Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.....http://www.gotelugu.com/issue330/839/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి).... “ఏంటి ముక్తా… అంత బెట్టు చేస్తావు? ఇన్ని సంవత్సరాలు పెళ్ళి-పేరంటం లేకుండా ఇలా ఒంటరిగా ఉన్న నీకు కోరికలు లేవంటే నేను నమ్మను.  అవి తీర్చుకునే మార్గం లేక ఇలా మడికట్టుకుని ఉన్నావు. నలుగురికీ తెలిస్తే అల్లరౌతుందన్న భయంతో కోరికలను అణగదొక్కుకున్నావు. ఇకముందు నీకా భయం అక్కరలేదు.రెండోకంటి వాడికి తెలియకుండా నేను మ్యానేజ్ చేస్తాను.’’ అతడి ఉడుంపట్టు అంతకంతకీ బిగుసుకుంటోంది.

మౌక్తికకు నరకయాతనగా ఉంది. అతడు ఎలాగైనా తనను లొంగదీసుకోవాలనుకుంటున్నాడని బోధపడుతూనే ఉంది. తన దేహంమీద పారాడుతున్న అతడి చేతుల స్పర్శకి తేళ్ళు, జెర్రులు పాకుతున్న ఫీలింగ్ కలుగుతోంది. ఆ మేరకు పెట్రోల్ పోసి కాల్చేసుకోవాలనిపిస్తోంది.

అందుకే… ఆడది మగవాడిని ద్వేషిస్తుంది. ఆడదాని మనసుతో ప్రమేయం లేకుండా ఆమె శరీరాన్ని అనుభవించాలనుకుంటారు.కాస్తంత చనువుగా మసలితే చాలు…. విచక్షణ మరచి, ఆమేదో కోరికలతో కొవ్వెక్కి కొట్టుకుంటోందని భావిస్తారు. అవకాశం దొరికితే ఆమెను కబళించాలని చూస్తారు.

ఒక్క మగవాడి ప్రవర్తనతో యావత్ మగజాతినీ ద్వేషించడం తప్పని తెలిసినా, శివాజీ విపరీత ధోరణి చూసి ఆ అభిప్రాయానికి రాక తప్పడంలేదు.

అతడు తన పట్టు సడలించడంలేదు. సరికదా…మరింత బిగిస్తున్నాడు. ఏమి చేయాలో తోచని నిస్సహాయ పరిస్థితిలో, అతడిని దూరంగా నెట్టేసే ప్రయత్నంలో … ఆసరాకోసమని టేబుల్ అంచు పట్టుకుని రెండోచేత్తో తన సెల్ కోసం టేబుల్ మీద తడిమింది మౌక్తిక. సెల్ దొరకలేదు కాని, మధ్యాహ్నం జామకాయ కోసుకుని టేబుల్ మీద వదిలేసిన కత్తి దొరికింది. దాన్ని అందుకుని గట్టిగా పట్టుకుంది. ఇంతలో భగవంతుడు ఆమెకి అనుకూలించినట్లుగా కరెంట్ కూడా వచ్చేసింది. అయినా శివాజీ తన పట్టు వీడలేదు. కామాతురాణాం’ న భయం… నలజ్జా’ అని అందుకే అన్నారేమో!“మర్యాదగా విడిచిపెట్టు శివాజీ…లేకపోతే దీనితో పొడిచేస్తాను’’ కత్తిపిడిని గట్టిగా ఒడిసిపట్టుకుని అతడి ముఖంకేసి చూపించింది మౌక్తిక. చటుక్కున ఆమెను వదిలేశాడు శివాజీ. అతడి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా డీలా పడి పోయాడు .మౌక్తిక గుండెలనిండా ఊపిరి తీసుకుంది. ఇందాక ఆమెలో చోటు చేసుకున్న భయం స్థానే కాస్త ధైర్యం వచ్చిచేరింది. కత్తిని వదలకుండా అలాగే పట్టుకుని “యు రాస్కెల్…గెటౌట్. గెటౌట్ ఫ్రమ్ హియర్. మగవాడు ఎప్పుడూ అవకాశం కోసమే పొంచి చూస్తాడని నిరూపించావు. నిన్ను తక్కువ అంచనావేసి లోపలికి రానివ్వడమే నేను చేసిన పెద్దతప్పు….ఫో అవతలకి’’ పిచ్చి పట్టినట్లుగా అరిచింది మౌక్తిక.

ఎవరి కుతంత్రాలతోటీ, దురాలోచనతోటీ  పనిలేనట్లుగా కుండపోతగా కురుస్తూనే ఉందివాన. నేలతల్లికి అంటిన మురికిని  ఆవర్షం కడిగేస్తోంది మరి… మనిషి మనసుకి అంటిన కల్మషాన్ని ఏవాన కడగగలదు! ఎన్ని పాపనాశనాల్లో మునిగితేలినా… ఇటువంటి మనుషులకి స్వఛ్ఛత అనేది ఏర్పడుతుందా!?

ఏమనుకున్నాడో ఏమో… మారుమాట్లాడక తలుపు తీసుకుని చీకట్లో కలిసిపోయాడు శివాజీ. మౌక్తిక ఒళ్లంతా చెమటలతో నిండిపోయింది. ఆమె గుండెచప్పుడు ఆమెకే వినబడుతోంది. అతడు గుమ్మందాటగానే ఠక్కున తలుపు మూసేసి గడియ పెట్టుకుంది.తన చేతిలో ఉన్న కత్తి మీదకి దృష్టిపోగానే ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అప్రయత్నంగా. శివాజీ ఇంతటి పిరికివాడా!? ఆ కత్తి గురించి రమ్య చేసే వ్యాఖ్యలు తలచుకుంటే నవ్వు ముంచుకొస్తుంది. ఆకత్తి పవర్ అలాంటిది మరి! అటువంటి పనికిమాలిన ఆయుధానికి శివాజీ ఝడిసాడంటే నవ్వురాక మరేమౌతుంది?

