Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
naneelu

ఈ సంచికలో >> శీర్షికలు >>

బాబు మిన్నుకెగశాడు - డా. ఎస్ జయదేవ్ బాబు

 

బాపు మెచ్చిన బాబు తెలుగు కార్టూను వ్యాఖ్యలో మచ్చుకైనా ఇంగ్లీషు( మనం ఏటా నోటా మాట్లాడుకునే) పదాలని వాడకుండా భాషమీద తన వ్యామోహం చాటి చూపి అర శతాబ్ధం మించి తెలుగు పాఠకజనాన్ని తన సున్నిత హాస్యంతో అలరించిన కొలను వేంకట దుర్గాప్రసాదు అనే కార్టూనిస్టు బాబు అమరజీవి ఐనాడు. 1961 లో నన్ను వెతుక్కుని చెన్నై ( అప్పటి మద్రాసు) వచ్చాడు. ఇద్దరం కార్టూనులు పట్టుకుని ఆంధ్రసచిత్రవారపత్రిక సంపాదకులు శివలెంక రాధాకృష్ణగారిని కలిశాము. మొదటి పరిచయంతోటే రాధాకృష్ణగారు, బాబు కార్టూనులు చూసి పరవశించారు. ఆ కార్టూన్లలో వుట్టిపడే తెలుగుతనం ఆయన్ని ముగ్ధుడిని చేసింది. రాధాకృష్ణగారు ఆ తర్వాత బాబును పట్టిపెట్టుకున్నారు. ఆంధ్రపత్రిక దినపత్రికలో సెమిపొలిటికల్ అంశాలమీద బాబు వందలాది కార్టూనులు గీసే అపూర్వావకాశం కల్పించి ఇచ్చారు.

బాబు మిన్నుకెగశాడు. స్వాతి బలరాం గారు బాబుకి రత్నకంబళం పరిచి ఆహ్వానించుకున్నారు. బాబు తన తుది శ్వాస దాకా స్వాతికి అంకితమైపోయారు. బాబు రచయిత ! ఎన్ని చిత్ర విచిత్ర వ్యాఖ్యలు, తెలుగు పాఠకుల పెదాలమీద వెలసింపజేసిన నవ్వుల కుప్పలు, లెక్కకు కట్టలేము. వాటికి వెలకూడా నిర్ణయించలేము. వీటన్నిటిమధ్య, బాబు నిరాడంబర జీవిగా మెదిలాడు. పబ్లిసిటీకి దూరంగా, శాలువాలకి, మెమెంటోలకి మరింత దూరంగా మూలకొదిగి నిలుచుని, మాణిక్యకాంతులతో, అపురూపంగా ప్రకాశించాడు. బాబు, నేను ఒకరితో ఒకరు కలిసిపోయాము. ఇద్దరం కలిసి కార్టూను ఫుల్ పేజీలు గీశాము. పులిచెర్లసాంబశివరావుతో సవాలుకు దిగాము. పులిచెర్ల వ్యాఖ్యలకు సమవుజ్జీ బాబు మాత్రమే. ఇంటాబయటా సామాన్యుడు, ప్రభుత్వోద్యోగె, డాక్టరూ, లాయరూ, రోగీ, నిరుద్యోగీ, ఇల్లాలూ, చెల్లీ, బావా, పాలకోవా అమ్మే సేటూ మాట్లాడుకునే భాష, యాస, వ్యాఖ్యల్లో బంగారు కిరీటంలో రత్నాలని ఇమిడ్చే తీరులో, అందమైన తెలుగు పదాలతో తన ప్రత్యేక లిపితో అమర్చి, తెలుగు పాఠకలోకానికి వినమ్రంగా సమర్పించాడు బాబు. అతడికి సాటి అతడే అని నిరూపించుకున్నాడు.



తన మొదటి కార్టూను సంకలనంతో బాపుగారిని కలిసినరోజున తన జీవితం ధన్యమైందని చెప్పుకుంటాడూ బాబు. ఆ కార్టూనులు చూసి బాపుగారు బాబుని గుండెలకు హత్తుకున్నారట. ! బాబు కార్టూనంటే బాపుగారికి ఎంతో ఇష్టం. " బండి ర" కార్టూను చూసి బాపుగారు మెచ్చుకుని ఎంతగా ప్రశంసించారో చెప్పలేము. బాబు పాత కార్టూనులు తిరగేస్తే అవి అన్నీ కొత్తగానే కనిపిస్తాయి. అప్పటి వ్యాఖ్యలు ఇప్పటికీ వర్తిస్తాయి. వందరోజుల పండగ, ఆరోజుల్లో సినిమావాళ్ళే చేసుకునేవాళ్ళు. బాబు తన కార్టూనులో ఒక రాజకీయ నాయకుడు చేసుకునేలా చూపించాడు. అది బాబు కాన్ సెప్టు! ఇప్పుడు రాజకీయ నాయకులు వందరోజుల పండుగలు జరుపుకుంటున్నారు. ! అదిచూసి నవ్వే...........తెలుగు పాఠకులు బాబును మరచిపోగలరా?

మరిన్ని శీర్షికలు
dasara