Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue345/854/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి).... శీతాకాలం పొద్దు కావడంతో అయిదోగంటకే వాతావరణం చల్లగా అయిపోయింది. రివ్వున వీస్తూ, చాచికొడుతున్నట్లుగా తగులుతున్న చలిగాలి శరీరాలని వణికిస్తోంది. ఆకాశంలో ఎగురుతూ తమతమ నెలవులకి సాగిపోతూ పక్షులు చేస్తున్న కలకూజితాలు, గాలిలో కలిసిపోయి నలుదెసలా వ్యాపిస్తున్న జాజిపూల సుగంధాలు, వాతావరణం… చాలా ఆహ్లాదంగా ఉంది.

“ఏమిటమ్మా సావిత్రీ… ఏదో మాట్లాడాలన్నావు?’’ నాన్నే కదిపారు. మా అందరివైపు ఓసారి చూసింది అత్తయ్య. ఆమె వాలకం చూస్తే దేనికో సంకోచిస్తోందనిపిస్తోంది.

“చెప్పమ్మా… జంకెందుకు?’’ నాన్న ఆమెని ఉత్తేజ పరిచారు.మరి…మరి… ముక్తని…నా కోడలిగా చేసుకోవాలని ఉందన్నయ్యా…’’

చిన్నత్తయ్య మాటలకి నాన్న తీవ్రమైన సంభ్రమానికి గురయ్యారు. అత్తయ్య అకస్మాత్తుగా ఊడిపడి, ఆ ప్రస్తావన తేవడం మా అందరికీ ఆశ్చర్య హేతువైంది. సుదీర్ఘమైన విరామానంతరం కలిసిన ఆమె ఈ ప్రపోజల్ పెట్టడం వింతకాక మరేమిటి! నాన్నకేమనాలో తోచినట్లులేదు. మౌనంగా ఉండిపోయారు.ఆయన సందిఘావస్థని అర్ధం చేసుకున్నదానిలా చిరునవ్వు నవ్వి” ఏంటన్నయ్యా…ఉన్నట్లుండి సావిత్రి ఇలాంటి కోరిక కోరిందేమిటా! అనుకుంటున్నావా!?’’ అంది చిన్నత్తయ్య. 

“అబ్బే… అదేమీ లేదమ్మా…’’ తడబడ్డారు నాన్న.

“నీకు ఆశ్చర్యం కలగడంలో అర్ధం లేకపోలేదులే అన్నయ్యా… సడన్ గా ఇన్నేళ్ళ తరువాత వచ్చి నేనీ ప్రసక్తి తెస్తే మీకు వింతగానే ఉంటుంది. కాని, ఆలస్యం అమృతం విషం అన్నారు కదా! మొన్న నవ్య పెళ్లిలో ముక్తను చూసిన దగ్గరనుంచీ నాకు చాలా ఆరాటంగా ఉంది. మీ బావగారికి కూడా ముక్త తెగ నచ్చేసింది.

ఇక నా కొడుకు ఎలా ఉంటాడో, ఎలాంటి వాడో నన్న సందేహం మీకుంటే కనక… అవన్నీ తీసి పక్కన  పెట్టేయండి. మీకటువంటి భయాలే అక్కరలేదు. నా కొడుకు మేలిమి బంగారం. ఏ ఒక్క చెడు అలవాటూ లేని సుగుణాల రాశి. ఇక మనిషంటావా! అచ్చం నాలాగానే ఉంటాడు.’’ సుదీర్ఘంగా చెప్పేసి, ‘ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడుక్కోడి.’ అన్నట్లు ముఖం పెట్టింది అత్తయ్య.

తన పెంపకంమీద ఎనలేని నమ్మకం ఉన్నట్లుగా అనిపించిండి ఆవిడ మాటలు వింటే. అసలా మాటకొస్తే ప్రతి తల్లికీ తన కొడుకు మంచివాడిలాగానే అనిపిస్తాడు…వాడు ఎంత దుర్గుణాల పుట్టైనా సరే.

