Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue339/848/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి)...‘ఇదేంప్రశ్న!’ అన్నట్లు నావైపోసారి చూసి, “తరువాతా… తరువాతేముంది? ప్రేమించుకుంటాం… పెద్దలొప్పుకుంటే పెళ్ళి చేసుకుంటాం…’’ తేలికగా అన్నాడు వెంకటేష్.

అతడు ‘ పెద్దలొప్పుకుంటే ‘ అన్నాడు కాని, ‘పెద్దలనొప్పించి’ అని అనలేదు. ఆ పాయింట్ నేను బాగానే పట్టేశా.

“ఒకవేళ మన పెద్దలు ఒప్పుకోకపోతే!?’’

నా మాటలకి ఖంగు తిన్నట్లుగా చూశాడు వెంకటేష్. నేనలా అడుగుతానని అతడూహించలేదు. సమాధానం చెప్పలేకో ఏమో… బొమ్మలా నిలుచిండిపోయాడు.

కొద్ది క్షణాల తరువాత “ఒప్పుకోకపోతే ఏంచేస్తాం? విడిపోతాం.’’ అన్నాడు బలవంతాన నోరు పెగల్చుకుని.

“పెద్దలప్పుకోకపోతేనేం… వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. వీలు కాకపోతే ఎదిరించి పెళ్ళి చేసుకుందాం.’’ అని అతడంటాడని నేనెస్సలెస్పెక్ట్ చేయలేదు. వాడి దృష్టిలో ప్రేమంటే  టైమ్ పాస్ కోసం ఉపయోగించే కాలక్షేపం బఠాణీలాంటిదన్న మాట.“ఆపాటిదానికి ప్రేమించుకోవడం దేనికి? హాయిగా ఎవరిమట్టుకు వారుంటే సరిపోతుంది కదా!’’ అతడినే తదేకంగా గమనిస్తూ అడిగాను.

నా మాటతీరుకి బిత్తరపోయాడతడు. “నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు ముక్తా…మన పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరని నువ్వు ముందే ఎందుకనుకుంటున్నావు? ఫస్టైతే మనం ప్రేమించుకోవాలి . అప్పుడు కదా…పెళ్ళిసంగతి!’’ అన్నాడు నసుగుతూ.

“సరే…ప్రేమించుకుందాం. అసలు… ప్రేమించుకోవడమంటే ఏమిటి?’’ సూటిగా అడిగాను.వెంకటేష్ అయోమయంగా చూస్తూ” ప్రేమించు కోవడం  అంటే ఇష్టపడడం. ఒకరి అభిరుచులింకొకరు తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకోవడం.’’ చెప్పాడు.“బాగుంది. ఒకరి అభిరుచులు ఇంకొకరు తెలుసుకుని ప్రేమించుకుంటాం. చెట్లంట- పుట్లంట జాలీగా తిరుగుతాం. ఒకే కూల్ డ్రింక్ లోరెండు స్ట్రాలు వేసుకుని కళ్లలో కళ్ళు పెట్టి చూసుకుంటూ తాగుతాం. కాలేజీకి డుమ్మాకొట్టీ , క్లాసులెగ్గొట్టీ నీతో కలిసి సినిమాలకీ, షికార్లకీ తిరుగుతాను నేను. కొన్నాళ్ళు తిరిగాక ‘ మేం ప్రేమించుకున్నాం. మాకు పెళ్ళి చేయండి’ అని మన అమ్మ-నాన్నలని అడుగుతాం. వాళ్ళొప్పుకుంటే ఫరవాలేదు. లేకపోతే… నా సంగతేంటి?’’

‘ ఐ లవ్ యు’ అని ఒక్క మాట చెప్పిన నేరానికి…పేద్ద లెక్చరిచ్చి…ఇలా ఝాడించేస్తానని వెంకటేష్ అస్సలూహించి ఉండడు. దిమ్మెరపోయి అలా… నిలబడిపోయాడు కొయ్యలా.

“నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నావు ముక్తా… అలా ఏం జరగదు. ‘’ అన్నాడు నన్నూరడిస్తున్నట్లుగా.

“జరిగితే?’’ మాట్లాడలేదు వెంకటేష్.

