Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kondamalli

ఈ సంచికలో >> కథలు >> మనసు కుదుటపడింది

manasu kudutapadindi

 గంట ఉదయం ఎనిమిదిన్నర--- కాఫీ కప్పుతో గదిలోకి ప్రవేశించిన రాధిక"ఏమండీ!గంట ఎనిమిదిన్నరైంది.లేచి కాఫీ తాగి తయారై ఇవాళైనా పనికెళ్ళండి"అంది భర్త వాసును కుదుపుతూ. వాసు బద్దకంగా కళ్లు తెరచి భార్య వంక చూసి అటు తిరిగి సర్దుకొని కళ్ళు మూసుకున్నాడు. రాధికకు కోపం వచ్చింది. "ఏంటి...అటు తిరిగి పడుకున్నారు. పనికెళ్ళరా! మీ దరిద్రపు స్నేహితులతో బాగా తాగి రాత్రి పన్నెండు గంటల కొచ్చి పడుకున్నారు. ఇలా తాగి తందనా లాడుతూ పనికెళ్ళకుండా వుంటే మా...మీ అమ్మానాన్నలు ఏమనుకొంటారు? లేవండి. పనికి వెళుదురుగాని" కాస్త కోపంగానే అంది.

కోడలు అంటున్న మాటల్ని వింటూ లోనికి ప్రవేశించిన వాసు తల్లి భ్రమరాంబ "ఏమిటే అమ్మాయ్! నిద్రపోతున్న వాణ్ణి సతాయిస్తున్నావ్ .రాత్రి పొద్దుపోయి వచ్చాడు. కాస్సేపు పడుకోనీ రాదు పాపం!"అంది.

"ఏంటి అలా అంటారత్తయ్యగారూ!మీ గారాబం వల్లే వారు ఇలా తయారై  సరిగ్గా పనికి వెళ్ళకుండ స్నేహితులను వెంటేసుకొని తాగుతూ రాత్రుల్లో పన్నెండు దాటిన తరువాత ఇంటికి వస్తున్నారు. ఇలా అయితే బాగుపడ్డట్టే!"ఆ మాటలు కోడలు నోటి నుంచి విసురుతో వచ్చాయి.
"ఏంటమ్మాయ్ ...నా కొడుకుని అలా అంటావ్ !వాడ్ని మా ముందే అవమానిస్తున్నావా?!"

"అది కాదండత్తయ్యగారూ!మా పెళ్ళై ఆరునెల్లు.ఈ లోపే వారి భాగోతం బయట పడింది. నిజం  చెప్పాలంటే పని పాటకెళ్ళని పచ్చి తాగుబోతుకిచ్చి నా గొంతు కోశారు మా వాళ్ళు. ఈ ఆరు నెలల్లో వారు పనికెళ్ళింది కేవలం నాలుగు నెల్లు .వీరిని ఆ కంపెనీ యాజమాన్యం ఏ క్షణంలో పనికి రావద్దంటారోనన్న భయం పట్టుకొంది నాకు.అలా అయితే మేము ఎలా బ్రతకాలి?" కోపాన్ని ప్రదర్శించింది రాధిక.

" ఏమిటి గొంతు పెద్దదవుతోంది.అయినా పనికి పోవలసిన ఖర్మ వాడికి లేదమ్మా.ఇంట్లో కూర్చొని తింటూ హాయిగా బ్రతికేయొచ్చు.కాకపోతే మగాడన్న తరువాత ఏదేని వుద్యోగంలో వుండాలని మేమే పంపించాం.ఆఁ"మనసులో మాట బయట పెట్టింది భ్రమరాంబ.

