాన్వి. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు" అంటూ మౌనాన్ని ఛేదిస్తూ అడిగాడు యశస్వి, పార్కులో తనను కలవమని పిలిపించిన యాన్వితో.

"ఆ..అది...ఏమిలేదు కోర్సు అయిపోవచ్చింది కదా. తరువాత నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటని" అసలు విషయాన్ని ఎలా మొదలెట్టాలో అర్థం కాక ఏదో అడిగింది యాన్వి.

" ఏముంది. మధ్యతరగతి వాణ్ణి. స్కాలర్ షిప్ మీద చదువుకుంటున్న వాడిని. ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ సహకారంతో సాధించుకోబోతున్న ఈ పట్టాను పుచ్చుకుని ఏదో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోనో చేరి ప్రజా సేవ చేస్తూ వాళ్ళ ఋణం తీర్చుకుంటాను"

ఉలిక్కిపడింది యాన్వి. ఇంత తెలివిగలవాడు ఇలా ఆలోచిస్తున్నాడేమిటి.

" అదేంటి పోస్టు గ్రాడ్యుయేషన్ చేయవా?"

"లేదు. ముందు ఉద్యోగం సంపాదించి, ఆ తరువాత చేస్తాను. ఇప్పటికే మా వాళ్ళకు నా చదువు భారంగా తయారయింది"

" రాంగ్ డెసిషన్ నీది. చూడు నేను మా డాడీతో చెప్పి మా హాస్పిటల్ లో జాబ్ ఏర్పాటు చేయిస్తాను. ఇద్దరం అక్కడే చేస్తూ పోస్టు గ్రాడ్యుయేషన్ కు ప్రిపేర్ అవుదాం"

" లేదు. నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, అక్కడ వాళ్ళ పర్మిషన్ తోనే పి.జి. చేస్తాను"

" ఎందుకంత ఫూలిష్ గా ఆలోచిస్తావు. గవర్నమెంట్ ఉద్యోగంలో ఎదుగూ బొదుగూ ఉండదు. ఏమాత్రం సంపాదించుకోలేవు. నీ అంత మేధావి అలా దిక్కు మొక్కు లేని వారికి సేవ చేయడం, పన్నీటిని బూడిదలో పోయడమే" యాన్వి గొంతులో విసుగు.

"సారీ యాన్వి నా ఆశయాలు, ఆలోచనలు వేరు. నన్నింతవాడిని చేసిన ప్రభుత్వాన్ని, ప్రజలను వదలి నా స్వార్థం నేను చూసుకోలేను"

" ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివిన వారంతా నీలా ఆలోచిస్తే ఇన్ని సూపర్ స్పెషాలిటీలు ఉండవు. నలుగురితో పాటు నడిస్తే మంచిది కదా. నీ ఆశయాలు నిన్ను అందలమెక్కిస్తాయా చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం ఒకటయితే మా నాన్న గారు మనకోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తారు. మనిద్దరం దాన్ని చూసుకుంటూ ఆనందంగా గడిపేయవచ్చు" మనసులో మాట కక్కేసింది యాన్వి. ఊహించని  పరిణామానికి ఉలిక్కిపడ్డాడు యశస్వి. యాన్వి పథకం అర్థమయింది. తనను పిలిపించి కోర్సు అయిన తరువాత ఏంచేస్తావని అడగడానికి కాదు. తనను వివాహం చేసుకోమని అడగడానికి.

" ఏం మాట్లాడుతున్నావు యాన్వి. మనిద్దరికీ పెళ్ళా. నీ మీద నాకలాటి ఊహే లేదు. అలా నేనెప్పుడూ ప్రవర్తించలేదు. నీ కసలిలాటి ఆలోచన ఎందుకొచ్చింది" తడబడుతూ అడిగాడు యశస్వి.

"యశస్వి నిన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నాను నేను. కాని చెప్పే ధైర్యం చాలక ఆగాను. మనిద్దరి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగ ఉంటుందని మా ఫ్రెండ్స్ అంటుంటారు. అయినా నాకేం తక్కువ. మా నాన్నగారు పేరున్న కార్డియాలజిస్ట్. మా అమ్మ గైనకాలజిస్ట్. నేను ఒక్కర్తినే వాళ్ళకు. మా నాన్న నా మాట కాదనడు. నువ్వు కావాలి నాకు, నీ స్టేటస్ కాదు. ఐ లవ్ యూ యశస్వి" యాన్వి గొంతు పరవశంతో వణికింది.

" యాన్వి. నీ వైపే గాని ఎదుటి వారి గురించి ఆలోచించవా. ఎదుటివారి ఇష్టాయిష్టాలతో పనిలేదా. నీ మీద నాకా దృష్టి ఎప్పుడూ లేదు. కావ్య, నువ్వు, నేను క్లాసులో ముందుంటాము. అందుకే నువ్వంటే అభిమానం. ఒకరి కొకరం సందేహాలు తీర్చుకోవడం కోసం కలుస్తుంటాము.  చర్చించుకుంటాము. అలా నీతో చనువు పెరిగిందే తప్ప, నీ మీద నాకు ఎలాటి ఫీలింగ్స్ లేవు. ఒకవేళ నీకలా అనిపించివుంటే సారీ. నేను...నేను" సగంలోనే ఆగిపోయాడు యశస్వి.

ఇలాంటి సమాధానం యశస్వి నుంచి వస్తుందని కలలో కూడ ఊహించలేదు యాన్వి. తనంత స్టేటస్ కలిగిన ఆడపిల్ల అడిగితే కాదనే దమ్ము ఎవరికి వుంది అనుకుంది. తన కంటి చూపు కోసం కాలేజిలో కుర్రాళ్ళంతా పిచ్చివారిలా ఎదురుచూస్తారు. అటువంటిది తనే సిగ్గు విడిచి అడిగితే కాదంటాడా...అహం దెబ్బతిన్నది యాన్వికి.

