Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue334/843/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి)....“అవును రమ్యా… అది పీడకలే. అది తరుచూ వస్తూంటుంది. ఆ కల వచ్చినప్పుడు నాకు చెప్పలేనంత భయమేస్తుంది. ఆ కల పదేపదే ఎందుకు వస్తోందో… నన్నెందుకింత ఆరడి పెడుతోందో నాకు తెలియడం లేదు.’’ అంతూ నెమ్మదిగా తనకొస్తూన్న ఆ కలను వివరించింది మౌక్తిక. చిత్రంగా ఆమె మనసెంతో తేలికపడింది. రమ్య చెప్పింది నిజమే… మనసులోని బాధను ఆప్తులతో పంచుకుంటే ఎదబరువుతీరి తేలికపడుతుంది.

రమ్య సాలోచనగా ఆమె వైపు చూసింది. ఆ చూపులో ఎన్నో భావాలు.

“చాలా థాంక్స్ ముక్తా… ఇప్పటికైనా నన్ను నీ ఆత్మీయురాలిగా అంగీకరించావు. నేనెక్కడో చదివాను… మనకొచ్చే కలలు మన ఆలోచనలకి ప్రతిబింబాలని. మెలకువలో మన అంతరంగాలలో బలవంతంగా అది మేసే ఆలోచనలే… కలత నిద్రలో కలలుగా వచ్చి మనలని కల్లోల పెడతాయట.  పాములు కలలో కనబడితే దానికి అనేక అర్ధాలు చెబుతారు. ముఖ్యంగా…’’

అర్ధోక్తిలో ఆగిపోయిన రమ్యను చూస్తూ “ఏమిటీ …ఏదో చెప్పబోతూ ఆగిపోయావూ…చెప్పు.’’ అంది మౌక్తిక.   “నాకు తెలిసిన, నేను చదివిన పరిజ్ఞానంతో చెబుతున్నాను… నువ్వు తప్పుపట్టుకోకూడదు మరి!’’ సంశయంగా అంది రమ్య.

ఆమె ఎందుకు సంకోచిస్తోందో అర్ధం కాకపోయినా “నేనేమంటాను చెప్పు! ప్లీజ్ కంటిన్యూ.’’ అంది మౌక్తిక. “పాములు… తీరని లైంగిక వాంఛాలకి సంకేతాలుగా భావిస్తారు కలల మీద పరిశోధనలు చేసేవారు. నీకు కూడా…’’ తతపటాయించింది రమ్య.

అటువంటి సున్నితమైన అంశాలను ప్రస్తావించడానికి ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తోందామెకి. ఈ చర్చపట్ల మౌక్తిక ఎలా రియాక్టౌతుందోనని మనసులో గుబులుగా ఉంది. కాని, మౌక్తిక ఆమెని ఖండించలేదు.. అలా…తలదించుకుని మౌనంగా ఉండిపోయింది.

“లైంగిక పరమైన ఆలోచనలు కలగడం తప్పా రమ్యా?’’ కాసేపటి తరువాత మెల్లగా ప్రశ్నించింది. రమ్య విస్తుపోయి చూసింది. ఆతరువాత ఏదో అర్ధం అయినట్లుగా  తల పంకించింది.“తప్పెలా అవుతుంది ముక్తా? ఆహార, నిద్రా, భయ మైధునాలు ఏ మనిషికైనా ప్రకృతిపరంగా రేకెత్తే ‘సహజ ప్రవృత్తులు’. వాటిని తీర్చుకోవాలని ఏ మనిషైనా వాంఛిస్తాడు. మన మనసుతో ప్రమేయం లేకుండానే వాటంతట అవే మనిషిలో సహజంగా ఉత్పన్నమౌతాయి. నీమనసులో ఏముందో నాకు  తెలియదు. నీ కలలకు పూర్తి అర్ధం చెప్పేంత పరిజ్ఞానమూ నాకులేదు. కాని నువ్వనుభవిస్తున్న మానసిక సంఘర్షణకి, తరచుగా వచ్చి నిన్నిబ్బందిపెట్టే కలకు ఏదో… సంబంధం ఉండితీరాలి.’’ దీర్ఘంగా నిట్టూర్చింది రమ్య.

మౌక్తిక మాట్లాడలేదు. ఆమె మనసు అల్లకల్లోల సంద్రంలా ఉంది. రమ్య ముందు మనసు విప్పాలని ఉందామెకి.ఆమె ఓదార్పులో సేద తీరాలని కూడా అనిపిస్తోంది. కాని,వ్యక్తపరచలేని అభ్యంతరమేదో ఆమెని పట్టి ఆపేస్తోంది.

“నీమనసులో మాట నాతో పంచుకోమని నిన్ను ప్రెస్ చేయను. చెప్పడం చెప్పకపోవడం అన్నది నీ ఇష్టం. కాని, నీ వేదన నాకు తెలిస్తే నేనేరకంగానైనా నీకు సహాయపడగలనేమోనని నా ఆరాటం. నీకొచ్చిన ఈ కలను విశ్లేషించి, దానికి భాష్యం చెప్పగలిగిన వ్యక్తొకరున్నారు. ఆయన దగ్గరకు నిన్ను తీసుకెళ్తాను.’’ అంది రమ్య.

