Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అనుబంధాలు - ముఫ్ఫయ్ ఒకటవ భాగం

anubandhalu telugu serial thirty first Part

అలాని చెప్తే అత్తగారు మరింత కంగారు పడుతుందని తన భయాన్ని, ఆందోళనని గొంతులోనే దాచుకుని, భర్త రాక కోసం ఎదురుచూస్తూ బెంగగా రోజులు గడుపుతోంది. అందుకే అనుకోకుండా జ్వరం బారిన పడిందామె.

కొడుకు తిరిగి రాకపోవడంతో ఒకవేళ కెనడా నుంచి అలానే వాడు ఇండియా వెళ్ళాడేమోనన్న అనుమానంతో మున్నలూరు ఫోన్ చేసిన ప్రతిసారీ గోపాల్ అక్కడికి వచ్చాడాని అడుగుతూనే ఉంది. అడిగిన ప్రతిసారీ రాలేదని సమాధానం వస్తుంది. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితుల్లో అయోమయంగా కొట్టుమిట్టాడుతూ అత్తాకోడళ్ళు ఇద్దరూ రోజులు గడుపుతున్నారు.

కొడుకు, మనవడు, మనవరాలితో సందడిగా ఉండే లంకంత కొంప బోసిపోయి కనబడుతుంటే చాలా బాధగా ఉంది.

"అత్తయ్యా! మనం ఇండియా వెళితే ఎలా ఉంటుంది?" ఉన్నట్టుండి అడిగింది సత్యవతి.

"అదేమిటే! అబ్బాయి రాకుండా ఎలా వెళతాం...?" ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణేశ్వరి.

"ఏమో! ఓసారి మనం అక్కడికి వెల్లొస్తే బాగుంటుందని ఉంది."

"నిజమే. నాకు అలాగే ఉంది కానీ... వెళ్తే నేను తిరిగి రాను. ఒకవేళ వాడు అక్కడ లేకపోతే నిన్నొక్కదాన్ని వెనక్కి పంపించలేను."

"ఫరవాలేదు. పిల్లల్ని తీసుకుని నేను వెనక్కి వచ్చేస్తాను."

"నిజమేగానీ అందరం వెళ్లిపోతే ఇక్కడంతా ఎవరు చూసుకుంటారు?"

"ఆ భయం లేదత్తయ్యా! ఆస్పత్రిలో అంతా నమ్మకమైన వాళ్లు. ఇక్కడ మనింట్లో పనివాళ్లు కూడా ఎంతో నమ్మకమైన వాళ్లు. అయినా పోయేది మాత్రం ఏముంది? పోయేదంతా షేర్లలోనే పోయింది. అప్పులు ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలీదు. అవసరమైతే ఆస్థులు అన్నీ అమ్మేసి, ఆయన్ని ఇండియా తీసుకెళ్దాం.

ఎప్పుడూ షేర్ల మీద వస్తున్న లాభాలు చూసి మురిసిపోయేవారాయన. అ డబ్బుతో ఇండియాలో పెద్ద ఆస్పత్రి కట్టాలని, ఆ ఆస్పత్రికి మీ పేరు పెట్టాలని మురిసిపోయారాయన. అంతా పోయింది. షేర్లు ఇలా కొంపముంచుతాయనుకోలేదు..." అంటూ చిన్నగా లేచికూర్చుంది సత్యవతి.

బయట సన్నగా వర్షం పడుతోంది.

వాతావరణం చలిచలిగా ఉంది. డెట్రాయిట్ వాతావరణం అన్నపూర్ణేశ్వరికి బాగా పడినట్టుంది. మరింత ఆరోగ్యంగా, మరింత రంగుదేలి, ఉత్సాహంగా కన్పిస్తోంది. ఎన్ని సమస్యలున్నా వాటి ప్రభావాన్ని మనసు మీద పడకుండా చూసుకోగలదు.

అది ఆమె వయసు నేర్పిన పాఠం. కష్టాలు వస్తుంటాయి. పోతుంటాయి. అలాగని మనసును కష్టపెట్టకుంటే  ఆ ప్రభావం ఆరోగ్యం మీద పడి, మరింత ముసలితనం మీద పడుతుందని ఆమెకు తెలుసు.

అమ్మాయి నాకో సందేహం ఉంది. కోడలికి దగ్గరగా కుర్చీని లాక్కుని కూర్చుంటూ అడిగింది.

