Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrydayam

వీడుకోలు - కన్నీటి వేడుకోలు...
ఇంగ్లీషు దేశాల్లో కొన్నిచోట్ల 13 నంబరు ఉండదు. దేశవ్యాప్తంగా బ్యాన్ అన్నమాట. తెలుగువాళ్ళలో కూడా పదమూడుని 'ఆపద'మూడుగా పేర్కొనేవాళ్లని చాలామందిని చూశాను. కానీ 2013 సంవత్సరం సినిమా పరిశ్రమకి 'ఆపద'మూడుగానే అవతరించింది. డిశెంబరు నెల రెండు నిముషాల్లో అయిపోయి, ఈ సంవత్సరం ఇంకేం జరక్కుండా ముగుసిపోతే బావుణ్ణనిపిస్తోంది.

ఆత్మీయులంతా ఒక్కొక్కరుగా ఆత్మస్వరూపులైపోవడం, భౌతికంగా మనని విడిచిపెట్టి, ఏడిపిస్తూ వెళ్ళిపోవడం ఇంక తట్టుకోలేకపోతున్నాం.

కుటుంబ జీవితాలని చాలా త్యాగం చేసి ప్రతి సినిమా యూనిట్టుని కుటుంబంలా భావిస్తూ పని చేస్తేనే సినీ పరిశ్రమలో పని చేయడం కుదురుతుంది. అనుకున్నది సాధించడం సాధ్యమౌతుంది. అందుకే సినీ పరిశ్రమలో ఎవరికన్నా ఏదన్నా జరగరానిది జరిగితే, కుటుంబ సభ్యులకన్నా, ఎక్కువ బాధ పరిశ్రమ వ్యక్తులకి, పరిశ్రమలో సన్నిహితులకి ఉంటుంది.

అటువంటి కుటుంబ సభ్యులిద్దర్ని కోల్పోయానీమధ్యకాలంలో - మొదట శ్రీ ఏవీఎస్ గారు, తర్వాత నన్ను 'అల్లుడూ' అంటూ అభిమానంగా పలకరించే 'మావయ్య' గారు డా. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు.

మనసంతా వెలితిగా ఉంది.

ఏమీ రాయబుద్ధి కావట్లేదు - బలవంతంగా కూడగట్టుకుని రాస్తున్నాను -

ఈ కాలం మొదలు పెట్టాక ఇంత బలవంతంగా రాయడం ఇదే మొదటిసారి.

53ఏళ్ళకే ఎందుకింత కంగారు "మావయ్యగారూ!"

హాఫ్ సెంచరీకే బ్యాట్స్ మెన్  ఔటైనట్టు - సెంచరీ కొట్టకుండా సచిన్ పెవిలియన్ చేరినట్టు - మీకు క్యాన్సరేంటి మావయ్య గారూ?

మీతో పంచుకున్న అనుబంధం ఎంత విలువైనదో ఎలా చెప్పమంటారు?

దూరదర్శన్ లో 'ఆనందో బ్రహ్మ' తో మొదటిసారి ధర్మవరపు గారికి పెద్ద ఫ్యానైపోయానని వారితో చెప్తే, ఆరోజు షూటింగ్ అయ్యేదాకా ప్రతి షాట్ గ్యాప్ లోనూ నాకు 'ఆనందో బ్రహ్మ' లో ప్రతి మంచి జోకూ మళ్ళీ యాక్ట్ చేసి చూపించారాయన - సెట్లో నా నవ్వులు చూసి పాపం ఆ సినిమా నిర్మాత అవన్నీ నేను తీస్తున్న జోకులని మురిసిపోయారు. అవి షాట్ గ్యాప్ లో ధర్మవరపు గారి ఆనందోబ్రహ్మ జోకులని తెలీక.

నా దర్శకత్వంలో 'శ్రీరామ్' నుంచి 'ముగ్గురు' దాకా ఇంచుమించు ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక పాత్ర ఆయన కోసం పుట్టింది. ఇంకా ఎన్నో సినిమాల్లో ఆయన కోసం ఎన్నో మంచి పాత్రలు పుట్టబోయే సమయంలో ఆ వందల పాత్రల్ని పుట్టకుండా అబార్షన్ చేసే హక్కు ఆ దేవుడికెవరిచ్చారు? భ్రూణహత్య పాపం అయితే, దేవుడెంత పాపం మూటగట్టుకున్నాడు?

సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా నాన్నగారికి ఎన్నో సాహితీ సత్కాలక్షేపాలు పనిగా కల్పించిన సహృదయుడాయన.

సహజంగా వచ్చే బాధని పంచుకుంటే తగ్గుతుంది. కానీ కొంతమంది ఇష్టుల వల్ల ఇలా అసహజంగా కలిగే బాధ పంచుకోవడం మొదలుపెడితే, బాధ పెంచుకోవడం మొదలుపెట్టినట్టే.

నేను మా ఇంటి గృహప్రవేశానికి పిలిచినా, నా సినిమాల ఆడియో ఫంక్షన్లకి పిలిచినా, నేను చదువుకున్న విజయవాడ పి.బి. సిద్ధార్ధ కాలేజీలో సృజనోత్సవ్ యూత్ ఫెస్టివల్ కి గెస్ట్ గా పిలిచినా, షూటింగ్ డేట్స్ చూసే మహేంద్ర గారి ఫోన్ నంబరిచ్చి వారితో మాట్లాడమనలేదు. ఆయనే మహేంద్ర గారికి చెప్పి, మా అల్లుడి డేట్స్ ఇవి, మిగిలినవి వీటికి ముందో, వెనకో ఫ్లాన్ చేస్కొండి అనేవారు. నా స్వంత చిత్రం 'రెయిన్ బో' కి రెమ్యూనరేషన్ అడక్కుండానే డేట్స్ ఇచ్చారు. పైగా రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన ఆఫీసుగదిని చిత్రీకరించడానికి ఫర్మిషన్ కూడా ఇప్పించారు.

