Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నీ పేరు తలచినా చాలు

nee peru talachina chalu

గత సంచికలోని నీ పేరు తలచినా చాలు సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్  చేయండి...http://www.gotelugu.com/issue349/858/telugu-serials/nee-perutalachina-chalu/nee-peru-talachina-chalu/

 

(గత సంచిక తరువాయి)... ఆ తరువాత జరగాల్సినవన్నీ చకచకా జరిగిపోయాయి. పెద్దక్క ద్వారా విషయం తెలుసుకున్న చిన్నక్క నాకు ధైర్యం నూరిపోస్తూ పెద్ద మెయిల్ పెట్టింది. “జరిగినదేదో జరిగిపోయింది ముక్తా… దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడుచేసుకోకు.పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి నీ కాళ్లమీద నువ్వు నిలబడు. నీకే సహాయం కావాలన్నా అందించడానికి నీ అక్క ఉందన్న విషయం మరచిపోకు.’’ అంటూ ఎన్నో హిత వచనాలు రాసింది.

ఆ మెయిల్ నాలో ఆత్మవిశ్వాసం నింపింది. సరిగ్గా అప్పుడే నాకు పిజిలో సీట్ వచ్చింది. పెళ్లికి ముందు ఆ.సెట్ రాశాను. అప్పుడు మంచి రాంకే వచ్చినా సీట్ కన్‌ఫర్మ్ కాలేదు. కాని, ఫైనల్ లిస్ట్ లో నాకు సీటు లభించింది. ఉన్న ఊరిలో ఉన్న పి.జి. సెంటర్ లోనే నాకు అడ్మిషన్ దొరికింది. బావ , నేను కలిసి మాట్లాడుకున్న పదిరోజులకి కాబోలు… అత్తయ్య మా ఇంటికి వచ్చింది.మనిషిలో కళాకాంతులు కొరవడ్డాయి. అత్తయ్యే నాన్నను పలకరించింది మొదట. నాన్న గంభీరంగా తలాడించారు. అమ్మ ముఖం తిప్పుకుంది ఆడపడుచుని చూసి.

“అన్నయ్యా… అదీ…’’ ఏదో చెప్పబోతున్న అత్తయ్యని వారిస్తూ “వద్దమ్మా సావిత్రీ… సంజాయిషీలేమీ చెప్పద్దు… నువ్వు, నీ కొడుకు కలిసి నా బిడ్డ జీవితంలో నిప్పులు పోశారు. దయచేసి ఇకమీద నువ్వు ఈ ఇంటిగుమ్మం తొక్కద్దు… నిన్ను చూశానంటే నా బంగారుతల్లికి జరిగిన అన్యాయం గుర్తొస్తుంది. ఇకపై ఈ ఇంటిఛాయలకి కూడా రావద్దు.’’ కరాకండిగా చెప్పేశారు నాన్న. 

గుడ్లనీరు కుక్కుకుంది అత్తయ్య .అమ్మకాని, బామ్మకాని ఆమెని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇంట్లోని వారికి ఇష్టంలేని పెళ్లి చేసుకుని  ఓసారి పుట్టింటికి దూరమైన అత్తయ్య… కొడుక్కి ఇష్టంలేని పెళ్లిచేసి శాశ్వతంగా దూరమైంది. ఆ బంధం అతుక్కుంటుందన్న నమ్మకం ఎవరికీలేదు.

అత్తయ్య కళ్ళు తుడుచుకుంది. నేను లోపలికి వెళ్లి పెళ్లిలో ఆవిడ నాకు పెట్టిన నగలని బాక్స్ తో సహా తెచ్చి ఆమె ముందుంచాను. “ఇవెందుకు ముక్తా… అవి నీకోసం చేయించినవే…’’ అంది అత్తయ్య విస్తుపోతూ.

 “కాదత్తయ్యా… ఇవి నీ కోడలికోసం చేయించినవి. వీటిని పెట్టుకునే యోగం, యోగ్యత రెండూ నాకులేవు.’’ నా కంత తొణికిన నీరు చూసి అత్తయ్య ముఖం పాలిపోయింది. “అలా అనకు ముక్తా…ఇవి నీవే. నా మేనకోడలికి కానుక ఇచ్చే అదృష్టానికి నన్ను దూరం చేయకు.’’ అంది అత్తయ్య భారంగా. “ప్లీజ్ అత్తయ్యా… నన్ను బలవంతం చేయకు.’’ అన్నాను పదునుగా. అత్తయ్య మరేమీ మాట్లాడకుండా బ్యాగ్ తెరచి సరికొత్త ఐదువందల రూపాయల నోట్లకట్ట తీసి నా చేతిలో పెడుతూ “నేను చేసిన తప్పునెలాగూ సరిదిద్దుకోలేను. కనీసం… ఇదన్నా తీసుకో’’ అంది వణుకుతున్న గొంతుతో. “బండలైపోయిన నా బతుక్కి మూల్యం కడుతున్నావా అత్తయ్యా?’’ బాధగా అన్నాను.

“అపార్ధం చేసుకోకు ముక్తా… దేనికైనా పనికి వస్తుంది’’ అనునయంగా అంది అత్తయ్య.

 “వద్దు… ఈ డబ్బు తీసుకోవడానికి నాకు మనసు రావడంలేదు.’’ సున్నితంగా తిరస్కరించాను. చేసేదేంలేక అత్తయ్య వెనుదిరిగింది. నేను బండబారిన హృదయంతో అలా నిశ్చేష్టనై చూస్తూ ఉండిపోయాను.

------------

అనుకున్నట్లుగానే నేను పి.జి.లో చేరిపోయాను మా ఊరిలోనే. పరస్పరం ఇష్టంలేకపోవడం వలన నాకు, బావకి విడాకులు సులభంగానే లభించాయి. ఇద్దరం ఇప్పుడు స్వేఛ్ఛాజీవులం. కోర్టు తీర్పు లభించాక బావ నాకు కృతజ్ఞతలు చెప్పాడు. నేను దేవతనని, నా సహకారంవల్లనే ఇప్పుడు తన బతుకులో ఆనందం చోటుచేసుకుంటోందని, తన ప్రేమనర్ధం చేసుకుని పక్కకు తప్పుకున్నందుకు జీవితాంతం ఋణపడి ఉంటానని… ఇలా… నా పైన ప్రశంసలజల్లు కురిపించాడు. వాటికి నేను పొంగిపోలేదు. ఈ విడాకుల వలన నాకు కూడా విముక్తి దొరికింది. ఆత్మాభిమానం చంపుకుని జీవించడమంత హీనం మరొకటి లేదు. అందుకే… నేను కూడా అతడినుండి విడిపోవాలని కోరుకున్నాను.

బావ నాకు భరణం ఇస్తానన్నాడు. అవసరం లేదని నిరాకరించాను.అలా… ఒక ప్రహసనంలా సాగిన నా పరిణయఘట్టానికి ముగింపు దొరికింది. అయితే… నా సమస్య అక్కడితో తీరిపోలేదు. నిజానికి నా బతుకులో కొత్తమలుపు మొదలైనదప్పుడే.

-------------------------- 

ఆ రోజు సాయంత్రం కాలేజ్‌నుంచి ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి అక్కవాళ్ళింటికి బయలుదేరాను. నేనిలా సందుమలుపు తిరిగానో లేదో… సర్రున ఓ మోటార్‌బైక్ వచ్చి నాముందు ఆగింది.దానిమీద వెంకటేష్… అదే… శ్రీధర్ కూర్చుని ఉన్నాడు. అతడికి డబ్బుమత్తు బాగా ఒంట పట్టినట్లుంది… ఒళ్ళుచేసి పచ్చగా, దబ్బపండులా మెరిసిపోతున్నాడు.నేను అతడివైపు ప్రశ్నార్ధకంగా చూస్తూ నుదురు చిట్లించాను.

“నీతో మాట్లాడాలి ముక్తా…’’ అన్నాడు. నాకర్ధం కాలేదు. సరిగ్గా రెండేళ్ల క్రితమూ ఇదే మాటన్నాడు. అప్పుడంటే ఇద్దరం అవివాహితులం. కాని, ఇప్పుడు… మా ఇద్దరికీ పెళ్లిళ్ళైనాయి. పైగా అతడో బిడ్దకు తండ్రి కూడానూ. “నాతోనా! ఏం మాట్లాడుతావు?’’ అడిగాను ఆశ్చర్యంగా.  అతడు దూరంగా వేలుచూపిస్తూ “అలా వెళ్ళి మాట్లాడుకుందాం.’’ అన్నాడు.మా వీధికి ఎదురుగా  పెద్ద మర్రిచెట్టు ఉందక్కడ. దాని చుట్టూ కట్టబడి ఉన్న పెద్ద రాతి అరుగుమీద అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోవడం పరిపాటి. ఆరోజు కాస్త మబ్బుగా ఉండడం మూలాన ఎవరూ లేరక్కడ.

సరే పద” అటువైపు అడుగులు వేశాను. ఇద్దరం ఓ వారగా కూర్చున్నాం. మబ్బుతెరలను తొలగించుకుని  అప్పుడప్పుడు పలకరించి పోతున్ననారింజరంగు  సాయంకాలపు నీరెండ అద్భుతంగా ఉంది.

 “చెప్పు’’ అన్నాను ఎటోచూస్తూ.

 “ఏమీలేదు ముక్తా… అప్పుడూ ఇప్పుడూ… ఎప్పుడూ కూడా నువ్వంటే నాకు అభిమానమే. పెళ్లంటే వేరే అమ్మాయిని చేసుకున్నాను గాని, నా మనసంతా నీమీదే’’ చేతులు నులుముకున్నాడు శ్రీధర్.

 “అయితే?’’ అతడి మాటల్లో గూఢార్ధం నాకు బోధపడలేదు.

“మనిద్దరం …ఒక్కటైతే బాగుంటుందనీ…’’

“ఎలా? నీకూ పెళ్లైంది… నాకూ పెళ్లైంది.’’ అయోమయంగా అడిగాను.

“ ఒక్కటవడానికి… పెళ్లికి సంబంధం ఏమిటి ముక్తా?’’ ఫెళ్ళున నవ్వాడు శ్రీధర్ నా అమాయకత్వానికి.“ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా?’ అరిచాను గట్టిగా.అతడదేమీ పట్టించుకోకుండా “నిజానికి నీ జీవితం చాలా దయనీయంగా తయారైంది. పెళ్లయ్యిందన్నమాటే కానీ, ఏం సుఖపడ్డావు? నీకు నచ్చితే, అభ్యంతరం లేకపోతే… ఆ సుఖం నేనందిస్తాను.’’ చెప్పుకుపోయాడు వంకరగా నవ్వుతూ.  అతడి ఆంతర్యం అర్ధమై గజగజ వణికిపోయాను తుఫాను గాలికి అల్లాడిన చిగురుటాలా. నా కళ్ళకి అతడు అమాయక మేకను వేటాడడానికి అవకాశం కోసం పొంచిఉన్న పెద్దపులిలా కనబడ్డాడు.

“నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయితో మాట్లాడుతున్నానని మరచిపోతున్నావు.’’ కోపంతో ఊగిపోయాను.అతడు ఇసుమంతైనా చలించలేదు.  “పెళ్లైనా నువ్వింకా కన్యవేనని నాకు తెలుసు ముక్తా… నీ మొగుడుట్టి మూర్ఖుడు. ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని ఎంజాయ్ చేయకుండా వదిలేసిన ప్రవరాఖ్యుడు. అదే నేనైతేనా?’’ కవ్వింపుగా అన్నాడు శ్రీధర్.నాకు నసాళమంటింది. ఇరుగమ్మ పొరుగమ్మల సానుభూతి పొందడం కోసం నా ఆంతరంగిక విషయాలని సినిమా కథలా మా వీధంతా టాంటాం వేసిన అమ్మని తలచుకుంటే మండిపోయింది. వీడింత ధైర్యంగా నేను కావాలని అడుగుతున్నాడంటే దానికి కారణమేమిటి? నా సొంత సంగతులు బహిరంగమైపోవడం వల్లనే కదా!వాడి రెండుచెంపలూ పేలగొట్టాలన్నంత ఆవేశం కలిగింది. అది నడిరోడ్డు కావడం వలన నన్ను నేనే కంట్రోల్ చేసుకున్నాను.

“ ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు శ్రీధర్. మరొక్కసారి ఇలాంటి ఛండాలం ప్రపోజల్ తో నా ముందుకి వస్తే మర్యాద దక్కదు జాగ్రత్త’’ భద్రకాళిలా విరుచుకు పడ్డాను. వాడు నన్ను ఎగాదిగా చూసి, పెదవి విరిచి ” ప్చ్… పోనీపాపం వయసు పోరు పెడుతూ ఉంటుంది… కాస్త తాపం తీరుద్దామనుకున్నాను. నీకు అదృష్టం లేదు. నీ అందాన్ని ఆస్వాదించే యోగం నాకులేదు. ఏం చేస్తాం! బ్యాడ్‌లక్. ఎప్పుడైనా నీ మనసు మార్చుకుంటే కాకితో కబురుపెట్టు. క్షణాల్లో నీ ముందు వాలిపోతాను.’’ అనుకుంటూ వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు వాడు.వాడు వెళ్లినవైపు అసహ్యంగా చూస్తూ “డర్టీ రాస్కెల్… సుఖాలందిస్తాడట…సుఖాలు. వీడందించే ఆ దరిద్రపు సుఖాలకోసం ఎవరూ కూడా వెంపర్లాడిపోవడం లేదిక్కడ.’’ అనుకున్నాను కసిగా. మొగుడొసిలేసిన ఆడపిల్ల అంటే ఈ మగాళ్ళకి ఎంత చిన్నచూపో అర్ధమైంది తొలిసారిగా. ఆ సంఘటన తరువాత నా మనసంతా చిరాగ్గా తయారైంది. ఇక అక్కవాళ్లింటికి వెళ్ళే మూడ్‌లేక తిరిగి ఇంటికేసి బయలుదేరాను.

-----------------------

కాలగతిలో మరో రెండేళ్ళకాలం పరుగులు తీసింది. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఉద్యోగంకోసం వెతుకులాట మొదలైంది.ఈలోపు ఇంట్లో చెప్పుకోదగిన మార్పులే వచ్చాయి.నాన్న అనారోగ్యంతో నానాటికీ కృశించిపోసాగారు.జబ్బు చేసింది ఆయన శరీరానికి కాదు. మనోవ్యాధే ఆయన్ను లొంగదీసుకుంది. బామ్మకి ఏదో… పెరు తెలియనిజబ్బు వచ్చి నెలరోజులపాటు మంచంలో తీసుకుని. తీసుకుని కన్నుమూసింది. ఆ ఇంటికి పెద్దదిక్కుగా నిలిచిన ఆమె ప్రాణం అనంతవాయువుల్లో లీనమైన తరువాత మాకు దుఃఖం ఆగలేదు.వృధ్ధాప్యం… ఆపైన వచ్చిన మాయదారి జబ్బు ఆమెని కడతేర్చాయి.దినేశః ఇంజనీరింగ్ చదువు పూర్తయ్యింది. వాడికి ఎలక్ట్రిసెటీ బోర్డ్ లో జె.యి.గా ఉద్యోగం వచ్చింది. నాకు కూడా ఒక డిగ్రీ కాలేజీ లో ఉద్యోగం వచ్చింది. కాని, మేముంటున్న ఊళ్లోకాదు.ఏం చేయాలోనని విపరీతంగా ఆలోచించాను. 

ఆరోగ్యం సరిగ్గా లేని నాన్నని, మనశ్శాంతి లేక అలమటించె అమ్మని విడిచిపెట్టి ఉద్యోగం పేరిట వాళ్లకి దూరంగా వెళ్లడానికి మనస్కరించలేదు.  కాని, తప్పదు. ఈ ఊళ్లో… ఈ వీధిలో… పరిచయస్తుల జాలి చూపులు,కొంటెకుర్రాళ్ళ ఆకలిచూపులు, ఇరుగుపొరుగుల ఉచిత సలహాలు…ఇవన్నీ భరింపశక్యం కాకుండా ఉన్నాయి. అందుకే…నేనెవరో తెలియని చోటుకి, నా గతం గురించి ఎవరికీ పరిచయం లేని ప్రదేశానికి వెళ్లిపోవాలని నిశ్చయించుకుని ఇక్కడికొచ్చి ఈ ఉద్యోగంలో చేరాను.|
|

నేను ఉద్యోగంలో చేరకముందే…నాకు బాగా సన్నిహితులైన ఒకరిద్దరు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని సూచించారు. రెండు మూడు మంచి సంబంధాలు కూడా చూపించారు. యాధాలాపంగా ఆ విషయాన్ని ఇంట్లో చెప్పిననాడు అమ్మ పెద్ద గాలి దుమారమే లేపింది. ‘ మొగుడొదిలేసిన దానికి మళ్ళీ పెళ్ళేమిటని, ఆడదానికి ఒకే పెళ్లి, ఒకే మొగుడు ఉండాలని’ ఇంకా ఇలాంటివే చాలా చెప్పి నా ఆలోచనకి అడ్దుకట్ట వేసింది. అంతేకాదు… నేను ఇక్కడికొచ్చేముందు నా చేత తన మీద ప్రమాణం చేయించుకుంది. అదీ ఆ దేముడి సమక్షంలో.  ‘ రెండో పెళ్లి’ అన్న ఊహను పొరబాటున కూడా నా మెదడులోకి రానివ్వద్దని నా చేత ఒట్టు పెట్టించుకుంది. ఈ తతంగమంతా నాన్నకి తెలియకుండా అతి రహస్యంగా జరిగింది. ఆ పరిస్థితుల్లో… ఆమె చెప్పినదానికి ‘సై’ అనకపోతే ఆమె మానసికంగా ఇంకా క్షోభ పడుతుందని నేనలా ఒట్టు పెట్టాను. అయితే… నాదీ ఉప్పూకారం తింటున్న శరీరమే. నాకూ అందరిలాగే సుఖప్రదమైన దాంపత్యజీవితాన్ని అనుభవించాలని, ముద్దులొలికే బిడ్దలకి తల్లినై బతుకు పండీంచుకోవాలని మరీమరీ అనిపిస్తుంది.

కాని, అమ్మమీద వేసిన ఆ ఒట్టు ఆ కోరికను మొదలంటా నరికేస్తుంది..ప్రకృతిసిధ్ధంగా నా మనసులో పుట్టే కోరికలను చంపుకోలేక, అమ్మ మీద చేసిన ప్రమాణం మీరలేక ఎంతో నరకం అనుభవిస్తున్నాను.

-----------------------

 ఆ తరువాత సంగతులు నీకు తెలిసినవే. నీతో పరిచయం స్నేహానికి సరికొత్త భాష్యం చెప్పింది. నా జీవితంలో నిండిన శూన్యాన్ని నీ చెలిమి ద్వారా భర్తీ చేసుకుంటున్నాను.’’ దీర్ఘంగా నిట్టూర్చింది మౌక్తిక తన గతచరిత్రనంతా చెప్పాక. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. నక్షత్రసమూహాలని కూడగట్టుకుని నెలరాజు రంగప్రవేశం చేస్తున్నాడు. రమ్య మౌక్తిక దగ్గరగా వచ్చి ఆమె తల నిమిరింది. ఆ లాలనకి మౌక్తికలో ప్రజ్వరిల్లిన దుఃఖాగ్ని కాస్త ఉపశమించింది. “ రియల్లీ అయాం వెరీసారీ ముక్తా… నీ జీవితంలో ఇంతటి విషాదం ఉందని ఊహించలేదు ముక్తా. ‘ ఇంతటి అందగత్తెకి, బుధ్ధిమంతురాలికి ఇంకా పెళ్లెందుకు అవలేదు చెప్మా’ అనుకునేదాన్ని. నిజం తెలిశాక నాకు చాలా బాధగా ఉంది. మీ అమ్మగారు నీకు విధించిన ఆంక్షలు మాత్రం అమానుషం. నువ్వు కూడా ఆవిడమాటకి కట్టుబడి నీ జీవితాన్ని అడవికాచిన వెన్నెలలా చెసుకోవడం విచారకరం.

“ఏం చేయను రమ్యా?ఆవిడ సంతృప్తికోసమని , నాన్న ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నేను చేసిన ప్రమాణం అనుక్షణం నన్ను వెంటాడుతోంది. ఒట్టుతీసి గట్టున పెట్టి నా స్వార్ధం చూసుకుంటే ఏమౌతుందోనన్న భయం నన్ను మళ్ళీపెళ్ళి గురించి ఆలోచించనివ్వడం లేదు. నేనూ మనిషినే. నాకూ కోరికలున్నాయి. ఆశలున్నాయి.కాని, అవి నెరవేరే భాగ్యం మాత్రం నాకులేదు. తోడుకావాలంటూ నా మనసు, వయసు చేసే అల్లరి తట్టుకోలేక, తెగించి అడుగు ముందుకేయలేక నాలో నేనే నలిగిపోతూ నరకమనుభవిస్తున్నాను.’’ మొట్టమొదటిసారి మనసు తలుపులు తెరచి తనివితీరా ఏడిచింది మౌక్తిక. రమ్య కళ్లలో కూడా నీళ్ళు తిరిగాయి. చప్పున మౌక్తికను గుండెలకి హత్తుకుని “ఊరుకో ముక్తా… రిలాక్స్. ఈ పెద్దవాళ్లంత మూర్ఖులు మరొకరుండరు. మీ అమ్మగారు సంఘంలో పరువు-ప్రతిష్ట వీటన్నింటి గురించే ఆలోచించారు గాని,  నీ సుఖసంతోషాల గురించి పట్టించుకోలేదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఛాందస భావాలున్నవాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.  దీన్నిబట్టి చూస్తే… ఆ రోజుల్లో మన సమాజంలో వేళ్లూనుకుని ఉన్న సాంఘికదురాచారాలను రూపుమాపడానికి ‘ ఆ రాజారామ మోహన్ రాయ్, వీరేశలింగం పంతులుగారు’ లాంటి సంఘ సంస్కర్తలు ఎంతగా కృషిచేశారో, ఈ సమాజానికి ఎంతగా ఎదురీదారో బోధపడుతోంది.’’ ఆవేశంగా అంది రమ్య.“అమ్మనేమీ అనకు రమ్యా… చెప్పాను కదా…ఆవిడవన్నీ పురాతనభావాలు. బామ్మ బతికుంటే నా సంగతి ఎలా ఉండేదోమరి!’’ వెక్కుతూనే వారించింది మౌక్తిక.

