Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాయంలో తృప్తీ - కొత్తపల్లి ఉదయబాబు

sayam lo trupti
రామాపురం లో రాములు, సోములు అనే ఇద్దరు స్నేహితులుండేవారు.వారి ఇద్దరి ఇళ్ళు పక్క పక్కనే. రాములు కిరానాకొట్టు వ్యాపారం చేస్తే, సోములు చక్రాల బండిమీద వీధి వీధి తిరిగి ఆయా  కాలాల్లో దొరికే పళ్ళు అమ్మేవాడు.
 
రాములుది కూర్చుని చేసుకునే వ్యాపారం కనుక బద్ధకంగా ఉండేవాడు.ఏ పని చెయ్యాలన్నా  సోములు మీద ఆధారపడేవాడు.
 
ఒక రోజు పట్నం వెళ్లి కొట్లో అయిపోయిన సరుకుల జాబితా ఇస్తానని, తెచ్చిపెట్టమని సోముల్ని ఆడిగాడు రాములు.
 
 
దానికి సోములు "చూడన్నా..నీది కూర్చుని చేసుకునే యాపారం.నాది నాలుగు వీధులు తిరిగివస్తేగాని జరగని యాపారం. నాకు ఎలా కుదురుతుంది చెప్పు?పోనీ ఒక గంటలో అయిపోయే పని కాదాయే.సరే. ఈసారికి చేసిపెడతాలే.'' అన్నాడు 
 
సోములు తాను చేశేసాయానికి సొమ్ము ఆశిస్తున్నాడనుకుని   రాములు ''వూరికె ఏమీ చేయవద్దులేవయ్యా.నాకు తోచిన సొమ్ము అప్పగిస్తాలే.'' అన్నాడు 
 
''డబ్బు ఆశించి చేసేది సాయం అవ్వదు.నువ్వు సరుకుల జాబితా ఇవ్వు. నేను తెస్తాను.'' అని రాములు దగ్గరనుంచి సరుకుల జాబితా తీసుకుని సరుకులు తెచ్చిపెట్టాడు సోములు. అలా చాలా సార్లు రాములుకి సాయం చేశాడు సోములు.
 
ఒకరోజు సోములుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. పళ్ళు అమ్మడానికి వెళ్లలేకపోయాడు. తనదగ్గర ఉన్న పళ్లను రాములుకు ఇస్తూ '' ఈరోజు నాకు బాగా జ్వరంగా ఉంది రాములు. నా పళ్ళబుట్టలు నీ కొట్లో పెడతాను. కాస్త అమ్మి పెట్టు.'' అని అన్నాడు. ''సరే.'' అన్నాడు రాములు.
 
ఆసాయంత్రం సోములు రాములు దగ్గరకు వచ్చి ''నా పళ్ళు అన్నీ అమ్మినందుకు నీకు కృతజ్నతలు.ఇదుగో ఈ సొమ్ము ఉంచుకో.'' అని రాములుకు తన లాభం లో కొంత ఇవ్వబోయాడు సోములు.
 
''డబ్బు ఆశించి చేసేది సాయం అవ్వదు అని నువ్వే నాకు చెప్పావ్.పైగా నాకు ఎన్నోసార్లు సాయం చేశావ్. నేను డబ్బు ఇవ్వబోతే కూడా నువ్వు తీసుకోలేదు. నువ్వు ఇస్తే నేను ఎలా తీసుకుంటాను అనుకున్నావ్? ఈవిషయాన్ని నేను నీనుంచే నేర్చుకున్నాను.ఒకరికి సహాయం చేయడం లో ఎంత సంతృప్తి ఉందో నీవల్లనే గ్రహించాను. ఒక పని చేద్దాం.ఇకనుంచి నువ్వు నీపళ్లను నాకోట్లో పెట్టుకో. నేను వాటిని అమ్మిపెడతాను.మామూలుగానే రోజూ వూరంతా తిరిగి బండిమీద వ్యాపారం కూడా చేసుకో. నువు పట్నం వెళ్ళినప్పుడల్లా నాకు సరుకులు తెచ్చిపెట్టు. సరేనా?'' అన్నాడు రాములు.
 
సంతోషంగా అంగీకరించాడు సోములు.అప్పటినుంచి వారిద్దరూ మరింత మంచి స్నేహితులుగా వూరిలో వారందరికీ ఆదర్శంగా మెలిగారు.
 
(నీతి : ఫలితం ఆశించకుండా చేసే సాయంలో ఎంతో తృప్తీ ఉంటుంది.)
 
 
మరిన్ని శీర్షికలు
naa jnaapakaallomchi