కాని, ఆ ‘మొండికత్తే’ నేడు తన మానాన్ని కాపాడింది. తన జీవితానికి మచ్చ ఏర్పడకుండా రక్షించింది. మరి కాస్సేపటికి గాని స్థిమిత పడలేదు మౌక్తిక. ఛీ…ఛీ… ఎంత మానర్ లెస్ గా బిహేవ్ చేశాడు! బాహ్య ప్రవర్తనని బట్టిమనిషి అంతరంగాన్ని అంచనా వేయడం ఎంత అవివేకమో తెలిసొచ్చింది ఆమెకి.ప్రతి వ్యక్తికి రెండుముఖాలుంటాయేమో! సమాయానుసారంగా ఆముఖాలను ప్రదర్శిస్తూ ఉంటారు కాబోలు!
  ఇలాంటి వాళ్లని గుడ్డిగా నమ్మబట్టే అమ్మాయిలంత త్వరగా మోసపోతూంటారు.ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపింది మౌక్తిక. తెలతెల వారేసరికి వాన నెమ్మదించింది. మరి కొద్దిసేపటికి రమ్య, శరత్ లు వచ్చేశారు. వారి రాక మౌక్తికకు అపరిమితమైన ధైర్యాన్ని ప్రసాదించింది.
-------------------                            -------------------                   --------------------

  “ ముక్తా…ముక్తా…’’ క్లాసు పూర్తైన తరువాత వరండాలో నడిచివస్తున్న మౌక్తిక దగ్గరకు పరుగెత్తుకొచ్చింది రమ్య. అది లంచ్ అవర్. స్టాఫ్ రూమ్ కి వెళ్లబోతోంది మౌక్తిక. రమ్య స్టాఫ్ రూమ్ కి వెళ్లకుండా తనకెదురు రావడంతో ఆశ్చర్యపోయింది. గతరాత్రంతా నిద్రలేకపోవడం మూలాన ఆమెకు ఏమీ తినాలనిపించడంలేదు. అందుకే బాక్స్ కూడా తెచ్చుకోలేదు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే ఆ నీరసం తగ్గుతుందన్న భావనతో వడివడిగా స్టాఫ్ రూమ్ కి వెళ్తోంది.

“రమ్యా… ఏమిటా కంగారు? ఏమైంది?’’ విస్మయంగా అడిగింది రమ్య.

“ముందిది చెప్పు…నిన్నరాత్రి మనింటికి శివాజీ వచ్చాడా?’’ సూటిగా ప్రశ్నించింది రమ్య.

“ఎందుకలా అడుగుతున్నావు? ఎనీ థింగ్ సీరియస్?’’ ఆదుర్దా, ఆత్రుత మౌక్తిక స్వరంలో మిళితమైనాయి.

“వచ్చాడా…లేదా? అది చెప్పుముందు!’’ గట్టిగా నిలదీసింది రమ్య.“ఆ( వచ్చాడు…’’ అంటూ ముందురోజు రాత్రి జరిగిన ఉదంతాన్ని అంతా పూసగుచ్చినట్లుగా వివరించింది మౌక్తిక.అసలు… ఆసంగతి రమ్యతో కూడా చెప్పాలనుకోలేదు ఆమె. ఆసంగతేమిటి! ఒకరికి కలవరం కలిగించేదేదైనా సరే… గుండెలోతుల్లో నిక్షిప్తమై సమాధి కావలసిందే గాని, తనకు తానుగా బయటకు చెప్పదు మౌక్తిక.బహుశా ఆ కారణం చేతే రమ్య ఆమెను ‘ అంతర్ముఖి’ అంటుందేమో!

ఇప్పుడు రమ్య రొక్కించి అడుగుతూంటే చెప్పక తప్పలేదు. అంతా విని నిర్ఘాంతపోయింది రమ్య. నమ్మలేనట్లుగా చూసింది.

“నిజంగా శివాజీ ఇలాంటివాడా! ఐ కాంట్ బిలీవ్.’’ రమ్యస్వరంలో సంభ్రమం.

“ నేనూ మంచివాడనుకునే లోపలికి రమ్మన్నాను. ఆ తరువాత అతడు నాతో మిస్ బిహేవ్ చేయడంతో అతడి నైజం బయటపడింది.’’ అంది మౌక్తిక.

“మరి… అతడు… స్టాఫ్ రూమ్ లో అలా చెబుతున్నాడేమిటి?’’ గొణుక్కున్నట్లుగా అంది రమ్య.

“ఎలా చెబుతున్నాడూ’’ అయోమయంగా అడిగింది మౌక్తిక.
“అతడు…అతడు…’’

“ఆ(… అతడూ?’’

“నిన్నరాత్రంతా నీతోనే గడిపానని, అతడు –నువ్వు కలిసి చాలా ఎంజాయ్ చేశారని, స్వర్గసుఖాల్లో తేలియాడారని… ఇంకా… చాలా…ఛండాలంగా చెబుతున్నాడు. నా చెవిన పడగానే చెంప పగలగొట్టాలని అనుకున్నాను. కాని, సంగతేమిటో… నీనోటితో విని, ఆపని చేద్దామని ఆగాను.’’ బాధగా చెప్పింది రమ్య.

“నువ్వు… అది నమ్మావా?’’ ఆవేశంతో రమ్య భుజాలు కుదిపేసింది మౌక్తిక.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్