Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు - భమిడిపాటి ఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ వారం ( 18/10 – 24/10) మహానుభావులు

జయంతులు

అక్టోబర్ 18

శ్రీ వంగోలు వెంకటరంగయ్య :  వీరు అక్టోబర్ 18, 1867 న నెల్లూరు లో జన్మించారు. ఆంధ్రవిద్యావయో వృద్ధులలో గణ్యులు. వీరు బహుభాషాకోవిదులు. ఆంధ్రాంగ్ల గీర్వాణములయందును, కన్నడము, తమిళము, హిందీ, ఉర్దూ, పారసీక భాషలయందు వీరు పాండిత్యము సంపాదించారు. వీరు వ్రాసిన ప్రసిద్ధ వ్యాసములు - రామాయణము లోని వానరులు నరులు కారా? నిజముగా వానరులే అగుదురా? అను విషయములను గూర్చియు, ప్రాచీన కాలమున సంస్కృతము దేశభాషగా నుండెనా? ఆంధ్రులెవరు? అను సమస్యలనుద్ధేశించియు, ఆనందరంగరాట్చందమును గూర్చియు, శ్రీ పంతులు గారు వ్రాసిన వ్యాసములు అమూల్యములు..

అక్టోబర్ 19

శ్రీ ఆచంట సాంఖ్యాయన శర్మ :  వీరు అక్టోబర్ 19, 1864 న విశాఖపట్నం లో జన్మించారు. తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. తన రచనలలో విస్తృతంగా విజ్ఞానశాస్త్ర విషయాలకు ప్రాచుర్యం కల్పించారు.

అక్టోబర్ 21

శ్రీ రూపనగుడి నారాయణరావు : వీరు అక్టోబర్ 21, 1881 న బళ్ళారి లో జన్మించారు. ప్రముఖ సాహితీ శిల్పి, నాటక కర్త. ఎన్నో నాటకాలు, అనువాదాలూ, పద్యకృతులూ రచించిన ఘనత వీరిది.

అక్టోబర్ 22

శ్రీ కొమరం భీమ్  :  వీరు అక్టోబర్ 22, 1901 న సంకేపల్లి లో జన్మించారు. హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు..  నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడారు. వీరు అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ యొక్క సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నారు.

అక్టోబర్ 24

శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు  : వీరు అక్టోబర్ 24, 1927 న ఇందుపల్లి లో జన్మించారు. రచయిత, అనువాదకుడు, సంస్కృత పండితుడు. సంస్కృత కావ్యాలు, నాటకాలు, శాస్త్రాలు వంటివి తెలుగులోకి అనువదించి వ్యాఖ్యానించారు. తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో 200లకు పైగా పుస్తకాలను వెలువరించారు.

వర్ధంతులు

అక్టోబర్ 18

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ : “ కవి సామ్రాట్ “ గా ప్రసిధ్ధి చెందారు.  తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. వీరు అక్టోబర్ 18, 1976 న స్వర్గస్థులయారు.

2. శ్రీ రావూరి భరద్వాజ :  తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నారు. గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు రచయిత.  37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించారు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. [4] సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన. 2012 లో వీరికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వీరు అక్టోబర్ 18, 2013 న స్వర్గస్థులయారు.

అక్టోబర్ 19

శ్రీ మీసరగండ విశ్వరూపాచారి  : “ విద్వాన్ విశ్వం “ గా ప్రసిధ్ధి చెందారు.  విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందినవాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు.  కథాసరిత్సాగరాన్ని 12 సంపుటాలుగా తెనుగించారు. "చందమామ"లో ద్విపద కావ్యం రూపంలో వ్రాసిన పంచతంత్ర కథలను బాపు బొమ్మలతో తి.తి.దే.ప్రచురణగా వెలువరించారు. బ్రహ్మసూత్రాలు శంకరభాష్యం నాలుగు సంపుటాలను, అధర్వణ వేదాన్ని అనువాదం చేసి ప్రచురించారు. వీరు  అక్టోబర్ 19, 1987 న స్వర్గస్థులయారు.

అక్టోబర్ 21

శ్రీ దివాకర్ల వెంకటావధాని :  ప్రముఖ  పరిశోధకుడు, విమర్శకుడు.  వీరు నలభైకి మించి గ్రంథాలను రచించారు.. వాటిలో పద్యకృతులు, వచన రచనలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, టీకాతాత్పర్యాలు ఉన్నాయి. ఖండవల్లి లక్ష్మీరంజనంతో కలిసి ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణకు విపులమైన పీఠిక వ్రాశారు.  వీరు అక్టోబర్ 21, 1986 న స్వర్గస్థులయారు.

అక్టోబర్ 23

శ్రీమతి న్యాపతి కామేశ్వరి :  “ రేడియో అక్కయ్య “ గా ప్రసిధ్ధులు.. ఆల్ ఇండియా రేడియో లో తెలుగులో, బాలలకోసం ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. రేడియోలో ప్రసారమయ్యె స్త్రీల కార్యక్రమాలతో తృప్తిచెందక గ్రామీణ స్త్రీల కోసం 50 మహిళా సంఘాలనూ ప్రారంభిచారట. తన భర్తతో కలసి బాలానంద సంఘాన్ని ఏర్పరిచారు.. వీరు అక్టోబర్ 23, 1980 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
karnataka teerdhayatralu