"కొడుకుని సమర్థిస్తున్నారా? అలా సమర్థిస్తే వీరిలాగే వుండి పోతారు. అత్తయ్యగారూ! మామగారికి అరవై ఏళ్ళకు పైనే వుంటాయి.ఇంటికోసం వారు ఇంకా సంపాయిస్తునే వున్నారు. ఇదిగో!చిన్న వుద్యోగమైనా భార్యను చక్కగా తన సంపాదనతో పోషించు కొంటారని నాడు పెళ్ళి చూపులప్పుడు మీరే అన్నారు.నన్ను పోషించటం మాట దేవుడెరుగు. ఇలా తాగడం, తినటం, తిరగడం. నిద్రపోవటమంటూ తయారైయ్యారు. ఇకపై అలా కుదరదండీ! వారు పనికెళ్ళాలి. సంపాయించాలి.ఎవరి దయాదాక్షీణ్యాలపై ఆధార పడకుండ మేము బ్రతకాలి.ఆఁ "

"ఆహాఁ! పరోక్షంగా మమ్మల్ని దెప్పేస్తున్నావా! ఇదిగో అమ్మాయ్ ... ఇలా లెక్కలేనితనంగా మాట్లాడావంటే పెట్టెబేడా సర్దుకొని మీ ఇంటికి వెళ్ళాల్సి వుంటుంది. ఆఁ"విరుచుకు పడింది అత్త భ్రమరాంబ. అప్పుడు ఇద్దరిలో కోపం కట్టలు తెంచుకొంది. క్షణాల్లో వీధి పోట్లాటలా మారిపోయింది. ఆ గోల కాస్త చెవులకు సోకేసరికి టఫీమని నిద్ర లేచాడు వాసు.

"లేచారా... ఇదిగో ! ఇక  ఈ ఇంట్లో నేను వుండను.వుండాలంటే మన సంపాదనతో తింటూ మన   ఇష్టానుసారంగా స్వేచ్ఛగా బ్రతకాలి. మీ అమ్మ నాన్నలు పెట్టే అంత కవలానికి భిక్షాటన ధోరణితో నేను ఎదురు చూస్తూ బ్రతకలేను"

"అమ్మాయ్! ఇంతకు నేనేమన్నానని నువ్వలా నోరు పారేసుకొంటున్నావ్ ? వాడు నా కొడుకు. బోలెడు ఆస్తికి వారసుడు. ముష్ఠి ఇరవై వేల రూపాయల జీతం కోసం పనికి పోవలసిన అవసరం  వాడికి లేదు"తెగేసి చెప్పింది అత్త భ్రమరాంబ.

"అయితే మీకు బానిసలా బ్రతకాలని నాకు లేదు.నా మొగుణ్ణి తీసుకొని నేను వెళ్ళిపోతాను. వారు  సంపాదిస్తే  ఆ సంపాదనలో బ్రతుకుతాను"అంది కోడలు రాధిక.

తల్లి పెళ్ళాం మాటల యుధ్ధాన్ని కాస్సేపు విన్న వాసు "అమ్మా! మీ మాటల యుధ్ధాన్ని కాస్త ఆపండి. రాధికా!నన్నిప్పుడేం చేయమంటావో చెప్పు?"కోపంగా ప్రశ్నించాడు వాసు.

"ఏం చేయమంటాను?మీ అమ్మా నాన్నలకు దూరంగా వుండాలంటాను. వేరు కాపురం  పెట్టాలంటాను. మీరు ఆ తాగుడికి స్వస్తి చెప్పి  సంపాయించి తెస్తే అందులో కలోగంజో కాసుకు తాగుతూ స్వేఛ్ఛగా బ్రతకాలంటాను.ఈ బానిస బ్రతుకులు అస్సలొద్దంటాను."

"బానిస బ్రతుకులా... ఏంటీ ... నిన్ను బానిసలా చూస్తున్నామా? అయినా పెళ్ళయి ఆరు నెల్లు కాలేదు. అప్పుడే ప్రక్కకెళ్ళాలంటావా?"
"అవును. మీతో గొడవలు పడుతూ ఇక్కడ వుండలేము. మేము వేరుగా వుండాల్సిందే! ఏమండీ... వేరుగా వుండేలా నిర్ణయం తీసుకుంటారా లేక నన్ను మా ఇంటికి వెళ్ళమంటారా చెప్పండి!"

