Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue332/841/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి)... “ఇవాళ నేను నీ గదిలోనే పడుకుంటాను ముక్తా…’’ చేతిలో తలగడ, దుప్పటి సహితంగా లోపలికి వచ్చింది రమ్య.

“శరత్ ఏమయ్యారు?’’ సంశయంగా ప్రశ్నించింది మౌక్తిక.

“ క్యాంపుందంటూ ఇందాకే బయలుదేరి వెళ్లారు. ఎల్లుందికి కాని రారు’’ అంటూ ఆమె పక్కనే సెటిలైపోయింది రమ్య. అప్పుడప్పుడు వాళ్లకిది అలవాటే. ఇద్దరూ అర్ధరాత్రివరకు కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు.

“ఆ(… అన్నట్లు నీకో విషయం చెప్పడం మరచాను.’’ పడుకున్నదల్లా లేచి కూర్చుంది రమ్య.

“ఏంటో!’’ ఆసక్తిగా అడిగింది మౌక్తిక.

“నిన్న మధుకిరణ్ నన్ను పిలిచి…’’ సస్పెన్స్ లో ఆపింది రమ్య.

“ఆ… పిలిచి?’’ ఆదుర్దాగా అడిగింది మౌక్తిక.

“కంగారు పడే విషయం కాదులే. నీ గురించి అడిగారంతే.’’

“నా గురించా? ఏమని అడిగారు?’’

“ఎందుకు బాలా … ఆ ఎక్సైట్ మెంట్… నీ గురించి అంటే…నీ కుటుంబ నేపధ్యం, తదితర వివరాలన్నమాట’’

“వాటి గురించి అతడికెందుకు మధ్యలో?’’ ముఖం ముడుచుకుంది మౌక్తిక.

“హయ్యో రామా! ఇంకా నీకర్ధం కాలేదా? అతడు… నిన్ను లవ్ చేస్తున్నాడే మొద్దూ…’’ చెప్పింది రమ్య సంబరంగా.నిశ్చేష్టురాలై ఉండిపోయింది మౌక్తిక. రమ్య చెబుతున్నది నిజమేనా! మధుకిరణ్ తనని ప్రేమిస్తున్నాడా! అదే నిజమైనే అతడి ఆరాధనను అందుకునే అదృష్టం తనకుందా?

అసలు… తన గురించి ఏం తెలుసునని తనని ప్రేమిస్తున్నాడు!? అతడికి తాను తగదని తెలిసిన నాడు అతడెలా స్పందిస్తాడు? తనని అసహ్యించుకుంటాడా! అన్నీ ప్రశ్నలే.

“ఏమిటీ… మళ్లీ ముడుచుకుపోయావా?’’ ఆమెకళ్ళముందు చేతులాడించింది రమ్య.తడబడింది రమ్య.

“  నీ ఊహ తప్పేమో రమ్యా…అతడు నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వెలా భావించావు? అతడు నోరువిప్పి నీతో చెప్పాడా? అతడు నా గురించిన వివరాలు అడిగినప్పుడు నువ్వెలా స్పందించావు? నా వివరాలతో అతడికి పనేమిటని నిలదీయలేదూ!’’ కలవరాన్ని కప్పి పుచ్చుకుంటూనే, రమ్య సమాధానం కోసం ఆత్రుతగా ఎదురు చూసిందిమౌక్తిక.

“ అయిందా… నీ ప్రశ్న పరంపర? మన కాలేజ్ లో ఎంతోమంది పెళ్లికాని లేడీ స్టాఫ్ ఉండగా…అతడు ప్రత్యేకించి నీ వివరాలే ఎందుకడుగుతా డూ !  ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండవది… నీ గురించి మాట్లాడుతున్నప్పుడు అతడి ముఖం వింత ఆనందంతో వెలిగిపోతుంది. నీపేరును అతడు మంత్రాక్షరాలు జపిస్తున్నంత పవిత్రంగా ఉఛ్ఛరిస్తాడు. నీ ప్రస్తావన రాగానే ఆసక్తిగా చెవులొగ్గి మరీ వింటాడు.ఇవన్నీ చాలవా… అతడు  నిన్ను ప్రేమిస్తున్నాడని గ్రహించడానికి!’’ అవలీలగా తేల్చి చెపేసింది రమ్య.ఆ మాటలు  అక్షరసత్యాలని అంగీకరించే తీరాలి. కాని, మౌక్తిక పరిస్థితే… అడకత్తెరలో పోకచెక్కలా ఉంది. ఎటూ చెప్పలేని డోలాయమాన స్థితి.

