Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
amavasya rojuna nimdupunnami

ఈ సంచికలో >> కథలు >> జీవితమే ఒక దీపావళి

jeevitame oka deepavali

" అమ్మా దీపావళి పండుగకు  ఇంకా మూడు రోజులే ఉందిగా " ఆరవ తరగతి చదువుచున్న అరవింద్ అడిగాడు 

"అవును అరవింద్ " అంది వసుమతి 

" ఇంకా టపాకాయలు ,కొత్త దుస్తులు తీసుకొని రాలేదు .నాన్న ఎప్పుడు కొంటారు,”

“ నాన్నవ్యాపారస్తుడు ,ఉదయం అంగడి తెరిస్తే రాత్రి దాకా ఉండాలి .ఇది పండుగ సీజన్ ,వ్యాపారం కాస్తా ఎక్కువగా ఉంటుంది .అంగట్లో సహాయానికి పనివాడిని కూడా పెట్టుకొలేదు  .సమయం చూసుకొని నీకు టపాకాయలు, దుస్తులు తెమ్మని నాన్నకు చెబుతాను” అంది వసుమతి

“ఎదురింటి కిరణ్ వాళ్ళనాన్న అప్పుడే తెచ్చేసాడు.  ఇంతకు ముందు బాంబులు కాల్చాడు" అన్నాడు అరవింద్.

"కిరణ్ వాళ్ళ నాన్న ఆఫీస్ ఉద్యోగి, సాయంత్రం తరువాత ఆఫీస్ పని ఉండదు……. నీకు దీపావళి లోపున టపాకాయలు దుస్తులు మీ నాన్న కొనుక్కోనివస్తారు,  నా మాటమీదనమ్మకం లేకుంటే  ఇప్పుడే నాన్నకు  ఫోన్ చేస్తాను, నీవే మాట్లాడు "అంటూ భర్తకు ఫోన్ చేసింది వసుమతి  "హలొ" అంటూ   ముగించేలోపున “వసుమతీ ఈ రోజు కాస్త  ఆలస్యంగా వస్తాను.ఇక ఫోన్ చేయవద్దు "  అంటున్న భర్త మాటల్లో అసహనాన్ని గుర్తించింది.  

“ దీపావళి వ్యాపారం కదా ...సరేలెండి ఫోన్ చెయ్యను. ఒక్క నిమిషం మన అబ్బాయి మీతో ....." అంటూ చెబుతున్న భార్య  మాటలకు అడ్డుపడి  "వసూ...ఇంటికొచ్చాక మాట్లాడుతాను ....ముందు ఫోన్ పెట్టెయ్ " కోపంగా అంటున్నభర్త మాటలు వినగానే "అలాగే నండీ "అంటూ ఫోన్ పెట్టేసింది  వసుమతి .

“అరవింద్,  నాన్న   మరలా మాట్లాడతానన్నారు  నీవు భోజనం చేద్దువురా “ అంటూ వంట గదివైపు వెళ్ళింది వసుమతి . రాత్రి పది గంటలు అయింది .పగలంతా బాగా ఆడుకొనడంతో తండ్రి కోసం ఎదురు ఎదురుచూస్తూ అలాగే నిదురపోయాడు అరవింద్. భర్త రాకపోవడం  సుమతిలో చిన్న అనుమానం కలిగింది .భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది . అర్థం తెలియని కలవరపాటు భయం కలిగినా ఏమీ చేయలేని నిస్సహాయురాలిగా కాలింగ్ బెల్ శబ్దం కోసం ఎదురుచూడసాగింది.

కాలింగ్ బెల్  కొట్టకుండా "వసుమతీ ....వసూ "అంటూ పిలుస్తున్న భర్త గొంతు విని ఆశ్చర్యపోయింది .ఆ పిలుపులో ఏదో క్రొత్త దనం వినిపించింది  ఇంత వరకు పేరుపెట్టి పిలువలేదు. .తలుపులు తెరవగానే భర్త దగ్గరనుండి గప్ మన్నవాసన ..... ఒక్క నిమిషం వసుమతి  మనసు బాధతో మూలిగింది. వెంటనే తేరుకుని భర్తను లోనికి నడిపించుకొంటూ వచ్చి సోఫాపై కూర్చొనపెట్టింది .తన భర్త కు త్రాగుడు  అలవాటుందని కలలో కూడా ఊహించలేదు. నిగ్రహించుకోవాలని ఎంత ప్రయత్నించినా కళ్ళలోంచి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపలేక పోయింది.

భార్య కళ్ళలో కన్నీటిని చూడగానే అంత మత్తులోనూ భార్యపై జాలికలిగింది ." వసూ భాదపడుతున్నావా " అన్నాడు విశ్వనాధ్ 

"మీరు చేసిన పనికి బాద పడకుండాఉంటారా "అంటూ కన్నీళ్లు తుడుచుకొంది.

