Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cartoons

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

మిగిలిన దేశాలమాటేవిటో కానీ, మనదేశంలో చాలామందికి “ సెక్యూరిటీ “ చాలా అవసరంగా భావించి,, ఓ వరసా వావీ లేకుండా, ఒకళ్ళిద్దరు “ గన్ మెన్” (  Gun Men)  లని తోడుగా ఉంచడం చూస్తూంటాము. ఏదో దేశ రాష్ట్రపతికీ, ప్రధానమంత్రికీ, కొందరు ముఖ్యమైన మంత్రులకీ, కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రులకీ , ఇలాటి సెక్యూరిటీ ఇచ్చారంటే ఓ అర్ధం ఉంది. కానీ చిత్రం ఏమిటంటే, పలుకుబడిని బట్టి, సెక్యూరిటీని పొందడం కూడా చూస్తూంటాము, వాళ్ళే కాక వాళ్ళ కుటుంబసభ్యులకి కూడా..అంత అవసరమంటారా? 

కొంతమంది వెనక్కాలుండే సెక్యూరిటీని చూస్తే, అసలు వీళ్ళు చేసే నిర్వాకాలకి, మనం కడుతున్న పన్నులు, ఇలాటివాళ్ళ సెక్యూరిటీ కోసమా అనిపిస్తుంది. దేశ రక్షణకి ఖర్చవుతోందంటే, ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, రాజకీయనాయకులకీ, పార్లమెంటు సభ్యులకీ, శాసన సభ్యులకీ,  కొందరు  so called V I P  లకీ , అసలు వీళ్ళేం ఉధ్ధరించెస్తున్నారని ఈ సెక్యూరిటీ మీద అంత ఖర్చో అర్ధమవదు. సాధారణంగా, కేంద్రప్రభుత్వ హోం శాఖ, నిర్ణయిస్తుందిట.. ఎవరెవరికి ప్రాణ హాని ఉందో, అదికూడా ఎంత మోతాదులో ఉందో, అసలు ఆ పెద్ద మనిషికి సెక్యూరిటీ అవసరమా లేదా, అధవా అవసరం ఉన్నా, ఏ క్యాటగిరీలోకి వస్తాడో, ఇవన్నీ ప్రతీ ఏడాదీ చూస్తారుట… కర్మకాలి ఎవరికైనా తగ్గించినా, పూర్తిగా తీసేసినా, సదరు వ్యక్తులు నానా హడావిడీ చేసేస్తారు. ఎంతైనా సెక్యూరిటీ, దానితో పాటొచ్చె తుపాకిధారులూ,  ఈరోజుల్లో ఓ  status symbol  అయిపోయిందిగా మరీ… ప్రభుత్వం కులాన్నిబట్టి విచక్షణ చూపిస్తోందీ, మావిమాత్రం ప్రాణాలు కావా అంటూ, టీవీల్లో హడావిడి చేయడం, చూస్తూంటాము.

అసలు ఈ సెక్యూరిటీలూ, సింగినాదాలూ మునపటి రోజుల్లో ఎక్కడ చూసామూ? ఏదో దేశ రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు మాత్రమే ఉండేవి. ఆ ప్రధాన మంత్రులు కూడా, ఎంత సెక్యూరిటీ ఉన్నా, ప్రజల్లోకి వెళ్ళి వారిని కలిసేవారు. తమ ప్రాణాలకి హానుందని ఎవరూ భయపడిన దాఖలాలు లేవు. జాతిపిత మహాత్మా గాంధీ తరవాత మహా అయితే ఓ పాతికమంది కంటే తక్కువగా, బహిరంగంగా హత్యచేయబడ్డారు… అందులో,  ప్రధానమంత్రులు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ల విషయం పక్కకు పెడితే, మిగిలినవాళ్ళు, ఏవో బలీయమైన కారణాలవలనే అన్నది మాత్రం ఒప్పుకోవాలి. ఇక్కడ బలీయమంటే ఏదో దేశసేవ అని కాదు, కొన్ని స్వార్ధపూరిత పనుల వలన మాత్రమే.. వేదాంతులు చెప్పినట్టు, ఏదో చేయకూడని పని చేసి, ఫలితం అనుభవించారనుకోవచ్చేమో. అంటే దానర్ధం ఏమిటీ—చేసేవేవో మంచిపనులు చేస్తే ప్రాణానికేమీ ధోకా ఉండదనేగా.. మరి చేయడానికేమొచ్చిందిట? ఎప్పుడు చూసినా, అధికారం ఎలా చేపట్టాలని , ఎవరెవరిని ఇబ్బందుల్లో పెట్టాలీ, అవతల పార్టీ వాడిని, ఎలా లొంగదీసుకోవాలీ, దానికోసం ఏమేం చేయాలీ అనే ఆలోచిస్తూ, అసలు ప్రజలకి మంచిపనులు చేయాలనే ఆలోచన రమ్మంటే ఎలా వస్తుందీ?

ఈ రోజుల్లో, దేశంలో ఎక్కడ చూసినా, చట్టాలను గౌరవించేవాళ్ళు తగ్గిపోతున్నారు. ప్రత్యేకంగా రాజకీయ నాయకుల్లో..ఒకరకమైన  overconfidence  ఎక్కువైపోయింది.ఒకానొకప్పుడు, ఏ శాసనసభకో, పార్లమెంటుకో ఎన్నికైన ప్రజాప్రతినిధి, అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఏ సమస్య వచ్చినా, వారిదగ్గరకు వెళ్ళి చెప్పుకునే స్వాతంత్రం ఉండేది. అలాగే, వారు ఎన్నికల్లో నిలబడినప్పుడు, వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారు ప్రజలకోసం చేసిన మంచిపనుల బట్టి వారికి ఓట్లు పడేవి--- అంతే కానీ వాళ్ళు పెట్టే తాయిలాలను బట్టి కాదు. అసలు ఆరోజుల్లో ఓటు ని కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఉండేది కాదు…కానీ కాలక్రమేణా , నాయకుల్లోనూ, ఓటు వేసే ప్రజల్లోనూ కూడా అనూహ్యమైన మార్పులు వచ్చేసాయి. ఈ రోజుల్లో ఓటు కి ఇంత రేటు అని ఇరుపక్షాలవాళ్ళూ ఒడంబడిక చేసేసుకున్నారు. నాయకులు కూడా, అసలు డబ్బిస్తేనే కానీ టిక్కెట్ దొరకని రోజులొచ్చేసాయి. ఆ డబ్బుకోసం నానా తిప్పలూ పడాలీ, చట్ట విరుధ్ధమైన పనులైతే చేయాలే కదా…ఈ ప్రస్థానంలో, మరి శత్రువులుకూడా పెరుగుతారే కదా..  చట్ట భయం ఉండదు వీళ్ళకి, ఉంటే గింటే ప్రాణభయం మాత్రమే.. అదుగో ఇలాటివాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ కావాలి.

సామాన్య ప్రజల కి ఇలాటి అవసరాలుండవు, కారణం, వీళ్ళేమీ “ ప్రజా సేవలు “ చేయరు. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు. ఒకానొకప్పుడు, వినేవాళ్ళం …” దేశం నీకేమిచ్చిందని కాదు , దేశంకోసం నువ్వేమిచ్చావు “ .. ప్రతీవాడి సెక్యూరిటీ ఖర్చులకీ, పన్నులు కడుతున్నాం కదా…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu