Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాణి కోపం - ఆర్.సి. కృష్ణస్వామి రాజు

rani kopam

రామగిరి రాజు పురంధర వర్మ ప్రజల మనిషిగా పేరుగాంచాడు. నీరు లేని పైరు నూనె లేని వొత్తి నిరుపయోగమని తెలిసిన రాజు జల సిరులను అభివృద్ధి చేసి నీటి ఎద్దడిని రూపుమాపాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. అందులో భాగంగా చెరువుల శుద్ధి, కాలువల  అభివృద్ధికి నడుము బిగించాడు. రేయింబగళ్ళు పల్లెలమ్మిట తిరుగుతూ ప్రజల సహాయంతో చెరువులలోని బండ రాళ్లను  చెత్త చెదారాలను పిచ్చి మొక్కలను ముళ్ల చెట్లను తీయించినాడు. అవసరమైన చోట పూడికలు తీయడం మరమ్మతులు చేయడం చేయించినాడు. జనం అండగా వుంటే-జలం ఉప్పొంగదా అన్నట్లుగా చెరువుల నిండా  నీళ్లు  చేరాయి.

అయితే వారాల కొద్దీ నెలల కొద్దీ రాజు పల్లెలలోనే తిరుగుతూ రాజ మందిరానికి ఎప్పుడో గానీ వచ్చేవాడు కాదు.ప్రజలే ప్రాణంగా తిరుగుతున్న  రాజు తనతో ఎక్కువ కాలం గడపడం  లేదని  రాణి ప్రమీలా దేవి మానసిక ఒత్తిడికి గురి అయ్యింది.  మానసిక ఒత్తిడిని తట్టుకోలేని రాణి ఆస్థాన వైద్యుడిని సంప్రదించింది.రాజు గారి పైన తనకి వున్న కోపాన్ని వెల్లడించింది.  మానసిక శాస్త్రంలో సైతం చక్కటి అవగాహన వున్న ఆస్థానవైద్యుడు ఆదినారాయణ శాస్త్రి మూడు రోజుల పాటు తను చెప్పిన చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు.

మొదటి రోజు  ఉదయం మరియు  సాయంత్రం లలో గంట సమయం పాటు నీళ్ల తొట్టె వద్ద కూర్చొని నీళ్లను రాజుగా భావించి ధభీ ధభీ మని నీళ్లను  కొట్టమన్నాడు. రాజును ప్రత్యక్షంగా ఏమీ చేయలేము కాబట్టి ఇలా చేస్తే రాజుగారి మీది కోపం తగ్గిపోతుందని చెప్పాడు.వైద్యుడు చెప్పిన ఒత్తిడి నివారణోపాయము రాణి విషయంలో ఫలించలేదు. 

రెండవ రోజు పిల్లలాడుకొనే బంతిని తెచ్చి ఇచ్చి రాజు ను తలుచుకొంటూ గట్టిగట్టిగా బంతిని పిసకమన్నాడు. అలాగైనా రాజుగారి మీద వున్న కోపం తగ్గి పోతుందని ఆశించాడు.  రాణి విషయంలో బంతి ప్రయోగం కూడా ఆశించినంత ఫలితం ఇవ్వ లేదు. మూడవ రోజు చివరిగా ఒక పెద్ద నేరేడు చెట్టు మీద రాజు గారి పేరు వ్రాయించి ఆ పేరు పైన బలంగా బంతిని వేసి కొట్టమన్నాడు. ఉదయం వంద సార్లు సాయంత్రం వంద సార్లు అలా చేస్తే ఉపశమనం లభిస్తుందని చెప్పాడు. కసి కసిగా రాణి నేరేడు చెట్టు పైన బంతిని విసిరింది. ఐదారుసార్లు బంతి విసిరిందో లేదో ఆమెకు చెప్పలేనంత దుఃఖం వచ్చి నేల పైన కూర్చోండి పోయింది.

"అయ్యా వైద్యుడు గారూ, రాజు గారు నాతో ఎక్కువ కాలం  గడపడం లేదని బాధగా వుంది తప్పితే ఆయన పట్ల నాకు, నా పట్ల ఆయనకు ఎంతో ప్రేమ అభిమానాలు ఉన్నాయి. ఆయనను ఉహించుకొని నా చేతులారా ఆయనను బంతితో కొట్టడం అనేది నాకు ఎంతో బాధను కలిగిస్తోంది" అని బిగ్గరగా ఏడవ సాగింది.

తన వైద్యం ఫలించినందులకు వైద్యుడు సంతోషిస్తూ "రాణిగారూ! రాజు పదవి పూల పాన్పు కాదు. జనం బాగుంటేనే రాజు బాగుంటాడు. రాజు బాగుంటేనే మీరు బాగుంటారు. మీ కోసం రాజ్యాన్ని ప్రజల బాగోగుల్నీ పక్కన పెట్టి ఇరవైనాలుగుగంటలూ మీ వద్దనే వుండి పోతే రాజ్యమేమవుతుంది?రాజ్యపాలన ఏమవుతుంది?ఆలోచించగలరు.ప్రజల సమస్యలే తన ఉఛ్వాస నిశ్వాసలుగా భావించే రాజు కారణ జన్ముడు. ఎందరో రాజులు తమ మందిరాలలోనే వుండి పోయి రాజ్యపాలనని విస్మరించి  కాల గర్భంలో కలిసిపోయారు. ప్రస్తుతం రాజు చేస్తున్న చెరువుల అభివృద్ధి ఈ తరానికే కాదు.  రానున్న  తరాలకు సైతం జల సమస్య తలెత్తకుండా చేసే మహా క్రతువుకు ఆయన  శ్రీకారం చుట్టారు. అంతే కాక ఏటికేడు వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు  వ్యవసాయం చేయలేక బతుకుతెరువు కోసం ఇతర రాజ్యాలకు వలస వెళ్లే ప్రమాదాన్ని రాజు పసిగట్టాడు. జలసిరి లేని రాజ్యంగా మారి పాలితులు లేక పాలకులు మాత్రమే మిగిలిపోతారేమోనని జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. మీరు సహకరిస్తే విజయం సాధిస్తారు. సహరించకపోతే ఆయన ఆశయానికి అవరోధాలు కల్పించిన వారవుతారు. ఇలాంటి చిన్న విషయాలు ఆలోచించి ఆలోచించి మీ మనసు శరీరం పాడు చేసుకొంటారు తప్పితే ఇంకేమీ జరగదు" అని సవినయంగా చెప్పాడు. తప్పు తెలుసుకొన్న రాణి బంతిని పొదల లోకి పారేసి వెల్లింది.

ఆ నోటా ఈ నోటా విషయం విన్న రాజు మంచి రాజ్య పాలనతో పాటు రాణికి కూడా కొంత సమయం కేటాయించసాగాడు.  దీంతో వారి దాంపత్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణమయ్యింది.

మరిన్ని శీర్షికలు
pet cartoons