Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి....http://www.gotelugu.com/issue336/845/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి)... బాల్యాన్ని, కౌమారాన్ని దాటి యవ్వన దశలోకి ప్రవేశించిన మనిషికి వర్ణించనలవి కాని వింత అనుభూతులేవో జనిస్తాయి. ఈ ప్రపంచమంతా సుగంధభరిత పుష్పాలతో నిండిన నందనవనంలాగానూ, వయస్సు వన్నెల ఇంద్రధనుసు లాగానూ అనిపిస్తూ ఉంటుంది. తమని తాము మరచి స్వేఛ్ఛగా విహరించాలని అనిపిస్తుంది.

అటువంటి ఉరకలెత్తే ఉడుకువయసులో… ఉన్నట్లుండి…ఏదో ఒకబంధం… ఏర్పడితే! అకస్మాత్తుగా మనిషికి కళ్ళాలుపట్టి లాగి, కాళ్లకు సంకెళ్ళు వేసినట్లనిపిస్తుంది. మనిషి జీవితం హాయిగా సాగిపోవడానికి కూడు, గూడు, గుడ్డ లాంటి ప్రధానావసరాలు తీరడంతో పాటు, స్వేఛ్ఛ స్వతంత్రం కూడా కావాలి. వాటిని హరించేబంధం ఏదో బిగుసుకున్ననాడు, మనిషి మనసులో విస్తృతంగా ఉత్పన్నమయ్యే భావపరంపరలకి అవరోధం ఏర్పడిననాడు…భరించలేనంత ఒత్తిడి మనిషిలో ఏర్పడుతుంది.

నీ విషయంలో ఇలాంటిదేదైనా జరిగి ఉండాలని నా అభిప్రాయం.ఫ్రీబర్డ్ లా ఏబాదరబందీలు లేకుండా హాయిగా గడిపే నిన్ను ఏదో బంధం, గట్టిగా పట్టి నీ అడుగులు ముందుకు పడకుండా వెనక్కు లాగుతోంది. ఆబంధానికీ, నీ మనసుకీ అనునిత్యం సంఘర్షణ.. ఆసంఘర్షణకి ప్రతిఫలం ఒత్తిడి… ఆ ఒత్తిడి బయటకుపోయే గవాక్షం పదేపదే నీకొచ్చే స్వప్నం. నువ్వు వదల్చుకోలేని ఆబంధం పాములరూపంలో నీమెడకి చుట్టుకుంటోంది.నిన్ను అశాంతిపాలు చేస్తోంది. యతిరాజ్ మాటలు మౌక్తికను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యేలా చేశాయి. ఆయన పలికే ప్రతి అక్షరం కాదనలేని తిరుగులేని వాస్తవం.రమ్య ఓరకంట ఆమెనే గమనిస్తోంది. మౌక్తిక వదనంలో చకచకా మారే రంగులు ఆమెను తీవ్ర ఆశ్చర్యంలో కూరుకుపోయేలా చేస్తున్నాయి.

మౌక్తిక నిస్సత్తువగా సోఫాలో చేరబడిపోయింది. మనస్తత్వశాస్త్రం అంటే ఇదేనా? తన మనసులోని అణువణువు చదివేసినట్లుగా చెబుతున్నాడీయన. అతడిలోని ఈ జ్ఞానమంతా ఆశాస్త్రాన్ని అధ్యయనం చేయడం వలన వచ్చిన ఫలితమేనా! మనిషికొచ్చే కలలకి…వారి వ్యక్తిగత జీవితానికి ఇంత దగ్గర సంబంధముందా!

మౌక్తిక ముఖ కవళికలను పసిగట్టిన యతిరాజ్ అన్నాడు “రిలాక్స్ మౌక్తికా… ప్లీజ్ రిలాక్స్ . నిన్ను హర్ట్ చేయడానికో, ఇబ్బంది పెట్టడానికో నేనివన్నీ చెప్పడంలేదు.ఇవన్నీ హండ్రడ్ పర్సెంట్ నిజాలు కావాలని కూడా లేదు. నీమనసులో పేరుకుపోతున్న ఒత్తిడిని తగ్గించుకుని, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటావని చెబుతున్నాను.’’

