Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి.... http://www.gotelugu.com/issue348/857/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

(గత సంచిక తరువాయి).... నిస్సత్తువగా అతడీవైపు చూశాను. “మీరేమంటున్నారో నాకు అర్ధంకావడంలేదు. మీరు నాకు అన్యాయం చేయడమేమిటి? మీకు… మీకు… నేనంటే ఇష్టంలేదా” నా స్వరం ఏ అగాధాల లోతుల నుంచో వెలువడుతున్నంత పీలగా ధ్వనించింది. 

ఓసారి నావైపు చూసి “ నిన్ను ఇష్టపడడం- పడకపోవడం అన్న ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇది వరకు మనం అపరిచితులం. మన రెండు కుటుంబాల మధ్యన రాకపోకలు లేవు. నీ పట్ల నాకే రకమైన భావమూ లేదు.’’ అన్నాడు బావ తల దించుకుని.  ఇతడేం తప్పు చేశాడనీ… అలా తల దించుకుంటున్నాడూ!

 “మరి!’’ ప్రశ్నార్ధకంగా చూశాను.

“నాకు కీర్తన అంటే ఇష్టం… చెప్పలేనంత ఇష్టం.” తెల్లబోయాను నేను.

“కీర్తనా ? ఆమె ఎవరు?’’

“నా హృదయాధిదేవత. నా ప్రేమ మనోహరి.’’ తన్మయత్వంగా అంటున్నాడు బావ. ఇంతటి అందగత్తెను, పైగా కట్టుకున్నదాన్ని. నన్ను చూసినప్పుడు బావలో కాస్తంత చలనం కూడా కలుగలేదు. అలాంటిది… కీర్తన పేరు పలుకుతున్నప్పుడు బావ లో ఎనలేని మైమరపు. ఆ వదనంలో శతకోటి తారకల తళుకు. ఆ స్వరంలో ఆమె పట్ల అంతులేని ఆరాధన. పరవశంతో బావకళ్ళు అరమోడ్పులైనాయి.  బావ నన్ను లక్ష్యపెట్టలేదంటే మా ఇద్దరి మధ్యా అసలు పరిచయమే లేదని సర్దుకుపోయాను. ఇప్పుడు నన్ను మాట్లాడడానికి పిలిచి, విషయం మొదలెడితే నా మీద ఇష్టం లేదేమోనని అపోహ చెందాను. కాని, ఇంతకు ముందే బావ ఎవరినో ప్రేమించి ఉండచ్చునేమోనన్న ఆలోచన పొరబాటున కూడా రాలేదు. ఎందుకు!? తన కొడుకు తాను గీచిన గీటు దాటడని అత్తయ్య నొక్కి వక్కాణించడం వల్లనే కదా!

“నేను కీర్తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. ఆమెతోటిదే నా జీవితం అని భావించాను.’’ బావ చెప్పుకుపోతున్నాడు.నేను నిశ్చేష్టనై అతడు చెప్పేది వింటున్నాను. ఇంత ప్రేమగ్రంధం నెరపి అతడు నామెడలో ఎందుకు తాళి కట్టినట్లు! ఉక్రోషం ముంచుకొచ్చింది నాలో.  ఉన్నట్లుండి  బావ కళ్ళు ఎరుపెక్కాయి. ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి.|“జరిగిన అనర్ధానికి కారణం అమ్మ… యస్… అమ్మే. కీర్తనని మనసారా ప్రేమించాననీ, ఆమెనే నా లైఫ్ పార్ట్‌నర్‌గా చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేలోపే… అమ్మ నీతో పెళ్లికి ప్రపోజల్ పెట్టింది. అయినా సరే… నేను నా మనసులోని మాట నిర్భయంగా చెప్పేశాను. అమ్మ నా మాటలు పెడచెవిన పెట్టింది. తను ఆనాడు చేసిన పని వలన తన వాళ్ళందరితోనూ సంబంధాలు తెగిపోయాయని, తిరిగి ఇన్నేళ్ల తరువాత పుట్టింటితో తిరిగి సంబంధం కలిసిందని పొంగిపోయిందమ్మ.

తన వాళ్ళతో ఏర్పడిన బంధం కలకాలం కొనసాగాలంటే… నిన్ను కోడలిగా తెచ్చుకోవడమొక్కటే మార్గం అని అనుకుంది. కాని, అందుకు నేను వ్యతిరేకించాను.’’ ఊపిరి తీసుకునేందుకు ఆగాడు బావ. నా మనసు మొద్దుబారిపోతూన్నట్లుగా ఉంది. ఏదో తెలియని నిస్సత్తువ నన్ను ఆవరించుకుని లోబరచుకుంటోంది. ఆ గోడమీదనుంచి కిందనున్న లోయలోకి పడిపోతానేమోనని భయమేసింది. ఆసరా కోసమని గోడ అంచులని గట్టిగా పట్టుకున్నాను.

