Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
role model

ఈ సంచికలో >> యువతరం >>

మూర్తిగారబ్బాయి!

moortigarabbayi

"వాడింకా రాలేదా?!" విసుగు ధ్వనించింది మూర్తి స్వరంలో. "లేదు. బహుశా ఇంకో అరగంటలో రావొచ్చు." నెమ్మదిగా చెప్పింది మూర్తి భార్య మృదుల.

"రోజురోజుకీ అయ్యగారికి పెత్తనాలెక్కువైపోయాయ్!" లోపలికి వెళ్ళిన భార్యకు గొంతు పెంచి చెప్పాడు మూర్తి.

"అలా ఎందుకనుకుంటారూ? ఇనిస్టిటూట్‌లో కాస్త ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసి వస్తానన్నాడు. మంచిదేగా?" తిరిగొచ్చి భర్తకు కాఫీ అందిస్తూ చెప్పింది మృదుల.

"నీ గారాబం వాడిని మరి కాస్త చెడగొడుతోంది. ఇంజనీరింగ్ అయ్యి అప్పుడే నాలుగేళ్ళు దాటింది. ఇంతవరకూ ఉద్యోగం లేదు. తెచ్చుకుందామన్న బాధ్యత అంతకంటే లేదు. అలాంటి ప్రయోజకుడిని పట్టుకుని నువ్వేమో మరింత వత్తాసు పలుకుతూ ఉంటావు." మూర్తిలోని విసుగు క్రమేపీ కోపంగా మారుతోంది.

"ముందు మీరు కోపం తగ్గించుకుని స్థిమితంగా ఆ కాఫీ తాగండి. మీ ఆదుర్దా నాకు తెలియనిది కాదు. కానీ అవకాశం కూడా కుదరాలి కదా. అదృష్టమూ కలిసి రావాలి కూడా! ఈ స్టేజ్‌లోనే మనం వాళ్ళకు ఆసరా ఇవ్వాలి." మృదుల భర్తను అనునయించే ప్రయత్నం చేసింది మళ్ళీ.

"ఏం అదృష్టమో గొప్ప జాతకం నీ సుపుత్రుడిది. సరిగ్గా బీటెక్ పూర్తి చేసాడో లేదో అక్కడ ట్రంప్ అడుగుపెట్టి వీడికి అమెరికా వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. పైగా అక్కడికి వెళ్ళేందుకు అంతంత మాత్రంగానే ప్రయత్నాలు చేసాడు. వీడి స్నేహితులు చూడు అక్కడికి వెళ్ళి లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. వీడేమో ఇంకా మన పోషణలోనే ఉన్నాడు." కప్పులోని కాఫీని త్వరత్వరగా తాగుతూ కాఫీ సెగలకు పోటీగా తన ఆవేశం వెళ్ళగక్కాడు మూర్తి.

"వాడంత బాధ్యత లేనివాడు కాదండీ. వాడి ప్రయత్నాలలో వాడుంటే మనం ఎందుకు ఊరికే ఆడిపోసుకోవడాం?!" శాంతంగా అడిగింది మృదుల.

"ఎప్పుడు చూసినా వాడిని సమర్థించడమేగా నువ్వు చేసేదీ? అసలీ వయసుకు నేను మూడేళ్ళ సర్వీస్ పూర్తి చేసేసాను తెలుసా?"

"మీ కాలానికీ ఈ కాలానికీ చాలా తేడా ఉంది నాన్నా! ఇప్పుడు ఉద్యోగాలు అంత తేలిగ్గా దొరకడంలేదు." ఎప్పుడొచ్చాడో ఏమో, వస్తూనే తండ్రికి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు హాసిత్.

"ఇదొక్కటి చెప్తావెప్పుడూ. నీ క్లాస్మేట్స్‌లో ఎంతమంది ఖాళీగా ఉన్నారో నాకు చూపించు చూద్దాం." కొడుకు వైపు కోపంగా చూస్తూ చెప్పాడు మూర్తి.

"సగానికి పైగా క్లాస్‌మేట్స్ ఖాళీగా ఉన్నారు నాన్నా." చెప్పాడు హాసిత్.

"ఐతే నీకు తోడుగా చాలామందినే కూడగట్టావన్నమాట!" హేళనగా అన్నాడు మూర్తి.

"నాన్నా ఇప్పటి పరిస్థితులు పూర్తిగా మీకు అర్థం కావు. నేనెంత చెప్పినా కూడా మీరు నన్నేదో ఒకటి అంటారు తప్ప చుట్టూ జరుగుతున్నది మాత్రం గ్రహించరు."

తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ వీలైనంత సౌమ్యంగా చెప్పటానికి ప్రయత్నించాడు హాసిత్.

"అవున్రా నేనే అంత గ్రహింపు లేని దద్దమ్మను మరి. నువ్వేదో ఉద్ధరిస్తావని నీ ఫీజులు కట్టడానికి అయిదులక్షలు బ్యాంక్ అప్పు తీసుకున్న దద్దమ్మను కూడా నేనే. నాకు అమెరికా వెళ్ళడానికి ఇష్టం లేదు నాన్నా, ఇక్కడే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాను అని నువ్వు నచ్చజెపితే నీ మీద నమ్మకంతో సరే అన్న దద్దమ్మను కూడా నేనేరా!"

"అయ్యో అలా అంటారేంటండీ? వాడేమీ తెలివితేటలు లేనివాడు కాదు కదా. ఇప్పుడు బాగా పోటీ పెరిగిపోయింది. ప్రభుత్వోద్యోగాలు తగ్గిపోయాయి. వాళ్ళు ప్రకటించే ఆ కాసిన్ని ఉద్యోగాలకీ విపరీతమైన పోటీ. అందుకేగా వాడెంత ప్రాక్టీస్ చేసినా కూడా ఒక్క పాయింట్‌తోనో అర్ధ పాయింట్‌లోనో అర్హత రావడం తప్పిపోతోంది. అంత మాత్రాన వాడి ప్రయత్నాలు వాడాపలేదు కదా!"

"ఇలాగే జీవితాంతం వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడే! ఆ వస్తున్న బ్యాంక్ మేనేజర్లు మంచోళ్ళు కాబట్టి ఇంతవరకూ ఎవరూ ఫోన్ చేసి లోన్ కట్టమనలేదు. లేకపోతే ఆ వేధింపులు కూడా నాకు తప్పేవి కావు. ఎంత చెప్పినా మీరిద్దరూ ఒకటేలే. నా కంఠశోష తప్ప మీలో మాత్రం మార్పు రాదు." విసురుగా లోపలికి వెళ్ళాడు మూర్తి. తల్లి వైపు నిర్లిప్తంగా చూసాడు హాసిత్.

"బాధపడకురా బాబూ... మనకూ మంచిరోజులు వస్తాయిలే." చెప్పింది మృదుల.

"నాన్నను కోపం తగ్గించుకోమని చెప్పమ్మా." బాధగా చెప్పాడు హాసిత్.

మరుసటిరోజు ఉదయం తొమ్మిది గంటల సమయం. మృదుల ఇచ్చిన కేరేజ్ అందుకుంటూ అడిగాడు మూర్తి. "అయ్యగారింకా రాలేదా?"

"వస్తూ ఉంటాడు. ఇంకో అరగంట పడుతుంది రావడానికి." చెప్పింది మృదుల. "కాలేజ్ రోజుల్లో ఆ క్రికెట్ వదిలేవాడు కాదు. ఇప్పుడూ అంతే... ఇంకా జాగింగూ రన్నింగంటూ ఆ  గ్రౌండ్ పట్టుకుని వదలడు."

"పోనీలెండి. ఉద్యోగం రాలేదనే బాధ వాడికీ ఉంటుంది కదా. ఇలా ఏదో ఒక వ్యాపకంలో మునిగితే వాడి మనసుకి కొంచెం ఉల్లాసంగా ఉంటుంది." చెప్పింది మృదుల.

"సరేలే వాడికి అప్లికేషన్లకీ ఖర్చులకీ డబ్బులు కావాలేమో ఈ అయిదు వేలూ ఉంచు. ఈమధ్య పౌరుషం ఎక్కువైపోయి నన్నడగడం మానేసారు యువరాజా వారు!" పైకి కోపం ప్రదర్శించినా భర్తలోని లోపలి మెతకమనిషి అప్పుడప్పుడూ ఇలా కనిపించడం మృదులకు తెలిసిన విషయమే కాబట్టి నవ్వుతూ ఆ డబ్బులు తీసుకుంది.

"సరే వస్తాను." భార్యకు చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయాడు మూర్తి.

మరో అరగంటకు ఇంటికి వచ్చాడు హాసిత్. "నాన్నగారు వెళ్ళిపోయారామ్మా?" రోజూలానే అడిగాడు.

"అవున్రా. ఇదిగో ఈ అయిదువేలూ నిన్నుంచుకోమన్నారు. నీ ఖర్చులకు." భర్త ఇచ్చిన డబ్బులు ఇవ్వబోయింది మృదుల.

"వద్దమ్మా." అని తల్లి చేతిని పక్కకు మృదువుగా తోసాడు హాసిత్.