"వసూ , పొద్దునుండి అంగడిలో పిచ్చాడిలా కూర్చొని కూర్చొని భరించలేక పోయాను.  వ్యాపారం ఇంత మోసంగా ఉంటుందని ఊహించలేదు  ఇంటికొస్తూనే మన అరవింద్ నాన్నా టపాకాయలు కొత్త దుస్తులు ఎప్పుడు కొనిస్తావు అని అడుగుతాడు . ఈ నెల ఇంకా  అంగడి బాడుగ, ఇంటి బాడుగ  కరెంటు బిల్,కట్టలేదు, అని  చెబితే ఎలా అర్థం చేసుకొంటాడు. అందుకే.అరవింద్ నిదురపోయేంతవరకు రాకూడదనుకొని అంగడిలోనే వున్నాను.  ఈ దీపావళి మన జీవితానికి అమావాస్య చీకటిలా ప్రవేశించిందని బాధపడ్డాను..అదే వీధిలో ఉంటున్న    అనుపమా షో రూమ్  అతను నా దగ్గరకు వచ్చి  ఏం బ్రదర్ ఈ రోజు వ్యాపారం పూర్తిగా తగ్గింది కదూ 'అంటూ అడిగాడు " 

“మీరేమి చెప్పారు” 

“అందుకే మనసు బాగోలేక కూర్చున్నాను  అని సమాధానం చెప్పాను”

 “ అతను యేమని చెప్పాడు"అడిగింది వసుమతి 

 "విశ్వనాథ్,  నా పరిస్థితి అంతే .పోయిన సంవత్సరం జరిగిన వ్యాపారంలో పాతిక శాతం కూడా వ్యాపారం జరుగలేదు , . ఈ సెల్ ఫోన్ షాప్ కోసం నేను పెట్టిన మొత్తాన్ని ఈ పోస్ట్ ఆఫీస్ నందు లేక బ్యాంకు నందు వేసిఉన్నా వచ్చే వడ్డీ డబ్బులతో హాయిగా జీవించేవాడిని . . నేనూ మీలాగే బాధలో ఉన్నాను అలా వెళదాం రండి అంటూ బార్ కు తీసుకెళ్లాడు.ఇద్దరం తాగాము . డబ్బులు అతనే ఇచ్చాడు .మందు తాగడం అంటేనే అసహ్యించుకునే నేను ఈ రోజు తాగానంటే నా మనస్సు ఎంతగా గాయపడిందో నీకు తెలీదు వసూ ... ఇంతవరకు నా మనసులో బాధ నీకు చెబితే నీవు బాధపడుతావని చెప్పలేదు. "

“ ఏమిటండీ మీరనేది ..." అర్థం కాక భర్తవైపు అయోమయంగా చూస్తూ అతని తలపై తన చేతితో మృదువుగా నిమరసాగింది 

"వసూ ఈ రోజు ఎంత వ్యాపారం అయిందో తెలుసా ...." బొంగురు గొంతుతో అంటుంటే ఏదో జరిగిందని ఊహించుకొంటరూ భర్తను తన కౌగిలోనికి  తీసుకొని  “చెబితేనేగా తెలిసేది " అంటూ అతనిని మెల్లగా నిమరసాగింది 

 "ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కరూ అంగడిలోనికి  ప్రవేశించలేదు" 

అమాంతం పాతాళానికి కూరుకు పోయినట్లనిపించింది. .మరుక్షణమే ఆయన మత్తులో ఏదో అంటున్నారన్న భావన కలగగానే "మీరు నిజంగా చెబుతున్నారా " అంటూ భయం భయంగా ఏం సమాధానం చెబుతాడా అని భర్త వైపు చూడసాగింది.

" వసూ నేను తాగిన మత్తులో చెప్పడంలేదు .నీ మీద ఒట్టు…  ఈ రోజు ఒక్క పైసా వ్యాపారం జరగలేదు .”వసుమతికి . మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు విలవిల్లాడింది .పోయిన సంవత్సరం  దీపావళికి బాగా వ్యాపారం జరిగిందంటూ అడగకుండానే పట్టుచీర కొనిచ్చిన సంఘటన గుర్తుచేసుకొంటూ  “ఎందుకిలా జరిగింది " అడిగింది 

“ పోయిన సంవత్సరం సంక్రాంతికి మనం చిన్న సెల్ ఫోన్ అంగడి ప్రారంభించాము . మరో మూడునెలలతరువాత ఉగాదికి  అనుపమా  సెల్ ఫోన్ షో రూమ్ ప్రారంభిస్తే మొదట భయపడ్డాను.వాడి షాప్ నందు పనిచేసేవారు ఆరుమంది ఉన్నారు .మన అంగడి చిన్న సెల్ ఫోన్ అంగడి అయినా నాకూ కొంత వరకు బాగానే వ్యాపారం జరగసాగింది .ఇప్పుడు మన అంగడితోపాటు   అనుపమ షో రూమ్ నందు కూడా అమ్మకాలు బాగా తగ్గిపోయింది " 