“అదే చెప్తున్నా...ఈ సమాజం ఒంటరి ఆడదాన్ని ఎంత చిన్నచూపు చూస్తుందో ఆవిడ ఎరుగనిది కాదు. ఎల్లకాలమూ నువ్విలా మోడువారిన చెట్టులా బతుకునీడవడం అంటే మాటలుకాదు! జీవితాంతం తోడుగా నడవాల్సిన సహచరుడు లేక, కడుపునపుట్టిన బిడ్డల ఆదరణలేక సాగే స్త్రీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆవిడకి తెలియదా!?’’ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయింది రమ్య. మౌక్తిక మాట్లాడలేదు.“పోనీ… అదంతా పక్కనపెట్టు. ఇప్పుడు నీకు మంచి అవకాశం వచ్చింది. నువ్వు ‘ ఊఁ’ అనాలేగాని మధుకిరణ్ నిన్ను పెళ్లిచేసుకునేందుకు  ముఖంగా ఉన్నాడు. నువ్వు ‘ యస్’ అని ఒక్కమాటంటే చాలు… మీ అమ్మగారిని నేను ఒప్పిస్తాను. ‘ నౌ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్’ ‘’ అంది రమ్య.  మౌక్తిక ముఖం అంతా రక్తం ఇంకిపోయినట్లుగా పాలిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు మధుకిరణ్ తన ప్రేమను వ్యక్తపరుస్తాడని ఆమెకూ తెలుసును కాని, అతడినేరకంగా ఎదుర్కోవాలో మాత్రం తోచలేదు. మధుకిరణ్ లాంటి జీవిత భాగస్వామి దొరకాలంటే ఏ జన్మలోనో బంగారుపూలతో పూజలు చేసుండాలి. కాని, తాను చేసిన పూజలు, నోచిన నోములు అన్నీ అసంపూర్ణమైనవి అయ్యుంటాయి. ఆ కొరనోముల ఫలితంగానే మేనబావతో పెళ్లైకూడా అతడికి దూరమైంది. ఆ నోముల కారణంగానే ఇవాళ ఆణిముత్యంలాంటి మధుకిరణ్ తనను వలచి వస్తే నిరాకరించ వలసిన దౌర్భాగ్యస్థితి ఎదురైంది. ఎవరో అన్నట్లు’ అదృష్టవంతుడిని చెరిపేవాడు లేడు. నిర్భాగ్యుడిని బాగు చేసేవాడు లేడు’ అని… నేను దౌర్భాగ్యురాలుని. ఎవరు చక్కదిద్దాలనుకున్నా తనబతుకు బాగుపడదు.అది అంతే.

“ఏమిటాలోచిస్తున్నావు? ఏం చెప్పాలా అనా? మీ అమ్మనాన్నలు ఎల్లకాలమూ నీకోసం కూర్చోరు. నీ జీవితానికి స్థిరమైన ఆలంబనను నువ్వే వెతుక్కోవాలి.’’ హితబోధ చేసింది రమ్య.“లేదు రమ్యా…అమ్మ మాటను మీరేంతటి మానసిక ధైర్యం నాకులేదు. ఈ జీవితం ఇలా గడచిపోవాలని రాసుంది. అలాగే జరగనీ. ఈ విషయంలో నేను అశక్తురాలిని. అయాం హెల్ప్‌లెస్’’ భోరుమంది మౌక్తిక. “నువ్వింక పిరికిదానివనుకోలేదు ముక్తా…కోరి నీ జీవితం పాడు చేసుకుంటున్నావు’’ కిందపెదవిని పంటికింద అదిమిపెట్టింది రమ్య.  “ఎలాగైనా అనుకో… నేను మాత్రం అమ్మమాట జవదాటే సాహసం చేయలేను. అయినా మధుకిరణ్‌కి నా గతం గురించి తెలియదు. అందుకే నన్ను ప్రేమించాడు. నా గురించిన నిజాలు తెలిస్తే మరిక నా జోలికి రాడు.’’ విరక్తిగా నవ్వింది మౌక్తిక కళ్లుతుడుచుకుని. “అతడంత సంకుచితుడు కాదనే నా అభిప్రాయం. అతడు నిన్ను డైరెక్ట్‌గా కలిసిఈ విషయం గురించి ప్రస్తావిస్తే మాత్రం కాస్త వివేకంతో బదులియ్యి. ఇది జీవితం… మంచి అవకాశం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది.’’ చెప్పింది రమ్య అదే ఆఖరుమాట అయినట్లుగా. అప్పటికే ఆ పరిసరాలలో చిక్కటి చీకటి అలుముకుని ఉంది. ఆకాశమంతా నిండిన చంద్రకాంతి ధగధగాయమానంగా వెలిగిపోతూ ఆ చీకటిని తరిమికొడుతోంది.  చంద్రుని చల్లదనం మౌక్తిక మనసులో చెలరేగే జ్వాలలను ఏ మాత్రం చల్లార్హలేకపోతోంది.

“ఇందాక అంకుల్ ఏం చెప్పారో విన్నావు కదా! రేపటినుండి నువ్వు యోగా క్లాసులకెళ్లు.’’ చెప్పింది రమ్య. అలాగేనన్నట్లుగా తలూపింది మౌక్తిక.“కిందకెళదాం పద… శరత్ వచ్చే వేళయ్యింది.’’ మెట్లవైపుగా నడిచింది రమ్య. అనుసరించింది మౌక్తిక.

----------------------

రమ్య చెప్పినట్లే యోగా క్లాసులకి వెళ్తోంది మౌక్తిక. ఇప్పుడిప్పుడే ఆమె మనసు కుదుటపడుతోంది. ధ్యానం చేయడం వలన ఆమె మనసులో కల్లోలం తగ్గి ప్రశాంతత చేకూరుతోంది. యోగాసనాలు వేయడం, ధ్యానంలో కూర్చోవడం…ఇత్యాది సాధనల వలన ఆమె మానసిక, శారీరిక ఆరోగ్యాలు మెరుగుపడ్డాయి. పదేపదే ఆమెను వేధించి, కలవరపెట్టే ఆకల మరిరావడం లేదిప్పుడు.  అంతర్ముఖంగా ఉండడం మానేసి, రమ్యముందు తన మనసు విప్పిచెప్పుకోవడం మూలాన ఒత్తిడితగ్గి, హృదయభారం తీరింది.  నిజమే… ఆనందమైనా , ఆవేదనైనా ఆప్తులతో పంచుకుంటే కలిగే ఊరటే వేరు. ఆవిషయం మౌక్తికకు అనుభవైకవేద్యమైంది .కాని, అప్పుడప్పుడు… ఆమె మదిలో అనేకానేక భావాల మధ్యన అంతర్యుధ్ధం జరుగుతోంది. మధుకిరణ్ తనని ప్రేమిస్తున్నాడని తెలిసినప్పటినుంచీ తన మదిలో చెలరేగే భావసంచలనాన్ని అదుపులో పెట్టలేక ఆమె సతమతమౌతూనే ఉంది. ఏం చేయగలదు! ఏమీ చేయలేని అసహాయత ఆమెది. కొన్ని చిక్కుముడులను కాలమే విప్పాలి. మానవుడు పరిష్కరించలేని కొన్ని క్లిష్టసమస్యలను… విసుగు విరామంలేక, అలుపుసొలుపు ఎరగక ముందుకు సాగిపోయే కాలమే పరిష్కరించాలి.

----------------   

దినేష్ దగ్గరనుంచి ఫోన్‌కాల్ వస్తూండడంతో క్లాస్ లో ఉన్న మౌక్తిక దాన్ని కట్ చేస్తూ వస్తోంది. కాని, మళ్ళీమళ్ళీ ఆ కాల్ వస్తూనే ఉండడంతో “ఎక్స్యూజ్  మి మై డియర్ స్టూడెంట్స్…’’ అని చెప్పి ఫోన్ ఆన్సర్ చేసింది. ఫోన్లో దినేష్ చెప్పిన విషయం వింటూంటే మెదడు మొద్దుబారి పోయిందొక్కసారిగా. కాళ్లుచేతులు గడగడ వణికాయి.

“ఏ… ఏమైంది దినేష్… నాన్నకేమైంది?’’ స్వరం కంపించింది. “వివరాలు నేను చెప్పలేనక్కా… నువ్వు వెంటనే బయలుదేరి రా” అనేసి ఫోన్ కట్‌చేశాడు దినేష్. మౌక్తికకు దుఃఖం పొంగుకొస్తోంది గట్టు తెగిన వాగులా.

“ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ …సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్…’’అని చెప్పేసి ఉధృతంగా ఉబికివస్తున్న ఏడుపుని అణిచిపెట్టాలని ప్రయత్నిస్తూ ప్రిన్సిపాల్ రూమ్‌వైపు దూసుకుపోయింది మౌక్తిక. ఆయనకి విషయం వివరించి వారం రోజుల పాటు సెలవు కోరింది. పరిస్థితిలోని తీవ్రతను అర్ధం చేసుకున్న ఆయన మరేమీ అనకుండా సెలవు మంజూరు చేశారు. అప్పుడే పీరియడ్ బెల్ మోగడంతో రమ్య క్లాసునుంచి ఇవతలకి వచ్చింది ఆమెతో సంగతిని క్లుప్తంగా  చెప్పేసి తాను ఊరికి వెళ్తున్నట్లుగా చెప్పింది మౌక్తిక.

ప్రిన్సిపాల్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆమెను ఆర్టీసీ కాంప్లెక్స్ లో డ్రాప్ చేసింది రమ్య. అప్పటికి తాను ఎక్కాల్సిన బస్ రెడీగా ఉండడంతో నిశ్చింతగా ఊపిరితీసుకుంది మౌక్తిక.

“చేరగానే ఫోన్ చేయి ముక్తా…నాన్నగారికేమీ కాదులే… నువ్వు ధైర్యంగా ఉండు.’’బస్ కదిలేవరకు ఏవేవో జాగ్రత్తలు చెబుతూనే ఉంది రమ్య.  బస్‌లో కూర్చున్నదన్న మాటేగాని మనసు అలలతాకిడికి కల్లోలమైన కడలిలాగా ఉంది. ‘అసలు… నాన్నకేమై ఉంటుంది! దినేష్ ఎందుకు వెంటనే రమ్మని ఫోన్ చేశాడు?’ అని ఒకటే కంగారుగా ఉంది ఆమెకి. దినేష్ ఆమెకు వివరాలేమీ చెప్పలేదు. తండ్రికి బాగాలేదని ఆసుపత్రిలో చేర్చామని మాత్రమే చెప్పాడు. బస్ విజయనగరం చేరేసరికి తెల్లవారుఝామున నాలుగైంది. మౌక్తికను తీసుకెళ్లేందుకు దినేష్ వచ్చాడు.  “నాన్నకెలా ఉంది?’’ అంటూ మౌక్తిక ఆదుర్దాగా అడిగినా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు.

‘భయపడ్డాడు కాబోలు!’ అనుకుంది మౌక్తిక. ఇంటికి చేరగానే తలుపుతీసిన శకుంతల కూతురిని చూస్తూనే భోరుమంది. ఏడ్చి ఏడ్చి ఆమెకళ్లు ఎర్రగా మారి, ఉబ్బిపోయి మంకెనపూవులని తలపింపజేస్తున్నాయి.దినేష్ ఏమీ మాట్లాడకుండా గదిలోకెళ్లి తలుపేసుకున్నాడు.  మౌక్తికకు అతడి వైఖరి అంతుచిక్కలేదు. ఏ భావమూ లేకుండా అతడంత నిర్లిప్తంగా ఎందుకున్నాడో ఆమెకి బోధపడలేదు.

“ఇంతకీ నాన్నకేమైందమ్మా?’’ ఆదుర్దాగా అడిగింది మౌక్తిక.శకుంతల జిర్రున ముక్కు చీది “ హార్ట్‌అటాక్… ఇరవైనాలుగ్గంటలసేపు అబ్జర్వేషన్‌లో పెట్టాలని డాక్టర్స్ చెప్పారు’’ చెప్పింది వెక్కిళ్ళుపెడుతూ.