"ఏంటి రాధికా నువ్వంటుంది. అలా అమ్మా నాన్నల వద్దుంచి ఎకాఎకిన వెళ్ళిపోతే నలుగురూ ఏమనుకొంటారు? మన ఇంటి పరువు పోదూ? ఆలోచించు".

"ఆహా! అప్పటికి తమ పరువు అలాగే వున్నట్టు. ఇదిగో... ఉద్యోగం,సద్యోగం లేకుండా తేరకే తింటూ తాగుతూ తిరుగుతున్నారని వూరు కోడై కూస్తోంది. తెలుసా?అసలివన్నీ ఎందుకూ...  వేరు కాపురం పెట్టాల్సిందే!"

"ఒరేయ్ వాసు...! ఇక నీ పెళ్ళాం గోల మేము పడలేము కాని తను కోరుకున్నట్టు వేరు కాపురం పెట్టేసుకొండి. ఇంట్లోంచి వెళ్ళిపొండి" అంటూ బాధతో పెరట్లోకి వెళ్ళిపోయింది భ్రమరాంబ. నిజానికి కొడుక్కి పెళ్ళయిన గత ఆరు నెల్లలో భ్రమరాంబ కోడల్ని మాటలతో బాధ పెట్టిన దాఖలాలు లేవు. మరెందుకు కోడలు అంతగా రెచ్చిపోయిందో...!

వాసు రాధికల పెళ్ళి జరిగి ఆరు నెల్లు. అప్పటి నుంచి రాధికను  కన్న కూతురిలా చూసు కొంటున్నారు అత్తామామలు. భర్త వాసుక్కూడా రాధికంటే ప్రాణం.వాసు చేస్తున్నది ఓ సివిల్ ఇంజనీర్ వద్ద కాంట్రాక్టు సూపర్ వైజర్  వుద్యోగమే అయినా ప్రతివారం తనకొచ్చే జీతంతో భార్యకు కావలసినవన్నీ చేసి పెట్టుకునేవాడు.  ఆది, శనివారాలంటూ వస్తే సినిమాలకు షికార్లకంటూ వెళుతూ బీచీ,మాల్స్ ,విహార యాత్రలని సిటీ మొత్తం తిరుగుతూ ఆనందంగానే జీవితాన్ని సాగిస్తూ వచ్చారు.  వాసు తల్లితండ్రులు కూడా పెళ్ళయిన కొత్తజంట కనుక వాళ్ళు సంతోషంగా వుండాలనుకొని కొడుకు జీతంలో పైసా అడిగేవారు కాదు. రాధిక కూడా దేవుడు తనకిచ్చిన మంచి  భర్త, అత్తమామలకు,అమరిన సుఖమయ జీవితానికి  మనసులోనే దణ్ణం పెట్టుకొంది.కాని అలాంటి మంచి జీవితం ఆమె నాలుగు నెల్లు మాత్రమే అనుభవించింది.