"నాకై నేనే వచ్చి అడిగానని చులకన చేస్తున్నావా యశస్వి" గొంతులో అసహనం.

" పొరపడుతున్నావు యాన్వి. నీ మనసులో మాట చెప్పావు. తప్పులేదు. నీలాటి అందం, ఐశ్వర్యం ఉన్న ఆడపిల్ల అడిగితే ఎవరూ కాదనరు. కాని నా పరిస్థితి వేరు. నేను డాక్టర్ కావాలనుకున్నది డబ్బు కోసం కాదు. మారుమూల గ్రామాలలో బ్రతుకుతూ వైద్య సౌకర్యానికి నోచుకోక, ఏ ప్రభుత్వ డాక్టరు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడక ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ప్రాణాలు కోల్పోయిన వారిలో మా అత్తయ్య కూడ ఉన్నారు. ఆమె ద్వారా విషయం విన్న తరువాత నాకు డాక్టరు కావాలని, పేద ప్రజలకు సేవ చేయాలని ధృఢనిశ్చయం ఏర్పడింది. నా ఆలోచనలతో నువ్వు ఏకీభవించలేవు. నువ్వేమిటో నాకు తెలుసు. పైగా నీ అంతస్తు వేరు, నీ బ్యాక్ గ్రౌండ్ వేరు. వయసు ఆవేశంలో నీవు అన్నీ వదులుకోవాలనుకున్నా, కాలక్రమంలో పశ్చాత్తాపపడి, బాధపడితే, కాలిపోయేవి మన జీవితాలే. అందుకని అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు" అంటూ లేచాడు యశస్వి, ఇక చెప్పవలసినది ఏమీలేదన్నట్లు.యాన్వి అహం దెబ్బతిన్నది. ఇందుకేనేమో పెద్దలంటారు "వనిత తనంత తాన్ వలచి వచ్చిన చులకన గాదె ఏరికిన్" అని.

" అదేనా నీ తుది నిర్ణయం. " పిలిచి పిల్లనిస్తానంటే ఎగిసి కాలితో తన్నాడంట నీలాటి వారెవరో" అంతేలే నీ హానికి ఆ కాకి బంగారం కావ్యే కరెక్ట్. కాకి ముక్కుకు దొండపండు అన్నట్టు ఉంటుంది మీ జంట" అక్కసు వెళ్ళగక్కింది, యాన్విలోని ఆడ అసూయ.

ఒక్కసారిగా అదిరిపడ్డాడు యశస్వి. కావ్య గురించి ఎందుకలా మాట్లాడుతున్నది. తను ఎంత మంచి మనిషి, మా ఇద్దరి కన్నా తెలివి గలదైనా, ఎంత ఒద్దికగా వుంటోంది. ఎప్పుడూ అతి చనువుగా ఉండదు. తన పేదరికం తనకు శాపం అనుకుంటుంది తప్ప, ఎవరినీ నొప్పించదు. కావ్యంటే తనకు ఇష్టం, కాని కనీసం ఆమె దగ్గర కూడ బయటపడలేదు. తమ ఇద్దరి భావాలూ ఒకటే. ఆమె మీద తనకున్న అభిప్రాయాన్ని తిన్నగా తెలియచేయాలనుకున్నాడు. కాని యాన్వి వ్యంగ్యంగా, ఎటువంటి ఆధారాలు లేకుండా నింద మోపుతున్నది. ఈమె సామాన్యురాలు కాదు. కాలేజీ మొత్తం చాటింపు వేస్తుంది. ఇది చిలికి చిలికి గాలివానై కావ్య మనసును బాధపెట్టేలోపు, తనే కావ్యతో ఈ విషయం మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు యశస్వి.

" వెళ్ళు వెళ్ళు గంతకు దగ్గ బొంత. మేడ్ ఫర్ ఈచ్ అదర్." తను కాబోయే డాక్టర్ అన్న స్పృహ కూడ లేకుండా ప్రేమ విఫలమయిన సగటు ఆడపిల్లలా మాట్లాడింది.

" చూడు యాన్వి, కావ్య చాలా మంచి పిల్ల. నీలా ఆవేశపరురాలు కాదు. తనంటే నాకు అభిమానం. ఇప్పుడు నువ్వనిన తరువాత అనిపిస్తున్నది, తనే నాకు సరైన జోడి అని. మనిషికి విలువ తెచ్చేది అందం కాదు గుణం. వయసుతో పాటు వాడిపోయే అందం కన్నా, కడదాకా మారని గుణమే నాకు ముఖ్యం. నువ్వన్నావే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. అది కరెక్ట్. ఆశయాలలో, ఆదర్శాలలో, కష్టాలు భరించడంలో మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్. మా చివరి క్షణం వరకు మేమలాగే ఉంటాం. కావ్యతో ఇప్పుడే మాట్లాడుతాను. ఒప్పుకునేంత వరకు తనని వదలను. మా జీవితాలను గుడిసెలలో బ్రతికే పేదల కోసం, వారి ఆరోగ్య రక్షణ కోసం అంకితం చేస్తాము. మంచి ఆలోచన అందించినందుకు థాంక్స్" అంటూ విస విస వెళ్ళిపోయాడు యశస్వి.

'తన కోపమె తన శతృవని' ఆవేశంలో తనే యశస్విని రెచ్చగొట్టానేమోనని డీలా పడిపోయింది యాన్వి.

మరిన్ని కథలు
okarikokaru