Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cini churaka by cartoonist bannu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrudayam

అంజనా ప్రొడక్షన్స్ అధినేత శ్రీ కె. నాగబాబు
'అన్నయ్య' కి తమ్ముడు, 'తమ్ముడు' కి అన్నయ్య - అర్ధం కాలేదా - 'అన్నయ్య' సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడు, 'తమ్ముడు' సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య శ్రీ కె. నాగబాబు. 'త్రినేత్రుడు', 'రుద్రవీణ', 'ముగ్గురు మొనగాళ్ళు' వంటి భారీ చిత్రాల్ని అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన నిర్మాత, నటుడు శ్రీ నాగబాబు. ఇక్కడి వరకూ అందరికీ తెలిసిందే. వ్యక్తిగా మహా సౌమ్యుడు. మంచి వక్త. ఏ విషయంమీదైనా అనర్గళంగా, ఆలోచితంగా, మాట్లాడగలిగినవాడు - మంచి హాస్యప్రియుడు, స్నేహశీలి - ఇది ఆయనతో పరిచయమున్న వారికి తెలిసిన విషయం. ఈ రెండూ కాక నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. 'బావగారూ బాగున్నారా' సినిమాకి జయంత్ గారి దగ్గర అసోసియేట్ దర్శకుడిగా అంజనాప్రొడక్షన్స్ లో వర్క్ చేశాన్నేను. నిర్మాత, సహాయ దర్శకుల తేడా మాటల్లో గానీ, చేతల్లో గానీ చూపించకుండా సొంత కుటుంబ సభ్యుడిలా ట్రీట్ చేసారు నాగబాబు గారు. నన్ను, నాతోపాటు వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ ని, స్క్రిప్ట్ లో సహకరించిన సాయిబాలాజీ గారిని, మరో అసోసియేట్ శ్రీనివాస్ గారిని, కో - డైరెక్టర్ జ్యోతి గారిని, షూటింగ్ సమయంలో నేను పరిచయం చేసిన మిత్రుడు, రచయిత రాజసింహని అందరినీ అంతే అభిమానంగా చూశారాయన.

యూనిట్ వందమందిపైన ఉంటే నాగబాబు గారి ఎకౌంట్ లో లంచ్, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ లకి ఆయన ఆహ్వానించే స్నేహితుల సంఖ్య రోజూ పదిహేనుమందికి పైనే ఉండేది. చివరికి ఒకరోజు చిరంజీవి గారే అన్నారు "నువ్వో చిన్న సైజు కృష్ణదేవరాయులులాగా, భోజరాజులాగ రోజూ పది, పదిహేనుమంది వచ్చి కబుర్లు చెబుతుంటే, నువ్వు పగలబడి నవ్వుతూ - ఏంట్రా ఇది? షూటింగ్ సంగతి చూడు" అని. ఆయన దానిక్కూడా నవ్వి, "నా ఫ్రెండ్స్ నిన్ను చూడ్డానికి వస్తానంటే, మన ఓన్ ప్రొడక్షన్ లో కూడా రావద్దని ఎలా చెప్పనన్నయ్యా? నీదాకా రాకుండా నేను కూర్చోబెట్టి ఎంగేజ్ చేస్తున్నాను తెల్సా?" అన్నారు.

ఆ అన్నదమ్ములు ఏనాడూ ఒక అతి సంపన్న కుటుంబంలో అన్నదమ్ముల్లా మాట్లాడుకోరు. మామూలు మధ్యతరగతి కుటుంబంలో అన్నదమ్ముల్లా మాట్లాడుకుంటారు. తేడా ఏమిటంటారా? విషయాన్ని సూటిగా, ప్రొఫెషనల్ గా మాట్లాడుకోవడానికి, సరదాగా, అభిమానంగా మాట్లాడుకోవడానికి ఉన్న తేడా - వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఎంత ఎదిగినా వాళ్ల మధ్య దూరాన్ని పెరగనివ్వలేదు, చిన్నప్పటి అభిమానాన్ని కోల్పోలేదు. అందుకు వీళ్ళ తల్లిదండ్రుల్ని అభినందించాలి.

