Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrydayam

ఈ సంచికలో >> సినిమా >>

తెలిసిన సంగతులే!

telisina sangatule

తొలి తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద' 1931 సెప్టెంబర్ 15 న విడుదలయ్యింది. అప్పటి నుండి ఇప్పటివరకు కొన్ని వేల సినిమాలు తెలుగులో వచ్చాయి. ఆ సినిమాల్లో కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాఫులు. కానీ ఆ సినిమాల్లో మనకు తెలిసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. అలాంటి తెలిసిన సంగతులు కొన్ని...

* 'ఆంధ్రా దిలీప్' అని నటుడు చలం ను పిలుస్తారు. అలా మొదట పిలిచినవారెవరో తెలుసా? హిందీ నటుడు 'పృధ్వీరాజ్ కపూర్' (రాజ్ కపూర్ తండ్రి).

* హాస్యనటుడు రాజబాబు అసలుపేరు 'పుణ్యమూర్తుల అప్పల్రాజు'. మరి మురళీ మోహన్ అసలు పేరేంటో తెలుసా? 'రాజబాబు'.

* తెలుగులో ఎక్కువమంది హీరోయిన్ లతో హీరోగా చేసిన నటుడు 'చంద్రమోహన్'. ఆయనతో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ లు అయిన వారిలో 'శ్రీదేవి, జయసుధ, జయప్రద, వాణిశ్రీ, విజయశాంతి, రాధ, సుహాసిని'లు కొందరు.

* ఎస్వీ కృష్ణారెడ్డి అనగానే మనకు చక్కటి హాస్య చిత్రాలను అందించిన దర్శకుడిగా తెలుసు. ఆయన హీరోగా 'ఉగాది, అభిషేకం' చిత్రాల్లో చేశాడు. ఈ రెండు సినిమాల కన్నా ముందు 'పగడాల పడవ' పేరుతో ఒక సినిమా ప్రారంభించి అందులో హీరోగా నటించాడు. కానీ ఆసినిమా ఆగిపోయింది. అందులో హీరోయిన్ ఎవరనుకున్నారు? సూపర్ కృష్ణ కుమార్తె 'మంజుల'.

* 'విజయ ప్రొడక్షన్స్' అనగానే మనకు 'మాయాబజార్' సినిమా గుర్తుకు వస్తుంది. అపూర్వ కళాఖండం 'మాయాబజార్'. ఈ సినిమాకు ముందుగా పెట్టాలనుకున్న పేరు 'శశిరేఖా పరిణయం'. కానీ ఎందుకో ఆపేరు పెట్టడం ఇష్టం లేక 'మాయాబజార్' పెట్టారు.

* తెలుగు సినిమాకు, సూపర్ స్టార్ కృష్ణకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమా మార్పులు కృష్ణతోనే మొదలయ్యాయి. అవేటంటే -
తొలి సినిమా స్కోపు చిత్రం - అల్లూరి సీతారామరాజు.
తొలి కౌబాయ్ సినిమా - మోసగాళ్ళకు మోసగాడు.
తొలి బాండ్ చిత్రం - గూడాఛారి 116.
తొలి డిటియస్ చిత్రం - తెలుగు వీర లేవరా.

* తొలి తెలుగు సినిమాలు
తొలి టాకీ సినిమా - భక్త ప్రహ్లాద.
తొలి రంగుల సినిమా - లవకుశ.
తొలి ద్విపాత్రాభినయ సినిమా - ఇద్దరు మిత్రులు.
తొలి అనువాద సినిమా - ఆహుతి.
తొలి జానపద సినిమా - కనకతార.
తొలి బాలల సినిమా - ధ్రువ - అనసూయ.
తొలి తెలుగు నవలా సినిమా - బారిస్టరు పార్వతీశం.
ఔట్ డోర్ లో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా - సాక్షి.
విదేశాల్లో ప్రదర్శితమైన తొలి సినిమా - మల్లీశ్వరి.
తొలి సోషియో ఫాంటసీ సినిమా - దేవాంతకుడు.
తొలి సినిమా హాలు - విజయవాడ మారుతి టాకీస్.
తొలి సినిమా పత్రిక - చిత్రకళ.
తెలుగు నుండి డబ్ చేయబడిన తొలి చిత్రం - కీలు గుర్రం(తమిళం లోకి)

* 'నీ గొంతు పనికిరాదు'? 'నువ్వు సినిమాల్లో పనికిరావ్ పో!' అంటూ అనిపించుకున్నా నిరాశపడక శోధించి సాధించిన నటుల్లో 'రావుగోపాలరావు' ఒకరు. 'ముత్యాలముగ్గు' సినిమాలోని డైలాగ్ లతో కూడిన గ్రామ్ ఫోన్ రికార్డులు అప్పట్లో బాగా అమ్ముడుపోయాయి. దటీజ్ రావుగోపాలరావు!