“మరి హాస్పిటల్‌లో ఎవరున్నారు?’’

 “పెద్దక్క, బావగారు ఉన్నారు. రాత్రి పదకొండింటివరకు నేనక్కడే ఉన్నాను. ఎక్కువమంది ఉండకూడదని అక్కడి నర్సులు కోప్పడితే పెద్దక్కే… బలవంతంగా నన్ను ఇంటికి పంపింది. నాన్న ఐసియు లో ఉన్నారు. నాకెందుకో భయంగా ఉందే ముక్తా…’’ మరోసారి ఘొల్లుమంది శకుంతల.

“ఏం ఫరవాలేదమ్మా… ఇప్పుడు వైద్యరంగం చాలా అడ్వాన్స్ అయ్యింది. మంచి మందులొచ్చాయి. నాన్న క్షేమంగాఇంటికొస్తారు. నువ్వేమీ భయపడకు.’’ గుండెపోటు అంటే సామాన్యమైన విషయం కాదని తెలిసినా తల్లికి ధైర్యం చెప్పింది మౌక్తిక.

“ఏమోనే… ఆయన క్షేమంగా ఇంటికొస్తే ఆ ఏడుకొండలూ నడిచొస్తానని మొక్కుకున్నాను.’’ శకుంతల పలికింది వణికేస్వరంతో.

“అలాగే చేద్దూగాని … తమ్ముడేంటీ అలా మూడీగా ఉన్నాడూ…’’ అడిగింది మౌక్తిక.

“వెధవ… వాడూసు ఎత్తకు… వాడివలనే ఈ ఉపద్రవం వచ్చిపడింది.’’ అంతవరకు ఏడుపుతో ఎర్రబడిన శకుంతల కళ్లు అప్పుడు కోపంతో రక్తారుణిమ నింపుకున్నాయి.

 “వాడివలనా! అంత కాని పని వాడేం చేశాడమ్మా?’’ ఆశ్చర్యపోయింది మౌక్తిక.  “ఏం చేశాడమ్మా? అంటూ అంత నెమ్మదిగా ఆడుగుతావేం… వాడు మా కొంపముంచాడు. మీ నాన్నగారి పరువు నిలువునా తీశాడు. ఎవరో అమ్మాయిని ప్రేమించానని మోసం చేయబోయాడుట… వాళ్ల వాళ్లందరూ ఇంటి మీదకొచ్చి నానా గలాభాచేసి గందరగోళం సృష్టించారు. ఆ గొడవకే మీ నాన్నకి గుండెపొటొచ్చింది.’’ ఆగ్రహంగా చెప్పింది శకుంతల కొడుకుపైన గల కినుకను వ్యక్తపరుస్తూ.  చేష్టలుదక్కి నిలబడిపోయింది మౌక్తిక. నిజంగా… దినేష్ ఇంతటి గ్రంధసాంగుడైనాడా!?     “ నువ్వు చెప్పేది నిజమేనా అమ్మా?’’ బలవంతాన నోరు పెగుల్చుకుంది మౌక్తిక.   “ బాగుందే… అబధ్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? వాడిని చూస్తే ఆయనకి మళ్ళీ తిరగబెడుతుందని మేమే హాస్పిటల్ కి రావద్దన్నాం.’’ విసురుగా పలికింది శకుంత.  “మరి ఆ అమ్మాయి?’’   “తగుల్చుకున్నాక తప్పుతుందా! ఆ గదిలో వాడితో పాటే ఏడిసింది.’’ నిరసన గళం వినిపించింది శకుంతల.   మౌక్తిక గదిలోకి వెళ్లింది. తప్పుచేసిన వాడిలాగా తల దించుకుని కూర్చున్నాడు దినేష్.  “రా అక్కా…’’ అన్నాడు మౌక్తికను చూస్తూనే.  “అమ్మ ఏదో చెబుతోంది…’’

“నువ్వు ప్రయాణం చేసి బాగా అలసిపోయావు. రెస్ట్ తీసుకో… తెల్లారాక మాట్లాడుకుందాం.’’ అన్నాడు దినేష్ నిర్వేదంగా. “ అలాకాదులే… విషయమేమిటో చెప్పు…’’ ఖచ్చితంగా ఆడిగాను.  వాడు నిస్సహాయంగా చూస్తూ “ ప్రీతి నేను ఇంజనీరింగ్ లో క్లాస్‌మేట్స్… ఇద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం.  నాన్నగారితో ఈ విషయం చెప్పి ఆయన ఆమోదం పొందాక ప్రీతి వాళ్ల వాళ్లకి కూడా చెబుదాం అనుకున్నాం. ఈ లోపే  ఈ విషయం వాళ్లింట్లో తెలిసి పెద్ద రభస అయ్యింది.ప్రీతి అన్నయ్యలు నన్ను అపార్ధం చేసుకుని, నేను తనని ఛీట్ చేశానేమోనని భావించి, ఇంటిమీదకు వచ్చి నానాగొడవా చేశారు.వాళ్ళని వారించాలని ప్రయత్నంచేసి అశక్తుడనైనాను. పరిస్థితి నాచేయి దాటిపోయిందని అర్ధమైంది. అందుకే… అప్పటికప్పుడు ప్రీతిమెళ్లో తాళి కట్టాల్సివచ్చింది.  ఈ అల్లరంతా నాన్నను మానసికంగా చాలా డిస్టర్బ్ చేసింది. నా వలన పదిమందిలో ఆయన పరువు మంటకలిసిపోయింది. ఆ బెంగతోనే ఆయనకు స్ట్రోక్ వచ్చింది. ఈపనివలన అమ్మ దృష్టిలో దోషిగా మిగిలిపోయాను. ఇప్పుడు నాన్న ఉన్న దుస్థితికి ఒకవిధంగా నేనే కారణం అక్కా…’’  పశ్చాత్తాపం నిండిన దినేష్ స్వరంలో నిజాయితీ  కనిపించింది మౌక్తికకు. బరువుగా వెలువడుతున్న అతడి మాటలు, అతడి మనోభారాన్ని సూచిస్తున్నాయి. అప్పుడు గమనించింది మౌక్తిక అతడిపక్కనే నిలబడి, భీతహరిణలా బితుగ్గా చూస్తున్న అమ్మాయిని.  అనుకోని విఘాతం ఎదురైనప్పుడు తల్లడిల్లే పసిపిల్లలాగా ఉందామె వాలకం. “దీనికంతటికీ కారణ్ నేను. మా వాళ్లు మిస్ అండర్‌స్టాండ్ చేసుకుని తొందరపడడం వల్లనే ఈ ముప్పు వచ్చింది. దయచేసి దిన్నూని ఏమీ అనకండి.’’ ఏడుపుగొంతుతో పలికింది ప్రీతి.

దీనంగా ఉన్న ఆ అమ్మాయి వదనం చూస్తే జాలి ముంచుకొచ్చింది. నిజమే… దినేష్ చెప్పినదాన్ని బట్టి చూస్తే జరిగినదానిలో ఆ అమ్మాయి ప్రమేయమూ ఉన్నట్లూ తోచలేదు.ఆమె నిమిత్తమాత్రురాలు మాత్రమే.ఏదైనా సంఘటన జరగడానికి కార్యకారణ సంబంధం అంటూ ఒకటుంటుందని బామ్మ అనేది. ఇప్పటి ఈ సంఘటనకి ఆమె అనుకోని కారణమైంది. చేసేదీ… చేయించేదీ… ఆ జగన్నాటక సూత్రధారి.  “జరిగిందేదో జరిగింది…నాన్నకిప్పుడు మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. ఆయన మనసు కుదుటపడేవరకు నువ్వాయనకి ఎదురుపడకు. నేను ఆయనకి నచ్చ చెబుతాను. అన్నీ అవే సర్దుకుంటాయి.’’ చెప్పింది మౌక్తిక దినేష్ భుజంతట్టి. జరిగిన పరిణామాలన్నీ చూస్తూఉంటే సినిమాల్లో సంఘటనల్లా అనిపిస్తున్నాయామెకి.ఎవరో పనిగట్టుకుని డైరెక్ట్ చేసినట్లుగా సీన్లన్నీ అత్యంత నాటకీయంగా జరిగిపోతున్నాయి  అంతలోనే నవ్వుకుంది విషాదంగా. అవును… ఆ దేముడిని మించిన ఎఫిషియెంట్ డైరెక్టర్ ఎవరుంటారు! మానవ జీవితానికి సంబంధించిన ప్రతి సంఘటనకూ పకడ్బందీయైన స్క్రీన్‌ప్లేని రాసుకుంటాడాయ.  మనిషి మనుగడకి చెందిన స్క్రిప్ట్‌ని పక్కాగా తయారుచేసుకుంటాడు.  ఆ పైనుంచే మానవుని జీవితదశలను నిర్దేశ్యించి, రిమోట్ తన చేతిలో ఉంచుకుని ఆటాడిస్తాడు. “థాంక్యూ ముక్తక్కా… థాంక్యూ వెరీమచ్. కనీసం నువ్వైనా నా హృదయఘోషను అర్ధం చేసుకున్నావు. అంతేచాలు.’’ దినేష్ కళ్ళు సజలమైనాయి.  పొరపాటు చేశానేమోనన్న అపరాధభావన నిండిన వాడి వదనంలోకి కాస్తంత వెలుగు చిమ్మింది.  “వెళ్ళి పడుకోరా… అమ్మా ప్రీతీ… నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో…’’ అనేసి బయటపడింది మౌక్తిక ఆ గదిలోనుంచి.  “నువ్వేమిటే… వాడికి నాలుగు చీవాట్లువేసి, ఇంత గడ్డి పెడతావనుకుంటే… అలా వెనకేసుకొస్తున్నావేంటి?’’ చాటుగా నిలబడి అంతా వింటున్న శకుంతల కూతురిమీద విరుచుకుపడింది. తల్లి ధోరణి మౌక్తికకు చిరాకు తెప్పించింది. చిన్నప్పటినుంచీ చూస్తోంది. అదే స్వభావం. ఎంతసేపూ తన సొద అతనదేగాని, ఎదుటివ్యక్తి అభిప్రాయాలని, ఉద్దేశ్యాలని, ఉద్వేగాలని అర్ధం చేసుకునే ప్రయత్నమే చేయదు. కనీసం… అవతలవాళ్ళేం చెబుతున్నారో వినేందుకు కూడా మొగ్గుచూపదు. అందుకే కాబోలు… ఆవిడకి, బామ్మకి నిరంతరం వాగ్యుధ్ధాలు జరుగుతూ ఉండేవి.

