Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> జ్ఞానోదయం

jnaanodayam

కాలింగ్ బెల్ మోగుతుంటే వెళ్ళి తలుపు తీద్దామనుకునేలోపే అమ్మ తలుపు తీసింది.ఏం జరిగిందో తెలియదు వెంటనే తలుపు ధభాలున వేసేసి “ఒరేయ్ చిన్నా(నా ముద్దుపేరు), నాలుగు డబ్బులు సాయం చేయమని కాబోలు ఎవడో వచ్చాడు అని ఎదురొచ్చిన నాతో చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది” తీరా చూద్దును కదా వాడు మా సుపుత్రరత్నం మోహన్. పదో తరగతి పాస్ అయిన వెంటనే దూరంగా మంచి కార్పోరేట్ కాలేజ్ లో ఇంటర్ లో చేర్పించాను.అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు.చేర్పించి ఆరేడు నెలలవుతుంది.చేర్పించిన తర్వాత వెంటనే హోమ్ సిక్ సెలవులకని వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇదే రావటం. మొహం కందగడ్డలా పెట్టి “బామ్మేంటి,మొహంమీదే తలుపువేసేసి లోపలికి వచ్చేసింది అంటున్నాడు,ఈ లోపు అమ్మ అరుపులు.

“అయ్యో,అయ్యో ఎకాఎకి ఇంట్లోకే వచ్చేసాడేమిట్రా చిన్నా వీడెవడో” అరుస్తుంది అమ్మ

“అమ్మా,వాడెవడనుకుంటున్నావు నీ మనవడు మోహన్” అని చెప్పా.

“ ఓరీ నీ జిమ్మడిపోనూ!,ఆ వాటం, ఆ వాలకం చూస్తే అసలు చదువుకునే కుర్రాడివేనా నువ్వు అని వాడితో అని  “ఆ చింపిరి గెడ్డం , పైనుంచి కింద వరకు చిల్లులతో ఉన్న ఆ గోనెగుడ్డ ఫ్యాంట్ తో ఉన్న వాడిని చూసి  అలా అనుకున్నాను రా “అంది నాతో వాడి పిల్లిగెడ్డాన్ని,టోర్న్ జీన్స్ ఫ్యాంట్ ని గుడ్లుఉరిమేలా చూస్తూ. వాడికి విషయమేమిటో  అర్ధం కాక వెర్రి మొహం వేసి చూస్తున్నాడు. చెప్పొద్దూ నాకూ చిరాకే అనిపించింది ఆ వాటంతో వాడిని చూసే సరికి.

“ ఇపుడు అవి ఫ్యాషన్ అమ్మా,చిరిగిపోయిన ఫ్యాంటు కాదు, చింపిన ఫ్యాంటే కొనుక్కుని వేసుకున్నది”అని అమ్మకు సర్ది చెప్పా. మా వాడికి విషయం తరువాత తెలిసి వాళ్ళ బామ్మ మీద అంతెత్తున ఎగిరాడు.

“వాణ్ణి సముదాయించేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది.

******

మా అమ్మతో వచ్చిన ఇబ్బందే ఇది. తన వాళ్ళు అవనీ, పరాయి వాళ్ళు అవనీ, మనసులో ఉన్నది ఉన్నట్లుగా మొహంమీదే మాట్లాడుతుంది.  దాంతో  నాకు చచ్చే చిక్కొచ్చి పడుతుంది. కాని మనసు మాత్రం వెన్నే.అలాగే ఈ మధ్య ఒకసారి నా శ్రీమతి భుజాల కి ఇరువైపులా కొంతమేర కత్తిరించబడినచేతులతో ఉన్న జాకెట్  వేసుకుంది.ఇపుడు ఆ ఫ్యాషన్ నడుస్తుంది.దాన్ని చూసి “అయ్యో! రామా, ఎంత చిరుగులు పడితే మాత్రం ఏదో గుడ్డతో చిరుగులకు మాటు  వేయించు కోవాలి గాని,నీకేం పోయే కాలమొచ్చిందే లలితా అంటూ పెద్దపెట్టున అరిచేసరికి వారిద్దరి మధ్య ఒకచిన్నపాటి యుద్దమే నడిచింది. తదుపరి నా శ్రీమతి  దీర్ఘాలు తీయటం మొదలుపెట్టింది. అది చూసి ”ఒరేయ్! నేనేమనేసానురా, అలా ఆరునొక్క రాగం అందుకుంది మీ ఆవిడ” అని నన్ను కూడా ఆ వివాదం లోకి లాగేసరికి కక్కాలేక మింగాలేక నా పరిస్థితి కుడితి లో పడ్డ ఎలుక లాగా అయ్యింది. అది ఇప్పటి ఫ్యాషనే బాబూ అంటూ సమర్ధించాల్సి వచ్చింది. లోలోపల సంతోషంగానే అనిపించింది నేను అడగలేనిది మా అమ్మ అడుగుతున్నందుకు. ఫ్యాషనా,పాడా అంటూ నసుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది.