అప్పుడు కల్పించుకుంది రమ్య. “అదిసరే అంకుల్…మౌక్తికకి వచ్చే కలలో ఈమధ్య కొత్తగా కనిపిస్తున్న పూలమాలకి అర్ధం ఏమిటి?’’
“అక్కడికే వస్తున్నాను. మౌక్తిక తనను అంటిపెట్టుకుని ఉన్న పాతబంధాలను వదల్చుకుని, తన జీవితంలోకి సరికొత్త బంధాన్ని స్వాగతించాలని అనుకుంటూ ఉండి ఉండవచ్చును. ఆసరికొత్త బంధానికి అర్ధమే ఆపూలమాల. తనని బలంగా అంటిపెట్టుకున్న పాత బంధాలను వదిలించుకోలేక, ఈసరికొత్త బంధానికి స్వాగతం పలకలేక ఆమె మానసికంగా ఎంతో చిత్రహింస అనుభవిస్తూ ఉండిఉండాలి.’’  ముక్కుమీదకు జారిపోతున్న కళ్ళద్దాలను పైకి తోసుకుంటూ మాట్లాడుతున్న యతిరాజ్ వైపు విస్మయంగా చూసింది మౌక్తిక. ఇంత సామాన్యంగా కనిపిస్తున్న ఇఅతడిలో ఎంత జ్ఞానం దాగుంది! ఎంత చక్కని విశ్లేషణ. ఇంతటి అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేసిన రమ్యమీద అంతులేని కృతజ్ఞతాభావం మొలకెత్తింది మౌక్తిక మదిలో.

“చూడమ్మా మౌక్తికా…నే చెప్పిన ప్రతివిషయమూ నీ జీవితంలో యధాతధంగా జరగాలని రూలేమీలేదు. ఒక వ్యక్తికి తరచుగా వచ్చే కలల వివరాలను రాబట్టి, వాటిని విశ్లేషించడాన్ని డ్రీమ్ అనాలిసిస్ అంటారు. నిజానికి ఈ సంభాషణా చికిత్సకి ఆద్యుడు ‘ సిగ్మండ్ ఫ్రాయిడ్’మాటలతో మనసుని శోధించి, తద్వారా మానసిక సమస్యలను పరిష్కరించవచ్చునని గుర్తించి ఆ దిశగా కృషిచేసిన మొట్టమొదటి మహనీయుడాయన.

మనిషి ప్రవర్తన మీద చేతనావస్థలోని ఊహలకంటే, అంతర్లీనంగా ఉండిపోయిన కోరికలు, భావనల ప్రభావమే ఎక్కువన్నది ఆయన ప్రతిపాదన. ఒక మనిషి తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకుని, దాన్ని అలాగే నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమించాలి. మనచుట్టూ ఎన్నో సంప్రదాయాలు, కట్టూబాట్లు అల్లుకుని ఉంటాయి. వాటికి, మనసుకి అనునిత్యం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మనకేం కావాలో తేల్చుకుని, కావలసినదాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో అవసరమైతే…ఈ సాంఘిక ఆచారాలకి ఎదురీదవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.  మనసుని మభ్యపెట్టుకుంటూ, మనకు మనమే అన్యాయం చేసుకుంటూ మనుగడ సాగించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మనసు…చాలా తేలికైన పదం. కాని, ఎంతో లోతైనది. వింతైనది. ఇంతకీ ఈ మనసు ఎలా ఉంటుంది?

భౌతికమైన రూపం అంటూ లేని మనసు…రంగు, రుచి, వాసన లేని మనసు… ఒక మనిషి లోని ఆలోచనలని నియంత్రిస్తూ ముందుకు నడిపించడం నిజంగా ఒక అద్భుతమైన విషయం.మనసుకెదురీది మనుగడ సాగించడం వలన ఎన్నో అనర్ధాలు జరుగుతాయి. ఆరోగ్యం పాడౌతుంది. మానసిక అశాంతి వలన శరీరంలో పలుమార్పులు చోటు చేసుకుంటాయి. మానవశరీరంలో కనిపించని మనసే కీలకం. మనసు చేసే గారడీలు, గమ్మత్తులు, చిత్ర విచిత్రాలుఎన్నో… ఎన్నెన్నో… కాబట్టి, నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుని, నీకేది మంచిది అనిపిస్తే అలాచేయి.’’ చెప్పాడు యతిరాజ్ సుదీర్ఘమైన తన ప్రసంగాన్ని ముగిస్తూ.