“నిన్ను చేసుకోనని చెప్పగానే అమ్మ మొదట ఆవేశపడింది. అరిచింది. అల్లరిచేసింది. అయినా నేను ఆవిడ మాట వినలేదు. ఆవిడ నా మీద ఆఖరి అస్త్రం ప్రయోగించింది. నేనీ పెళ్ళికి ఒప్పికోకపోతే తాను చస్తానని బెదిరించింది. బెదిరించడమే కాదు. ఆత్మహత్యాప్రయత్నం కూడా చేసింది.’’ బావ కంఠం రుధ్ధమైంది. నేను అప్రతిభురాలనైనాను. నా పెళ్ళి కోసం ఇంత తతంగం జరిగిందా!? ఇంతా చేసి అత్తయ్య ఏం సాధించాలనుకుంది! పుట్టింటి మమకారాన్ని నిలబెట్టుకోవడం కోసం కన్నబిడ్డ ప్రేమని బలిపెట్టిందా!? ఈ సంబంధం కలుపుకోకపోయినా ఆవిడకి తన కన్నవారింట గల స్థానం చెక్కు చెదిరేది కాదు. ఆవిడ మంకుతనం ఎంతటి అనర్ధానికి హేతువైందీ!

“మీరు పెళ్లికి ముందే ఈ విషయం నాకు చెప్పుండాల్సింది.’’ నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది. బావ విరక్తిగా నవ్వాడు. వేదన నింపుకున్న కన్నులతో దీనంగా చూశాడు. చెట్టంత మగాడి కళ్ళలో కొండంత దైన్యాన్ని నేను భరించలేకపోయాను.

“ ఆ ప్రయత్నమూ అయింది. నిన్ను కలిసి నా ప్రేమసంగతి చెప్పాలనీ, కనీసం ఫోన్‌లోనైనా నీతో మాట్లాడాలనీ ఎంతగానో ట్రై చేశాను. అమ్మ పడనివ్వలేదు. అటువంటి ప్రయత్నాలేం చేసినా తాను విషం తాగి చస్తానని హెచ్చరించింది. అందుకే… తప్పనిసరి పరిస్థితుల్లో నీకు తాళి కట్టాల్సి వచ్చింది.’’ బావ గొంతు గద్గదమైంది. సినిమాలలో ఇటువంటి సీన్లు చూసి తెగ నవ్వుకునేదాన్ని. పెద్దవాళ్ళు చస్తామని బెదిరించినంత మాత్రాన మనసుకెదురీది ఇష్టంలేని పెళ్లిళ్ళు ఎలా చేసుకుంటారా! అని విపరీతంగా ఆలోచించేదాన్ని. కాని, అదే సన్నివేశం … నా జీవితంలో ఎదురయ్యేసరికి మాత్రం నాకు గట్టి షాకే తగిలింది. తాను చస్తానని బెదిరించి, కొడుకుని నొప్పించి-ఒప్పించి… నాతో పెళ్లిచేసి నా జీవితాన్ని నరకం చేసింది అత్తయ్య. నా భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసింది. ఎంతకీ సాల్వ్ కాని ఒక పజిల్‌లా మిగిలింది నా బతుకు.

“నన్ను క్షమించు ముక్తా…నేను నీకే విధంగానూ న్యాయం చేయలేను. నా మనసునిండా కీర్తనే నిండి  ఉంది. ఆమెను హృదయంలో ఉంచుకుని నీతో అయిష్టంగా కాపురం చేయలేను. నా మనసుతో పాటు నేను కూడా ఆమెకే అంకితం కావాలనుకుంటున్నాను.’’ బాధగా కణతలు నొక్కుకున్నాడు బావ. కాళ్ళకింద భూమి కంపించినట్లయింది. ఏమంటున్నాడితడు! అతడి జీవితంలో నాకు స్థానం లేదనేగా ఆ మాటలకర్ధం! 