******

ఇంకోసారి నా కూతురి స్నేహితురాలు మా ఇంటికొచ్చింది. ఆ అమ్మాయి ఫ్యాంటు,షర్ట్ వేసుకుని బాబ్డ్ హెయిర్ తో వచ్చింది.వాళ్ళిద్దరు పక్కపక్కల కూర్చుని మాట్లాడుకుండటాన్ని చూసి “ఒసేయ్,ఒసేయ్ నీ కేం పోయేకాలమొచ్చిందే ఎంత స్నేహితుడైతే మాత్రం రాసుకు పూసుకుని మాట్లాడుకోవాలా”అని మనవరాలని ఉద్దేశించి అనేసరికి నా కూతురు కూడా  ఏం తీసిపోకుండా  “ఎమేవ్ బామ్మా, నీకు బొత్తిగా కళ్ళు కనిపించికపోతే నాన్న నడిగి కళ్ళడాక్టరు కి చూపించుకోవే, వచ్చింది స్నేహితుడు కాదే, నా స్నేహితురాలే “అంది. పిదప కాలం, పిదప బుద్ధులు అని గింజుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది.

******

మా చినతాతయ్య కొడుకు రాజారావు చిన్నాన్న కుటుంబం ఉద్యోగ రీత్యా చాలా కాలం క్రితమే హైదరాబాద్ వెళ్ళిపోయారు.ఎప్పుడైనా పెళ్ళిళ్ళకు,పేరంటాలకు వస్తుంటారు. అలా మా చిన్నాన్న, వాళ్ళ అమ్మాయి పెళ్ళిపిలుపుకి వచ్చి, ఇంటిల్లిపాది రావాలి అని పిలిచి వెళ్ళాడు.అమ్మని తప్పనిసరిగా తీసుకురండి అని నాకు చెప్పటమే కాకుండా మా అమ్మతో కూడా “అమ్మా, మీరు కూడా తప్పనిసరిగా రావాలి “అని చెప్పాడు. చిన్నప్పుడే చిన్నాన్నమ్మ చనిపోతే మా అమ్మ దగ్గరే పెరిగాడు,సొంత బిడ్డలా చూసుకోవడంతో  అమ్మ దగ్గర చనువెక్కువ.అందుకే అమ్మ వదిన అయినప్పటికి అమ్మ అనే పిలుస్తుంటాడు. “సరే,అలాగే అంది” అమ్మ.

నాన్న చనిపోయిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఏ శుభకార్యం కు హాజరుకాలేదు,అటువంటిది తొలిసారిగా “ఒరేయ్ చిన్నా, మీ చిన్నాన్న కూతురి పెళ్ళికి హైదరాబాద్ వెళదాం రా “ అంది. చాలాకాలం తర్వాత శుభకార్యానికి వస్తాననటం ఆనందంగానే అనిపించినా అక్కడ ఎవరితో ఏం మాట్లాడి తగువు తెచ్చుకుంటుందో అని భయపడుతూ భయపడుతూనే తీసుకెళ్ళా. అనుకున్నంత పని జరిగింది. విందు భోజనాలు కేటరింగ్ వాళ్ళకి పురమాయిస్తే వాళ్ళు బఫే భోజనాలు ఏర్పాటు చేసారు.ఆ భోజనాలను చూసి అమ్మ అంతెత్తున రంకెలు వేస్తూ”ఏంట్రా రాజా (చిన్నాన్నని అమ్మ పిలిచే పిలుపు)ఈ భోజనాలు,ప్రతి ఒక్కడి దగ్గరకెళ్ళి నాకింత అన్నంపెట్టు,నాకింత కూరుంటే పెట్టు అని అడుక్కోవాలా,ఏం గతిలేక వస్తారేంట్రా అంటూ అందరి ముందు దులిపేసేసరికి పాపం చిన్నాన్న చిన్నబుచ్చుకున్నాడు. పెళ్ళి తెల్లవారుజాము ముహూర్తమని , వచ్చిన బందుమిత్రులు పెళ్ళి సమయం వరకు చాలా మంది ఉండరని రాత్రి భోజనాల తర్వాత పెళ్ళికూతురు ,పెళ్ళికొడుకుని పెళ్ళి మండపం లోని డయాస్ పై రెండు సింహాసనంలాంటి కుర్చీలను పక్కపక్కన వేసి వాటిలో పెళ్ళికూతురు,పెళ్ళికొడుకుని కూర్చోపెట్టి వచ్చిన వాళ్ళతో అక్షింతలు వేయించటం మొదలుపెట్టి, పెద్దావిడ కదా అని అమ్మని వచ్చి అక్షింతలు వేయమని చిన్నాన్న అడిగేసరికి చిన్నాన్నకు గట్టిగా అక్షింతలు వేయడం మొదలెట్టింది.”ఒరేయ్ రాజా,ఎక్కడైనా ఉంటుందా ఇటువంటి చోద్యం,అంతకంతకు మీకు మతులు పోతున్నాయి .