“ఎక్కడికి” అని మౌక్తిక అడగలేదు. ‘ఫలానా చోటుకి’ అని రమ్య చెప్పలేదు. రమ్య తన మేలుకోరే వ్యక్తే కాని,కలలోనైనా తనకు కీడు తలపెట్టదు. అందుకే భారం ఆమెపైన మోపి అలాగేనని తలూపింది రమ్య.

“దైవనామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా పడుకో… హాయిగా నిద్రపడుతుంది.’’ ధైర్యం చెప్పింది రమ్య.

ఆమె ఇచ్చిన సూచన పాటించిన మౌక్తిక కాసేపటికి నిద్రపోయింది.

----------------------

“డాక్టర్ యతిరాజ్’ (సైకాలజిస్ట్)…గేటుముందు ముచ్చటగా రాయబడి ఉన్న ఆబోర్డ్ వైపు ప్రశ్నార్ధకంగా చూసింది మౌక్తిక.రమ్య తనని ఇక్కడికెందుకు తీసుకొచ్చినట్లు!? ఆమె ఆశ్చర్యాన్ని గమనించినదానిలా “ నాతోరా…’’ అంది రమ్య ఆమెలో మరింత ఉత్కంఠని రేపుతూ.  సంశయంగానే ఆమెవెంత లోపలికి నడిచింది మౌక్తిక. కాలింగ్ బెల్ మ్రోగించిన మూడు నిముషాల తరువాత తలుపులు తెరుచుకున్నాయి.
  తలుపుతీసినామె పనిమనిషి కాబోలు…”ఎవరు కావాలండీ’’ అని అడిగింది.

“యతిరాజ్ గారున్నారా? పొద్దున్న ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకున్నాం.’’ చెప్పింది రమ్య.

“ఉన్నారమ్మా… లోపలికి వచ్చి కూర్చోండి.’’ అందామె గుమ్మానికి అడ్డు తొలుగుతూ. ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు.ఆ లివింగ్ రూమ్ అత్యాధునికమైన ఫర్నిచర్ తో అందంగా అలంకరించబడి ఉంది. గోడలకి లేత నీలిరంగు ఎమల్షన్ పెయింట్ వేయడం వలన ఎంతో డీసెంట్ లుక్ వచ్చింది. మెత్తని సోఫాలు, అక్కడక్కడ అమర్చిన ఇండోర్ ప్లాంట్స్, కిటికీ గ్రిల్ కి పాకించిన మాలతీలత… ఆవాతావరణం ఎంతో ఆహ్లాద భరితంగా  ఉంది.

మౌక్తికనింకా సందిగ్ధానికి గురిచేయడం ఇష్టంలేనట్లుగా చెప్పింది రమ్య” యతిరాజ్ గారు మా డాడీకి బెస్ట్ ఫ్రెండ్. సైకాలజీలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. ప్రత్యేకించి ‘కలలు’ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన్నడిగితే నీకలని విశ్లేషిస్తారేమోననీ…’’  మౌక్తిక కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. తన పట్ల ఇంత శ్రధ్ధ తీసుకుంటున్న ఆమెని ఏవిధంగా మెచ్చుకోవాలో ఆమెకి తెలియడంలేదు.ఇంతలో ఎవరో వస్తున్నట్లుగా మెత్తటి అడుగుల సవ్వడి వినిపించింది. చప్పున కళ్ళు తుడుచుకుని ఆ వైపు చూసింది రమ్య. ఒక నడివయసు వ్యక్తి ఆగదిలోకి వచ్చాడు. అతడిని చూస్తూనే లేచి నిలబడింది మౌక్తిక. రమ్య మాత్రం అలా కూర్చునే “గుడీవినింగ్ అంకుల్’’ అంది మర్యాద పూర్వకంగా.

“గుడీవినింగ్ రా…ఎలా ఉన్నావు? శరత్ బాగున్నాడా?’’ ఆప్యాయంగా పలకరించాడాయన.“వియ్ ఆర్ ఫైన్ అంకుల్. ఈమె నా ఫ్రెండ్ మౌక్తిక.’’ అంది రమ్య మౌక్తికను పరిచయం చేస్తూ.

మౌక్తిక వినయంగా ఆయనకి నమస్కరించింది. కూర్చోమన్నట్లుగా సోఫా చూపించాడాయన. ఆయన చూడడానికి సామాన్యంగా ఉన్నా ముఖంలో ఏదో వింతతేజస్సు ఉట్టిపడుతోంది. నిరంతరం విజ్ఞానామృతపానం చేయడం వలన కాబోలు  కళ్లలో ఏదో కాంతి నిండిఉంది. కళ్లకు దళసరి అద్దాలున్న కళ్ళజోడు, సాదాగా కనబడే వస్త్రధారణ, చురుకైన చూపులతో ఆయన చాలా హుందాగా కనిపిస్తున్నాడు.

“చెప్పరా రమ్యా…అపాయింట్ మెంట్ కావాలని అడిగావూ…బయటవాళ్లకైతే అపాయింట్ మెంట్సూ అవీనూ…నువ్వు ఎప్పుడైనా రావచ్చు.’’ మృదువుగా అన్నాడు యతిరాజ్.

“మీరు చాలా బిజీ కదా అంకుల్… అపాయింట్ మెంట్ తీసుకుని వస్తే మీకూ మాకూ కూడా మంచిదనీ…’’ నవ్వింది రమ్య.  ఆయనా నవ్వేశాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్