నా కళ్ళు తిరుగుతున్నాయి. క్రమంగా స్పృహ తప్పుతోంది.  నాకు తెలివొచ్చేసరికి బావ కార్లో ఉన్నాను. నా వైపే ఆతృతగా చూస్తూ బావ. నాకెందుకో అమితమైన దుఃఖం పొంగుకొచ్చింది. ఆహ్లాదంగా వీస్తూన్న పిల్లగాలు… మండువేసవి లో మధ్యాహ్న సమయంలో వీచే వడగాడ్పుల్లా అనిపిస్తున్నాయి. వాతావరణం అంత ప్రశాంతగా ఉన్నా సరే… నా మనసులో పిడుగులు పడుతున్నాయి. ఉగ్రమూర్తియైన నారసింహుని శాంతింపచేయడానికి మణుగుల కొద్దీ మంచిగంధాన్ని తెచ్చి పూస్తారట! మండుతున్న నా మనసుని చల్లార్చడానికి ఏ చందనపు పూతలు పనికొస్తాయి.|

“రియల్లీ అయాం వెరీసారీ ముక్తా…నీ పరిస్థితికి ఒక విధంగా నేనే కారణం. నా అసమర్ధత వలన నీ జీవితం పాడైంది.’’ ఆవేదన తొణికిసలాడింది బావస్వరంలో. నేనలా వెర్రిదానిలా చూస్తూండిపోయాను. ఇన్నేళ్లుగా నాశరీరంతో పాటు మనసుని కూడా ఏ కల్మషమూ సోకకుండా ఉంచుకున్నాను.అమ్మ-నాన్నలు ఎంపిక చేసిన వ్యక్తికే అర్ధాంగినై, ఒక పూజాపుష్పంలా ఆ వ్యక్తికే అర్పితమౌదామనుకున్నాను. ఏ లవ్‌ వైరస్సూ  సోకకుండా, నా మనసుకి ఎంగిలి అంటకుండా నన్ను నేను నియంత్రించుకున్నాను. దానికి ప్రతిఫలం ఇంత చేదుగా ఉంటుందా! పర్యవసానం ఇంత దారుణమా!

నా జీవితంతో ఆడుకునే హక్కు ఈ తల్లీకొడుకులకి ఎవరిచ్చారు? ఆవిడగారు చస్తానని బెదిరించిందట… ఇతగాడు వణికిపోయి ‘సై’ అన్నాడుట!భేష్! ఎంతబాగుంది! భోరుమని ఏడవాలనిపిస్తోంది. అత్తయ్య ఈ పెళ్ళి కావడానికి చస్తానని బెదిరించింది. నేను ఈ వివాహబంధాన్ని నిలుపుకునేందుకు అదేపని చేస్తేనో!

 “ఇంతసేపూ మీరు చెప్పినదంతా విన్నాను. ఎలా జరిగినా, ఎందుకు జరిగినా పెళ్ళి జరిగిపోయింది. స్త్రీ జీవితంలో పెళ్ళి అనేది ఒకే ఒక్కసారి వచ్చే మధురమైన, మరపురాని ఘట్టం. వివాహితయైన ఆడది భర్త తోడు లేనిదే మనుగడ సాగించలేదు. అందుకే సిగ్గు విడిచి చెబుతున్నాను. మీరు నాతో కాపురం చేయకపోతే నేను ఉరిపోసుకుని చస్తాను.’’ నాలో అంత మొండితనం ఎక్కడినుంచి వచ్చిందో నాకే తెలియలేదు.
నేననుకున్నట్లుగా బావ బెదిరిపోలేదు. పసిపిల్ల అమాయకత్వం చూసి నవ్వినవాడిలా నవ్వాడు. అతడి మదిలోని విషాదంలో నుంచి పుట్టిన నవ్వు అది.

 “మనసులేని మనువు నరకమైతే… ఇష్టంలేని కాపురం వ్యభిచారంతో సమానం. అలాచేసి నా స్థాయిని దిగజార్చుకోలేను. జీవితాంతం నిన్నుసురు పెట్టలేను. ఒకసారి అమ్మ బెదిరింపుకి భయపడి జీవితంలో అతి ముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకోవడంలో విఫలమైనాను. మళ్లీ మళ్ళీ అదే తప్పు చేయడానికి నేను సిధ్ధంగా లేను.’’ నిష్కర్షగా చెప్పాడు బావ.

‘నీ ఇష్టమొఛినట్లుగా చావు’ అని ఎంత కూల్ గా చెప్పేశాడు! శిలలా బిగుసుకుపోయాను. నా భావాలు నన్నే పరిహసిస్తున్న అనుభూతి కలిగింది. అయిపోయింది…ఎన్నో సుందరస్వప్నాలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నా బతుకు చీకటైపోయింది. ముచ్చటపడి నిర్మించుకున్న జీవనరమ్యహర్మ్యాలు కుప్పకూలిపోయాయి.