తరువాత భర్త వాసు ఓ తాగుబోతని గుర్తించింది. వాసు కూడా తనో తాగుబోతని భార్యకు తెలీకుండా కొన్నాళ్ళు జాగ్రత్తపడ్డా చివరికి దొరికి పోయాడు.వాసు తాగుడికి కారణం చెడు సహవాసం.  మూడునెల్లు జాగ్రత్తగా వున్న వాసుని స్నేహితులు విడిచి పెట్టలేదు. తాగడం కేవలం సరదాకోసమని మళ్ళీ బారుకు తీసుకు వెళ్ళడం, తాగడం అలవాటు చేశారు.వాసు కూడా తాగుడికి బానిసై మరోసారి గాడి తప్పి నడవ సాగాడు. మొదట్లో స్నేహితులు తాగుతున్నప్పుడు వాసుకు ఓ కోక్ మాత్రమే  యిప్పించేవారు. వాసుకూడా వాళ్ళు తాగుతున్నంత సేపు ఆ కోకును తాగుతూ  కంపెనీ యిచ్చేవాడు. కాని మనిషిది చపల బుధ్ధకదా!...వాసులో  మార్పు చోటు చేసుకొంది.మెల్లగా ఒక్క పెగ్గుకు అలవాటు పడ్డాడు. అలా కొనసాగిస్తూ రెండు,మూడని పెంచుకొంటూ వెళ్ళి స్నేహితులను మించి పోయాడు వాసు. నిత్యం సాయంత్రం  పని ముగించుకొని చక్కగా ఇంటికి వెళ్ళే తను ఇప్పుడు బాగా తాగి ఏ పన్నెండింటికో  ఇంటికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు.భర్త తాగుతున్నాడని తెలుసు కున్న రాధిక విషయాన్ని అత్తమామల దృష్ఠికి తీసుకువెళ్ళి బోరున ఏడ్చింది. అదేం పట్టించు కోని వాసు తల్లితండ్రులు  పరిష్కరించే ప్రయత్నాలు చేయలేదు సరిగదా కొడుకుని సమర్థిస్తూ రాధికను ,ఆమె మాటల్ని నిర్లక్ష్యపెట్టారు.ఇక తన్ను ప్రాణపదంగా చూసుకునే భర్తను మామూలు మనిషినిగా చేసు కోవాలని తనే రంగంలోకి దిగింది. ఆ పని అత్తమామల వద్ద వుండగా కుదరనుకొంది.తక్షణమే వేరు కాపురం పెట్టాలనుకొంది.

వేరు కాపురం పెట్టాలంటే ఇంటినుంచి వెళ్ళిపోవాలి.అందుకు సరైన కారణం కావాలి.అందుకే అత్త భ్రమరాంబతో గొడవలకు దిగింది.అత్తనోటే ఇంటినుంచి వెళ్ళిపొండన్న మాటను పలికించింది. నెల తిరక్కుండానే భర్తను తీసుకొని అద్దింట్లోకి వెళ్ళిపోయింది రాధిక. కొడుకు,కోడలు అలా వేరు కాపురం పెట్టడం ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో అద్దెకు దిగిన ఇంట్లో పాలు పొంగించి కొడుకు చేతిలో పది వేల రూపాయలుంచి  బాధతో వెనుదిరిగారు వాసు తల్లిదండ్రులు.

నాటినుంచి రాధిక వాసును గట్టిగా కొంగున ముడేసుకొంది.వాసు కోరుకున్నట్టు వుంటూ,సర్వ సుఖాలను అందించి ఆనందంగా సంసారాన్ని సాగిస్తూ నెలలోపే ఎంచక్కా తన వేపుకు త్రిప్పుకొంది భర్తని.   ఆశ్చర్యమేమిటంటే వాసు కూడా  భార్యతో పాటు ఇంట్లోనే వుంటూ సరదాగా గడిపేయటానికి అలవాటు పడ్డాడు.ఇప్పుడు తనకు మందు అస్సలు గుర్తుకు రావటం లేదు మరి. నెలనాళ్ళలోనే  భర్తలో మార్పును గమనించిన రాధిక మనసులోనే భగవంతుడికి దణ్ణం పెట్టుకొంది.

నెల రోజుల్లో పదివేల రూపాయలు కాజేసుకున్నారు ఆ దంపతులు. మరో వారంలో తిండికి కూడా తిప్పలు పడే సమయం అసన్నమౌతుందని తెలుసుకున్న రాధిక, మెల్లగా భర్తను పనికి వెళ్ళమని బ్రతిమాలింది.వాసు కూడా పనికి వెళ్ళక పోతే భోజనానికి సైతం ఇబ్బంది పాడాల్సి వస్తుందన్న భయంతో భార్య మాట మీద పనికి వెళ్ళను ప్రారంభించాడు.