“చూడు వెంకటేష్… చాలా ప్రేమకథల పర్యవసానం ఇదే. నీకు నాకు ఆస్తులు, కులాలు, హోదాలు వీటన్నింటిలో నక్కకి- నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. వీటిని అధిగమించి, పెద్దల మనసులు నొప్పించి మనం పెళ్ళిపీటలెక్కడం అసంభవం. నాతో ప్రేమాయణం జరిపినట్లు లోకమంతా ‘టాంటాం’ అయిపోయిన తరువాత … వీటిల్లో ఏకారణం చేతైనా మనకి పెళ్ళి కాకపోతే!?

మగవాడివి… నీకు ఫరవాలేదు. కాని, ఆడపిల్లని. అల్లరిపాలైతే నాగతేంటి? నన్నెవరు పెళ్ళి చేసుకుంటారు?” నా మాటలు అతడిని ఆలోచనలో పడేశాయేమో…మౌనంగా వింటున్నాడు వెంకటేష్.

“పెళ్ళికి దారి తీయని ప్రేమ మనకి అవసరమంటావా? ఈ ప్రేమ-దోమ వీటిమీద నాకు నమ్మకంలేదు. మనలని కని, పెంచి మనమీదే ఎన్నో ఆశలు పెంచుకుని జీవిస్తున్నమన తల్లిదండ్రులని ప్రేమ పేరుతో నొప్పించి, మానసికంగా హింసిచడం న్యాయంకాదు.నేనా పని చేయలేను. నువ్వుకూడా అలా చేయద్దు. హాయిగా మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకుని నీ భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించు.’ నేను చెప్పాలనుకు న్నది  చెప్పేసి, అతడిని ఆ చీకట్లో వదిలిపెట్టి చకచక ముందుకి నడిచాను.అమ్మ-నాన్నలని బాధపెట్టే పని నేనెన్నటికీ చేయను. చేయలేను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నా కత్యంత ఇష్టులైన వారు వారే కాబట్టి. అందులోనూ… నాన్న ఇప్పటికే రెండుసార్లు సమ్మెటపోట్లలాంటి రెండు దెబ్బలు తిని ఉన్నారు.

ఆ తరంలో నాన్న చిన్నచెల్లెలు సావిత్రి ఆయన చూసిన సంబంధాన్ని కాదని, ఆయనకిష్టంలేని మా దగ్గర బంధువుల కుర్రాడిని ప్రేమవివాహం చేసుకుని బయటకు వెళ్ళిపోయింది. కాలం ఆ గాయానికి మలాము పూసి ఆయనను తేరుకునేలా చేసింది అనుకునేంతలో,
ఆఫీసులో తనతో పాటుగా పనిచేస్తున్న సహోద్యోగిని మతాంతర వివాహం చేసుకుని, కొద్దిగా కోలుకుంటున్న ఆయన గుండెలమీద మరి కొంచెం బలమైన దెబ్బ కొట్టి గడపదాటింది చిన్నక్క సాత్విక.

చిన్నక్క క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నాక నాన్న మానసికంగా మరికాస్త డీలా పడిపోయారు.ఆక్షణమే… నేను గట్టిగా  నిర్ణయించుకున్నాను… అమ్మ-నాన్నలని బాధించే పని నేనెన్నటికీ చేయకూడదని. వాళ్ళు ఎవరిని చూపిస్తే వాడిని… ఆఖరుకి వాడికి ఏ అవలక్షణాలున్నా సరే…వాడినే చేసుకుని, వారికి సంతోషాన్ని కలుగజేయాలని  దృఢంగా తీర్మానించుకున్నాను. నాతో ప్రేమకబుర్లు వల్లెవేసిన వెంకటేష్ ఆరునెలలు తిరగకుండానే ఐదు లక్షల కట్నాన్ని, ఓ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగాన్ని సారెగా తీసుకొచ్చిన ఓ అమ్మాయిని ఘనంగా వివాహమాడాడు.
ఆ పెళ్ళికి మా ఇంట్లోని వాళ్లతో కలిసి వెళ్ళాను నేను. భార్యను నా దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశాడు  వెంకటేష్ గొప్పగా.

“థాంక్స్ ముక్తా… ప్రేమలో మునిగి తేలడం కన్నా, జీవితంలో గెలవడమే ముఖ్యమని నాకు తెలియజెప్పావు. నువ్వు కాని నా ప్రేమని ఆమోదించి ఉంటే నీకన్నా అందగత్తె అయిన భార్యని, మంచి ఉద్యోగాన్ని, ఐదు లకారాలని మిస్ అయి ఉండేవాడిని.’’ చెప్పాడు భార్య వినకుండా. నాకు నవ్వొచ్చింది. అతడి ముఖంమీదే ఫక్కున నవ్వేశాను.

