Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
yuvatarangam

ఈ సంచికలో >> శీర్షికలు >>

కుర్రాళ్ళు.. కిర్రాక్‌ పుట్టించే కళాకారులు.! - ..

Kirrock Artists

ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు.. అంటూ కమెడియన్‌ సునీల్‌లో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బీభత్సమైన సాంగేయించాడు. నిజమే, టాలెంట్‌ ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఒకప్పుడు సినిమాల్లో నటించడమంటే అదో ప్రసహనం. టీవీల్లో అవకాశాలు దక్కడమంటే గగనం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్‌. చేతిలో ఓ స్మార్ట్‌ ఫోన్‌ వుంటే చాలు, టాలెంట్‌ చాటుకునేందుకు దారి దొరికినట్లే. ఒక్కసారి టాలెంట్‌ ప్రపంచానికి తెలియజేస్తే, ఆ తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయ్‌. వీడియో కెమెరాలతో పనిలేదు.. ఎవరో దర్శకత్వం వహించాలన్న బాధ అసలే లేదు. అంతా ఓన్‌ టాలెంట్‌.. సింగిల్‌ హ్యాండెడ్‌ వ్యవహారమే.

టిక్‌ టాక్‌ అనొచ్చు, ఇంకో పేరు చెప్పొచ్చు.. అంతిమంగా అదో జస్ట్‌ మొబైల్‌ యాప్‌ అంతే. వీడియో తీయడం, ఎడిటింగ్‌ చేయడం.. అంతా చాలా స్మార్ట్‌గానే నడిచిపోతోంది. అంతలా యాప్స్‌ స్మార్ట్‌ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించేస్తున్నాయి. పల్లెటూరూ లేదు, పట్నమూ లేదు.. అంతా ఒక్కటే. హైటెక్‌ సిటీలో వున్నా, మారుమూల గ్రామంలో వున్నా.. టాలెంట్‌కి తిరుగు లేదంతే. పాటలు పాడటం దగ్గర్నుంచి, యాక్టింగ్‌ చేయడం వరకూ.. వంటలు చేయడం దగ్గర్నుంచి, సాంకేతిక అద్భుతాలు సృష్టించడం వరకు.. అన్నింటా ఈ యాప్స్‌ పోషిస్తోన్న పాత్ర అంతా ఇంతా కాదు. ఎక్కువగా యువత ఈ యాప్స్‌ని వినియోగిస్తున్నాయి. సాంకేతిక అద్భుతాల్ని ముందుగా వాడేసేది వాళ్ళే కదా.! 
అఫ్‌కోర్స్‌, ఇప్పుడు యాప్స్‌ వినియోగానికి సంబంధించి వయసుతో పని లేదు. కళాత్మకతను ప్రదర్శించడానికీ వయసుకీ లింకేమీ లేదు. సో, 'కల' నెరవేర్చుకోవడానికి 'కళ'ని ప్రపంచానికి చాటి చెప్పడానికీ, ఈ స్మార్ట్‌ యుగం ఎంతో వెసులుబాటు కల్పించిందన్నమాట. నటన విషయానికొస్తే, ఔత్సాహిక నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. చిన్న చిన్న విషయాలూ చాలా తేలిగ్గా వైరల్‌ అయిపోతున్నాయి. అలా పుట్టుకొచ్చిన టాలెంట్‌ని మనం సినిమాల్లోనూ, టీవీల్లోనూ చూస్తున్నాం.

తమిళనాడుకి చెందిన ఓ వ్యక్తి, తీవ్ర అనారోగ్యం కారణంగా రెండు కిడ్నీలూ పోగొట్టుకున్నాడు. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో చిన్న ఆలోచన, అతని జీవితాన్ని మార్చేసింది. చేపలు పట్టి, కూర వండి.. ఆ తతంగాన్ని వీడియోగా మార్చి, సోషల్‌ మీడియాలో పెట్టడం మొదలెట్టాడు.. ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. ఇంకో కుర్రాడి పరిస్థితి వేరు. సరిగ్గా నిలబడేందుకు వీలు కాని పరిస్థితి అతనిది. కారణం, వైకల్యం. అయితేనేం, స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి, తనలోని టాలెంట్‌కి పదును పెట్టాడు. వైకల్యాన్ని అధిగమించి, గొప్ప డాన్సర్‌ అనిపించేసుకున్నాడు. విజయగాధలు కోకొల్లలుగా వున్నాయ్‌. సాధించాలన్న తపన వుంటే, ప్రతి విజయగాధా రోల్‌ మోడల్‌గానే అన్పిస్తుంది నేటి యువతరానికి.

మరిన్ని శీర్షికలు
kerala viharayatralu