ఆ శిధిలాల కింద సమాధి అయిన నా జీవనశకలాలను వెదుకుతూ మిగిలిన నా బతుకు ప్రయాణాన్ని కొనసాగించవలసిందేనా!?
అంతకన్నా ఇంకేం మిగిలింది నాకు! ఇప్పుడు నేనేం చేయాలి? కటువుగా బావ పలికిన మాటలే నా చెవిలో మారుమ్రోగుతున్నాయి. వీళ్ళంతా కలిసి నాకు ఏ విధమైన న్యాయం చేస్తారు? గుర్రాన్ని అదిలించి ఏటిదాకా తీసుకురాగలరు. కాని, బలిమిన ఒక్క చుక్క నీరైనా తాగించగలరా!
ఎవరో పనిగట్టుకుని సమ్మెటలతో నా తల మీద బాదుతున్నట్లుగా అనిపించింది. దిక్కుతోచని స్థితిలో కాస్సేపు ఉండిపోయాను. కాస్సేపటికి నా ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చాయి.

 “చెప్పు ముక్తా… నా మనసులోని మాట నీకు స్పష్టంగా చెప్పేశాను.నువ్వు ఎన్నాళ్లు వేచి చూసినా ఫలితం ఉండదు. ఇది నాకు నేనే వేసుకుంటున్న శిక్ష.’’ అన్నాడు బావ అసహనంగా. శిక్షా! ఎవరికీ! అతడికేం మగమహారాజు. హాయిగా దులిపేసుకుంటాడు. కాని, నేను…అతడివలన ఏ ఆదరణకీ నోచుకోకుండా మోడులా పడుండాలి. ఇప్పుడు నేను తీసుకోబోయే నిర్ణయం వలన అమ్మ-నాన్నలు బాధ పడతారని తెలుసు. కాని, తప్పదు! పరిస్థితి నా చేతుల్లో లేదు. ఈ సమయంలో నా ఆలోచనే సరైనది అనిపిస్తోంది.

“మీరు బలవంతంగా నన్నేలుకోవలసిన పనిలేదు. నా జీవితం ఎటూ నాశనమైపోయింది… కనీసం మీరన్నా సుఖంగా ఉండండి.’’ ఈ మాటలంటున్నప్పుడు ఉబికివస్తున్న కన్నీళ్ళని విశ్వప్రయత్నం మీద అపుకోగలిగాను.

 “అంటే…’’ బావ నిటారుగా అయ్యాడు కూర్చున్నచోటే.

“మనం విడాకులు తీసుకుందాం.’’ తడారిపోతున్న గొంతుతో పలికాను.

“వి…డాకులా?’’ విస్మయంచెందాడు బావ.

“అవును …విడాకులే… మీరే నన్ను కాదన్నాక..నేను ఏ అర్హతతో మీ భార్యగా మిగలగలను! మనం లీగల్ గా విడిపోదాం.’’ బహుశా… వివాహమై నెలరోజులు కూడా కాకుండా విడాకుల గురించి మాట్లాడిన తొలి దురదృష్టపు ఆడపిల్లను నేనేనేమో! బావ నవ్వాడు. ఆ నవ్వు నా అజ్ఞానాన్ని చూసి నవ్వినట్లుంది.“పిచ్చి ముక్తా…అవేమన్నా తమలపాకులనుకున్నావా? విడాకులు… అంత సులభం కాదు. అయినా అమ్మ ఇంకెంత అల్లరి చేస్తుందో ఈ మాట వింటే!’’

“అయితే నన్నేలుకోండి…’’ బావ నిస్సహాయంగా చూశాడు.

“ మీకు కుదరదు కదా! అలాంటప్పుడు ఈ మెతకదనం దేనికి! మీ పిరికితనమే ఈనాడు మన జీవితాలని బలిపీఠం మీద నిలుచుండబెట్టింది. మీ అమ్మ బెదిరించిందని ఆలోచించి నా మెడలో మూడుముళ్ళు వేశారే కాని, మీ నిరాకరణ వలన ఒక ఆడపిల్ల జీవితం ఎన్ని ఇక్కట్లకు లోనౌతుందో ఊహించలేకపోయారు.

