Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue340/849/telugu-serials/ nee- perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి)...ఆ రోజు సాయంత్రం క్లాసులు పూర్తవ్వగానే త్వరగా ఇంటికి చేరాను. ఆ రోజు ట్యూషన్ కి సెలవు. వీధిగుమ్మం మెట్లు ఎక్కుతూ ఉండగానే వంటింట్లోనుంచి పకోడీలు వేగుతున్న వాసన గుమ్మెత్తించింది నన్ను. గబగబ పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి అడుగుపెట్టాను పకోడీల వాసనకి నోట్లో నీళ్ళు ఊరుతూ ఉండగా. బయట నుంచి రాగానే కాళ్ళు-చేతులు కడుక్కోకపోతే అమ్మ వంటింటి ముఖం కూడా చూడనివ్వదెవ్వరినీ కూడా.నేను వంటింటి ముందుకి వెళ్ళేసరికే పెద్దక్క కూర్చుని ఉందక్కడ. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది.

“హాయ్ అక్కా…చాలాసేపైందా వచ్చి?’’ అక్కపక్కనే కూర్చుంటూ అడిగాను. అక్క ప్రశాంతంగా చూస్తూ “లేదే… ఇప్పుడే… ఓ ఐదు నిముషాలైంది వచ్చి.’’ అంది.వంటిటి ముందున్న వసారాలో కూర్చుని, పెరట్లోనుంచి ధారాళంగా వీస్తున్న గాలి చల్లదన్నాన్ని అనుభవిస్తూ, ఒత్తులు చేసుకుంటున్న బామ్మ నన్ను చూస్తూనే “ ఇదుగో శకుంతలా…పకోడీలు మరీ వేగకుండా మెత్తగానే తీసేయి. ముక్తకి మెత్తని పకోడీ అంటేనే ఇష్టం’’ చెప్పింది.

బామ్మ వాత్సల్యంతోనే నా కడుపు సగం నిండిపోయింది.అమ్మ మూతి మూడువంకర్లు తిప్పింది. “అవునులెండి… మీ ఒక్కరికే దానిమీద ప్రేముంది మరి! నేనేమన్నా దాన్ని కన్నానా…పెట్టానా!?’’ కుడిచేతిని అట్లకాడ సహితంగా తిప్పుతూ అంది అమ్మ.

“అబ్బబ్బ అమ్మా… ప్రతీదానికి అలా పెడర్ధాలు తీస్తావేందుకు? ఆవిడన్నదానిలో తప్పేముంది? అలా విరుచుకు పడకపోతే ‘ అలాగే’ అనేస్తే  నీ సొమ్మేం పోతుంది చెప్పు…’’విసుగ్గా అంది పెద్దక్క.

బామ్మ మెటికలు విరుస్తూ “ అదీ… అలా పెట్టు గడ్డి….ఏదో పిల్లదానిమీద ప్రేమకొద్దీ చెప్తే పేద్ద రాధ్ధాంతం చేస్తోంది.’’ అంది నాపైన గల ప్రేమనంతా తన మాటలలో రంగరించి.

అమ్మ మళ్లీ ఏదో అనడానికి నోరు తెరవబోయి, పెద్దక్క సైగ చేయడంతో ఆగిపోయింది. రాబోయే పెను తుఫాను తన దిశను మార్చుకున్నట్లు గా  తోచి, నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాను. పకోడీలు మెత్తగా వేయించి తీసి, ప్లేట్లోపెట్టి నాకిచ్చింది అమ్మ.    అందుకే దినేష్ గాడు నన్ను “పళ్ళూడిపోయిన బోసినోటి ముసలమ్మవంటూ’ హేళన చేసి, నా చేత చీవాట్లు తింటూంటాడు. మా ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చలేక అమ్మ సతమతమౌతూ ఉంటుంది.

“అవునక్కా… హారతి, ఆదర్శ్ లేరీ?’’పకోడీ నములుతూ అడిగాను.

“హారతి ట్యూషన్ కి వెళ్లింది. ఆదర్శ్ ఆటలకి వెళ్లాడు… మీ బావగారు వర్క్ ఎక్కువగా ఉంది లేటౌతుంది అన్నారు. నాకు కాస్త బజారుపని ఉంది… నువ్వు సాయం వస్తావేమోనని అడగడానికి వచ్చాను.’’ చెప్పింది అక్క ఎవరో తరుముకొస్తున్నట్లుగా. తినడం ముగించి చేతులు కడుక్కుంటూ “ అలాగే అక్కా… ఎటూ ఈ రోజు ట్యూషన్ లేదు…’’ అన్నాను.

