Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

సాధారణంగా  చాలా దేశాల్లో మాతృభాషకే పెద్ద పీట వేస్తారు. అలాగని విదేశీ భాష ఉదాహరణకి ఏ ఇంగ్లీషో నేర్చుకోవద్దని మాత్రం ఎవరూ చెప్పరు.

మన దేశంలో ఉత్తరభారతీయులు అధికారంలో ఉండడం మూలాన హిందీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, అప్పుడెప్పుడో జాతీయ భాష గా ప్రకటించారు.. దక్షిణభారత రాష్ట్రాలు కొన్ని అభ్యంతరం తెలపడంతో, వెనక్కి తగ్గారు. అలాగని హిందీ అస్సలు నేర్చుకోలేదా అంటే అదీ కాదూ.. హిందీ సినిమాలు చూసి ఎంజాయ్  చేయడం లేదూ? ఏదో బలవంతం చేస్తున్నారని అపోహ పడి వద్దన్నారంతే.. భాష  నేర్చుకోవడమంటే, ఏదో పుస్తకాలకి పుస్తకాలు రాసేయమని కాదు.. ఏదో ఆ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు సౌకర్యంగా ఉంటుందని మాత్రమే.. అయినా ఇప్పటికీ కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో, ససేమిరా నేర్చుకోకూడదని నిశ్చయించేసుకున్నారు.

అసలు దేశంలోని వివిధ రాష్ట్రాలనూ వారు మాట్టాడే భాషకి అనుగుణంగా విభజించారు. చిత్రమేమిటంటే, ఈ పధ్ధతిలో రాష్ట్రం విడిగా వచ్చింది, 1953 లో  “ ఆంధ్ర రాష్ట్ర “ మే..ఆ రోజుల్లో మన రాష్ట్రంలోని నాయకులు, మన భాషకి ప్రత్యేకంగా రాష్ట్రం ఉండాలనే సదుద్దేశ్యంతో, ఉద్యమాలు చేసి, శ్రీ పొట్టి శ్రీరాములుగారి ఆమరణ నిరాహార దీక్ష ధర్మమా అని మొత్తానికి సాధించగలిగారు. 1956 లో తెలుగే ఎక్కువగా మాట్టాడే హైదరాబాద్ ని కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది.. కారణాలేవైనా 2014 లో విడిపోయాయి.ఆతరవాత 1960 లో దేశంలోని మిగిలిన రాష్త్రాలను కూడా, భాషా ప్రాతిపదిక మీదే విభజించారన్నది అందరికీ తెలిసినదే.

ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, ఒక జీఓ జారీచేసారని విన్నాము – ప్రాధమిక విద్య తెలుగులో కాకుండా, ఇంగ్లీషుమాధ్యమం లో నేర్పించాలని.- ఇంతకంటే  దౌర్భాగ్యపు ప్రకటన ఇంకోటుంటుందనుకోను. ఒకవైపు, కేంద్రసర్వీసులలో సివిల్స్ పరీక్షలకి కూడా, ఇంగ్లీషు హిందీలతోపాటు, ప్రాంతీయభాషలలోకూడా అనుమతిస్తున్న ఈ తరుణం లో, మనవాళ్ళేమో, అసలు తెలుగేవద్దనడం హాస్యాస్పదంగా ఉంది. అక్కడకేదో  ఇంగ్లీషులో ప్రావీణ్యం చాలా ఉందన్నట్టు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే చాలామందికి ఇంగ్లీషులో శలవుచీటీ రాయడం కూడా రాదన్నది, జగమెరిగిన సత్యం. బహుశా ఆ కారణం చేతనేమో, ప్రతీ కార్యాలయంలోనూ, శలవు అభ్యర్ధన అచ్చువేసి ఉంచారు—ఓ సంతకం పెట్టేస్తే సరిపోతుందనేమో..ఒక వైపున పరాయి భాషలకి ప్రాచీన హోదా కలిగిస్తున్నారని, దెబ్బలాడి మరీ, మన తెలుగుకి కూడా ప్రాచీన హోదా సంపాదించారు.. ఆ హోదా ద్వారా కొన్ని కేంద్రప్రభుత్వ నిధులుకూడా లభ్యమవుతున్నాయి.. అవన్నీ ఏం చేస్తారుట? రాజకీయనాయకుల జేబుల్లోకా? 

ఇంగ్లీషు మాధ్యమంలో నేర్చుకుంటేనే పరిజ్ఞానం పెరుగుతుందని భావించడం అపోహ.. విద్యావ్యవస్థ భ్రష్టు పడక పూర్వం, పూర్వపురోజుల్లో  ప్రాధమిక/సెకండరీ విద్యా తెలుగు మాధ్యమంలోనే ఉండేవి.. ఆ తరవాత కాలేజీకి వెళ్ళేటప్పడికి ఇంగ్లీషులోనే బోధించినా, విద్యార్ధులకి ఎటువంటి ఇబ్బందీ ఉండేదికాదు. పెద్దపెద్ద డిగ్రీలుతీసుకుని, అత్యుత్తమ ఉద్యోగాల్లో దేశవిదేశాల్లో ఉండే  ఆనాటి తెలుగువారే దీనికి ఉదాహరణ.
ఆంధ్రప్రదేశ్ లో పూర్వపు ప్రభుత్వ ఆధ్వర్యంలో, కార్పొరేట్  స్కూలు/కాలేజీ లకి పట్టంకట్టేవారు, కారణం రాష్ట్రంలో ఉండే కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు రాజకీయనాయకులవి .

ఏదో ప్రభుత్వం మారితే  ఆరోగ్యకరమైన మార్పొస్తుందని ఆశిస్తే, అసలు మొత్తానికే మోసం వచ్చేసింది.ఈ ఇంగ్లీషు వ్యామోహానికి కారణం ఈనాటి తల్లితండ్రులు, కాన్వెంటుల్లో తప్ప తమపిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ససేమిరా చదవడానికి వీల్లేదు.. ఎన్ని లక్షలు ఖర్చయినా, తల తాకట్టు పెట్టైనా తెస్తారు కానీ, కార్పొరేట్ స్కూల్లో చదవడం ఓ స్టేటస్ సింబల్ గా ఉంది. ఇంక సంఘంలోని గొప్పగొప్పవారు తమపిల్లల్ని నూటికి తొంభైమంది విదేశాల్లోనే చదివిస్తారాయే..

విదేశీయుడైన శ్రీ చార్లెస్ బ్రౌన్ దొరగారు తెలుగుభాషకి చేసిన ఉపకారం మరువలేనిది. అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగుని “ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ “ అంటారేమో కానీ, మన దౌర్భాగ్యపు పాలకులకి మాత్రం ఇంగ్లీషే బెల్లం, తెలుగు అల్లం. కొత్తరాష్ట్రమైన తెలంగాణా ప్రభుత్వం వారు తెలుగు ఇస్తూన్న ప్రాధాన్యత అమోఘం. పరాయిరాష్ట్రాల్లో కూడా తెలుగులో విద్యాబోధన చేయడానికి ప్రత్యేకంగా పాఠశాలలున్న ఈరోజుల్లో, ఆంధ్రప్రదేశ్ లో దానికి విరుధ్ధంగా జరగడం, మన రాష్ట్ర నాయకులు ఎంత నికృష్టులో అర్ధమవుతోంది.

సర్వేజనా సుఖినోభవంతూ

మరిన్ని శీర్షికలు
Oxygen for sale!