అమ్మ, బామ్మ అపనమ్మకంగా చూస్తున్నారు. దివి నుంచి భువికి దిగివచ్చి, అడగకుండానే వరాలు ప్రసాదించే దేవతను చూస్తున్నంత భక్తిభావన వారి చూపులలో. కాస్సేపు తీవ్ర యోచనలో కొట్టుమిట్టాడాక ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా నిట్టూర్చారు నాన్న.

“ముక్తని నీ కొడుక్కిచ్చి పెళ్ళి చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా… కాకపోతే వాడికి ఇష్టముందో లేదో తెలుసుకోకుండా…’’ అర్ధోక్తిలో ఆగారు నాన్న. ఆయన మాటలు అంగీకార సూచకాలై ధ్వనించాయో ఏమో…” రోహిత్ నా మాట జవదాటడన్నయ్యా… నేనెంత చెబితే అంత.’’ అంది చిన్నత్తయ్య గర్వంగా.  “మంచిదమ్మా… నీకు, శేఖరానికీ కూడా ఇష్టమైతే ఇక అడ్డేముంది’’

 “ అసలు ముక్తని చూసి నాకన్నా ఆయనే ఎక్కువగా సంబరపడ్డారన్నయ్యా… ఆయన అంగీకారం తెలిపాకే నేను నిన్ను అడగడానికి వచ్చాను.’’ నన్ను దగ్గరగా పొదివి పట్టుకుని, నా నుదురు ముద్దాడింది అత్తయ్య.

“ నేను ఈ సంబంధం కలుపుకోవాలనుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది అన్నయ్యా…’’

“ఇంకో కారణమా! ‘’ నాన్న- అమ్మ, బామ్మ ముక్తకంఠంతో అడిగారు అయోమయంగా చూస్తూ. వారి కంగారును గమనించిన అత్తయ్య పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.

“ఎప్పుడో… నా కారణంగా తెగిపోయిన మన బాంధవ్యాన్ని…ముక్తని కోడలిగా చేసుకోవడం ద్వారా తిరిగి కలుపుకోవాలన్న స్వార్ధం తో ఇలా అడుగుతున్నాను అన్నయ్యా… ఒక విధంగా ముక్త మన రెండు కుటుంబాల మధ్యన వారధి అనుకో…’’ చెప్పింది చిన్నత్తయ్య. నాన్న నవ్వారు ఆనందంగా. అమ్మ- బామ్మల ముఖాలు ఆనందంతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఈ లోకంలో మనుషుల నడుమగల బంధుత్వాలు, సంబంధాలు పటిష్టంగా మారాలంటే ఎంతో కృషి, సహనం, సంయమనం కావాలి. ఎన్నో ఏళ్ల సాహచర్యం మాత్రమే ఆ బంధాలను దృఢపరచగలదు. అప్పుడే అవి ఫెవికాల్ బంధాలై వర్ధిల్లుతాయి.. ఎంతో పెద్దదైన దూదికుప్ప క్షణాల్లో త్గగలబడడానికి ఒకేఒక్క నిప్పురవ్వ చాలును. ఎంతో శ్రమించి అల్లుకున్న పూపొదరిల్లు కూలిపోయి చెదిరిపోవడానికి ఒక్క పెనుతుఫాను చాలును.అలాగే… ఎన్నో ఏళ్లుగా పెనవేసుకుపోయిన బంధాలు పుటుక్కున తెగిపోవడానికి మనసుని బాధపెట్టే ఒక్క చిన్న చాలును. కేవలం ఒక్క చిన్నికారణం రక్తసంబంధీకుల మధ్యన అగాధాలు సృష్టించగలదు. అంతరాలు పెంచగలదు.

మా విషయంలో జరిగినదదే. ఒకసారి తెగిపోయిన బంధాలను తిరిగి ఏర్పరచుకోవడం అంత సులువైన వ్యవహారం కాదు. ఆ బంధం తిరిగి అతుక్కోవడానికి కాలం కలిసిరావాలి…దైవం సహాయపడాలి. అప్పుడే ఆబంధం తిరిగి అతుక్కుంటుంది.నన్ను వారధిగా చేసుకుని చిన్నత్తయ్య అప్పుడెప్పుడో తాను కోల్పోయిన పుట్టింటి మమతానురాగాలని తిరిగి పొందాలని అనుకుంది. కాని,దాని ద్వారా తన పుట్టింటితో తనకు గల అనుబంధాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటుందని ఎంత మాత్రం ఊహించి ఉండదు ఆక్షణం. ఆవిడ అలా ఊహిస్తే… ఈ కథ ఇంత దూరం వచ్చి ఉండేదేకాదు.