"అడగండి అత్తయ్యా! ఏమిటి మీ సందేహం?" నుదుటి మీద గుడ్డను తీసి పక్కన పడేసి అడిగింది సత్యవతి.

"ఏం లేదు. నిజంగానే షేర్ల మీద అంత నష్టం వచ్చిందంటావా?"

"వచ్చే వుంటుంది. లేకపోతే ఆయన అంత బాధపడతారా? అత్తయ్యా ఒక్క నిమిషం" అంటూ ఏదో గుర్తుకొచ్చినట్టు చెప్పడం ఆపింది సత్యవతి.

"ఏమైంది?"

"ఏంలేదు. స్టీఫెన్ అనే అని షేర్ బ్రోకర్ ఒకతను, మీ అబ్బాయికి మంచి ఫ్రెండు. ఈ వీధి చివరే అతని ఆఫీస్. ఓసారి అతన్ని పిలిచి మాట్లాడితే కొత్త విషయాలు ఏమన్నా  తెలుస్తాయేమో? ఒక్కోసారి పతనమైన షేర్లు కూడా తిరిగి పుంజుకుంటాయి."

"అలాగా! అయితే మాట్లాడదాం..." విశ్రాంతి తీసుకో జ్వరం తగ్గాక వెళదాం.

"పరవాలేదు. జ్వరం తగ్గింది. ఫోన్ చేసి అతన్ని పిలుస్తాను" అంటూ ఓపిక తెచ్చుకుని మంచం దిగింది సత్యవతి.

ఫోన్ వద్దకు వెళ్లి ఫోన్ చేసింది.

ఆమె ఫోన్ చేసిన పావుగంటలోనే స్టీఫెన్ కార్ వచ్చి పోర్టికోలో ఆగింది.

తెల్లగా పొడవుగా, హుందాగా వున్న మధ్య వయసు అమెరికన్ ఒకతను చిరునవ్వుతో లోనకు వస్తూ నమస్తే మేడం అంటూ హిందూ  సాంప్రదాయంలో సత్యవతికి నమస్కరించాడు.

అన్నపూర్ణేశ్వరి అతడి నమస్కారానికి ఆశ్చర్యపోయింది.

"అమ్మాయి అతను ఇండియా వాడా ఏమిటే? చూడ్డానికి అలా లేడే?" అంది.

అతన్ని పట్టి పట్టి చూస్తున్న అన్నపూర్ణేశ్వరి ఇతను కొంతకాలం హైద్రాబాద్ లో ఉన్నాడట. మన పద్ధతులు తెలుసు. కానీ తెలుగు రాదు. హిందీ కొద్దిగా మాట్లాడగలడు. అంటూ స్టీవెన్ కి నమస్కారం చేసి, రండన్నయ్యా కూర్చోండి అంది ఆదరంగా ఇంగ్లీష్ లో. అతను కూర్చున్నాడు. అత్తగారిని అతడికి పరిచయం చేసింది సత్యవతి.

"గోపాల్ గారు ఇంకా రాలేదు." చుట్టూ చూస్తూ అడిగాడు స్టీవెన్.

"కెనడా వెళ్లాడు. రెండు మాసాలు కావస్తోంది. ఇంకా తిరిగిరాలేదు. అందుకే కంగారు పడుతున్నాం. షేర్లలో భారీగా నష్టపోయినప్పట్నుంచి ఆయన పరిస్థితి బాగాలేదు."

"వెయిట్... మినిట్..." అంటూ ఆమె మాటలకు అడ్డువచ్చాడు స్టీవెన్.

"షేర్లలో భారీగా నష్టం ఏమిటి?" అర్ధం కానట్టు అడిగాడు.

"అదేమిటి మీకు తెలియదా? ఒకేసారి ఐదు వందల నష్టం. జిన్ లేబొరేటరీస్ కుప్పకూలడంతో మా డబ్బు కూడా పోయింది."

"వ్వాట్..." ముఖం చిట్లించి అర్ధంకానట్టు అరిచాడు స్టీవెన్.

ఆ వెంటనే పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు.

అతడు ఎందుకు నవ్వుతున్నాడో అర్ధంకాక అత్తాకోడళ్ళు ముఖాముఖాలు చూసుకున్నారు.

"మీ షేర్లు నష్టపోయినట్టు ఎవరు చెప్పారు మీకు?" నవ్వాపుకుంటూ అడిగాడు.