"బావగారూ బాగున్నారా?" కి ముందే సురేష్ ప్రొడక్షన్స్ లో 'ప్రేమించుకుందాం రా" చిత్రానికి వర్క్ చేసినందున, అంజనా ప్రొడక్షన్స్ కి రాగానే నాగబాబుగారితో సాన్నిహిత్యం ఏర్పడ్డాక, నిర్మాణంలో ప్రతి విషయానికీ సురేష్ బాబుని ఉదాహరిస్తూ ఇలా చేయాలి, అలా చేయాలి అంటుండేవాడిని. ఇంకొకరెవరైనా అయితే, అలా కంపేర్ చేసినందుకు కొట్టేవారు. నాగబాబు మాత్రం ఓపిగ్గా ఆయనెందకలా ఆలోచించారోఎక్స్ ప్లెయిన్ చేసేవారు. నిజానికి నాకు చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేకపోయినా సరే.

ఆ కుటుంబానికి కృష్ణుడిలాంటి బావగారు అల్లు ఆరవింద్ గారు, సౌమ్యంగా కుటుంబ పెద్దగా ధర్మరాజులాగ చిరంజీవిగారు, ఆవేశంగా, ఆహార్యంలో కూడా బలీయంగా భీముడిలా నాగాబాబుగారు, పౌరుషంగా, ఎక్కుపెట్టిన బాణంలా, అర్జునుడిలా పవన్ కళ్యాణ్ - ఇలా అనిపించేది నాకు వీళ్ళ నలుగురినీ చూస్తుంటే - వీళ్ళందరికీ ఒక్కటే కామన్ గుణం ఏమిటంటే, నవ్వడం, నవ్వించడం, విషయం ఎంత పెద్దదైనా, సీరియస్ దైనా, దాన్ని జోక్ గా కన్వర్ట్ చేసి చుట్టూ పనిచేసేవాళ్ళని హాయిగా ఉంచడం.

నాగబాబుగారి వాళ్ళ దూరపు బంధువు త్రినాధ్ గారు అప్పుడే చేరారు ప్రొడక్షన్ లో. ఇప్పటికీ ఆయనతోనే ఉన్నారు. 'బావగారూ బాగున్నారా' టైటిల్ పెట్టడానికి ముందు త్రినాధ్ గారు 'మహీధరుడు' అని టైటిల్ పెడితే బావుంటుందన్నారు. అప్పుడు నాగబాబుగారు నవ్విన నవ్వు నాకింకా గుర్తుంది.

'బావగారూ బాగున్నారా' సినిమా రష్ ఎడిటింగ్ రూమ్ లో ఎన్నిసార్లు చూసినా నాగబాబుగారు అప్పుడే మొదటిసారి చూసినట్టు బిగ్గరగా నవ్వుతుండేవారు. ముఖ్యంగా బ్రహ్మానందంగారితో చిరంజీవి గారి సీన్స్, సెకండాఫ్ లో శ్రీహరి గారి, ఎమ్మెస్ నారాయణ గారి, కోట గారి సీన్స్, ఇంటర్వెల్ సీన్ లో చిరంజీవిగారి రియాక్షన్ - పదే పదే నవ్వుతుండేవారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసే ఏ నిర్మాతా అంత హాయిగా, స్వచ్చంగా, ఒక ప్రేక్షకుడిలా రష్ చూసి నవ్వడం నేనింతవరకూ చూడలేదు ఆయన్ని తప్ప. ఇప్పుడు 'జబర్దస్త్' చూస్తుంటే తెలుస్తోంది ఆయన ఏమీ మారలేదు - అంతే హాయిగా నవ్వుతున్నారని. చాలామంది అనుకుంటారు - అల్లు ఆరవింద్ గారిలాంటి సీనియర్ ప్రొడ్యూసర్ గైడెన్స్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ గార్ల వంటి సూపర్ స్టార్ల డేట్స్ ఈజీగా ఉన్నవాడు హాయిగా నవ్వుకోడా అని - కానీ, నాకు తెలిసి చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి మెగాహీరోల తోడబుట్టిన వ్యక్తికి ఆనందంకన్నా అడుగడుగునా వాళ్ల ఇమేజి తనవల్ల డ్యామేజ్ కాకూడదన్న టెన్షనే చాలా ఎక్కువ ఉంటుంది. ఆయన పొజిషన్ ఇంటా, బయటా కూడా ఆడకత్తెరలో పోకచెక్కే. దర్శకుడితో కన్నా, ఆర్టిస్టులతో కన్నా నాగబాబుగారికి రచయితలతో గడపడం ఎక్కువ ఇష్టం. అందుకే - ఆయన సినిమాలకి యండమూరి వీరేంద్రనాథ్ గారిని, సత్యానంద్ గారిని, పరుచూరి బ్రదర్స్ ని, చింతపల్లి రమణని, తదితరులని పెట్టుకుని ఉండేవారాయన. పరుచూరి వెంకటేశ్వరరావుగారు, నువ్వు మీ నాన్నగారి పేరు గానీ, నీ భార్య పేరు గానీ పెట్టు అని చెప్తే వెంటనే వాళ్ల నాన్నగారి పేరు సమర్పకుడిగా వేసేశారాయన.

స్టోరీ సిట్టింగ్స్ కి వెళ్తే ముగ్గురన్నదమ్ములూ స్వయంగా టిఫిన్ వడ్డించేవారు. వాళ్ల మర్యాదలు, అభిమానం చూశాక అనిపించేది - వీళ్ళకి ఇన్ని కోట్లమంది అభిమానులు ఉండడం చాలా సబబే అని.

ఎటువంటి కృత్రిమమైన ప్రయత్నం లేకుండా ఎదుటివ్యక్తిని ఆకట్టుకోవడం అన్నది చాలా కష్టమైన, అరుదైన విద్య - అది ఈ అన్నదమ్ములకి చాలా సహజ లక్షణం. ఇప్పటికీ నాగబాబుగారు, నాగబాబుగారి పిల్లలు, వారి భార్య అంతే సింపుల్ గా ఉంటారు. అంతే సరదాగా పలకరిస్తారు. డబ్బు వల్ల, పేరువల్ల, హోదావల్ల, ఏమాత్రం హిపోక్రసీ అంటుకోని మామూలు సహజమైన, స్వచ్చమైన మనుషులు ఆ కుటుంబంలోని వారందరూ - ఇప్పటి స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో సహా అలా ఉండడం చాలా కష్టం.

"ఏమీలేని ఆకు ఎగిరెగిరిపడుతుంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది", "నిండుకుండ తొణకదు" లాంటి పాత సామెతలకి కొత్త నిర్వచనాలు వీళ్లు.

నటనతో పైకొచ్చారు కాబట్టి నిర్మాణంలో ఎక్కువ సక్సెస్ కాలేకపోవచ్చు. కారణం, ఏమాత్రం వ్యాపార దృక్పథం లేకపోవడం - అందరినీ ఆత్మీయులుగానే నమ్మడం కావచ్చు. అయినా నాగబాబు కష్టపడి పనిచేస్తూనే ఉంటాడు. ఎప్పుడూ ఖాళీగా కూర్చోకుండా - ఎవ్వరిపైనా ఆధారపడకుండా - నేను పనిచేసిన నిర్మాతలందరూ పెద్ద నిర్మాతలు, మేదావులైన వ్యాపారవేత్తలే. నాగబాబు మాత్రం నిర్మాతగా కంటే వ్యక్తిగా నేనెక్కువ అభిమానించే నిర్మాత.

ఆయన సినిమా నిర్మిస్తారో, నిర్మించరో నాకు తెలీదు కానీ, మనుషుల మధ్య మంచి బాంధవ్యాల్ని నిర్మిస్తారు. నవ్వులు పంచే ఆహ్లాదాన్ని నిర్మిస్తారు. వాటితోనే ఆయన నటించకుండా జీవిస్తారు. కీపిటప్ సార్... వుయ్ ఆర్ ఆల్ దేర్ ఫర్ యూ - ఫరెవర్ -

(వచ్చేవారం - వైజయంతీ మూవీస్ అధినేత శ్రీ సి. అశ్వనీదత్ గారితో నా పరిచయం...)

                                                                                                                                                       మీ
                                                                                                                                                వి.ఎన్. ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
directors became producers