 “ఇంతకీ ముక్తకి ఇష్టం ఉందో, లేదో కనుక్కున్నారా?’’

వయసులో పెద్దదైన బామ్మకి నా అభిప్రాయం కనుక్కోవాలన్న ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషించాను. అదే సమయంలో… ఇంకెవరికీ రానందుకు చింతించాను కూడా. అయితే… నాన్న ఎవరిని తెస్తే వారినే పెళ్లాడాలన్న నిర్ణయానికి నేనెప్పుడో వచ్చేశాను కనుక… ఈ విషయంలో అభ్యంతరం చెప్పడానికేమీ లేక తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయాను.

“అబ్బో! ఇదంతా సిగ్గే?’’ అంది అత్తయ్య నవ్వుతూ. నాన్న మీసాలు దువ్వారు’ నీ పెంపకం మీద నీకెంత నమ్మకమో… నాకూ అంతే ఉంది.’ అన్నట్లుగా. అందరి వదనాలు వికసిత జలజాల్లా వింతకళతో విరాజిల్లాయి. నిశ్చితార్ధానికి ముహూర్తం చూపించమని నాన్నకి పురమాయించింది అత్తయ్య.

“ఇన్నేళ్ళుగా నా బుర్ర అప్పడంలా నమిలేసి, నన్నల్లరి పెట్టావు. ఇప్పుడు చూడు… నీ పాల పడడానికి మరొక బకరా దొరుకుతున్నాడు… ఓ గాడ్… సేవ్ హిమ్…’’ ఆకాశంలోకి చూస్తూ ప్రార్ధించాడు దినేష్. వాడి వేళాకోళానికి నేను మనసారా నవ్వేశాను. ఎందుకో… ఆక్షణం వాడిమీద కోపం రాలేదస్సలు. ఆ మరునాడు ఉదయాన్నే నాన్న పంతులుగారి దగ్గరకెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చారు. నిశ్చితార్ధానికింకా పదిరోజుల సమయముందని అత్తయ్య ఆ సాయంత్రమే బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ రోజునుండీ… నా కలల నిండా నాకు ఎంతమాత్రం పరిచయంలేని బావే కదిలాడు. ఇంతకీ బావ ఎలా ఉంటాడు!? బావకంతా తన పోలికేనంది అత్తయ్య. అంటే… అత్తయ్యంత అందంగా ఉంటాడా? నా ఆత్రానికి నాకే నవ్వొచ్చింది. తినబోతూ రుచెందుకు? నిశ్చితార్ధం నాడు బావనెలాగూ చూడబోతున్నానుగా! అయినా… ఈ మనసుకెందుకో అంత తొందర! ఆగడాల మనసు… ఆగనంటూంది. బావ గురించిన ఊహలతో నిద్ర కూడా పట్టడంలేదు. భవిష్యత్తులో నాకు నిద్ర కంకా కరువై పోతుందని  తెలియక… అసలు నిద్రపోయే ప్రయత్నం కూడా చేయలేదు.

---------------

 “ఉభయులూ తాంబూలాలు మార్చుకోండి…’’  నాన్నకి- మామయ్యకి చెప్పారు పంతులుగారు. నిశ్చితార్ధం జరిగిపోయింది. పెళ్ళిముహూర్తం కూడా పెట్టేస్తున్నారు.అయితే… ఆ ప్రదానానికి ఎంతో ముఖ్యమైన, తప్పని సరిగా రావాల్సిన అసలువ్యక్తి…బావ మాత్రం రాలేదు. వినసొంపుగా…చక్కగా సాగిపోతున్న రాగాలాపనలో ధ్వనించిన అపశ్రుతిలా అనిపించింది నాకీ సంగతి.జీవితంలో అతి ప్రాముఖ్యతని సంతరించుకునే ఘట్టం వివాహం. దానికి నాందిగా జరిగే ప్రదానానికి కూడా బావ రాలేదంటే ఏమనుకోవాలి! నా మనసెందుకో కలుక్కుమంది .  “అఫీసులో పని ఎక్కువగా ఉందటన్నయ్యా…వాళ్ళ మానేజర్ సెలవిచ్చేది లేదని చెప్పేశాడట…’’ అత్తయ్య సంజాయిషీ నాన్నని సంతృప్తి పరచలేదని ఆయన ముఖ కవళికలే చెబుతున్నాయి.

“రేప్పొద్దున్న పెళ్లి వేళకైనా వస్తాడా?  పూర్వం క్షత్రియులలో కత్తికి బాసికం కట్టేవారట… నీ కొడుకు అక్కడే ఏ కత్తికైనా తాళి కట్టేస్తాడా?’’ మేలమాడింది అమ్మ.

“ అదేం మాటొదినా…ఎంత ప్రయత్నించినా సెలవు దొరకలేదు. అయినా నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవలసింది పెద్దలేగా!’’ నొచ్చుకుంది అత్తయ్య.నాకు మాత్రం ఎనలేని నిరాశగా అనిపించింది.  రెండువైపుల వాళ్ళూ తాంబూలాలు మార్చుకున్నారు. అత్తయ్య నాకు రాణీ కలర్ ప్యూర్ సిల్క్ చీర,మామిడిపిందెల నెక్లెస్, అందె ఉంగరం తెచ్చింది. వాటిని నాకలంకరించి, నా బుగ్గలు పుణికి ముద్దాడి, మురిసిపోయింది అమితంగా.

“నీకోసం… ఓ స్పెషల్ గిఫ్ట్…’’ అంటూ ఎవరూ చూడకుండా నా చేతికో కవర్ ఇచ్చింది. దాన్ని చీరచెంగు మాటున దాచేసి, గదిలోకి పరుగెత్తి మంచం మీద వెల్లకిలా పడుకుని కవర్ లో ఉన్న బావ ఫోటోని బయటకు తీశాను. ని…జం…గానే బావ చాలా అందంగా ఉన్నాడు. తుమ్మెదరెక్కలని అవహేళన చేసేంత నల్లటి ఉంగరాల జుట్టు, పచ్చని పసిమిఛాయ, తీరైన ముఖ కవళికలు…ఆ వయసులో ఉండేటప్పుడు నాన్న ఇలాగే ఉండి ఉంటారనిపించింది. నా మది పరవళ్ళు తొక్కే నదీప్రవాహంలా తుళ్ళిపడింది. ప్రవాహంలో కొట్టుకుపోయే చెత్త-చెదారంలా నా మదిలో ఉద్భవించిన శంకలు, సందేహాలు, అన్నీ బావ సుందరరూపం చూడగానే ఏర్పడిన ఆనందవాహినిలో కొట్టుకుపోయాయి.నా పెళ్లి విషయంలో నా పెద్దలదే తుదినిర్ణయం కావాలని నేననుకోవడం వలన నాకు మంచే జరిగిందనిపించింది.బావలాంటి అందగాడు, మంచి హోదాలో ఉన్నవాడు నన్ను వెతుక్కుని మరీ వచ్చి నా మెడలో వరమాల వేయాలనుకోవడం నేనీ జన్మలో పొందుతానని అనుకోలేని అదృష్టంగా భావించాను.

మా పెళ్ళికి ఇంకా న…ల…భై… రోజులుంది. అంతవరకూ ఎలా నిరీక్షించాలో మరి!

 “ ఇంకెన్నాళ్లు డియర్… మనిద్దరం కలిసి పెళ్ళిపల్లకీలో ఊరేగే శుభతరుణం దగ్గరలోనే ఉంది.’’ ఫోటో లో ఉన్న బావ కొంటెగా చూస్తూ అన్నట్లనిపించింది.పరవశంగా ఫోటోని నా గుండెలకి హత్తుకున్నాను.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్