* భారతదేశ చరిత్రలో ఎన్నికల్లో పోటీచేసి లోక్ సభకు ఎన్నికైన తొలి సినీ నటుడు మన తెలుగు నటుడే. ఆయన ఎవరో తెలుసా? కె. జగ్గయ్య. (1967 లో ఒంగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున).

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సబ్సిడీని అందుకున్న మొదటి చిత్రం 'పదండి ముందుకు'. తొలి తెలుగు రాజకీయ చిత్రం కూడా ఇదే.

* 'తోట రాముడు' సినిమాలో హీరోగా నటించిన నటుడు చలం. కానీ ఇదే 'తోట రాముడు' పేరుతో ఎన్.టి.ఆర్ హీరోగా ఒక చిత్రం ప్రారంభం కావాల్సింది. ఎందుకనో ఆగిపోయింది.

* 'వెంకటేశ్వర మహాత్యం' చిత్రాన్ని రెండుసార్లు రూపొందించిన వారు దర్శక నిర్మాత పి. పుల్లయ్య.

* 'అనుపమ ఫిలిమ్స్' వారి తొలిచిత్రం 'ముద్దుబిడ్డ'. కానీ ఈపేరు కన్నా ముందు అనుకున్న పేరు 'బిందుగారబ్బాయి'. ఇదే అనుపమ వారి నిర్మించిన 'ఎం.ఎల్.ఎ' కు మొదట 'పుట్టినరోజు' అనే పేరు అనుకున్నారు.

* 'జయసుధ' అసలుపేరు 'సుజాత'.

* తొలి టాకీ చిత్రనాయిక - 'సురభి' కమలాబాయి.

* హీరోయిన్ కి గ్లామర్ తెచ్చిన తొలి నటీమణి - కాంచనమాల.

* తొలి తెలుగు సినిమా నేపధ్య గాయని - రావు బాలసరస్వతి.

* వంశీ దర్శకత్వంలో 'గాలి గొండపురం రైల్వే స్టేషన్' పేరుతో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ చేశారు. లతా మంగేష్కర్ తో ఒక పాట పాడించారు కూడా. కానీ సినిమా మాత్రం ఆగిపోయింది. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరనుకుంటున్నారు? 'వెంకటేష్'.

* కె. విశ్వనాథ్, కళ్యాణ చక్రవర్తి కాంబినేషన్ లో 'సిరిమువ్వల సింహనాదం' పేరుతో ఒక సినిమా షూటింగ్ జరుపుకుని ఆడియో కూడా విడుదలైంది. కానీ సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదు.

* పూర్తిగా జంతువులతో షూటింగ్ జరుపుకుని విడుదలైన చిత్రం - మాకూ స్వాతంత్ర్యం కావాలి.

* ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ, కృష్ణంరాజు లతో బాలనటిగా నటించి ఆ తర్వాతి కాలంలో హీరోయిన్ గా నటించిన నటి - శ్రీదేవి.

* ఈ మధ్యకాలంలో అన్ని వరుస ఫ్లాపులతో ప్రేక్షకులను తెగ ఇబ్బంది పెడుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆ మధ్య 'వైజయంతీ మూవీస్' పై నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ఓ చిత్రంలో హీరోయిన్ గా ఊర్మిళ నటించింది. ఎందుకనో ఈ సినిమా ఆగిపోయింది. ఇంతకూ ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరో తెలుసా? 'చిరంజీవి'.

* బుల్లితెర పై(టి.వి) నటించిన తొలి హీరో - మురళీ మోహన్.

* సూపర్ స్టార్ కృష్ణ నటించిన తొలి చిత్రం ఆదూర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన సినిమా 'తేనె మనసులు' అని చాలామంది అనుకుంటారు. నిజానికి ఈ సినిమా కృష్ణ హీరోగా నటించిన తొలి సినిమా. అంతకు ముందు కొన్నిచిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు కృష్ణ. అందులో నటుడు జగ్గయ్య నిర్మించిన 'పదండి ముందుకు' ఒక సినిమా.

* 'మా సినిమా నువ్వే హీరోయిన్ వి' అన్నారు. అది కూడా అక్కినేని పక్కన నటించే అవకాశం. తీరా - ఆ దర్శకుడు లాభం లేదు! నువ్వు హీరోయిన్ గా బాగుండవన్నారు. మళ్ళీ ఇంకో సినిమాలో చిన్న నర్తకి వేషం వేసింది ఆ నటి. ఇంకో సినిమాలో కాస్త గుర్తింపు ఉండే వేషం వేసింది. అప్పుడు వచ్చింది ఒక సినిమా. ఆ నటి జాతకం మార్చింది. ఆ సినిమానే 'దేవదాసు' - ఆ నటే 'సావిత్రి'. హీరోయిన్ గా బాగుండవన్న దర్శకుడు 'ఎల్.వి. ప్రసాద్'. 'సంసారం' చిత్రంలో.

మరిన్ని సినిమా కబుర్లు
young hero