బామ్మ ఒత్తులు చేయడం ముగించి, చిన్న ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి దేముడిగదిలో ఉంచుతూ “ఒసేయ్ కార్తికా… నేనూ మీతో వస్తానే…’’అంది.
అమ్మ ఒక్క ఉదుటున వంటగదిలోనుంచి బయటకి వచ్చి “మీరా? మీరెక్కడికి మధ్యలో?’’ అడిగింది దూకుడుగా.

“నీదంతా కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్లుగా తోచే వ్యవహారమేనే శకుంతలా…ఈ రోజు శివాలయానికి ఎవరో స్వాములవారు వస్తున్నారట…  వీళ్లు వెళ్లేది ఆ తోవంటే కదా… దింపేసి పోతారనీ…’’ బామ్మ చెప్పింది అంతకన్న ధాటీగా. వీళ్లు పూర్వ జన్మలో పాము- ముంగిసలై ఉంటారు. ఆ జన్మలోని జాతివైరపు లక్షణాల అవశేషాలేవో మిగిలిపోయి, ఈ జన్మలో ఇలా కాట్లాడుకుంటున్నారు.మేము తయారైపోయి నాన్నగారికి చెప్పేసి బయలుదేరాం. మా సందు మలుపు తిరిగి మెయిన రోడ్ మీదకు మళ్లాం. అక్క ఆటో పిలిచింది. ముగ్గురం సర్దుకుని కూర్చున్నాం ఆటోలోకెక్కి.

“హోటల్ బాలాజీ ఇంటర్నేషనల్’ కి పోనీ…’’ చెప్పింది అక్క.

నేను అయోమయంగా చూశాను. నాతో బజారుకని చెప్పింది కదా! ఇప్పుడు హోటల్ అంటోందేమిటి!?

“బజారన్నావు కదా!?’’ విస్మయంగా చూశాను అక్కవైపు.  అక్క మాట్లాడలేదు.

“ఏంటక్కా… బదులీయకుండా అలా నీళ్ళు నములుతావేం?’’

“అదీ… అదీ…” మాటలకోసం తడుముకుంది పెద్దక్క.బామ్మ అక్కని వారిస్తూ “ నువ్వాగవే… నేను చెబుతానుగా…మరేమీ లేదు ముక్తమ్మా …   మీ చిన్నక్క ఏదో ఆఫీసు పని మీద ఊళ్ళోకొచ్చిందట…. వీలుంటే వచ్చి కలవమని మీ పెద్దక్కకి ఫోన్ చేసి చెప్పిందట. మీ పెద్దక్క బయలుదేరిందందుకే. నాకు కూడా దాన్ని చూడాలనిపించింది. అందుకనీ…’’ చెప్పింది వివరంగా.నా మనసులో సన్నని మంట మొదలైంది. నాన్నగారు మానసికంగా డీలాపడిపోయి, కుదేలైపోవడానికి కారణం చిన్నక్క కాదూ! మతం కానివాడిని పెళ్ళి చేసుకుని, నిర్దాక్షిణ్యంగా ఆయన గుండెల్లో గునపాలు దించి తన సుఖం తాను చూసుకుంది.

“ఆటో ఆపించేయి… నేను దిగిపోతాను.’’ నిరసనగా ముఖం పక్కకు తిప్పుకున్నాను.

“ఎంతైనా అది మన తోడబుట్టినదే… నేనెంతో అదీ అంతే నీకూ…’’ బతిమలాడడం మొదలెట్టింది పెద్దక్క.

“అలా ఎలా అవుతుందక్కా? నీకు దానికి తేడా లేదూ! అది నాన్నగారిని ఎంతగా బాధపెట్టిందో మరచిపోయావా?’’ నా కడుపు రగిలిపోతోంది చిన్నక్కని తలచుకుంటూంటే.

“నాన్నగారూ… ఇతడు నా కొలీగ్…మీకు పరిచయం చేయాలని తీసుకొచ్చాను.’’ అంటూ అది జోసెఫ్ ని ఇంటికి తీసుకొచ్చిననాడు నాన్నగారు అతడిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. 

కాని, కాస్సేపటి తరువాత చిన్నక్క తన నిర్ణయం వినిపించగానే అందరం అవాక్కయ్యాము.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్