 “ఏంటమ్మా… వచ్చినదగ్గరనుంచీ చూస్తున్నాను. నీ గోల నీదేగాని ఎదుటివాళ్ళనసలు పట్టించుకోవు. ప్రతీ విషయాన్నీ భూతద్దంలోనుంచి చూసి గగ్గోలుపెడతావు.అసలు… నాన్నకి నీమూలంగానే వచ్చుంటుంది గుండెపోటు. కనీసం తమ్ముడి విషయంలోనైనా సర్దుకుపోవడానికి ప్రయత్నించు.’’ఎప్పుడూ తల్లి మాటలకి ఎదురాడని మౌక్తిక అలా కసురుకుంటున్నట్లుగా మాట్లాడడంతో అవాక్కయి నిలబడిపోయింది శకుంతల. “అనవే అను… మీ అందరూ మంచివాళ్ళే. ఎదుటివారిని అర్ధం చేసుకునే ఉత్తమోత్తములే. నేనే దుర్మార్గురాలిని. పగదాన్ని, పరాయిదాన్ని’’ మళ్ళీ ముక్కుచీదింది శకుంతల ఏడుపు మొదలెడుతూ. ఆవిడని ఓదార్చడానికి తాతలు దిగి వచ్చినంత పనైంది మౌక్తికకు. అప్పుడప్పుడే తెల్లారుతోంది. అరుణభానుడి ఆగమనానికి మురిసిన తూరుపుకాంత ఆయనకు స్వాగతగీతి పాడడానికి సమాయత్తమవుతున్నట్లుగా కెంజాయవర్ణపు వస్త్రాన్ని చుట్టుకుంటోందా అన్నట్లుగా ఆకాశం అంతా ఎర్రబడింది. ఆ ప్రశాంత ప్రభాతంలో… పక్షుల కిలకిలారావాలు అనేక రకాలైన వాయిద్యాల సమ్మేళనంలా ధ్వనిస్తున్నాయి.  రాత్రంతా ప్రయాణం…ఎడతెరిపిలొఏని ఉద్విగ్నత… వీటన్నింటితో అలసిపోయిన మౌక్తిక కళు మూతలుపడ్డాయి ఆమె ప్రమేయం లేకుండానే. అలా హాల్లోనే ఓ మూలకి ఒరిగిపోయింది.

------------------------

“ముక్తా లేమ్మా… లే..’’ శకుంతల తట్టిలేపడంతో మౌక్తికకు మెలకువ వచ్చింది. బధ్ధకంగా కళ్ళు తెరిచి , కిటికీలోనుంచి బయటకు చూసింది. బయట ఎర్రని ఎండ కాస్తోంది.తరణి తన తీక్షణతతో పరిసరాలను మండిస్తున్నాడు.  “ముక్తా బారెడు పొద్దెక్కింది లేమ్మా..టైమ్ ఎనిమిది దాటుతోంది. ఆ వేడి డబ్బాలో ఇడ్లీలు, ఫ్లాస్కోలో కాఫీ అన్నీ రెడీ చేసి పెట్టాను.చూసుకో. నేను హాస్పిటల్ కి వెళ్లొస్తాను. అక్కావాళ్ళు కాఫీ అయినా తాగారో లేదో..’’కూతురి ముఖం మీదకు వంగి నిద్రలేపింది శకుంతల. భర్త ఆరోగ్యం సరిగా లేదన్న బెంగ ఆమెను డీలాపడేలా చేస్తోంది. రెండురోజులుగా పడుతున్న టెన్షన్, నిద్రలేకుండా చేస్తున్న జాగరణ ఫలితంగా ముఖమంతా పీక్కుపోయి, కళ్లు లోతుకిపోయి నీరసంగా ఉంది ఆమె వాలకం.  తల్లిని చూస్తే జాలి ముంచుకొచ్చింది మౌక్తికకు. చటుక్కున లేచి కూర్చుంటూ…’’ఛ…ఛ…మొద్దునిద్ర పట్టేసిందదేమిటోగాని…కాస్సేపాగు అమ్మా… నేను తీసుకెళ్తాను అక్కవాళ్లకి టిఫిన్, కాఫీ. నాకు కూడా నాన్నగారిని ఎంత త్వరగా చూస్తానని ఒకటే ఆత్రంగా ఉంది.’’ అంది మౌక్తిక.  “తొందరేమీలేదు… నువ్వు తాపీగా రా. రాత్రనగా వచ్చేశాను.ఆయనెలా ఉన్నారో ఏంటో!నేను వెళ్తాను… నువ్వు తరువాత రా…’’ అంది శకుంతల హడావుడి పడుతూ. మరి తర్కించలేదు మౌక్తిక. ఆవిడ ఆదుర్దాని అర్ధం చేసుకున్నదానిలా మౌనంగా ఉండిపోయింది.  “సరే… నువ్వొక్కదానివీ వెళ్లగలవా మరి!’’ అడిగింది. “ఆఁ…మరేం ఫరవాలేదు. తెలిసిన రిక్షావాడున్నాడుగా. వాడిని రమ్మన్నాను.’’ చెప్పింది శకుంతల కంగారుగా అన్నీ సర్దుకుంటూ.  మౌక్తిక లెచి స్నానపానాలు పూర్తిచేసుకుని తయారయ్యేసరికి పదిదాటింది. ప్రీతికి, దినేష్‌కి జాగ్రత్తలుచెప్పి ఆదరాబాదరా హాస్పిటల్‌కి బయలుదేరింది. ఆమె వెళ్ళేసరికి విద్యాధరరావు పరిస్థితి ఏమంత ఆశాజనకంగాలేదు. శకుంతల విషణ్నవదనంతో దీనంగా కూర్చుని ఉంది. కార్తిక, ఆమె భర్త కూడా ఆందోళన చెందుతున్నారు. కూతుర్ని చూస్తూనే” ముక్తా” అంటూ బావురుమంది శకుంతల. ఆ స్థితిలో ఆమె అవధులుదాటి పొంగుతున్న శోకసంద్రంలా ఉంది. ఊరుకోమన్నట్లుగా తల్లి భుజాలమీద చేతులు వేసి పొదివిపట్టుకుంది మౌక్తిక.   ఆమెకళ్ళు కూడా సజలమైనాయి. ముక్కుకి ఏవేవో గొట్టాలు, నోటికి ఆక్సిజన్ మాస్క్… ఇవన్నీ తగిలించబడి అపస్మారకంగా పడి ఉన్న తండ్రిని చూస్తే ఆమెకు దుఃఖమాగడంలేదు.

ఆ మధ్యాహ్నం విద్యాధరరావుకి మరోమారు స్ట్రోక్ వచ్చింది. అది ఈసారి ఆయన ప్రాణాలను తనతోపాటుగా పట్టుకుపోయింది. మృత్యువుతో పోరాడేశక్తిని కోల్పోయిన ఆయన దాన్ని స్వాగతించారు సంతోషంగా.  శకుంతలని ఆపడం ఎవరివల్లనా కావడంలేదు.గుండెలు బాదుకుంటూ, దుఃఖభారంతో నిలువెల్లా కంపించిపోతూ ఆక్రోశిస్తున్న ఆమెను చూస్తే కడుపు తరుక్కుపోతోంది.ఫార్మాలిటీస్ పూర్తయినాక విద్యాధరరావు పార్ధివదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.ఆడపిల్లలందరిలోకీ చిన్నదైన మౌక్తిక అంటే ఆయనకు అపరిమితమైన వాత్సల్యం. “ముక్తమ్మా… ముక్తమ్మా…”అంటూ ఆప్యాయంగా పిలుస్తూ తనను సమర్ధిస్తూ వచ్చిన ఆయన…భర్తను కాదని వచ్చిన తన తప్పులెంచక, ఆప్యాయంగా గుండెల్లో పొదువుకుని తనకు ఓదార్పునిచ్చిన ఆయన మరిలేరంటే దుఃఖం ముంచుకొస్తోంది మౌక్తికకు. తాను తమ్ముడు కీచులాడుకుంటే… తమ మధ్యన సయోధ్య కుదర్చలేక చిరునవ్వుతో తలపట్టుకునే తండ్రి…సాత్విక మతాంతర వివాహం చేసుకుంటే చిన్నబుచ్చుకుని ఆమెతో తెగతెంపులు చేసుకున్న తండ్రి…తల్లి-బామ్మల తగాదాల్లో ఎటూ వాలిపోక, మౌనప్రేక్షక పాత్ర వహించి ఎంతో సంయమనంతో వ్యవహరించిన తండ్రి…మరలిరాని లోకాలకి తరలిపోయాడంటే … నమ్మశక్యంగా లేదు మౌక్తికకు. ఆ ఆవేదనని తట్టుకోవడం వాళ్లవలన కావడంలేదు. పుట్టిన ఏ జీవికైనా మరణం అనివార్యం. దాన్ని ఆపే శక్తి మనుషులను పుట్టించిన ఆ పరమాత్మకి కూడాలేదు.గుండె రాయి చేసుకుని  జరగవలసిన తతంగమంతా జరిపించేశారు. వాళ్ళ ధర్మంగా సావిత్రికి, సాత్వికకి కూడా ఆయన మరణవార్త తెలియజేశారు. సావిత్రి వెంటనే పతీసమేతంగా వచ్చి శకుంతలని పలకరించి వెళ్ళిపోయింది. సాత్విక మాత్రం ఆ టైమ్‌కి ఢిల్లీలో ఉండడంచేత దశాహంనాటికి వచ్చింది.

 శకుంతల ఆమెను కౌగిలించుకుని ఒకటే ఏడిచింది. చిన్నారి ‘ విద్యాధర్’ ని ఎత్తుకుని ‘మావారం’టూ  వదలడంలేదు.  విద్యాధరరావు బతికి ఉన్నన్నినాళ్ళూ సాత్వికను ఇంటిగడప తొక్కద్దని శాశించాడు. ఆయన మాటలని అక్షరాలా అమలుపరిచిన సాత్విక ఆయన కర్మకాండలకి హాజరవడం అందరినీ విచారసాగరంలో ముంచివేసింది. అంత బాధలోనూ శకుంతల దినేష్‌ని తూలనాడడం మానలేదు. అతడిని తన అగర్భశత్రువులా చూస్తూ, తన మాంగల్యాన్ని లాగేసుకున్నాడంటూ ఒకటే శాపనార్ధాలు పెడుతోంది. దినేష్ వెర్రివాడిలా చూస్తూ అలా మౌనంగా ఉండిపోయాడే గాని, నోరుతెరచి తల్లిని వారించలేదు. ప్రీతి సంగతి సరేసరి…జరిగిన ఘోరానికి తానే కారణం కాబోలు… అనుకుని బిక్కచచ్చిపోయి ఓ వారగా ఒదిగిపోయింది. అన్ని కార్యక్రమాలు ముగిశాయి. తండ్రి ఆత్మశాంతి కోసమని అన్నిరకాలు దానాలు చేసి, తంతంతా ఎంతో ఘనంగా జరిపించాడు దినేష్. తన సెలవును మరొక నాలుగురోజులకి పొడిగించింది మౌక్తిక. కన్నతండ్రిని కోల్పోయిన లోటు ఎవరూ భర్తీ చేయలేరు. శకుంతలకి కష్టాన్ని ఎవరూ తీర్చలేరు. పోయినవాళ్ళని మరచిపోక తప్పదు. ఆ మరుపు మనిషికి భగవంతుడిచ్చిన అమూల్యవరం.జరిగిన ఘోరాన్ని నెమరు వేసుకుంటూ, కృంగిపోయి కూర్చుంటే మనుగడ అసాధ్యం అవుతుంది. అక్కలిద్దరూ వెళ్లిపోయాక ఇల్లు ఖాళీ అయ్యింది. తల్లిని తనతోపాటుగా తీసుకెళ్దామని అనుకుంది మౌక్తిక. కాని, శకుంతల రావడానికి ఒప్పుకోలేదు. తాను ఇప్పుడు ప్రయాణాలేమీ చేసే స్థితిలో లేనని, కాస్తంత మానసిక ప్రశాంతత చిక్కగానే వస్తానని చెప్పేసింది.

మనసునిండా అంతులేని విషాదం నింపుకుని మౌక్తిక ఊరికి బయలుదేరింది.