మీరు మీ మనసుకెదురీది నాతో కాపురం చేయలేరు. నాకు కూడా అది నరకంతో సమానం. అందుకే… ఇద్దరం చట్టబధ్ధంగా విడిపోయి ఎవరిదారి వారు చూసుకోవడం మంచిది.’’ మనసులో జ్వాలలు రగులుకుంటున్నా  నా పెదవుల మీద చిరునవ్వు  పులుముకునే చెప్పాను.
నాలో ఇంతమంచి నటి దాగుందని నాకే తెలియదు.  ‘ మహానటీ… మహానటీ…’ అంటూ ఎవరో ఆర్. ఆర్. వేసినట్లుగా అనిపించింది.
   బావ ఆలోచనలో పడ్డాడని ముడుచుకున్న అతడి నుదురు చెబుతోంది.

“ఆల్‌రైట్ ముక్తా… నువ్వన్నదీ నిజమే. ఇద్దరమూ ఇలా మానసికంగా నలిగిపోయేకంటే, సరైన నిర్ణయం తీసుకుని చేసిన పొరపాట్లని సరిదిద్దుకోవడమే మేలు. కాని,’’

“కాని!?’’

“ దీనికి అమ్మ ఎలా రియాక్టౌతుందోనని భయంగా ఉంది.’’

‘ అమ్మ… అమ్మ… ఇంత అమ్మకూచివేంట్రా బాబూ… అమ్మ గురించి ఆలోచించేవాడివే అయితే… ఆ కీర్తనను మరచిపోయి నాతో హాయిగా కాపురం చేసి ఉండేవాడివి. కాని, నాతో కాపురం చేసేటప్పుడు మాత్రం ఆ కీర్తన, ఆమెతో  ప్రేమ వ్యవహారం అన్నీ గుర్తొస్తాయి.’ కసిగా పెదవి కొరుక్కున్నాను.

ఆ కీర్తన ఎవరోగాని, నాకు చాలా అసూయ కలిగింది.  అవకాశం దొరికితే, సందుకో చిన్నిల్లు మెన్‌టెయిన్ చేసే పురుషపుంగవులున్న మన సమాజంలో… ప్రేమికురాలినే మనసులో నింపుకుని, కట్టుకున్నదాని వైపు కన్నెత్తైనా చూడని బావని చూస్తే గౌరవం కూడా కలిగింది ఆక్షణంలో.

 బావ ప్రేమలో నిజాయితీ ఉంది. అది ఏ ప్రలోభాలకీ లొంగదు.

“వద్దు బావా… అత్తయ్య గురించి ఆలోచించవద్దు. ఆవిడ ప్రేమలో స్వార్ధం ఉంది. కాని, నీ ప్రేమ ఈ స్వార్ధాలకి అతీతంగా సాగాలని నా భావన. మా ఇంట్లోని వాళ్లకి నేను నచ్చచెప్పుకుంటాను.అత్తయ్యకి ఏం చెప్పాలో, ఎలా ఒప్పించాలో నువ్వు చూసుకో. నువ్వు ఏ లాయర్ దగ్గరకి రమ్మంటావో, ఎక్కడ సంతకాలు పెట్టమంటావో చెప్పు. నేను రెడీ.’’ నిర్వికారంగా చెప్పాను. చిత్రంగా ఇందాక నన్ను పట్టి కుదిపేసిన బాధ తీవ్రత తగ్గింది. మనది కాని వస్తువు మీద ఆశలు పెంచుకోవడమన్నది ఎంత తెలివితక్కువ తనమో తెలిసి వచ్చింది. బావ మీద నాకు ప్రత్యేకించి ఒక నిర్దుష్టమైన భావమేదీ లేదు. పెద్దలు అతడిని నాకు కాబోయే భర్తగా ఎంపిక చేసినకొద్దీ ఆశలు పెంచుకున్నాను. అతడు లేకపోతే నేను బతకలేను అన్నంత అనుబంధమేదీ మా మధ్యలేదు. |

నా మెడలో తాళికట్టిన వాడిగా అతడిని కోరుకున్నాను. మొగుడు వదిలేసిన ఆడదానిగా పడుండడం ఇష్టంలేక నాతో కాపురం చేయమని వేడుకున్నాను.కాని, కట్టుకున్న దానిమీద ఏ రకమైన భావమూ… అది ఇష్టం, కోరిక, బాధ్యత… ఏదన్నా కావచ్చు… లేనివాడితో నేనెలా కలిసుండగలను!

