Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cartoons

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

 ఈ రోజుల్లో ఒక విషయం గమనించే ఉంటారు..  ఎవరిని చూసినా, వయసుతో నిమిత్తం లేకుండా. నూటికి డెబ్భై మంది, మోకాళ్ళ్ నొప్పులతోనో, నడుంనొప్పులతోనో బాధ పడేవారే.. ఇదివరకటి రోజుల్లో లేవా అంటే, అప్పుడూ ఉండేవి, కానీ ఓ వయసు వచ్చిన తరవాతే.

ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు, ఏ ఆర్థోపిడీషియన్ దగ్గరకో వెళ్ళడం తరవాయి, ఓ నాలుగైదు ఎక్స్ రేలు  తీసేసి, ఆ మోకాల్లో గుజ్జు ఎంతవరకూ ఎండిపోయిందో, మరింత ఆలశ్యం చేస్తే, అస్సలు లేవలేక, మంచం పట్టేస్తామో వగైరా…వగైరా చెప్పి నానా కంగారూ పెట్టడం. అర్జెంటుగా మోకాళ్ళ మార్పిడి మాత్రమే పరిష్కారం అంటాడు.

అదే ఏ క్రీడలకి సంబంధించిన (  Sports Doctor)  దగ్గరకు వెళ్ళండి, మళ్ళీ ఎక్స్ రేలు తీసి, “ అబ్బే దీనికి ఆపరేషనెందుకూ? నాలుగు మాత్రలిస్తానూ, వీటిని తీసుకుంటూ,ఓ రెండుమూడు ఎక్సర్ సైజులు చేస్తూండండీ చాలూ అంటారు. మరో ఆయుర్వేదం వైద్యుడి దగ్గరకు వెళ్తే,  మరో పరిష్కారం చెప్తారు. వీళ్ళందరూ కాకుండా, ఈమధ్యన ఏవేవో విడియోలు వస్తున్నాయి – ఫలనాదేదో రోజుకోసారి పరగడుపునే వేసుకుంటే చాలంటారు, పైగా వీరి వైద్యం వలన ఎంతమంది, వయీవృధ్ధులు కూడా, పరుగులపోటీల్లో పాల్గొంటున్నారో, వారి పేర్లూ, మొబైల్ నెంబర్లూ ఇచ్చి కావాల్సొస్తే వెరిఫై చేసుకోమంటారు.. ఇవన్నీ కాకుండా,  Social Media  లో ప్రకటనలు – ఫలానా నీకాప్ (  Knee Cap)  వాడితే మోకాలినొప్పులు హాంఫట్ అంటారు. ఇందులో ఎవరిని నమ్మి మన మోకాళ్ళని వాళ్ళ చేతుల్లో పెడతామూ ?

అన్నిటికన్నా బెస్ట్… శ్రీ చాగంటి వారి ప్రవచనాల్లో చెప్తూంటారు—“ కిందటి జన్మలో ఏ కుక్కనో రాయిపెట్టి కొట్టుంటావూ, అందుకే ఈ జన్మలో మోకాలి నొప్పీ అని సరిపెట్టుకో.. అంటారు. హాయి కదూ..

అస్సలు ఈ కాళ్ళనొప్పులూ, నడుంనొప్పులూ ఎందుకొచ్చాయో మాత్రం ఆలోచించరు, ఎందుకంటే మన జీవనవిధానం (  Life style)  లో వచ్చిన మార్పులు. గుర్తుండే ఉంటుంది, ఇదివరకటి రోజుల్లో ,  ఆడా, మగా  తెల్లవారుఝామునే, ఓ చెంబు పట్టుకుని, ఊరిబయటకువెళ్ళి, ఏ పొదలచాటునో పనికానిచ్చేసుకునేవారు. ఆర్ధిక స్థోమతను బట్టి, ఉంటున్న ఇంట్లోనే పని కానిచ్చేయగలిగినా,  పెరట్లో, ఓ లెట్రిన్ కట్టించుకుని, అందులో కూర్చునే చేసేవారు. అలాటిది ఎప్పుడొచ్చిందో ఏమో కానీ, ఈ పనులకి, అవేవో  Western Style Commode  లని వచ్చాయి. అప్పటినుండీ, ఆడా మగా పిల్లా పీచూ, చివరికి ఇళ్ళల్లో ఉండే వయోవృధ్ధులూ కూడా, ఈ పధ్ధతికి అలవాటు పడిపోయారు. కూర్చోవడమంటే మర్చిపోయారు. మోకాళ్ళకి వాటికివ్వాల్సిన  exercise  ఇవ్వకపోతే., మరి ఎలా వంగుతుందీ? చివరకి పూజలూ పునస్కారాలూ కూడా,  నేలమీద కూర్చుని చేయలేక, ఏ కుర్చీయో వేసుకోవాల్సిన పరిస్థితి కి వచ్చేసాము. పాపం దేవుడుకూడా వీటికి అలవాటు పడిపోయాడు. సాష్టాంగ నమస్కారం పెట్టడమంటే, ఏదో కష్టపడి పెట్టొచ్చు, కానీ లేపడానికి మరొకరి సహాయం అవసరమ వుతూంటుంది.

ఒకానొకప్పుడు ఇళ్ళల్లో భోజనం చేయడానికి, హాయిగా ఓ పీట వేసి, ఓ కంచమో, అరిటాకో, అడ్డాకో వేసేవారు. కానీ, ఈరోజుల్లో ఎక్కడ చూసినా, డైనింగ్ టేబులూ, లేకపోతే ఓ కుర్చీ వేసుకునో, లేక మంచంమీదో భోజనాలు… కింద కూర్చోలేరుగా పాపం !!! ఇదివరకటి రోజుల్లో , పనిమనిషి ఉన్నాకానీ, రోజులో ఏ రెండుసార్లో ఇల్లంతా చీపురుతో నడుంవంచి, తుడుచుకునేవారు , ఏ పురుగూ పుట్రా ఉండకూడదని. ఈ రోజుల్లోనో, ఆఖరికి పనిమనుషులు కూడా, ఇంట్లో వాక్యూం క్లీనరుందా అంటున్నారు—నడుంవంగదుగా..

నడవడం ప్రాక్టీసే లేదూ… ఎక్కడకు వెళ్ళాలన్నా, కారో, బైక్కో, ఆటో కావాల్సిందే..ఇన్నేసి సూకరాలు పెట్టుకుని, మోకాళ్ళనొప్పులూ అవీ వస్తాయంటే రావు మరీ? హాయిగా చేయాల్సిన పనులు మానేసి, వేలూ లక్షలూ ఖర్చుపెట్టి అవేవో   Gym  లో చేరడమే ఆనందం కదా…
ఇంక పురుళ్ళ విషయాలకి వస్తే, నొప్పులు పడ్డానికి కూడా ఓపికా, సహనం ఉండడం లేదు. ఒకనొకప్పుడు అరుదుగా జరిగే సిజేరియన్ ఆపరేషన్లు, ఇప్పుడు ఫాషనైపోయాయి.  

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈరోజుల్లో వయసుతో ప్రమేయం లేకుండా వచ్చేరోగాలకి సవాలక్ష కారణాలున్నాయి. చిత్రం ఏమిటంటే అవన్నీ కూడా స్వయంకృతాలే…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu