Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మన్మధుడు - 2 చిత్రసమీక్ష

manmadhudu 2 movie review

చిత్రం: మన్మథుడు2 
నటీనటులు: నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లక్ష్మి, వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు. 
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్‌ 
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌ 
నిర్మాతలు: నాగార్జున, పి.కిరణ్‌ 
నిర్మాణం: మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, వాయాకామ్‌ 18 
దర్శకత్వం: రాహుల్‌ రవీంద్రన్‌ 
విడుదల తేదీ: 09 ఆగస్ట్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

తన ఆనందం కోసం మాత్రమే జీవించే వ్యక్తి సాంబశివరావు అలియాస్‌ సామ్‌ (నాగార్జున) పోర్చుగల్‌లో నివసిస్తుంటాడు. వయసు మీద పడ్డంతో సామ్‌పై కుటుంబ సభ్యుల నుంచి పెళ్ళి విషయమై ఒత్తిడి పెరుగుతుంటుంది. కానీ, వారి మాటల్ని లెక్కచేయని సామ్‌, లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటాడు తనకు నచ్చిన విధంగా. మరోపక్క, కుటుంబ సభ్యుల ఒత్తిడి తీవ్రమవడంతో, అవంతిక (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌)ని ప్రేమిస్తున్నట్లు కుటుంబానికి పరిచయం చేస్తాడు. సరిగ్గా పెళ్ళి సమయానికి తనను వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నది సామ్‌, అవంతికతో కుదుర్చుకున్న ఒప్పందం. మరి, ఆ ఒప్పందాన్ని అవంతిక గౌరవించిందా? సామ్‌కి పెళ్ళయ్యిందా? లేదా? ఇంతకీ, పెళ్ళంటే ఎందుకు సామ్‌కి ఇష్టం వుండదు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే..

వయసు మీద పడ్తున్నా, నాగార్జునలో ఛార్మ్‌ తగ్గలేదు. అందుకే అతన్ని టాలీవుడ్‌లో మన్మథుడు అని పిలుస్తుంటారంతా. ఈ సినిమా కోసం యంగ్‌ లుక్‌ సంతరించుకున్నాడు. అయినాగానీ, మధ్య వయస్కుడి పాత్రలో అదరగొట్టాడు. వీలు చిక్కినప్పుడల్లా తన వయసు మీద తానే సెటైర్లు కూడా వేసుకున్నాడు. ఈ సినిమాకి నాగార్జునే ప్రధాన ఆకర్షణ.

నాగ్‌ తర్వాత, ఈ సినిమాకి మరో ఎట్రాక్షన్‌ ఖచ్చితంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అయితే, ఆమె పాత్ర గ్లామర్‌కే పరిమితమైంది. నటనలో ఓకే అన్పించుకున్న రకుల్‌, కొంచెం హద్దులు దాటేసింది గ్లామర్‌ సహా ఇతర విషయాల్లోనూ. రకుల్‌కి నిజంగానే ఇదో సరికొత్త పాత్ర అనుకోవచ్చు. తన వరకూ పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించింది.

మిగతా పాత్రల్లో వెన్నెల కిషోర్‌కి స్క్రీన్‌ స్పేస్‌ బాగా దక్కింది, బాగా నవ్వించేందుకు ట్రై చేశాడు.. కొంతవరకు సఫలమయ్యాడు కూడా. నాగార్జునతో వెన్నెల కిషోర్‌ కెమిస్ట్రీ బావుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. కథ విషయానికొస్తే, నిజానికి ఇది కొత్త కథేమీ కాదు. అయితే, సినిమాలో మసాలా చాలా దట్టించేసి, కథని గందరగోళంగా మార్చేశాడు దర్శకుడు. సంభాషణల్లో కామెడీ కొంత బాగానే వున్నా, డబుల్‌ మీనింగ్‌ డైలాగులు ఎక్కువైపోయాయి. సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. నిర్మాణపు విలువల పరంగా ఏమాత్రం రాజీపడని వైనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కన్పిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. ఎడిటింగ్‌ పరంగా ఒకింత జాగ్రత్తగా వ్యవహరించి వుండాల్సింది.

'మన్మథుడు' క్లాసిక్‌. నాగార్జున కెరీర్‌లో అదో ప్రత్యేకమైన సినిమా. ఆ పేరుని మళ్ళీ వాడుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడే నాగార్జున, కొన్ని జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. యూత్‌ ట్రెండ్‌కి తగ్గ సినిమా చేయాలనుకున్న నాగ్‌, ఈ క్రమంలో క్లీన్‌ మన్మథుడ్ని, హాట్‌ మన్మథుడిగా మార్చేయడం కొంత ఇబ్బందికరమే. పైగా, నాగార్జున నుంచి మరీ ఇంతలా డబుల్‌ మీనింగ్‌ డైలాగుల్ని చాలామంది జీర్ణించుకోలేరు. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌, హాట్‌ కంటెంట్‌ మీద ఫోకస్‌ పెట్టి, మిగతా విషయాల మీద ఫోకస్‌ తగ్గించేసినట్లున్నాడు. దర్శకుడిగా తొలి సినిమా విషయంలో గ్లామర్‌ వైపు చూడని రాహుల్‌, ఈ సినిమాతో ఆ లోటు పూడ్చేసుకోవాలనుకున్నాడుగానీ, బొక్క బోర్లా పడ్డట్లయ్యింది ఆయన వ్యవహారం. హీరోయిన్‌ రకుల్‌ కూడా డబుల్‌ మీనింగ్‌ డైలాగులకి ఓటేయడం కొంత ఇబ్బందికరంగా అన్పిస్తుంది. నాగ్‌ యంగ్‌ లుక్‌ ఇచ్చిన కిక్‌, అతుకుల బొంతలా తయారై కథనంతో, అభ్యంతకరమైన డైలాగులతో డీలాపడింది.

అంకెల్లో చెప్పాలంటే..

2.25/5

ఒక్క మాటలో చెప్పాలంటే..

ఈ మన్మథుడ్ని చూసి, ఆ మన్మథుడు బాధపడ్తాడేయమో!

మరిన్ని సినిమా కబుర్లు
churaka