“రియల్లీ అయాం వెరీసారీ ముక్తా… నా చేతకాని తనం వలన నీ బతుకు బలి అయింది. ఏదైతే అదయ్యిందని పెళ్లికి ముందే ఈ విషయం నీతో చెబితే పరిస్థితి వేరేలా ఉండేది. ఆడపిల్లవైన నీకున్న ధైర్యం నాకు లేనందుకు సిగ్గు పడుతున్నాను.నా మెతకదనానికి నా మీద నాకే  సహ్యంగా ఉంది. నన్ను క్షమించు ముక్తా…’’ బావ కళ్లలో కృతజ్ఞతాభావం, స్వరంలో గాద్గద్యం చోటు చేసుకున్నాయి. ఈ ‘ క్షమించు’ అన్న పదం విని వినీ  అసహ్యం వేస్తోంది. చిరంజీవిలా’  తెలుగుభాషలో నాకు నచ్చని ఒకేఒక పదం ‘క్షమించు’  అని గంభీరంగా అనాలనిపిస్తోంది.

పదేపదే క్షమించమని కోరినంత మాత్రాన నేను మళ్లీ పెళ్లికాని పాత ముక్తలా మారిపోగలనా!? వేదమంత్రాల నడుమ, అగ్నిసాక్షిగా నా మెడలో ముడివడిన  ఈ బంధం నన్ను ఇలా అపహాస్యం చేయకుండా ఉండేదా! గడచినకాలం గుప్పిటసందుల్లోని ఇసుకలాగా జారిపోయింది. దాన్ని  వెనక్కి తిరిగి తీసుకొచ్చే శక్తి మనకిలేదు. ఆ పాటిదానికి ఇన్ని సార్లు క్షమాపణలు కోరడం దేనికి!

 ‘వస్తాను బావా’’ కారు డోర్ తీసుకుని దిగబోయాను.“ఆగు ముక్తా… దైవదర్శనం చేసుకోవద్దూ…’’ ఆపాడు బావ. పగలబడి నవ్వాలనిపించింది.  అది నడిరోడ్డు కాబట్టి బలవంతాన ఆపుకున్నాను. నాకు తెలియకుండానే నా కళ్లలో నీళ్ళు తిరిగాయి. అప్పుడే అర్ధమైంది… నా మనసు బాగా గాయపడిందని. విరక్తిగా నవ్వి కారు దిగిపోయి “థాంక్స్ బావా… నువ్వు, కీర్తన కలిపి చేసుకోండి దైవదర్శనం’ అనేసి , కిందికి వెళ్ళే బస్సులు ఆగి ఉన్న చోటుకి వెళ్లి నిలబడ్డాను.  నా వెనుకే వచ్చాడు బావ. “పద ముక్తా… నిన్ను కార్లో డ్రాప్ చేస్తాను.’’ అన్నాడు అపరాధ భావన నిండిన స్వరంతో.

“ వద్దు బావా… నేను బస్ లో వెళ్లిపోతాలే.’’ చెప్పాను పొడిగా.

 “ముక్తా… ఇఫ్ యు డోంట్ మైండ్…’’ పర్స్ లో నుంచి ఐదువందల నోట్లు తీశాడు బావ. చురుగ్గా చూశాను. ‘ ఏ అధికారంతో, ఏ హక్కుతో ఆడబ్బు తీసుకోను!’ అని ఆ చూపులు అతడిని నిలదీశాయేమో!...మాట్లాడకుండా జేబులో పెట్టేసుకున్నాడు.“వస్తాను బావా… ఏం జరగాలో త్వరగా ఆలోచించు. అది నీకు, నాకు చాలా మంచిది.’’ బస్ కదులుతూండగా చెప్పాను. తల దించుకున్నాడు బావ. అతడిని చూస్తే బాధనిపించింది.

 ఒక చిన్న ప్రతిఘటన’ మా ఇద్దరి జీవితాలనూ నాశనం కాకుండా కాపాడేది కదా! మూలిగింది హృదయం. కన్నీటిపొరల మధ్యన బావ రూపం అస్పష్టంగా కనిపించింది. బస్ కదిలింది నెమ్మదిగా. కర్చీఫ్ తో కళ్లు తుడుచుకుని, బావకి చేయూపాను .

--------------------

“ నీకోసం మంజూష వచ్చింది.’’ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక, అమ్మచేసిన ఉప్మాని తింటున్న నాకు పొలమారి, ముద్ద గొంతుకి అడ్డపడింది. నెత్తిమీద అరచేత్తో కొట్టుకుని చెంబెడునీళ్ళు గటగటమని తాగేశాను.అమ్మ ముఖం అప్రసన్నంగా ఉంది. నేను అబధ్ధం చెప్పి వెళ్ళానని ఆవిడకి కోపమొచ్చిందని బోధపడింది. మాటలకోసం తడుముకుంటూ “అదీ…అదీ” అంటూ నీళ్ళు నమిలాను.

 “ఎప్పుడూ అబధ్ధం చెప్పని నువ్వు, ఏనాడూ మా అనుమతి లేకుండా గడపదాటి వెళ్ళడం అలవాటు లేని నువ్వు అలా వెళ్లావంటే ఏదో కారణం ఉండే ఉంటుందని నాకు తెలుసు. ఆ కారణం ఏమిటని నిన్ను నిలదీయను. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు.’’ ఎప్పుడొచ్చారో… వంటగది గుమ్మంలో నిలబడిన నాన్న అన్నారు. ఆయన ముందు దోషిలా తలదించుకుని నిలవాల్సి వచ్చినందుకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అవనీ… నేను అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పడానికి తగిన సందర్భం వెతుక్కోకుండా కాలం కలిసివచ్చింది. ఎప్పటికైనా ఈ విషయం వాళ్ళకి తెలియాల్సిందే. తింటున్న కంచాన్ని అలాగే వదిలేసి నాన్న దగ్గరకి వచ్చి విషయమంతా పూస గుచ్చినట్లుగా వివరించాను.
  నాన్న కళ్లలో ఆశ్చర్యం…ముఖంలో అపనమ్మకం. తన తోడబుట్టిన చెల్లెలు స్వార్ధంతో ఇంత దగా చేసిందంటే ఆయనకి నమ్మబుధ్ధి కావడం లేదు. మాటరానట్లుగా అలా కుర్చీలో కూలబడిపోయారు. “నీసలు బుధ్ధుందే… వాడేదో చెప్పాడుట… ‘తగుదునమ్మా’ అంటూ ఈవిడగారు ‘తందానతాన’ అని వచ్చేసిందట. ఏమనుకుంటున్నారే పెళ్లంటే! బొమ్మలాట అనుకుంటున్నారా? అగ్నిసాక్షిగా నిన్ను పెళ్లాడి ఇప్పుడు నట్టేట ముంచేసి పోతాననడానికి వాడికి మనసెలా వచ్చింది? వాడిమీద నీకు సర్వాధికారాలూ ఉన్నాయి. వాడు నీ మెడలో తాళి కట్టాడే… ఆ అధికారం చాలు వాడిని నిలదీయడానికి. ఏమండీ… అలా చూస్తూ కూర్చున్నారేమిటి? పదండి మీ చెల్లెలిని అడగాల్సిన నాలుగూ అడిగేసి, కడిగేసి పారేద్దాం.’’ అమ్మ ఆపకుండా అరుస్తూనే ఉంది.

 నాన్న మౌన మహర్షిలా కూర్చున్నారు.నేను కూడా సమాధానం చెప్పకుండా అలా బొమ్మలా కూర్చుండిపోయాను ఇంటిచూరులో ‘ కిచకిచ’మంటూన్న పిచికపిల్లలను చూస్తూ. అరచి అరచి అమ్మ అలసిపోయింది.  ఎప్పుడు కబురు వెళ్లిందో గాని పెద్దక్క , బావగారు వచ్చేశారు.అందరూ కలిసి ఏం చేయాలా అని తర్జనభర్జనలు పడుతున్నారు.

 “నాన్నా ముక్తా… తొందరపడ్డావేమోరా?’’ కాస్సేపటిగా అన్నారు నాన్న శాంతంగా. నేను ఒక్క ఉదుటున ఆయన దగ్గరకి వెళ్ళిపోయి ఆయన ఒడిలో ముఖం దాచుకున్నాను. ఇందాకటినుంచీ నా గుండెల్లో అణగదొక్కి ఉంచి ఆక్రోశమంతా బద్దలైన క్షణం అది. నిజానికి నా బాధ తగ్గుముఖం పట్టిందనుకున్నాను ఇందాక. కాని, అది తాత్కాలికమని నేను భోరుమన్నప్పుడు తెలిసింది.

 “తల్లీ…వద్దురా… ఏడవకు. నీకిష్టం లేకపోతే నువ్వక్కడికి వెళ్లద్దు. కాని, సావిత్రి ఇలా ఎందుకు చేసిందో నాకు అర్ధం కావడంలేదు. పుట్టింటి అనుబంధం శాశ్వతం కావాలంటే ఇలానే చేయనక్కరలేదు. అది నిలబెట్టుకోవడానికి మా మధ్య రక్తసంబంధమే చాలును.’’ అన్నారు ఓదార్పుగా నా వెన్ను నిమురుతూ.చాలు… నాన్న నన్ను అర్ధం చేసుకున్నారు. నా మనసులో రగులుతున్న అగ్నిగుండాన్ని ఆర్పేశక్తి కేవలం నాన్న పలికే ప్రియవచనాలకే ఉంది.