“భేష్ రా బాబూ… అసలైన అవకాశవాదివి. ఒకవేళ నిన్ను ప్రేమిస్తున్నానని నేను కమిట్ అయినా జరిగేది ఇదే… కాకపోతే నేను, నా వాళ్ళు చాలా నష్టపోయి ఉండేవాళ్లం. మా పరువు గంగలో కలిసి ఉండేది. ‘అరిటాకు- ముల్లు’ సామెత మరోసారి ఋజువై ఉండేది.’’ అనుకున్నాను కసిగా. అందుకే… అందుకే… నాకీ ప్రేమల మీద నమ్మకం కుదరనిది.అయితే… స్వఛ్ఛమైన ప్రేమ అమృతంకన్నా తీయనిది అని, మకరందం కన్నా మధురమైనదని అని నాకప్పుడు తెలియదు.  అసలు -సిసలు ప్రేమలోని నిజాయితీ ముందు ప్రపంచం మొత్తం తలవంచాల్సిందేనని, ప్రేమే దైవమని, ప్రేమ అమరమని, ప్రేమంటే త్యాగమని , ప్రేమంటే నమ్మకమని నేనెప్పుడూ అనుకోలేదు.
   హృదయాంతరాళాలను వెలిగించే దివ్యజ్యోతి ప్రేమ అని నాకు ఆ క్షణంలో  తెలియలేదు.

‘ప్రేమా!?’ అదెలా ఉంటుంది? దానికి భౌతికమైన రూపం అంటూ ఉండదు కదా! రంగు, రుచి, వాసన లాంటి లక్షణాలేమీ లేని దాని ఉనికి మనకి ఎలా తెలుస్తుంది?‘ప్రే…మ…’ ఈ రెండక్షరాల పదానికి విశ్వమంతా దాసోహమంటుందెందుకు? నిజంగా ప్రేమకంతటి శక్తి ఉందా!?
ఇలా… ఎన్నో సందేహాలు మాత్రం నన్ను పట్టి పీడించేవి. ప్రేమంటే…విశ్వ జనీనమైన ఒక మధురభావన. అసలు… ప్రేమంటే…స్త్రీ- పురుషుల మధ్యన నెలకొన్న ఆకర్షణే కానక్కర లేదని నాకు చాలా ఆలస్యంగా అర్ధమైంది.స్ఫటికం తన అనేక ముఖాల ద్వారా కాంతికిరణాలను వెదజల్లినట్లే… ప్రేమ ఎన్నో కోణాల ద్వారా ప్రకటితమై తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటుంది.

ప్రేమకు ఎన్నో రూపాలు. తల్లి బిడ్డలకి అందించే వాత్సల్యమూ ప్రేమే…అన్న చెల్లెలికి పంచిచ్చే అనురాగమూ ప్రేమే.తాత –మనవల మధ్య, పాలు- నీళ్లలా కలిసిపోయి అనురాగబంధంతో మమేకమయ్యే భార్యాభర్తల నడుమ, ఒకరి గుండెలోతులొంకొకరు తడిమి చూసుకునే ఇద్దరు స్నేహితుల మధ్యన, ఆప్యాయతతో పెనవేసుకు పోయిన అక్కచెల్లెళ్ళ నడుమ…  తాను జన్మించిన ఈనేలకి- మనిషికి మధ్యన …ఇలా  సృష్టిలో ఎవరి మధ్యనైనా ఉత్పన్నమయ్యే మానసిక బంధమే ప్రేమ.

ఆ ప్రేమే లేకుంటే ఆనాడు… నిస్వార్ధంగా దీనజనులను తన అక్కున చేర్చుకుని ఓదార్పు నందించిన ఆ మదర్’ సేవలు మన దేశానికి అందుండేవి కావు. ఆ దేశప్రేమే లేకుంటే… అవినీతికి వ్యతిరేకంగా అన్నహజారే’ తన నిరసన గళం వినిపించి ఉండేవారే కాదు. ఈ సత్యం… చా…లా…  ఆలస్యంగా అవగతమైంది నాకు. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్