----------------------   

“సారీ ముక్తా…నాన్నగారు పోయారని తెలిసినా నేను రాలేకపోయాను. ‘’ రమ్య పలకరించింది ప్రియసఖిని. ఆమె పలకరింపులోని ఆత్మీయత మౌక్తిక హృదయాన్ని తాకగానే ఆమె నయనాలు జలజల వర్షించాయి.శరత్ కూడా ఆమెను పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశాడు. కాలేజ్‌లో స్టాఫందరూ కూడా విద్యాధరరావు కి నివాళులు అర్పించారు. మధుకిరణ్ ప్రత్యేకంగా వచ్చి ఆమె వేదనను పంచుకునే ప్రయత్నం చేశాడు. అతడు అలా… అంత చేరువగా వచ్చి తనను సాంత్వన పరుస్తూ ఉంటే తన స్వంతమనిషే తనను ఓదారుస్తున్నట్లుగా ఫీలైంది మౌక్తిక. అతడు తనపట్ల కనబరుస్తున్న శ్రధ్ధకి తన మనసెక్కడ అతడి వశమైపోతుందోనని ఆ కళ్లలోకి  చూడడానికే భయపడింది మౌక్తిక.  నెమ్మదినెమ్మదిగా తండ్రిపోయిన దుఃఖంనుంచి తేరుకుని రొటీన్‌కి అలవాటుపడసాగింది.

----------------------

  ఆ రోజు ఉదయాన్నే ఆరున్నరకి యోగాక్లాసునుంచి తిరిగివస్తున్న మౌక్తికకు తోవలో కనిపించాడు మధుకిరణ్. ట్రాక్‌సూట్ వేసుకుని, జాగింగ్ చేసుకుంటూ వస్తున్న అతడిని చూసి మంత్రముగ్ధలా ఆగిపోయింది మౌక్తిక.  తెల్లని చుడీదార్, పైజమాలో అప్పుడే విరిసిన నందివర్ధనంలా తాజాగా కనిపిస్తున్న మౌక్తికను చూస్తూనే, అకస్మాత్తుగా కాళ్ళకెవరో సంకెలలు బిగించినట్లుగా నిలబడిపోయాడు మధుకిరణ్ కూడా.  “గుడ్ మార్నింగ్ ముక్తాగారూ…ఏమిటి సంగతి… ఇంత పొద్దున్నే ఇలా దర్శనమిచ్చారు.?’’ చొరవగా తనే ముందు పలకరించాడు మధుకిరణ్.  అతడంత సమీపంగా మాట్లాడుతూంటే  మౌక్తికకు ఏదోలా ఉంది.     “యోగాక్లాసుకెళ్లి వస్తున్నాను. మీరెక్కడినుంచి?’’ సమాధానం చెప్పకుండా ఉండడమ్ సభ్యత కాదని అడిగింది మౌక్తిక.  “నేను జాగింగ్ చేసి వస్తున్నానండీ…’’ చెప్పాడు మధుకిరణ్.   అంత సున్నితంగా మాట్లాడే మగవాడిని ఆమె ఇంతవరకు చూసి ఉండలేదు. ఏదో… మృదుమధుర పరిమళం తనను చుట్టుముట్టినట్లుగా అనుభూతి చెందిందామె. మందగతిన వీచే మలయానిలం అలా…అలా… తనను స్పృశిస్తూ వెళ్ళి, తన మదిగది మూలలను ఆప్యాయంగా తడిమినట్లుగా ఉన్నాయతడి చూపులు.  ఇదేమిటి! అతడికి తానింతలా లోబడిపోతోందేమిటి! అతడి సమక్షంలో ఏమీ గుర్తుకురావడం లేదెందుకు! ఎవరి ఆంక్షలు, తానుచేసిన ప్రమాణాలు తనని బాధించనట్లుగా ఉంది అతడి సాన్నిధ్యం. “ఏమిటీ… అలోచిస్తున్నారు?’’ చిత్తరువై తనముందు నిలచిన మౌక్తికను వింతగా చూస్తూ ప్రశ్నించాడు మధుకిరణ్.  “అబ్బే..ఏమీలేదండీ… మీరు వెళ్ళేది ఇంటికేగా?’’ అసంబధ్ధమైన ప్రశ్న అని తెలిసినా అడగక తప్పలేదు మౌక్తికకు.  “అప్పుడేనా! ఎనిమిదింటివరకు ట్యూషన్స్ చెప్పి అప్పుడింటికెళ్తా. బ్రహ్మచారిగాడిని కదండీ… అప్పుడెళ్లి స్వయంపాకం చేసుకోవాలి.’’ నవ్వాడు మధుకిరణ్. మల్లెమొగ్గల్లాంటి పలువరస  మెరిసింది తళుక్కున. ‘కాలేజ్ లో వస్తున్న జీతం సరిపోలేదు కాబోలు…ట్యూషన్స్ చెప్పు ఇంకా నొర్లేసుకుంటున్నాడు.’ కినుకగా అనుకుంది మౌక్తిక.   చాలామంది అధ్యాపకులు కాలేజ్ లో పాఠాలు సరిగ్గా చెప్పకుండా, ఇంటిదగ్గర ట్యూషన్స్ చెప్పి డబ్బులు వెనకేసుకోవడం ఆమెకి తెలుసు. అలాంటి వాటికి ఆమె చాలా దూరం.  “బాగానే సంపాదిస్తున్నారనుకుంటా’’ కాస్తంత వ్యంగ్యంగా అడిగింది మౌక్తిక. అతడు ఆమెవైపు ఆశ్చర్యంగా చూసి “సంపాదనా! కొంపదీసి నేను డబ్బుకోసం ట్యూషన్లు చెబుతున్నాననుకుంటున్నారా!’’ అడిగాడు నొచ్చుకుంటున్నట్లుగా ముఖంపెట్టి.

 “మరి!”  “నేను ట్యూషన్లు చెప్పేది డబ్బుకోసం కాదండీ… నా ఆత్మతృప్తికోసం. మా ఇంటికి దగ్గరలో బీదసాదా ఉండేటువంటీ బస్తీ ఒకటి ఉంది. అక్కడ ఉండేవాళ్లంతా రోజుకూలి చేసుకుని జీవనం సాగించే కార్మికులు, తాపీపనివాళ్లు. వాళ్లపిల్లలలో కొందరు చాలా తెలివైనవాళ్లు. సానపడితే ఒక్కొక్కరు ఒక్కో వజ్రాల్లా తయారౌతారు. కాని, వాళ్లకి ట్యూషన్ సెంటర్లలో చేరే ఆర్ధికస్తోమతలేదు. మట్టిలో మాణిక్యాల్లా మెరిసిపోయే అటువంటి విద్యార్ధులకి కోచింగ్ ఇచ్చి మెరికల్లా తయారు చేయాలన్నదే నా ఆకాంక్ష.”చెప్పాడు మధుకిరణ్.  కళ్లు విప్పార్చుకుని వింటోంది మౌక్తిక. మధుకిరణ్ వ్యక్తిత్వంలో ఇంకో పార్శ్వం ఆవిష్కృతమౌతూంటే సంభ్రమంతో చూస్తూ ఉండిపోయింది ఆమె.మధుకిరణ్ చాలా సమర్ధుడైన అధ్యాపకుడు అని ఆమెకి తెలుసు. అటువంటివాడు ఏ కోచింగ్‌సెంటర్ పెట్టుకున్నా వేలకివేలు సంపాదించుకోవచ్చును. కాని, అతడలా ప్రతిఫలాపేక్ష లేకుండా పేదపిల్లలకి విద్యాదానం చేయడంతో ఆమె మనసులో అతడికున్న స్థానం ఇంకా పదిలమై నిలిచింది.  ఆమె దృష్టిలో అతడు హిమవన్నగమంత ఎత్తుకి ఎదిగిపోయాడు.  “గ్రేట్ మధుకిరణ్ గారూ…మీరు చేస్తున్న ఈ మంచిపని వలన ఎందరో పేదపిల్లల జీవితాలలో వెలుగులు నిండుతాయి.  ఈసారి మధుకిరణ్ విస్మయంగా చూశాడు ఆమెవైపు.  మౌక్తిక అతడితో అంత ఫ్రీగా మాట్లాడడం అదే మొదటిసారి మరి! ఎప్పుడూకూడా అత్తిపత్తిలా తనలోకి తానే ముడుచుకుపోతూ, బిడియంగా ఉండే మౌక్తిక అలా మనసువిప్పి తనతో మాట్లాడడం అతడికి అంతులేని సంతోషాన్ని కలుగజేసింది. ఆమె సమక్షం ఏదో వింతభావనని రేకెత్తిస్తోంది. మాట్లాడుతున్నప్పుడు చిన్నగా మూసుకుంటూ, విచ్చుకుంటున్న ఆమె పలుచని పెదవులు, ఏదో తత్తరపాటుతో చంచలంగా కదులుతున్న ఆమె  కనుగుడ్లు ఇవన్నీ అతడికి ఎంతో అపురూపంగా అనిపిస్తున్నాయి.

అలా ఆమెనే చూస్తూ యుగాలకొద్దీ ఉండిపోవాలనిపిస్తోంది. అతడికి స్పష్టంగా తెలుసు… తాను వెదికే అమ్మాయి ఆమేనని. కాని, ఆమె మనసులో ఏముందో తెలియడంలేదు. తాను తారసపడినప్పుడు ఆమెలో కనిపించే భావావేశాలకి అర్ధమేమిటో అతడు కనుక్కోలేకపోతున్నాడు. ఆమె నయనాలలో తనపట్ల వ్యతిరేకతైతే కనబడదు. కాని, ముఖంలో ఏదో… కంగారు, ఇదీ అని చెప్పలేని తడబాటు.ఆమె హృదయాన్ని చేరే మార్గం ఆ కాలమే చూపాలి తనకు. “వస్తా ముక్తాగారూ…నా క్లాసులకి టైమౌతోంది.’’ ఆమెను వీడివెళ్లడం తప్పనిసరి అన్నట్లు కదిలాడు మధుకిరణ్.“అలాగే… బై…’’ అంది మౌక్తిక అతడు వెళ్తున్నవైపే చూస్తూ.

--------------------

“అక్కా…నువ్వొక్కసారి అర్జెంటుగా ఇంటికి రా…నీతో ఎన్నో మాట్లాడాలి.’’ దినేష్ దగ్గరనుంచి ఫోన్ రాగానే ఆదరాబాదరా బయలుదేరిపోయింది మౌక్తిక.  వెళ్లేముందు రమ్యతో ఓమాట చెప్పిపోదామని వాళ్ళింట్లోకి వెళ్లింది. బెడ్‌మీద నిస్త్రాణంగా పడుకుని ఉంది రమ్య. పక్కనే ఉన్న శరత్ ఆమెచేత పళ్లరసం తాగించడానికి నానా తంటాలూ పడుతున్నాడు.  మౌక్తికను చూస్తూనే “చూడండి ముక్తా…జ్యూస్ తాగకుండా చిన్నపిల్లలా ఎలా మారాం చేస్తోందో… రెండురోజులై ఒకటే వామిటింగ్స్. ఎంత నీరసంగా అయిపోయిందో చూశారా… మీరన్నా మీఫ్రెండ్‌కి నచ్చచెప్పి ఈ జ్యూస్ తాగించండి….ప్లీజ్…’’ పక్కకు తప్పుకుంటూ చేతిలోని గ్లాసుని టీపాయ్ మీద ఉంచాడు శరత్.