'ఆట' సమయంలో సునీల్ గారి డేట్స్ ప్రాబ్లమ్ గా ఉండి, 'మీరు తప్పకుండా రేపు మధ్యాహ్నం షూటింగ్ కి రావాలి మావయ్య గారూ!' అని నేను కంగారుగా ఫోన్ పెట్టేశాను. ఆయనొచ్చారు - ఆయన్ని, సునీల్ ని మిట్ట మధ్యాహ్నం ఎండలో రెండు ఒంటెల నెక్కించి షాట్లు తీస్తున్నాం - కొన్ని షాట్ల తర్వాత లొకేషన్ లో మార్పు కావాల్సి వచ్చింది. వారినలాగే కూర్చోపెట్టి చుట్టుపక్కల వెతుకుతున్నాం - ఈలోగా ఆయన ఒంటె దిగారు. సాయంత్రం సన్ లైట్ పోతోందన్న టెన్షన్ లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని అరిచాను - ధర్మవరపు గారిని ఎవరు ఒంటె దిగమన్నారు? ఇప్పుడు షాట్ రెడీ అయింది - ఆయన ఒంటె ఎక్కి, పొజీషన్ లోకి రావడానికి అరగంట టైమ్ పడుతుంది కదా! అని. కో - డైరెక్టర్ రాంబాబు గారొచ్చి 'ఆయనే దిగారు సర్! వంట్లో బాగోలేదాయనకి - నూట నాలుగు జ్వరం' అన్నారు. గబగబా వెళ్లి చేయిపట్టుకుని చూస్తే ఒళ్లు కాలిపోతోంది. చెప్పలేదేంటి మావయ్య గారూ! అన్నాను బాధగా. నిన్నే ఫోన్ లో చెప్దాం అనుకున్నాను అల్లుడూ! నువ్వు కంగారుగా మేటర్ చెప్పి పెట్టేశావ్. ఎంత టెన్షన్ లో ఉండి ఉంటావో, మళ్ళీ నేను కూడా ఎందుకు టెన్షన్ పెట్టడం అని వచ్చేశాను. మూడు రోజుల్నుంచి ఇలాగే ఉంది - మీ అత్తయ్య గారు ఒకటే తిట్లు - అల్లుడి సినిమా అయితే మీకు వీలైనప్పుడు వెళ్లాలి గానీ, ఇలా హడావిడిగా, అనారోగ్యంగా ఉన్నప్పుడు వెళ్లాలా అని - మన టెన్షన్లు వాళ్లకేం తెలుస్తాయ్ - అన్నారు నవ్వుతూ... ఆయన సంస్కారానికి మనసులోనే నమస్కరించాను.

పరిశ్రమలో ప్రముఖలంతా తెలుగుదేశం పార్టీని బహిరంగంగా సమర్ధించిన 2004 ఎన్నికల్లో తన మిత్రులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కోసం కాంగ్రెస్ జెండాని మోసిన ధైర్యం మావయ్య గారిది. ఆయనకి తెలిసిన ఆప్తులందరూ వద్దన్నారు, చంద్రబాబు గారితో సహా. అయినా వెనుకంజ వేయలేదు. కాంగ్రెస్ గెలిచి రాజేశేఖర్ రెడ్డి గారు సి.యం అయ్యాక, ధర్మవరపు గారే పరిశ్రమకీ, ప్రభుత్వానికీ వారధి అయ్యారు. రెండో విడత ఎన్నికలప్పుడు ఆయన్ని ఎవరూ పార్టీ మారమని అడగలేదు. ఆ పార్టీలోకి మమ్మల్ని చేర్చుకొమ్మని రికమెండ్ చేయమని అడిగారు. మళ్లీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక ఏ పార్టీ జెండాని పట్టుకోలేదాయన. స్నేహధర్మం అంటే అదేనేమో.

ఆ బ్రహ్మదేవుడికి సృష్టి కార్యక్రమాల్లో అలసట పెరిగి ఆటవిడుపు కోసం ఈ 'ఆనందో బ్రహ్మ'ని సత్యలోకానికి పిలిపించుకున్నాడో, ఆ విష్ణుమూర్తికి బోరు కొట్టి ఆ - మంచి వెంకట సుబ్రహ్మణ్యాన్ని వైకుంఠానికి పిలిచేశాడో - ఆ పరమశివుడికి నట విన్యాసాలు చూడాలనిపించి శ్రీహరి గారిని హరీమనిపించాడో - ఇలా దేవతలంతా రాక్షసులై తెలుగు సినీ పరిశ్రమ మీద కక్షగట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

వెండితెర వందేళ్ళ సందర్భంలో సంబరాలు చేసుకోనీయకుండా మా ఆత్మీయులందరికీ వందేళ్ళు అర్ధాంతరంగా ముగిసిపోవడం గర్హనీయం - అందుకే, ఈ సంవత్సరం 'అత్తారింటికి దారేది' అనే సినిమా వసూళ్ల వ్యాపారంలో శిఖరాగ్రంలో నిలిచినా, టాలీవుడ్ మార్కెట్ కి కొత్త బౌండరీస్ ఏర్పరచినా, మా మావయ్య గారిని దూరం చేసిన బాదే ఎక్కువ కాబట్టి, ఐ హేట్ 2013.

వచ్చేవారం ముందనుకున్నట్టు నేను పనిచేసిన నిర్మాతల గురించి యధావిధి వివరిస్తాను...



మీ
వి.ఎన్. ఆదిత్య.

మరిన్ని సినిమా కబుర్లు
telisina sangatule