Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సాహో చిత్రసమీక్ష

saho movie review

చిత్రం: సాహో 
నటీనటులు: ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌, జాకీష్రాఫ్‌, మందిరా బేడీ, వెన్నెల కిషోర్‌, దామినీ చోప్రా, మురళీ శర్మ, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ (స్పెషల్‌ సాంగ్‌) తదితరులు. 
సినిమాటోగ్రఫీ: ఆర్‌. మది 
సంగీతం: తనిష్క్‌, బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, శంకర్‌ ఎహ్‌సాన్‌ లాయ్‌, జిబ్రాన్‌ (నేపథ్య సంగీతం) 
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌ 
నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌, టి.సిరీస్‌ 
కథ, దర్శకత్వం: సుజీత్‌ 
విడుదల తేదీ: 30 ఆగస్ట్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

తాను నడుపుతున్న అండర్‌వరల్డ్‌ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ని వారసుడిగా చేయాలనే ప్రయత్నంలో వుంటాడు పృధ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌). మరోపక్క, రాయ్‌ గ్రూప్‌ పేరుతో రాయ్‌ (జాకీష్రాఫ్‌) క్రైమ్‌ సిండికేట్‌ నడుపుతుంటాడు. రాయ్‌ - దేవరాజ్‌ మధ్య ఆధిపత్య పోరు నడుఉస్తుంటుంది. అనుమానాస్పద స్థితిలో రాయ్‌ చనిపోతాడు. మరోపక్క, 2 లక్షల కోట్లరూపాయల డబ్బు మాయమవుతుంది. దాన్ని తీసుకొస్తానంటూ రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో 2 వేల కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం నిగ్గు తేల్చడానికి అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) అండర్‌ కవర్‌ కాప్‌గా వస్తాడు. ఈ కేసు విచారణలో అమృతా నాయర్‌ (శ్రద్ధా కపూర్‌) క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారిగా రంగంలోకి దిగుతుంది. కేసు విచారణ సమయంలోనే అశోక్‌ - అమృతల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇంతకీ, 'సాహో' ఎవరు.? పోయిన డబ్బు ఏమయ్యింది.? దొంగిలించబడ్డ సొమ్ము సంగతేంటి.? ఈ ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే..

అండర్‌ కవర్‌ కాప్‌ పాత్రలో డార్లింగ్‌ ప్రభాస్‌ దుమ్ము రేపాడు. సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌తోపాటు యాక్షన్‌ సీన్స్‌లో సత్తా చాటాడు. సినిమాలో డిఫరెంట్‌ షేడ్స్‌ వున్న పాత్రల్లో ప్రభాస్‌ మెప్పించాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో అయితే హాలీవుడ్‌ హీరోలను తలదన్నేలా కనిపించాడు. ప్రతి సన్నివేశంలోనూ తన మార్క్‌ ఈజ్‌తో అదరగొట్టేశాడు. సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ని ఒకటికి రెండు సార్లు చూపించాడు ప్రభాస్‌. మరోపక్క శ్రద్ధా కపూర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో బాగా చేసింది. యాక్షన్‌లోనూ అదరగొట్టింది. ప్రభాస్‌తో కెమిస్ట్రీ విషయంలో శ్రద్ధా కపూర్‌ చాలా క్యూట్‌గా, అంతే హాట్‌గా కనిపించి మెప్పించింది.

మిగతా పాత్రల్లో చుంకీ పాండే, అరుణ్‌ విజయ్‌ చాలా బాగా చేశారు. కల్కి పాత్రలో మందిరా బేడీ బాగానే మెరిసింది. జాకీష్రాఫ్‌, టిను ఆనంద్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ తమ తమ పాత్రల్లో రాణించారు.

కథ పరంగా చూస్తే.. ఇలాంటివి వెండితెరకు కొత్తేమీ కాదు. కథని తెరపై అద్భుతంగా చూపెట్టడంలో విఫలమయ్యాడు దర్శకుడు. కథనం విషయంలోనూ తడబడినట్లు కనిపిస్తుంది. ఎడిటింగ్‌కి ఇంకా చాలా ఆస్కారముంది. సాగతీత సన్నివేశాలపై కత్తెర వేటు పడి వుంటే బావుండేది. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. హాలీవుడ్‌ సినిమాని తలపించింది. స్టంట్‌ కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంతవరకు ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఇలాంటి విజువల్స్‌ని ఎప్పుడూ చూడలేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌.. సినిమాకి తగ్గట్టుగా వున్నాయి. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. డబ్బుని మంచి నీళ్ళలా ఖర్చు చేశారనడం అతిశయోక్తి కాదు. 
'బాహుబలి' ప్రభాస్‌ని 'సాహో'గా చూపించే క్రమంలో దర్శకుడు సుజీత్‌, కథని పెద్దగా పట్టించుకోలేదు. కథతోపాటు, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుని వుంటే, 'సాహో' ఇంకో రేంజ్‌లో వుండేది. ఎంతసేపూ హాలీవుడ్‌ హంగుల మీదనే ఫోకస్‌ పెట్టాడు. తెరపై సాంకేతిక బీభత్సం కనిపిస్తుంది. ప్రభాస్‌ కష్టమూ కనిపిస్తుంది. సన్నివేశాల మీద ఫోకస్‌ బాగాన పెట్టాడుగానీ, ఆ సన్నివేశాలన్నీ కథకి, కథనానికీ లోబడి వుండేలా చేసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సుజీత్‌, తనకు లైఫ్‌లో లభించిన అరుదైన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడని నిస్సందేహంగా చెప్పొచ్చు. యాక్షన్‌ని ఇష్టపడే ప్రేక్షకులు ఆయా సన్నివేశాల్ని ఎంజాయ్‌ చేస్తారు. డై హార్డ్‌ ఫ్యాన్స్‌ కూడా పెదవి విరిచేలా సినిమాని దర్శకుడు రూపొందించడం దురదృష్టకరం.

అంకెల్లో చెప్పాలంటే

2.5/5

ఒక్క మాటలో చెప్పాలంటే

యాక్షన్‌ సాహో.. కథ, కథనం.. బెదరహో.!

మరిన్ని సినిమా కబుర్లు
churaka