“ఏంటండీ మీరు కూడానూ…అదేదో తలతిక్కగా వాగితే మీరు సమర్ధిస్తారేమిటి! అసలు… సంబంధం కలుపుకుందామని మనమేమన్నా దేవురించామా!తనంత తానుగా వచ్చి పిల్లనిమ్మని అడిగి దాని బతుకు నట్టేట్లో ముంచింది మీ చెల్లెలు.పదండి…వెళ్ళి ముఖంకాల్చి మంగళహారతి పాడుదాం.’’ అమ్మ అంది ఆగ్రహంగా.

“అవును మామయ్యగారూ…ఇప్పుడు అతడు ముక్తకి విడాకులిస్తే తన బతుకు ఏమౌతుంది? నలుగురిలో నవ్వులపాలవదూ! ఆడపిల్లకి పెళ్ళైన తరువాత అత్తవారిల్లే శాశ్వతస్థానం కావాలి. అదే ఆమెకి గౌరవం కూడానూ.’’ బావగారు సలహా ఇచ్చారు.

“ఏం గౌరవం బావగారూ… నేనక్కడే ఉంటే వాళ్లింట్లో షోకేసులో అందాన్ని పెంచే బొమ్మకీ నాకూ తేడా ఏముంటుంది! నాతో కాపురం చేసేది లేదని అతడు తెగేసి చెప్పిన తరువాత నేను అతడి నీడకోసం పాకులాడితే అది ఆత్మవంచనే అవుతుంది. నా వలన మీ అందరి పరువూ పోతుందంటే చెప్పండి… ఏ నూతిలోనో దూకుతాను…’’స్థిరంగా చెప్పాను. అక్క ఏదో అనడానికి నోరు తెరిచింది.

 “ఇక ఈ విషయంలో వాదోపవాదాలు అనవసరం.ఇప్పటికే దాని జీవితం గాడి తప్పింది. ఇంకా ముందుకుపోయి దాన్ని మరింత రవ్వలపాలు చేయలేను.దాని ముఖాన ఇంతే రాసుందనుకుందాం. దాని మనసెంతో కష్టపడితే గాని, ఇలాంటి నిర్ణయానికి రాదు. నా బిడ్డ నాకు బరువుకాదు. నేను బతికున్నన్నినాళ్ళూ దానికింత ముద్ద పెట్టలేకపోను ‘’ విసురుగా అన్నారు నాన్న. ఎన్నడూ ఎవరినీ కూడా పరుషంగా ఒక్క మాటకూడా అనని నాన్న… అలా…కర్కశంగా మాట్లాడడంతో బిత్తరపోయి చిత్తరువులై నిలిచిపోయారందరూ. ఆయన స్వరంలోని తీవ్రతకి కుక్కిన పేలకి మల్లే ఉండిపోయారు. బావగారు ముఖం గంటుపెట్టుకున్నారు.

 అమ్మ మరేమీ అనలేక” బాగుంది వరస.. పిల్లదేదో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే నాలుగు మంచిమాటలు చెప్పి  కాపురం చక్కదిద్దాలి కాని, గుండెలమీద కుంపటిలా అట్టిపెట్టుకుంటానంటారేమిటీ…’’ సణుక్కుంటూ లోపలికి పోయింది.

బామ్మ నన్ను కౌగిలిచుకుని “ముక్తమ్మా… నీకెంత కష్టం వచ్చిందే! అసలే… నోరు-వాయి లేని పిల్లవి.పెద్దవాళ్లందరం కలిసి నీ బతుకు బుగ్గి చేసి పారేశాము కదే.’’ అంటూ ఉసూరుమని ఏడ్చింది. తమ్ముడు అభావంగా చూసి బయటకుపోయాడు. నాన్నన్న మాటలకి చిన్నబుచ్చుకున్న పెద్దక్క, బావగారు మరే వ్యాఖ్యానాలూ చేయక నిష్క్రమించారు. సర్వం కోల్పోయిన బికారిలా అలా… శూన్యంలోకి చూస్తూండిపోయాను. నా జీవితంలో మిగిలింది శూన్యం కాక మరేమిటి!? 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్