ఆ రోజు శనివారం.ఆ వారంలో వాసుకి వచ్చిన జీతం మొత్తం తెచ్చి భార్య చేతికిచ్చాడు. డబ్బు లెక్క పెట్టుకు చూసిన ఆమె  ఆశ్చర్యానికి గురైంది. "ఇదేంటండీ!మీ ఖర్చుల నిమిత్తం కొంత డబ్బు వుంచుకోకుండా  మొత్తం నా చేతికిచ్చారు? " భర్తను అడిగింది. "నాకంటూ ఖర్చేముంది  రాధిక!అదృష్టవశాత్తు ఆఫీసులో నన్ను డబ్బులకు పీడించి తాగుడికి తీసుకువెళ్ళే ఆ  స్నేహితులిద్దర్ని  మరో ప్రాజెక్టుకు బదిలీ చేయడంతో వాళ్ళను కలుసుకునే సందర్భాలు లేకుండా పోయాయి.దాంతో తాగుడన్న వూసే నాకు జ్ఞాపకానికి రాలేదు.ఇక బోధి వృక్షం క్రింద బుద్దుడికి జ్ఞానోదయం కలిగినట్టు భార్యగా నువ్వు ప్రేమతో చెప్పిన నీ సందేశాత్మక బోధనలు నన్ను మార్చేశాయి. తాగడం వల్ల  ఆరోగ్యపరంగా ఒంటికి, ఆర్థిక పరంగా ఇంటికి మంచిది కాదని తెలుసుకున్నాను. ఎటూ బస్సు,'టి' ఖర్చులకు డబ్బు నువ్విస్తున్నావాయె! ఇక నాకు పైసలతో పనేముంది?" వాసు భార్య నడుం చుట్టు చేయిని పోనిచ్చి గుండెలకేసి హత్తుకున్నాడు.

భర్త స్పర్షతో ఒళ్ళంతా పులకరించిపోగా ఎనలేని ఆనందాన్ని పొందిన రాధిక,' ఈ కొద్ది రోజుల్లోనే భర్తలో ఇంతటి మార్పా ...థాంక్ గాడ్. ఇదిలాగే కొనసాగాలి భగవంతుడా' అని మనసులోనే అనుకొంటూ ఇంకాస్త  భర్తలోకి వొదిగి పోయింది.

©©©©©©

రునెల్ల తరువాత కొడుకును చూడాలన్న కోరిక కలిగింది భ్రమరాంబకు. "ఏమండీ!నాకు పిల్లాడ్ని చూడాలనివుంది.మీరూ వస్తారా?"భర్తను అడిగింది భ్రమరాంబ. "ఎందుకూ!వాడిప్పుడు ఆ  చెడు వ్యసనాలకు దూరమై చక్కగా పనికెళుతూ సంసారాన్ని సాగిస్తున్నట్టు విన్నాను.మళ్ళీ నువ్వెళ్ళి నీ అతి ప్రేమతో వాడ్ని వుద్యోగం మానేలా చేయ టానికా?. నేను రాను. నువ్వు వెళ్ళి చూసి సాయంత్రానికి వచ్చేయ్"అంటూ సైకిల్లో పనికి వెళ్ళి పోయాడు వాసు తండ్రి. భ్రమరాంబ కొడుకు ప్రియంగా తినే అరిశెలను,చక్రాలను సంచిలో వుంచుకొని పది గంటలకు బస్సెక్కి పది కిలో మీటర్లకావల వున్న కొడుకు ఇంటికి చేరుకుంది. కాంపౌండు గేటు తీసుకొని లోనికి నడిచింది భ్రమరాంబ. గుమ్మం వద్ద ఆగి కాలింగ్ బెల్ నొక్కబోయింది.ఆమెకు లోపలినుంచి  ఏవో మాటలు వినబడినై .ఆ మాటలను అక్కడే నిలబడి వినసాగింది.