పెళ్ళి తంతు ఇంకా ఏమి జరగకుండానే ఇలా పక్కపక్కన కూర్చోపెట్టి అక్షింతలు వేయమంటావా అసలు నీకు బుద్ది ఉందా” అంటూ తిట్లదండకం మొదలుపెట్టింది.ఆమెను శాంతింపచేయటానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.పోనీ అంతటితో వూరుకుందా అంటే అదీ లేదు,తెల్లవారుజాము పెళ్ళిసమయానికి హాజరై పెళ్ళికూతురుకి,పెళ్ళికొడుకుకి మధ్య తెర ఉండటం చూసి విసవిసా నడుచుకుంటూ పెళ్ళిమంటపం పై కెళ్ళి బరబరా అడ్డుగా ఉన్న తెరను లాగేసి రాత్రి పక్కపక్కల కూర్చోబెట్టి ఇప్పుడు మధ్యలో తెర అవసరమా అనేసరికి అందరం బిక్క చచ్చిపోయాము. అయితే పెద్దావిడ అనే గౌరవంతో ఎవరూ తిరిగి మాట్లాడలేదు.

******

ఉన్నట్టుండి ఉదయాన్నే ఊడిపడ్డాడు నా ఫ్యామిలి ఫ్రెండు నారాయణ. అప్పుడప్పుడు ఇంటికి వస్తావుంటాడు. అమ్మ తో కూడా మాట్లాడుతుంటాడు. ఎకాఎకిన అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మతో “మాతృదినోత్సవ శుభాకాంక్షలు “అండి అన్నాడు.అంతే నారాయణ మీద గయ్యిన పడి “నా కొడుకు నన్ను బానే చూసుకుంటాడు,ప్రత్యేకంగా నాకు మరల దినం ఎందుకు అనేసరికి మా నారాయణ మొహంలో కత్తివేటుకి నెత్తురుచుక్కలేదు.

******

ఇలా మాట్లాడే  అమ్మ ఒక రోజు మోకాలు వరకు ఉండే స్కర్ట్ తో ప్రత్యక్షమయ్యింది. పైగా ఆ స్కర్ట్ కి నడుముకి ఇరువైపులా చిల్లులతో ఉంది. ఆ అవతారంతో చూసేసరికి మా ఆవిడ,మా అమ్మాయి స్పృహతప్పి పడిపోయినంత పని చేసారు. ఎట్టకేలకు మా ఆవిడ నోరు విప్పింది. “ ఈ వయస్సులో ఏంటండి ఆ స్కర్ట్ లు మీకు, పైగా ఆ స్కర్ట్ కి నడుముకి ఇరువైపులా ఆ చిల్లులేంటండి అని నిలదీసింది”
“ఏ, ఫ్యాషన్స్ మీకేనా, మాకుండవా పైగా స్కర్ట్ కి నడుము  వైపు రెండు చిరుగులు ఎందుకో తెలుసా,అవి ఫ్యాషన్ మాత్రమే కాకుండా తుంటికి నేను చేయించుకునే ఇంజక్షన్స్ ఇక ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయించుకోవచ్చు అని చెప్పేసరికి మా ఆవిడ నోట మాట పడిపోయింది.

మరొక రోజు టీ-షర్ట్,జీన్స్ ప్యాంట్ తో దర్శనమిచ్చింది. ఆ జీన్స్ ఫ్యాంటుకి ఒక కాలు మోకాలు వరకే ఉంది,ఇంకొక కాలు మడమ వరకు ఉంది. అది చూసి మా ఆవిడ నన్ను మా అమ్మ ఎదురుగానే “మీరే తెచ్చి ఇస్తున్నారా ఇటువంటివన్నీ” అని నిలదీసేసరికి మా అమ్మ అందుకుని “ఏ,నా కొడుకే కావాలా ఇటువంటివి తేవడానికి” అని బదులిచ్చేసరికి  “మీకైనా తెలియట్లేదా, అలా తయారయ్యి తిరుగుతుంటే” అని మరో ప్రశ్ననాపై సంధించే సరికి మా అమ్మ  మరల అందుకుని “ఏం మీరు చిరిగిన ఫ్యాంట్లు ఫ్యాషన్ అని వేసుకున్నపుడుగాని, చేతులదగ్గర కత్తిరించుకున్న జాకెట్లు వేసుకున్నప్పుడు మీకు తెలియలేదా “అనేసరికి మా వాళ్ళందరికి అప్పటికి జ్ఞానోదయమయింది.  ఆ తర్వాత ఇటువంటి వింత వింత ఫ్యాషన్ల జోలికి మా వాళ్ళెవరు వెళ్ళలేదు. ఇంతకీ అసలు రహస్యం ఏంటంటే ఇదంతా  మా అమ్మ,నేను కలిసి ఆడిన నాటకం. మీరు మా వాళ్ళకు చెప్పనంతవరకు ఇది దేవరహస్యమే.

మరిన్ని కథలు
alambana