Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

దర్శకులే నిర్మాతలు!

directors became producers

దర్శకుడు గుణశేఖర్ తన మెగా డ్రీమ్ ప్రాజెక్టు, భారతదేశంలో చారిత్రిక నేపధ్యంలో నిర్మిస్తున్న తొలి త్రీడీ చిత్రం 'రుద్రమదేవి' షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. 'గుణ' టీం వర్క్స్ పతాకం పై గుణశేఖరే ఈ చిత్రానికి నిర్మాతగా ఉంటున్నాడు. ఇలా దర్శకులు నిర్మాతలుగా మారడం తెలుగు చిత్రసీమలో సాధారణ విషయమే. అలనాటి నలుపు తెలుపు చిత్రాల నుండి ఇప్పటి డిజిటల్ సినిమాల వరకు ఎందరో తెలుగు చిత్ర దర్శకులు నిర్మాతలుగా మారారు. అలాంటి దర్శకులెవరంటే...

'వాహిని పిక్చర్స్' పతాకంపై వచ్చిన 'దేవత, మల్లీశ్వరి, బంగారు పాప, రంగుల రాట్నం, సుమంగళి' చిత్రాలను తన స్వీయ దర్శకత్వంలో బి.ఎన్.రెడ్డి నిర్మించారు. ఇదే 'వాహిని'లో వచ్చిన 'పెద్ద మనుషులు, గుణ సుందరి కథ, యోగివేమన, భక్తపోతన' సినిమాలకు కె.వి. రెడ్డి దర్శకత్వం వహించారు.

'మాలపిల్ల, రైతు బిడ్డ' లాంటి సామాజిక చైతన్య విలువలు గల సినిమాలకు దర్శకత్వం వహించిన గూడవల్లి రామబ్రహ్మం 'శారదా ఫిలింస్' పేరిట 'పల్నాటి యుద్ధం' సినిమా నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం మధ్యలో గూడవల్లి మరణించగా దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ సినిమాను పూర్తి చేసారు.

దర్శకుడు కె.వి.రెడ్డి కొంతమంది మిత్రులతో కలిసి 'జయంతి పిక్చర్స్' బ్యానర్ పై 'పెళ్ళినాటి ప్రమాణాలు, భాగ్యచక్రం, శ్రీ కృష్ణార్జున యుద్ధం' సినిమాలు నిర్మించారు.

అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావులు నిర్మాతలుగా 'చక్రవర్తి చిత' పతాకంపై 'మరో ప్రపంచం, సుడిగుండాలు' లాంటి ప్రయోజనాత్మక సినిమాలు నిర్మించారు.

'స్వతంత్ర పిక్చర్స్' పై ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో 'ద్రోహి' సినిమాను నిర్మించారు దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు. ఆ తర్వాత 'ప్రకాష్ పిక్చర్స్'ను స్థాపించి 'కన్నతల్లి, మేలికొలుపు, అంతే కావాలి', పిల్లల కోసం మూడు చిత్రాల్ని 'బాలానందం' పేరిట ఒకే సినిమాగా నిర్మించారు.

'జానపద బ్రహ్మ' విఠలాచార్య 'విఠల్ ప్రొడక్షన్' పై 'పెళ్ళి మీద పెళ్ళి', 'వద్దంటే పెళ్ళి, కన్యాదానం,అగ్గి బరాటా, జగన్మోహిని, వరలక్ష్మీ వ్రతం, కనకదుర్గ పూజా మహిమ' సినిమాలు నిర్మించారు.

'అనుపమ' పతాకంపై నిర్మాత, దర్శకుడు కె.బి. తిలక్ 'అత్త ఒకింటి కోడలే, ఈడూ జోడూ, ఉయ్యాల జంపాలా, ముద్దు బిడ్డ, ఎం.ఎల్.ఎ' సినిమాలు తీసారు.

ఎల్.వి.ప్రసాద్ 'లక్ష్మి ప్రొడక్షన్స్' బ్యానర్ పై 'ఇలవేల్పు', 'ఇల్లాలు' సినిమాలు నిర్మించారు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలను నిర్మించారు ప్రసాద్.

అవుట్ డోర్ లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం 'సాక్షి' ని తీసిన బాపు తన మిత్రుడు రమణతో 'అందాల రాముడు, ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్ళాం, పెళ్ళి పుస్తకం' మొదలగు సినిమాలు నిర్మించారు.

కోడి రామకృష్ణ, నిర్మాత వాకాడ అప్పారావు కలిసి 'లలిత కళాంజలి' బ్యానర్ ను స్థాపించి 'అత్తగారూ స్వాగతం, ఇంటి దొంగ, అత్త మెచ్చిన అల్లుడు' సినిమాలను తీసారు.

దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ 'చరిత చిత్ర' పతాకంపై ఊర్మిళ, పోతేపోనీ' మొదలగు సినిమాలు నిర్మించారు.

'తాత - మనవడు' సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలెట్టిన దాసరి నారాయణరావు 'తారక ప్రభు' ఫిలింస్ పై 'శివరంజని, మేఘసందేహం, బహుదూరపు బాటసారి' తదితర ఎన్నో సినిమాలు తన స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

'దర్శకేంద్రుడు' కె. రాఘవేంద్రరావు తన సోదరుడు కృష్ణమోహనరావుతో కలిసి 'ఆర్.కె. అసోసియేట్స్' బ్యానర్ పై 'అపూర్వ సహోదరులు, యుద్ధభూమి, అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు, ఘరానా బుల్లోడు, ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు, ఇద్దరు మిత్రులు' సినిమాలను నిర్మించారు.

'శివ' సినిమాతో తెలుగు సినిమాను 'శివ'కు ముందు 'శివ'కు తర్వాత లాగా మార్చిన రామ్ గోపాల్ వర్మ 'వర్మ క్రియేషన్స్' పై, మనీ, మనీ మనీ, దెయ్యం, w/o వి. వరప్రసాద్' సినిమాలే కాక బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు తన దర్శకత్వంలో కొన్ని, తన శిష్యుల దర్శకత్వంలో కొన్ని నిర్మించారు.

'గులాబి', నిన్నే పెళ్ళాడతా, ఖడ్గం, అంతఃపురం, చందమామ' లాంటి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు కృష్ణవంశీ కూడా 'ఆంధ్రా టాకీస్' పై 'సింధూరం' సినిమాను నిర్మించాడు.

నటుడు ఆర్. నారాయణమూర్తి, కొంతమంది స్నేహితులతో కలిసి 'స్నేహచిత్ర పిక్చర్స్' బ్యానర్ పై 'లాల్ సలామ్' సినిమా నుండి 'నిర్భయ భారతం' వరకు దాదాపు ఇరవైకి పైగా సినిమాలు నిర్మించారు.

'ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావగారూ బాగున్నారా, లక్ష్మీ నరసింహ' లాంటి హిట్ చిత్రాలను తీసిన దర్శకుడు జయంత్ సి.పరాన్జీ మహేష్ బాబు హీరోగా 'టక్కరి దొంగ' సినిమా నిర్మించారు.

'ప్రేమ ఖైదీ, ఆమె, అప్పుల అప్పారావు, వారసుడు, హలో బ్రదర్' మొదలైన ఎన్నో హిట్ సినిమాల దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ నిర్మాతగా 'ఇ.వి.వి సినిమా' బ్యానర్ పై 'తొట్టి గ్యాంగ్, చాలా బావుంది, కితకితలు, అత్తిలి సత్తిబాబు, ఫిటింగ్ మాస్టర్' మొదలగు సినిమాలు నిర్మించారు.

'ఆనంద్' లాంటి మంచి కాఫీ లాంటి సినిమాను అందించిన శేఖర్ కమ్ముల కొంతమంది మిత్రులతో కలిసి 'అమిగోస్ క్రియేషన్స్' పై 'ఆనంద్, హ్యాపీ డేస్, ఆవకాయ్ బిర్యానీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలు తీసారు.

దర్శకుడు వై.వి.యస్. చౌదరి 'బొమ్మరిల్లు వారి' బ్యానర్ పై 'లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస్, ఒక్కమగాడు, నిప్పు' సినిమాలను నిర్మించారు.

'వైష్ణో అకాడమీ' పై పూరీ జగన్నాథ్ 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, బంపర్ ఆఫర్' మొదలగు సినిమాలు తీసాడు.

'శుభమస్తు, శుభాకాంక్షలు, సూర్యవంశం, సుస్వాగతం' లాంటి రీమేక్ సినిమాలను తెలుగులో తీసి హిట్ కొట్టిన భీమనేని శ్రీనివాసరావు రవితేజతో 'దొంగోడు', అల్లరి నరేష్ తో 'సుదిగాడు' సినిమాలు తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.

'చిత్రం, నువ్వు నేను' సినిమాల ఘనవిజయం తర్వాత దర్శకుడు తేజ సొంతంగా బ్యానర్ ను స్థాపించి 'జయం, ధైర్యం, జై, సంబరం' తదితర సినిమాలను అందించాడు.

- ఇలా ఎంతో మంది దర్శకులు అప్పుడు, ఇప్పుడు నిర్మాతలుగా మారి ఎన్నో సినిమాలు నిర్మించారు.


కె. సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
anti sentiment