"పర్వాలేదు రాధికా!మీ అత్తమామల దృష్ఠిలో నువ్వు  అణకువ లేని ఆడదానివనిపించుకొని గడప దాటొచ్చినా భర్తను దారికి తెచ్చుకొన్నావ్ .మీ వారికున్న చెడు వ్యసనాన్ని మాన్పించి మనిషిని చేసుకున్నావ్ .ఆరేడు నెలల్లోనే మీ వారికొచ్చిన జీతంతో కుటుంబాన్ని గడుపుతూ వారికోసం ఓ బైకును కూడా కొన్నా వ్ .నిజంగా గొప్పదానివే "అంది రాధికకు కొత్తగా  స్నేహితురాలైన  ప్రక్కింటమ్మాయి.

"నిజమే !ఇంతటికి కారణం మా అత్తగారే!ఆమెకు కొడుకంటే వల్లమాలిన ప్రేమ.మా వారికీ తల్లంటే ప్రాణం. మా వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది వాళ్ళింట్లో! అందువల్లనే మా వారు బాగా పాడైపోయారు. వారికున్న దుష్ట సహవాసం వారిని పాడు చేసింది. మందు లేక పోతే బ్రతకలేడన్నంతగా వారిని దిగజార్చింది. ఈ సంగతి మా అత్తమామల దృష్థికి తీసుకు వెళ్ళాను.కాని  కొడుకుమీద వారికున్న అతి ప్రేమతో కనీసం మావారిని మందలించ లేకపోయారు.ఇక  తాగుబోతుకు భార్యనై నిండు జీవితాన్నిపోగొట్టుకునేది నేనేగా?!ఆ సంగతి మా అత్తామామలు గ్రహించలేక పోయారు. అందుకే నేను వాళ్ళ దృష్ఠికి చెడ్డదానిగా మారి పోయినా పర్వాలేదనుకొని మా వారిని తీసుకొని ప్రక్కకు వచ్చేశాను.నిజానికి మా అత్తగారు చాలా మంచివారు.ఆమె నాకు మా అమ్మకన్నా ఎక్కువే.నన్ను  ఎంతో ప్రేమతో కన్న కూతురి లా చూసుకొంటారు.నాకు తలనొప్పంటే ఆ నొప్పి వారికే వచ్చినట్టు బాధపడి పోతారు. నిజం చెప్పాలంటే అత్తమామల వద్ద వున్నన్నాళ్ళు నా జీవితం హాయిగానే సాగింది.అలా చూసు కున్నారు వాళ్ళు.కాని మా వారు తాగుడికి బానిసై తన జీవితాన్నే పోగొట్టుకునే ప్రమాద ముందని గ్రహించి  గొడవ పడి బయటికొచ్చేశానంతే!అందుకే ఖచ్చితంగా మేమూ చాలా గొప్పగా బ్రతుకుతున్నామన్న సంకేతంతో ఈ దీపావళికి మా వారి కొత్త బైకులో మా ఇంటికి వెళ్ళాలను కొంటున్నాం. వెళతాం కూడా!"అంటూ ముగించింది రాధిక.

గుమ్మం వద్దే నిలబడి కోడలు అంటున్న మాటల్ని విన్న భ్రమరాంబ ఆనందంతో వుప్పొంగి పోయి  కళ్ళమ్మటి జారుతున్న కన్నీటిని కొంగుతో  తుడుచుకొంటూ"అమ్మా రాధికా "అంటూ గబగబ వెళ్ళి సంచిని ప్రక్కన పెట్టి కోడల్ని వాటేసుకొంది.అత్తాకోడళ్ళను ఆశ్చర్యంతో అలాగే చూస్తూ వుండిపోయింది ప్రక్కింటి రాధిక  స్నేహితురాలు.
 

మరిన్ని కథలు