" ఇలా ఎందుకిలా జరిగింది " అడిగింది 

" సెల్ ఫోన్ లు ఆన్ లైన్ లైన్ లో అమ్మకాలు ప్రారంభించడం వల్ల   అంగడివైపు వెళ్లి కొనే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది   ఆఫర్లు.. డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ లు..అంటూ మన లాంటి వ్యాపారస్తులను నిలువునా ముంచేస్తున్నారు కాయగూరల వ్యాపారం వదులుకొని ఎక్కువ లాభాలు వస్తుందని సెల్ ఫోన్ వ్యాపారం పెట్టి పూర్తిగా సర్వ నాశనం అయ్యాము .....సర్వనాశనం అయ్యాము .....నాశనం "అంటూ అలాగే సోఫాపై అచేతనం పడుకొన్న భర్తను బాధగా చూసింది  .

మనసులోని బాధ ఎవరితోనైనా చెబితే తగ్గడంతో పాటు పరిష్కారం దొరుకుతుంది .వసుమతి తన సమస్యను బెస్ట్ ఫ్రెండ్ కు చెప్పాలని పించింది 

వసుమతిని ఎవరైనా నీ   బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడిగితే  "మా అమ్మ......... నా దృష్టిలో ప్రతి ఆడపిల్లకు కన్న తల్లి బెస్ట్  ఫ్రెండ్ " అని సమాధానం చెబుతుంది  తడుకు పేటలో ఉన్న  అమ్మకు ఫోన్ చేసి జరిగిందంతా వివరించి  చెప్పింది. సుమారు అర్ధగంట సేపు చర్చించి   ఒక నిర్ణయానికి  వచ్చారు. ఉదయం నిదురలేచాక  "మనసు బాగోలేక రాత్రి ....... " అన్నాడు విశ్వనాథ్ 

"ఆ విషయం నేను ఎప్పుడో మరచిపోయాను.  దీపావళి   రోజు నుండి మనం సెల్ ఫోన్ వ్యాపారం బదులు  మనమిద్దరం కలసి కాయగూరల వ్యాపారం చేద్దాము "

"వసుమతీ నీవు ఏమిటి మాట్లాడుతున్నావు .కాయగూరలు అమ్మడానికి స్థలం ముందుగా చూడాలి .  "

"ఎక్కడా చూడనక్కరలేదు మన సెల్ ఫోన్ అంగడి ముందు కాయగూరలు పెట్టుకొని వ్యాపారం చేద్దాము. సెల్ ఫోన్ లు తిరిగి ఆ కంపెనీ కి తిరిగి ఇచ్చివేయడం లేదా అతి తక్కువ లాభానికి అమ్ముదాము .మనకు బాడుగకు ఇచ్చిన యజమానికి అంగీకరిస్తే అక్కడే కాయగూరలు అంగడి పెడదాము అక్కడినుండి కాయగూరల మార్కెట్ కొంచం దూరం ఉండటంవల్ల వ్యాపారం బాగా జరుగుతుందన్న నమ్మకం ఉంది "అంది వసుమతి 

“మరి డబ్బులు "

తన మేడలో అప్పుడే వేసుకొన్న పసుపు తాడు చూపించి " మేడలో ఉన్న బంగారు నగ తీసి ఇది వేసుకున్నాను ఎదురింటావిడ బంగారు నగ తాకట్టుపెడితే బ్యాంకు వడ్డీకి అప్పు  ఇస్తుంది .ఆ డబ్బు మన కాయగూరల వ్యాపార పెట్టుబడికి ,  అరవింద్ అడిగిన  టపాకాయలు కొత్త దుస్తులు కొనడానికి ఉపయో గపడుతుంది" 

దీపావళి రోజు సెల్ ఫోన్ అంగడి ముందు కాయగూరల వ్యాపారం ప్రారంభించారు ,అనుకున్నదానికన్నా ఎక్కువ వ్యాపారం అయింది.  ఆ సాయంత్రం సూర్యుడు అస్తమించగానే   వసుమతి  ఇంటిముందు ప్రమిదలు వెలిగించింది.అరవింద్ ఉత్సాహంతో కాకరొత్తులు కాలుస్తున్నాడు .ఆయింటి తోపాటు వారిజీవితాలలో  అమావాస్య చీకటిని పారద్రోలే  నూతన  వెలుగుల దీపావళి పండుగ వచ్చింది .

ఘంటసాల సుశీల గార్లు పాడిన  " చీకటివెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి " పాటను గుర్తుచేసుకున్నాడు విశ్వనాథ్. 

మరిన్ని కథలు