  “థాంక్యూ అంకుల్…మా మౌక్తిక మనసు తేలికపడేలా చేశారు.ఆమె రిలాక్స్ అయ్యేందుకు ఏమైనా…’’ అంది రమ్య.  “ఇట్స్ మై ప్లెజర్ రమ్యా…’’ అంటూ “చూడమ్మా మౌక్తికా… నీ మనసులోని కల్లోలం తగ్గేందుకు నేను కొన్ని చిట్కాలు చెబుతాను. శారీరిక మానసిక ఆరోగ్యాలు మెరుగు పడేందుకు ‘ యోగా’ ని మించిన ఔషధంలేదు. క్రమంతప్పక మెడిటేషన్ చేస్తూ, యోగాసనాలు, సూర్యనమస్కారాలు ప్రాక్టీస్ చేశావంటే నీలోని డిప్రెషన్ తగ్గి, మెంటల్ బ్యాలెన్స్ వస్తుంది. నీ మనసులోని బాధను గాని, సంతోషాన్ని కాని, ఆప్తుల ముందు పంచుకో…ఒత్తిడి తగ్గడానికిఇది ఒక తారకమంత్రం. అయితే… ఇదంతా క్షణాలమీద చక్కబడే వ్యవహారం కాదు.కాస్త సహనంతో వేచిచూడాలి. అప్పుడే తగిన ఫలితం కనబడుతుంది. ఇంకో మాట… నీకు జ్యోతిష్యంలమీద నమ్మకం గనక ఓమారు నీ జాతకచక్రం ఎవరైనా పండితులకి చూపించుకుని ఏమైనా దోషాలుంటే గనుక గ్రహశాంతులు చేయించుకో.” సూచించాడు యతిరాజ్. ఆయనకు ఇతరశాస్త్రాలు, సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవానికి ముగ్ధురాలైపోయింది మౌక్తిక.

“థాంక్యూ సార్…మీరు చెప్పినదాన్ని తప్పక ఆచరిస్తాను. థాంక్యూ వెరీమచ్…” నమస్కరించింది వినమ్రంగా.

“ఆఁ…అంకుల్… అడగడమే మరచా…ఆంటీ ఏదీ… కనబడడం లేదూ?’’ ప్రశ్నించింది రమ్య చుట్టూ చూస్తూ. “మీ ఆంటీకి కొడుకుమీదకు గాలి మళ్లిందమ్మా… ఢిల్లీ వెళ్ళింది.’’ చెప్పాడు యతిరాజ్ నవ్వుతూ.

“ ఓహో… ఆంటీ వచ్చాక మళ్ళీ వస్తాను.  వన్సెగైన్ థాంక్యూ అంకుల్. తనకి మెడికేషన్ ఏమన్నా అవసరం పడుతుందా?’’ మౌక్తిక లేచి బయటకు వెళ్ళగానే అడిగింది రమ్య నెమ్మదిగా.

“ప్రస్తుతానికి మందుల అవసరం లేదనే నా అభిప్రాయం. చూద్దాం… నా కౌన్సిలింగ్ ఎంతవరకూ పని చేస్తుందో!’’ సాలోచనగా అన్నాడు యతిరాజ్.తను కూడా బయటకొచ్చేసి స్కూటీ స్టార్ట్ చేసింది రమ్య..

ఇల్లు చేరేవరకూ పెదవి విప్పి ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదు ఇద్దరూ. యతిరాజ్ మాటలకి మౌక్తిక మనసు పూలరెక్కల్లాగా తేలికగా మారింది. ఆమె ఆటో దిగి, తన వాటావైపు అడుగులేస్తూ ఉండగా, రమ్య గొంతు వినిపించింది.“హాయిగా రెస్ట్ తీసుకో ముక్తా…రేపెటూ ఆదివారమే కదా! సావకాశంగా మాట్లాడుకుందాము.’’ అలాగేనంటూ తలూపి, రమ్య తనవాటాలోకి వెళ్ళిపోయేవరకు ఉండి లోపలికి వెళ్ళింది మౌక్తిక.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్