"ఆయనే చెప్పారు. బెంగపడ్డారు కూడా. అదేమిటి? జిన్ లేబోరేటరీస్ పతనం కావడం నిజం కాదా?" ఉద్వేగభరితంగా అద్దిగింది సత్యవతి.

"నిజమే. జిన్ లేబోరేటరీస్ కుప్పకూలిన మాట నిజమే."

"మరింకేమిటి? మా షేర్లు కూడా కుప్పకూలినట్టేగా?"

"ఏమిటి సిస్టర్? ఇదేం జోకో నాకు అర్ధం కావడం లేదు. జిన్ లో మీకు షేర్లే లేవు. ఇక కుప్పకూలడం ఏమిటి?"

ఆశ్చర్యంతో నోట మాటరాలేదు సత్యవతికి.

"నమ్మను. నేన్నమ్మను. నాకు షేర్ల గురించి తెలియకపోవచ్చు. కానీ ఆయన చెప్పింది నేను మర్చిపోలేదు. జిన్ లేబోరేటరీస్ లోనే డబ్బు మదుపు చేశానన్నారాయన." అంది.

"లేదు సిస్టర్ మీతో మిస్టర్ గోపాల్ అలా ఎందుకు చెప్పారో కారణం నాకు తెలీదు. మీ డబ్బు ఎక్కడికీ పోలేదు. పైగా ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి . మిస్టర్ గోపాల్ కి జిన్ లేబోరేటరీస్ లో ఒక్క షేర్ కూడా లేదు. ఆయన తన డబ్బంతా పెట్టింది జెన్ ఫార్మా లేబోరేటరీస్ షేర్ల మీద. అప్రతిహాసంగా ముందుకు సాగుతున్న పెద్ద కంపెనీ అది. జెన్ ఫార్మా షేర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంది. అప్పుడు అమ్మకానికి పెట్టినా మీ షేర్ల మీద కోట్లకు కోట్లు లాభం వస్తుంది. జెన్ ఫార్మాకి జిన్ కి పేర్లు దగ్గరగా ఉన్నంత మాత్రాన గోపాల్ పొరపాటు పడే చాన్స్ లేదు. ఏదో కారణంతోనే ఆయన మీకిలా నష్టం వచ్చిందని చెప్పుండాలి.

సారీ సిస్టర్ జరిగిందానికి మీరు చాలా బాధపడినట్టునారు. నిశ్చితంగా ఉండండి. గోపాల్ రాగానే నేను మాట్లాడతాను. మీరు అనుకున్నట్టు మీకు ఏ నష్టం జరగలేదు. ఓ.కే." అంటూ ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు స్టీవెన్.

అతడు పోయిన ఐదు నిమషాల్ వరకూ అత్తాకోడళ్లు ఇద్దరూ కోలుకోలేకపోయారు.

"ఏం జరిగింది? ఏం జరగబోతోంది? అర్ధం కాని పరిస్థితి. పేర్లలో నష్టపోలేదని తెలిసినందుకు చాలా సంతోషించాలా? లేక గోపాల్ ఎందుకు ఈ విధంగా చేసాడో తెలియని పరిస్థితికి విచారించాలో అర్ధంగాని పరిస్థితి. పైగా ఏ నష్టం రానప్పుడు ఇతగాడు కెనడా వెళ్లి కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది.

"అమ్మాయి సత్యవతి!" అంటూ తనే ముందుగా తేరుకుంటూ కోడల్ని పిలిచింది అన్నపూర్ణేశ్వరి.

"నాకంతా అయోమయంగా ఉంది అత్తయ్యా! ఏమీ అర్ధం కావడం లేదు" అంటూ తల పట్టుకుంది సత్యవతి.

"నాకు అర్ధమైంది గానీ, నువ్వేమీ కంగారుపడకు. వీళ్ల సంగతేమిటో తేల్చేస్తాను. రా చెప్తాను" అంటూ లేచిందావిడ.

"ఎక్కడికి అత్తయ్యా!"

"చెప్పింది విను. మనమిక్కడ చేతులు ముడుచుకు కూర్చుంటే పనులు కావు. నా ఉద్దేశం సరైతే గోపాల్ కెనడాలో లేడు. ఇండియా వెళ్లిపోయుండాలి. గోపాల్ అక్కడికి రాలేదని కావాలనే వాళ్లంతా అబద్ధం చెప్తున్నారు. కాదు కాదు గోపాల్ వాళ్ల చేత అలా చెప్పిస్తూ ఉండాలి."

"అలా ఎందుకు చేస్తారు?"