రమ్యకి వాంతులవుతున్నాయా!? ఎందుకు? పైత్యంచేసిందా? రెండురోజులై లీవ్ లో ఉంది తను. ఫీవర్ అని చెప్పింది. ఇంకా తగ్గలేదా!?   “ఏమిటి రమ్యా? వాంతులవుతున్నాయా? నాతో అననేలేదూ…’’ గ్లాసు రమ్య నోటికి అందించింది మౌక్తిక. “ప్లీజ్ ముక్తా… గాలనిలేదు.నన్ను ప్రెస్‌చేయకు…’’ అయిష్టంగా ముఖం తిప్పుకుంది రమ్య.  ‘పోనీలే… నీకు సహించకపోతే వద్దు. డాక్టర్ దగ్గరకన్నా వెళ్తావా!?’’ గట్టిగా నిలదీసింది మౌక్తిక. “అన్నీ అయ్యాయి… మొదట్లో ఇలాగే ఉంటుందని చెప్పిందావిడ…’’ చిరాగ్గా అంటూ నాలిక్కరుచుకుంది రమ్య.  ‘మొదట్లో ఇలాగే ఉంటుందా!’ అంటే! మౌక్తికకు అర్ధం అయ్యీ…కానట్లుగా ఉంది.  “ అసలే…క్యారీయింగ్… సహించినా సహించకపోయినా ఆరారా ఏదో ఒకతి తినాలని, తాగాలని చెప్పింది డాక్టర్…కాని, తనేమో మొండికేస్తోంది…’’ తెగ హడావుడి పడిపోతున్న శరత్‌ని చూస్తే ఆమెకో సంగతి స్ఫురించింది. రమ్య చెవిలో తానడగాలనుకున్నది అడిగేసింది గుసగుసగా.   ఆమె సిగ్గుగా నవ్వి మూడువేళ్ళు చూపించింది కళ్లు అరమోడ్పులవ్వగా. అంతే… విషయం మొత్తం బోధపడిపోయింది. తన అల్లరి స్నేహితురాలు అమ్మ కాబోతోందన్న శుభవార్త తెలిసి ఎంతో సంతోషమనిపించింది మౌక్తికకు. వెంటనే పరుగున వెళ్లి…రివ్వున వీస్తున్న చల్లగాలికి, ఆకాశంలో పరుగులు తీస్తున్న నీలిమబ్బులకి, స్వేఛ్ఛగా రెక్కలు ‘టపటప’ లాడించుకుంటూ ఎగిరిపోతున్న పక్షిసమూహాలకి  ఈ శుభవర్తమానం చెప్పేసి రావాలి అనిపించింది.

అమ్మతనం పొందడంకన్నా అమూల్యవరం ఇంకేం కావాలి ఆడదానికి. స్త్రీత్వానికి సార్ధకత చేకూరేది ఇక్కడే. పురుషుడు తలకిందులుగా తప్పస్సుచేసినా అనుభవించలేని మహత్తరమైన ఆనందం మగువకి లభించేది ఈ ఒక్కవిషయంలోనే. తన ప్రాణాలను పణంగా పెట్టి , మృత్యువుతో పోరాడి ఒక జీవికి ఊపిరిపోసే అద్భుతశక్తి కేవలం స్త్రీమూర్తికే ఉంది. ఆడపుట్టుక పుట్టినందుకు ఆక్షణాన ఎంతో గర్వంగా అనిపించింది మౌక్తికకు. అంతలోనే మనసంతా పిచ్చిపిచ్చిగా తయారైంది. రమ్య నెలతప్పితే తనకెందుకు ఇంతసంబరం!? ఆమెతో తనకి పోలికేమిటి!? అడవిలో పూసిన పిచ్చిపూవుకి, సుందరనందనోద్యానవనంలో ముద్దుగా విరిసిన గులాబిబాలకి సాపత్యం ఏమిటి? అందం, యవ్వనం అంతా కూడా అడవికాచిన వెన్నెలలా వ్యర్ధంగా ఉండిపోయి ఏ అనుభూతికీ నోచుకోని తనకి, అనాఘ్రాత పుష్పంలా మిగిలిపోయిన తనకి…

తన స్త్రీత్వాన్ని, సౌందర్యాన్ని మనసైన ప్రాణనాధునికి అంకితంచేసి, అతడినుంచి అపురూపమైన అమ్మతనాన్ని కానుకగా పొందిన రమ్యకి సామ్యమా!? అనుకుందికే ఏదోలా ఉంది. ఆడపుట్టుక పుట్టగానే సరా! అనుభవించే రాతుండద్దూ… ఒక శుష్కహాసం మెదిలింది మౌక్తిక పెదవులమీద. తన భావావేశాన్ని బహిర్గతం కానివ్వకుండా జాగ్రత్తపడుతూ… రమ్యని, శరత్ ని మసస్ఫూర్తిగా అభినందించి తాను ఊరికి వెళుతున్న విషయం చెప్పి బయలుదేరింది మౌక్తిక.“నా బంగారుతల్లికదూ…నువ్విలా అల్లరిపెడితే..నీ కడుపులో పెరుగుతున్న బుజ్జిగాడికి బలం ఎలా వస్తుందిచెప్పు!? నా మాట విని ఒక్క సిప్…’’గారం చేస్తూ బతిమలాడుతున్నాడు శరత్ మళ్ళీ. “ఇదంతా బుజ్జిగాడిమీద ప్రేమే కాని, నామీద కాదన్నమాట!’’ అలిగినట్లుగా అంటోంది రమ్య.  కిలకిల నవ్వులు వినబడ్డాయి ఒక్కసారిగా. తానేమి కోల్పోయిందో… మౌక్తికకు గుర్తు చేశాయి ఆనవ్వులు. భారమైన మనసుతో గేటుదాటింది.

-------------

ఇల్లుచేరిన మౌక్తిక ప్రీతిని చూస్తూనే నిర్ఘాంతపోయింది. తండ్రికి ఒంట్లో బాగాలేనప్పుడు తాను తొలిసారిగా చూసిన ప్రీతికి, ఈ ప్రీతికి అస్సలు పోలికేలేదు. బొద్దుగా, ముద్దుగా ముద్దబంతిలా మిసిమివన్నెలొలుకుతూ ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆనాటి ప్రీతివేరు. శరీరమంతా శుష్కించి, వన్నెతగ్గి, వసివాడి కళ్లకిందుగా పాకిన నల్లని చారలతో వడలిపోయిన గులాబీలా ఉన్న ఇప్పటి ప్రీతి వేరు.  కేవలం రెండు… రెండంటే రెండే నెలల్లో మనిషిలో ఇంతటి మార్పు రావడం సాధ్యమా!  దానికి సాక్ష్యంగా కనబడుతున్న ప్రీతిని చూస్తే మౌక్తిక కడుపు తరుక్కుపోయింది.  “ఏంటి ప్రీతీ… ఇలా అయిపోయావు? ఒంట్లో బాగాలేదా?’’ కళ్లలో ప్రాణాలు నిలబెట్టుకున్నట్లుగా ఉన్న ప్రీతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది మౌక్తిక.  దినేష్ ముఖం గంభీరంగా మారిపోయింది.    “ప్రీతీ… నువ్వు లోపలికి వెళ్ళి అక్కకి కావలసినవి చూడు..’’ అని ఆమెకి పురమాయించి, “అక్కా… నువ్వు స్నానంచేసి రెస్ట్ తీసుకో…తరువాత మాట్లాడుకుందాం.’’ అన్నాడు.  ప్రీతి లోపలికి వెళ్ళిపోయింది. దినేష్ వైఖరికి, ప్రీతి అలా నీరసించిపోవడానికి కారణం ఏమైఉంటుందో మౌక్తికకు అంతుచిక్కడంలేదు.  ఇంట్లో శకుంతల అలికిడి వినబడలేదు. ఆమె ఏమైనట్లు!?  “అమ్మేది దినేష్?’’ అడిగింది మౌక్తిక బ్యాగ్ లోనుంచి ఇస్త్రీ చీర, జాకెట్ తీసుకుంటూ.  “అమ్మ…పెద్దక్క వాళ్ళింట్లో ఉందక్కా…’’ దినేష్ స్వరం నూతిలోనుంచి వస్తున్నంత నీరసంగా ఉంది. “అక్క తీసుకెళ్లిందా?’’ తండ్రి పోయి, మూడోనెల నడుస్తోంది కాబట్టి లాంఛనం కోసం కార్తిక తల్లిని తీసుకెళ్లిందేమోనని అడిగింది మౌక్తిక.  “లేదక్కా’’.  “మరి! “ ఆశ్చర్యపోయింది మౌక్తిక.   “అమ్మ నామీద అలిగి వెళ్ళిందక్కా.’’ ఆ విషయం చెప్పడానికి౯ అతడు ఎంతో వేదనను, మానసిక సంఘర్షణని అనుభవించాడని అతడి వాలకమే చెబుతోంది.  “అదేంటి దినేష్… అమ్మ నీమీద అలగడం ఏమిటి?’’ నమ్మలేనట్లుగా చూసింది మౌక్తిక.  దినేష్ శకుంతలకి గారాల పుత్రుడు. ఒక్కగానొక్క మగపిల్లాడని ఆమెకు అతడిమీదే పంచప్రాణాలూనూ. భర్త ఎప్పుడైనా మందలించబోతే ‘పసివాడం’టూ వెనకేసుకొచ్చేది. అందుకే అక్కచెల్లెళ్లందరూ కూడా దినేష్‌ని ‘ అమ్మకూచి’ అని వెక్కిరిస్తారు.

అటువంటి దినేష్ మీద తల్లి అలగడమేమిటి… వింత కాకపోతేనూ! “నువ్వు చెప్పేది నిజమేనట్రా!’’ విస్మయంగా అడిగింది మౌక్తిక.  విరక్తిగా నవ్వాడు దినేష్.  “ఏ ముహూర్తాన నేను ప్రీతిని పెళ్ళి చేసుకున్నానో గాని, అప్పటినుంచీ ఈ ఇంట్లో అన్నీ అరిష్టాలే. అల్లారుముద్దుగ పెరిగిన ఆమెకు నా వలన ఎటువంటి సుఖమూ చేకూరకపోగా, ఆమె బతుకు మరింత నరకమైంది. ప్రీతిని ఈ ఇంటికోడలిగా తెచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశానక్కా’’ బాధగా పలికాడు దినేష్.  “దినేష్… ఏమంటున్నావురా?’’ నిర్ఘాంతపోయింది మౌక్తిక.  అతడు నిస్పృహగా చూస్తూ “అవునక్కా… ప్రీతిని చూస్తేనే అమ్మకెందుకో కోపం. నేను, ప్రీతి సరదాగా మాట్లాడుకుంటే చూడలేదు. నాకు సంబంధించినంత వరకు అన్నిపనులూ తానే చేయాలి అనుకుంటుంది ప్రీతి జోక్యాన్ని అస్సలు సహించలేకపోతోంది.  ప్రీతి గట్టిగా మాట్లాడినా, నవ్వినా, ఆఖరుకి శుభ్రంగా తయారై మంచిచీర కట్టుకున్నా అమ్మ భరించలేకపోతోంది. ప్రతి విషయంలో ఆమెను తప్పుపడుతోంది. పని చేయడానికి ముందుకొస్తే నీ సహాయం అక్కరలేదంటోంది. అలాగని దూరంగా మెలిగితే ‘దున్నపోతులా తిని కూర్చుంటే ఇంటి చాకిరీ అంతా చేసే ఓపిక తనకు లేదని తగువాడుతోంది.’’ గాఢంగా నిట్టూర్చాడు దినేష్. “నువ్వు చిన్న సమస్యను పెద్దది చేసి చూస్తున్నావేమో దినేష్. నాన్నపోయి ఇంకా మూడునెలలు  కూడా కాలేదు. బహుశా అమ్మ… ఆ డిప్రెషన్‌లో…’’ ఖండించింది మౌక్తిక. దినేష్ అడ్డంగా తలూపుతూ “అలా అనుకునే నేనూ ఓపిక పట్టానక్కా… కాని,అమ్మ విపరీత ధోరణి రోజురోజుకీ ఎక్కువౌతోంది. నేను ప్రేమించానని చెప్పడం లేదు కాని, ప్రీతి చాలా మంచి అమ్మాయి. ఎవరినీ నొప్పించే మనస్తత్వం కాదు. ఎందుకో గాని, అమ్మ ప్రీతి ఉనికిని ద్వేషించేంతటి రాక్షసత్వం ప్రదర్శిస్తోంది. ప్రీతి పడే మానసిక క్షోభ నేను చూడలేకున్నాను. నా మీద ఇష్టంకొద్దీ తను ఇదంతా భరిస్తోంది. తన పుట్టింట్లో విషయం తెలిస్తే… మళ్లీ ఏం గొడవలౌతాయోనని పళ్ల బిగువున భరిస్తోంది. చివరికి… అమ్మ… ఎంతలా తయారైందంటే…’’ దినేష్ స్వరం గద్గదమైంది. “ఏమైందిరా?’’ ఆరాటంగా అడిగింది మౌక్తిక.  అతడు ఇబ్బందిగా కదులుతూ” నాలుగురోజుల కిందట  రాత్రి పదకొండు గంటలప్పుడు…నేను, ప్రీతి  ఏకాంతంలో ఉండగా… హఠాత్తుగా గది తలుపులు తట్టి, లోపలికి వచ్చి తనకు భయంగా ఉందంటూ మా ఇద్దరి మధ్యనా పడుకుంది…’’ చెప్పలేక చెప్పలేక చెప్పాడు.