“నువ్వేమన్నావింతకీ?’’ కుతూహలంగా అడిగింది మౌక్తిక.

రమ్య విశ్రాంతిగా మేనువాలుస్తూ” నీ గురించిన వివరాలు నీ అనుమతి లేకుండా వెల్లడించడం సభ్యత కాదని నాకు తెలుసు. అందుకే నా కంతగా తెలియదని దాటవేశాను. అయినా… నీ గురించి నాకేం తెలుసునని చెప్తానూ!’’ దీర్ఘం తీసింది రమ్య కినుకగా. అందులో… ‘ఇంత సన్నిహితంగా ఉన్నా కూడా నాకేమీ తెలియదనడం ఎంత అసంబధ్ధంగా ఉందో చూశావా!’ అన్న దెప్పిపొడుపు ధ్వనించింది. మౌక్తిక మౌనం వహించింది.

“అయినా …ఒకవేళ అతడు నిన్ను ప్రేమిస్తున్నాడనే అనుకుందాం. అతడి ప్రేమని ఆమోదించడానికి నీకేం అభ్యంతరం? మనిషా ఉత్తమోత్తముడు. అందగాడు…ఉద్యోగస్తుడు. నిన్ను దేవతలా నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తాడు. దానికి నేను గ్యారెంటీ. మరి దేనికి నీ సంకోచం?’’ అతడిని చేపట్టడానికి ఇంతకన్నా అర్హతలు ఇంకేమి కావాలన్నట్లుగా ప్రశ్నించింది రమ్య.రమ్య చెప్పినది నూటికి నూరుపాళ్ళూ సత్యం. అవేమీ అసత్యాలు, అసంగతాలు కావు. ఏ ఇంతైనా ఇలాంటి ఉత్తమ లక్షణాలు మూర్తీభవించిన పురుషుడినే తన జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటుంది. అందులో ఏమాత్రమూ సందేహం లేదు.

కాని, ఇప్పుడు తానేం చేయాలి? ఒకవేళ అతడు డైరెక్ట్ గా ఈ విషయం తనతో ప్రస్తావిస్తే…తనకి ప్రపోజ్ చేస్తే ఏమని బదులీయాలి? ఏమిటీ సంఘర్షణ! ఏమిటీ నరకయాతన!  మౌక్తిక మనసు అనేకరకాల సందేహాలతో, సంకోచాలతో త్రాసులో ముల్లులా అస్థిరంగా ఊగుతోంది.ఆమెనే గమనిస్తోంది రమ్య. ఆమె ఎందుకో మధనపడుతోందని గ్రహించిందో ఏమో…

“సరేలే…ఇప్పుడా విషయం గురించి చర్చ దేనికి ? ఒకవేళ అతడు సడెన్ గా నీముందుకొచ్చి అతడి మనసులోని మాటను డైరెక్ట్ గా చెప్పేస్తే, నువ్విబ్బంది పడతావేమోనని ముందు జాగ్రత్త కోసం ఈ విషయం నీతో చెప్పాను. అప్పటి సంగతి ఆలోచిద్దాం కాని, నువ్వు పడుకో…’’ అంది ఆవిలిస్తూ.

మరుక్షణంలో పక్కకు తిరిగి నిద్రలోకి జారుకున్న ఆమెను బలవంతంగా లేపి కూర్చోబెట్టి, నాలుగు తన్నాలనిపించింది మౌక్తికకి.

‘తన మానస సరోవరంలో గులకరాయి పడేసి, అంతులేని ప్రకంపనలు సృష్టించి, తను మాత్రం హాయిగా గుర్రెట్టి నిద్రపోతోంది. పాపి… మిత్రద్రోహి…’ నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టేసుకుంది మౌక్తిక. చాలా సేపు గింజుకున్న తరువాత మౌక్తిక కనురెప్పలు మూతబడ్డాయి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్