"అదేంట్రా? నీకూ ఖర్చులకు అవసరమే కదా? పోయినసారి ఇచ్చినప్పుడు కూడా ఇలానే డబ్బులు తీసుకోలేదు నువ్వు. నాన్నగారు చెప్పినట్టు పౌరుషపడిపోయి ఇబ్బంది పడకురా బాబూ!" మృదుల కన్నుల్లో సన్నని నీటిపొర కదలాడింది.

"లేదమ్మా. నాకవసరం అయినప్పుడు తీసుకుంటాను కదా. ప్రస్తుతం ఏ పరీక్షలూ దగ్గర్లో లేవు. అందుకే వద్దన్నా." తల్లికి నచ్చచెప్పాడు హాసిత్.

మరో రెండేళ్ళు ఆ ఇంట్లో ఏ మార్పులూ లేకుండానే గడిచాయి. ఈ రెండేళ్ళ కాలంలోనూ తండ్రీకొడుకుల సంఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తల్లీకొడుకుల నచ్చచెప్పుకోవడాలూ నడుస్తూనే ఉన్నాయి. ఓకరోజు మూర్తి ఆఫీసులో అతని కొలీగ్ భాస్కర్ అడిగాడు.

"మూర్తిగారూ మీరు నాకో సహాయం చేసి పెట్టాలి. దయచేసి కాదనకూడదు."

"భాస్కర్ గారూ విషయం ఏమిటో తెలీకుండా తప్పకుండా చేస్తానని నేనెలా మాటివ్వగలను చెప్పండి?" మొహమాటంగా నవ్వాడు మూర్తి.

"మీరు తల్చుకుంటే అరక్షణంలో పని సార్."

"సరే. ముందు విషయం ఏమిటో చెప్పండి."

"ఏం లేదు మూర్తి గారూ... మా తమ్ముడి కొడుకు అండర్ ఫోర్టీన్ క్రికెట్ టీంలో సెలక్ట్ చెయ్యమని మీ అబ్బాయికి చెబుతారని. రేపే సెలెక్షన్స్." అర్థింపుగా అడిగాడు భాస్కర్.

"భాస్కర్ గారూ మా వాడు ఒకప్పుడు క్రికెట్ బాగా ఆడిన మాట నిజమే కానీ మీ తమ్ముడి కొడుకు సెలక్షన్‌కీ వాడికీ సంబంధం ఏంటి చెప్పండి?" విస్మయంగా ప్రశ్నించాడు మూర్తి."అయ్యో ఎంత మాట. మీ అబ్బాయే కదండీ టీం కోచ్. అతను చిన్నమాట చెబితే చాలు పనైపోతుంది." అవునూ కాదూ అన్నట్టుగా తలూపి ఆఫీసులోనుంచి బైటపడ్డాడు మూర్తి. ఎంత మోసం! పోటీపరీక్షలకు బాగా చదువుకోమంటే దానికి బదులుగా క్రికెట్‌తో కాలక్షేపం చేస్తున్నాడా వీడు! ఇలాంటి కొడుకును కనడం తనదెంత దౌర్భాగ్యం! ఆవేశంతో మూర్తి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. బహుశా సాయంత్రం కూడా వీడు కోచింగ్ కోసం ఇనిస్టిట్యూట్‌కి  వెళ్ళకుండా క్రికెట్‌కే వెళుతూ ఉండి ఉండాలి. అలా ఆలోచన రాగానే బండిని ఇనిస్టిట్యూట్ వైపు పరుగు పెట్టించాడు మూర్తి.

ఇన్స్ టిట్యూట్ లోపలికి వెళ్ళాడు. క్లాసులో చూసాడు. క్లాసురూం పక్కనే ఉన్న లైబ్రరీలో చూసాడు. అనుకున్నంతా అయింది. వీడు జీవితాన్ని ఆ క్రికెట్‌కే ధారపోసి ఆడాలనుకున్న వాడి తృష్ణను తీర్చుకుంటుంటూ తన మనసునే బంతిగా చేసుకుని ఆడేసుకుంటున్నాడు. గుందేనంతా బలంగా ఎవరో పిండినట్టయింది మూర్తికి. అయోమయంగా చూస్తోన్న అతన్ని "ఎవరు కావాలని సర్?" అంటూ ప్రశ్నించింది రెసెప్షన్లో ఉన్న అమ్మాయి.

"హాసిత్ అని ఇక్కడ క్లాసుకొచ్చేవాడు కదమ్మా? లేడా?" ఇంకెక్కడో ఉంటాడన్న ఆశ మినుకుమినుకుమంటూండగా అడిగాడు మూర్తి.

"హాసిత్ సర్ ఇక్కడ మానేసి సంవత్సరం పైనే అవుతోంది సర్" వినయంగా చెప్పిందా అమ్మాయి.

సర్ ఏమిటి? వీడిని పట్టుకుని సర్ అనడం ఏంటీ? క్రికెట్లో వెలగబెట్టినదంతా ఇక్కడా చెప్పుకుని కోచ్‌గా ఏదో పొడిచేస్తున్నానుకుంటున్నాడా ఈ చెడబుట్టిన వెధవ! ఆలోచిస్తూ బైటకొచ్చి తల పక్కకు తిప్పిన మూర్తిని వెక్కిరిస్తూ కనపడింది బ్యాంక్. హాసిత్ చదువు కోసం అప్పు తీసుకున్నదక్కడే. అది గుర్తుకు రాగానే ఉలిక్క్పడ్డాడు. అప్పుడు తీసుకున్న ఆరు లక్షలూ ఇప్పుడెంతయిందో? హాసిత్‌ని నమ్ముకుని వడ్డీ కూడా కట్టడం మానేసాడు తను.

ఆలోచిస్తూ బ్యాంక్ లోపలికి వెళ్ళాడు. లోన్స్ సెక్షన్లో ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి అతన్ని బ్రతిమాలాడు. "ఏమీ అనుకోకండి. ఇది ఆఫీసు టైం కాదని తెలుసు కానీ బాగా పాత లోఅన్ కట్టకుండా ఉండిపోయాను. అదేమైనా చూడగలరా?"

పాతబాకీ అనగానే ఆ ఆఫీసర్ ముఖం విప్పారింది. "మీకు కౌంట్ నంబర్ తెలుసూఅ?" ఉత్సాహంగా అడిగాడు.

ఫోన్లో నోట్ చేసి పెట్టుకున్న ఆ లోన్ నంబర్ చెప్పాడు. కీబోర్డులో టకటకా కొట్టి కంప్యూటర్లోకి చూసి, "ఇది రెగ్యులర్‌గానే ఉంది కదండీ? ముందే కట్టేస్తున్నారు? ఇంకా పదివేల చిల్లర మాత్రమే బ్యాలన్స్ ఉంది." ఆశ్చర్యం వ్యక్తం చేసాడు లోన్ ఆఫీసర్.

"సరేనండీ. ఠంక్స్." అని చెప్పి బైటకొచ్చాడు మూర్తి. క్రికెట్ కోచ్‌గా వెళితే అంత డబ్బు వస్తుందా? మరీ ఆరు లక్షల లోన్ రెండేళ్ళలో తీర్చేసేటంతనా?! వీడు కానీ ఇంకేమైనా వెధవపనులు చేస్తున్నాడా? మనసొక్కసారిగా ఆవేదనకు గురైంది మూర్తికి. ఛ ఛ! వాడలాంటి వాడు. వాడు తన కొడుకు. అనుకుంటూ సర్దుకున్నాడు.

భాస్కర్‌కి ఫోన్ చేసాడు. "సర్... ఏమన్నాడు మీ అబ్బాయి?" ఉత్సాహంగా అడిగాడు భాస్కర్.

"లేదు భాస్కర్ గారూ వాడింకా ఇంటికి రాలేదు కానీ నాకో సందేహం ఉంది తీరుస్తారా?" అడిగాడు మూర్తి.

"అడగండి సర్." కొంచెం నిరుత్సాహంగా వచ్చింది జవాబు.

"క్రికెట్ కోచ్‌కి సంపాదన బాగా ఉంటుందా?"

"భలేవారు మూర్తిగారూ మీరు! తెలియనట్టు అడుగుతారేం ఒక సీజన్లో కోచ్‌గా వెళ్ళారంటే కనీసం లక్ష రూపాయ్లొస్తాయి. మీ అబ్బాయి మీకు చెప్పడంలేదా ఏంటీ? అది సరే కానీ మా వాడి విషయం మాత్రం మీ హాసిత్‌కి చెప్పడం మర్చిపోకండి సర్ ప్లీజ్!"

సరే అని చెప్పి ఫోన్ కట్ చేసాడు మూర్తి. బండి స్టాండ్ తీయబోతుంటే ఇందాకటి రెసెప్షనిస్ట్ కనిపించింది. మూర్తిని చూసి అతని దగ్గరకొచ్చి అడిగింది. "మా చెల్లి డిగ్రీ చేసి ఖాళీగా ఉంది సర్. హాసిత్ సర్ మీకు బాగా తెలుసనుకుంటాను సర్. ఆయనకి చెప్పి నాలా అక్కడ రెసెప్షనిస్ట్‌గా వేసుకోమని చెప్పండి సర్ ప్లీజ్."