తీవ్ర దిగ్భ్రమకి లోనైంది మౌక్తిక. తల్లి ఇంత సంస్కారహీనంగా తయారైంది అంటే ఆమెకి నమ్మశక్యం కావడంలేదు. అసలు… ఆమె ఎందుకింత దిగజారి ప్రవర్తించినట్లు!? మిలియన్ డాలర్ల క్వశ్చన్.నిజంగానే భయపడిందనుకోవడానికి లేదు. ఆమెకి భయమంటే ఏమిటో తెలియదు. ఇంట్లోని వాళ్లందరూ ఎటైనా వెళ్లినా సరే… ఎవరి సాయమూ లేకుండా అదే ఇంట్లో ఎన్నోసార్లు గడిపిన ఆమె భయమంటూ వెళ్ళి, భార్యాభర్తలని అసౌకర్యానికి గురిచేసిందా!? “నమ్మలేకపోతున్నావు కదూ! కాని, ఇదంతా నిజమక్కా. మరునాడు ఉదయాన అకారణంగా ప్రీతిమీద విరుచుకుపడిన అమ్మని’ నీ ఉద్దేశమేమిటని’ నిలదీశాను. అంతే…నన్ను నానా మాటలాడి అలిగి, అక్కవాళ్ళింటికి వెళ్లిపోయింది’’ దినేష్ కళ్లు సజలమైనాయి.తనకన్నా రెండేళ్ళు చిన్నవాడైన అతడి కళ్లలో చెమ్మని చూసి తట్టుకోలేకపోయింది మౌక్తిక. తల్లి అతడినెంతో గారం చేసేది.  “మగపిల్లాడిని అంతలా నెత్తెక్కించుకోవద్దే శకుంతలా…గారాబం ఎక్కువైతే చెడిపోతారంటూ’  నెత్తినోరు కొట్టుకుని గోలపెట్టేది బామ్మ.  అయినాసరే… అతడి ఒంటిమీద ఈగ కూడా వాలనిచ్చేదికాదు తల్లి. అటువంటి తల్లి …ఇప్పుడు కొడుకు సుఖసంతోషాలకి అడ్డుతగులుతోందెందు కు? అనురాగమయమైన అతడి సంసారానికి విఘాతం కలిగిస్తోందెందుకు? మౌక్తిక బుర్రంతా గజిబిజిగా తయారైంది.   “వదినా… స్నానానికి నీళ్ళు పెట్టాను. మీరు ఫ్రెష్ అయితే టిఫిన్ చేద్దురుగాని…’’చెప్పింది ప్రీతి వంటింటి గడపలో నిలబడి. ఆమెవైపు తదేకంగా చూసింది మౌక్తిక. కల్లాకపటం తెలియని అమాయకపు పసిదనం తొంగిచూస్తోంది ఆమె వదనంలో. ఆ కళ్ళు… మంచులో తడిసిన మరుమల్లెల్లా వింత ధవళిమతో మెరుస్తున్నాయి. ఆ ముఖంలో ఎక్కడాకూడా జాణతనం కాని, జట్టీలుపెట్టే మనస్తత్వం కాని కనబడడంలేదు.  ఇంతటి సౌజన్యమూర్తిని తల్లి అంతలా ఆరడి పెడుతోందెందుకు!?స్నానం చేసొచ్చి ప్రీతి పెట్టిన టిఫిన్ తినేసి బయలుదేరింది మౌక్తిక.  “అక్కా’’ గడప దాటుతూంటే పిలిచాడు దినేష్. “ఏంటిరా?’’ ఆప్యాయంగా అడిగింది మౌక్తిక. “అమ్మతో అనవసరంగా గొడవ పడకక్కా… నీతో చెప్పుకుంటే, నిన్నోసారి చూస్తే నా గుండెబరువు తీరి కాస్త మనశ్శాంతిగా ఉంటుందని నిన్ను రమ్మన్నాను.’’ ఏడ్చేశాడు దినేష్.  చూడలేకపోయింది మౌక్తిక. తనతో ఏదైనా గొడవ పడినప్పుడు ఎప్పుడూ తనదే పైచేయిగా ఉండాలని మొండిగా వాదించే దినేష్… ఇలా పిరికివాడిలా ఏడుస్తూ ఉంటే మౌక్తిక గుండె తరుక్కుపోయింది.

 తనకే ఇంత బాధగా ఉందే!మరి… తల్లి గుండెల్లో జాలి, దయ ఇంకిపోయి ఆమె అంత మొరటుగా తయారైందేమిటి!?“నువ్వు గాబరాపడకు. నేను అంతా సెట్‌రైట్ చేస్తానుగా.’’ అతడికి అభయం ఇచ్చి వీధిలోకి కాలుపెట్టింది మౌక్తిక.

-------------------

మౌక్తికను చూడగానే శకుంతల ఆశ్చర్యపడింది. కూతురంత హఠాత్తుగా ఎందుకు ఊడిపడిందో అర్ధంకాక సంశయంగా చూడసాగింది.  “ఎప్పుడొచ్చావే ముక్తా…’’ కూతురుని పలకరించింది.  తనకేమీ తెలియనంత అమాయకంగా ముఖం పెడుతూ “ ఇప్పుడే వచ్చాలే…నువ్వేంటిక్కడా?’’ అడిగింది మౌక్తిక.  అంతే… శకుంతల ముఖం కళతప్పింది. ఎందుకంటే శకుంతల ఇల్లువిడిచి ఎవరింట్లోనూ ఒక్కక్షణం ఉండదు. ఎప్పుడైనా కార్తిక వచ్చి తనింట్లో నాలుగురోజులు ఉండమంటే” ఆడపిల్ల సొమ్ము మాకెందుకు?’’ అంటూ రానుపొమ్మని నిరాకరించేది.  “అంతా నా ఖర్మ తల్లీ…ఏ ముహూర్తాన ఆ మహాతల్లి ఇంట్లో పాదం మోపిందో నా కొడుకు నాకు కాకుండా పోయాడు.వన్నెల విసనకర్రలా వగలుపోయి వాడికి వల విసిరింది. వాడికేదో మందుపెట్టి తన వశం చేసుకుంది. నా కొడుకుని నా నుంచి దూరంచేసింది.’’ కళ్లు-ముక్కు ఎర్రగా చేసుకుని ఆవేశపడింది శకుంతల.నువ్వు సమస్యను నీ కోణంలోనుంచే చూస్తున్నావు. వాడింకా పసిపిల్లాడు కాదు. పెళ్లైనవాడు. వాడికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. మనమే సర్దుకుపోవాలి.’’ వ్యర్ధమని తెలిసినా శకుంతలని శాంతపరచాలని చూసింది మౌక్తిక. ఆవిడ తన ముఖాన్ని కందగడ్డలా చేసుకుని “ఏమిటే సర్దుకుపోయేదీ… గాడిదగుడ్డు. నేననేదాన్ని జన్మనివ్వకపోతే వాడెలా వచ్చాడటా! అలాంటి కన్నతల్లిని …పెళ్లవగానే పనికిమాలినదానిలా చూస్తాడా? ఆ ఇనపగజ్జెలతల్లి ని ఇంట్లోకి తెచ్చి నా పసుపుకుంకాలు లాగేసుకున్నాడు. అది చాలనట్లు నన్ను చులకన చేసి చూస్తాడా?’’ ముక్కుచీదింది జిర్రున. తల్లి ఆక్రోశానికి అర్ధం తెలిసింది మౌక్తికకు. పొసిసివ్‌నెస్…  తనది అనుకున్న వస్తువు వేరొకరి స్వంతం అయితే చూసి ఓర్వలేని ఉడుకుమోత్తనం. కొడుకు కోడలికి తనతో సమానస్థానమిచ్చి ఆదరిస్తే భరించలేని అసూయ. తన మనిషి కేవలం తన సొత్తు మాత్రమే కావాలని ఆశించే స్వార్ధపరత్వం.

  అత్తకోడళ్లకి అభిప్రాయబేధాలు తలెత్తేదిక్కడే. అన్నాళ్ళు ‘ అమ్మా…అమ్మా…’ అంటూ తన కొంగుపట్టుకుని తిరిగే ముద్దులకొడుకు…, కోడలు రాగానే ఆమె కొంగుచాటు కృష్ణుడల్లే మారిపోవడం చూసి సహించలేనితనంతో కొందరు తల్లులు వారిని విడదీసేందుకు సైతం వెనుకాడరని తల్లిని చూస్తే తెలిసింది మౌక్తికకు.
   తన తల్లి కూడాఈ రకమైన భావనకి అతీతురాలు కాదన్న సత్యం అవగతమైన మౌక్తిక డీలాపడిపోయింది.
  ఇంతలో కార్తిక వచ్చి “ఇలారా ముక్తా” అంటూ మౌక్తిక చేయిపట్టుకుని గదిలోకి తీసుకెళ్ళి తలుపు మూసింది.
  “ముక్తా… ఇక్కడ నూటికి నూరుపాళ్ళు అమ్మదే తప్పు. ప్రీతి మెతకపిల్ల అని నాకు తెలుసు. కాని, తనను దోషి చేసి నిలదీస్తే అమ్మ తట్టుకోలేదు. అందుకే… నీకు ఫోన్ చేయమని తమ్ముడితో చెప్పాను. ఏం చేయాలో కాస్త ఆలోచించు.’’ చెప్పింది కార్తిక.
  ఆమె సంయమనానికి, వ్యవహార దక్షతకు అబ్బురపడింది మౌక్తిక. నిజమే… పీకలు తెగ్గోసేంత కర్కోటకుడిని కూడా డైరెక్ట్‌గా నువ్వు ‘ నేరస్తుడివి’ అంటే మండిపడతాడు.
  ‘నీదేతప్పు…’ అని నేరుగా చెబితే తల్లికి కోపం రావచ్చును.

ముగింపు వచ్చేసంచికలో... 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్