"ఎక్కడా?!!" అప్రయత్నంగా మూర్తి నోటి వెంట వచ్చింది ప్రశ్న.

"హాసిత్ గారి ఇనిస్టిట్యూట్‌లో సర్."

"అదెక్కడా?!!" మూర్తి మరింగా ఆశ్చర్యపోతూ అడిగాడు.

"మూర్తి కోచింగ్ ఇన్స్టిట్యూట్ సర్. ఊరి చివర ఉన్న నరేంద్ర నగర్‌లో."

ఆ అమ్మాయి మాట వింటూనే బండిని అటువైపు పోనిచ్చాడు మూర్తి. నరేంద్ర నగర్ అంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందున్న కాలనీ. అక్కడికి వెళ్ళడానికే ఇరవై నిమిషాలు పట్టింది. వెతకాల్సిన పని లేకుండా కాలనీ మొదట్లోనే తాటికాయంత అక్షరాలతో తన పేరుతో మొదలైన బోర్డును చూసాడు మూర్తి. లోపలికి వెళ్ళాడు. నాలుగు క్లాసురూములున్నాయి. అన్నీ నిండుగా ఉన్నాయి. ఓ క్లాసురూంలోంచి బైటకొస్తూ కనిపించాడు హాసిత్. ఒక్కసారిగా తండ్రిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. మరుక్షణం చిన్న తత్తరపాటు. దాన్ని అణచిపెట్టుకుంటూ "నాన్నా మీరిక్కడ..." అంటూ వచ్చి ఆయన చేతులు పట్ట్కున్నాడు.

"పోటీపరీక్షలు రాసి రాసి ఆ అనుభవంతో ఉద్యోగం రాకపోయేసరికి చాలా నిరాశ పడ్డాను నాన్నా. కానీ మీ మాటలే నన్ను బాగా ప్రేరేపించాయి. ముందు నేను కోచింగ్ తీసుకున్న చోటనే కొన్నాళ్ళు ఫేకల్టీగా చేసాను. తర్వాత నేనే సొంతంగా చెయ్యగలనన్న నమ్మకం ఏర్పడి ఈ బిల్డింగ్ అద్దెకు తీసుకున్నాను. ఇంకా బాగా డవలప్ అయ్యాక మిమ్మల్ని తీసుకొచ్చి చూపిద్దామనుకున్నా నాన్నా! కానీ మీరే కనిపెట్టేసారు. మీరు గ్రేట్ నాన్నా!" కొడుకు చెబుతోన్న మాటలకు స్పందంగా తన చేతులను చాచి అతన్ని హత్తుకున్నాడు మూర్తి. హాసిత్ భుజం వెచ్చని కన్నీటి బొట్లతో తడిసాయి.

అదేరోజు రాత్రి...

"పిచ్చి కనా... రోజూ నాన్నగారి చేత అలా తిట్లు తినడమే కానీ విషయం నాకైనా చెప్పావా?" అడిగింది మృదుల. "చెప్పాను కదమ్మా... ఇంకొంచెం కాలం ఆగి చెబుదాం అనుకున్నాను." తల్లికి కూడా అలాగే సర్ది చెప్పాడు హాసిత్. ఎప్పటికీ అలా తను సర్ది చెబుతూనే ఉంటాడు. మూడేళ్ళ క్రితం తండ్రికి తోడుగా మెడికల్ చెకప్‌కి వెళ్ళినప్పుడు తనను డాక్టర్ పక్కకు పిలిచి, "మీ నాన్నగారికి కార్డియో మయోపతి. అంటే గుండెలోని నాళాలు దళసరిగా ఉన్నాయి. ఇంకా ప్రారంభదశలోనే ఉంది కనుక కంగారు పడవలసిందేమీ లేదు." అని చెప్పగానే తను విదేశాలలో ఉద్యోగావకాశాలు వదులుకున్న విషయం కానీ, కోచింగ్ తీసుకుంటున్నపుడే రెండుమూడు ఉద్యోగాలు వచ్చినా వెళ్ళకుండా క్రికెట్ కోచ్‌గా కొనసాగుతూ సొంతంగా ఇనిస్టిట్యూట్ నడపాలన్న నిర్ణయం తీసుకున్న విషయం కానీ వాళ్ళిద్దరికీ చెప్పనే చెప్పడు.

ఎందుకంటే హాసిత్ అనే తను... మూర్తిగారబ్బాయి!

మరిన్ని యువతరం