"ఎందుకేమిటే పిచ్చి మొద్దూ? వాళ్లు ముగ్గురూ అక్కడున్నారని తెలిస్తే మనం కూడా వచ్చేస్తామని ఈ నాటకం ఆడుండాలి."

"అయితే బావగారికి ఫోన్ చేసి అడగనా?"

"వాళ్ళంతా ఒకటైపోయారే పిచ్చి మొఖమా! మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదనే చెప్తారు.

అన్నన్నా...నాకిప్పుడు  అర్ధమవుతోంది. గుర్తుందా? వెళ్లేముందు ఇక్కడ ఫోన్ నెంబర్లన్నీ మార్పించేశాడు."

"అవును. అకారణంగా మార్పించేశాడు"

"అకారణం కాదు అంతా సకారణమే. నీ కొడుకు, కూతురు చాలా మారిపోయారని అబ్బో! చాలా కబుర్లు చెప్తున్నాడు. అదంతా నిజమై ఉండదు. పాత నెంబర్లుంటే అనంత్, శివానీలు మాటిమాటికీ ఫోన్ చేసి వచ్చేస్తామని గొడవ చేస్తారని నెంబర్లు మార్చేసి, షేర్లలో నష్టం వచ్చిందని వంక పెట్టి నైస్ గా ఇండియా వెళ్ళిపోయాడు. నా అనుమానం నిజమైతే ముందుగా జర్మనీ వెళతానని వెళ్లాడు చూసావా? ఆ వంకన అప్పుడు ఇండియానే వెళ్లుంటాడు."

"ఓసారి ఇండియా వెళ్ళొచ్చి, రెండోసారి కూడా ఇండియానే వెళ్లారంటావా?"

"అవును సందేహం అక్కర్లేదు. అక్కడేదో గందరగోళం జరుగుతోంది. రా చెప్తాను. మనింటికి ఫోన్ చేసి లాభం లేదు. నర్సారాయుడు గారింటికి ఫోన్ చేస్తే వాళ్లు నిజం చెప్తారు. నా సూట్ కేస్ లో నెంబరుండాలి. తెస్తా..." అంటూ గబగబా తన గదిలోకి వెళ్లి, పావుగంట తర్వాత తిరిగి వచ్చిందావిడ.

చిన్న హ్యాండ్ బుక్ లో రాసి పెట్టుకున్న నెంబర్ సత్యవతికి చూపించింది.

"ఫోన్ చేసి నాకివ్వు. నేను మాట్లాడతాను" అంది.

సత్యవతి ఫోన్ చేసింది. పది నిమిషాలు ప్రయత్నించాక లైన్ కలిసింది.

నర్సారాయుడిగారి భార్య రుక్మిణీ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆవిడ అన్నపూర్ణేశ్వరికి మంచి స్నేహితురాలు.

"ఏయ్... రుక్మిణీ... నేనే అన్నపూర్ణేశ్వరిని. అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నాను" అని ఆవిడ అరిచి చెప్పగానే అవతల రుక్మిణి చాలా సంతోషపడిపోయింది.

"అబ్బ... ఇన్నాళ్లకి గుర్తొచ్చానా? అమెరికా కోడలి దగ్గరికెళ్లగానే పూర్తిగా మమ్మల్ని మర్చిపోయావు. ఎలా ఉన్నావు? ఏమిటి?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

కుశల ప్రశ్నలు అవగానే "ఇంతకీ మావాళ్ళంతా ఎలా ఉన్నారు?" అంటూ కూపీ లాగనారంభించింది అన్నపూర్ణేశ్వరి.

"వాళ్లకేమిటి నిక్షేపంగా ఉన్నారు. కాదంటే..."

"ఊ... కాదంటే... ఏమైందే...?"

"ఏం లేదు. నీ మనవడు, మనవరాలు ఇక్కడ కన్పించడం లేదు."

"ఎక్కడికెళ్లారట?"

"అన్నట్టు మా అబ్బాయి గోపాల్ అక్కడే ఉన్నాడా?"

"అదేం అడుగుతావు. ముందోసారి వచ్చి మూడ్రోజులుండి అమెరికా వచ్చేసాడా? గడ్డం పెంచుకొని, మనిషి దిగాలుగా... ఇంతకీ ఓ మాట చెప్పొదినా? నేను విన్నది నిజమేనా?"

"ఏం విన్నావ్...?"

"అదే... షేర్లు దివాళా తీసి, ఎన్నో కోట్లు నష్టం వచ్చిందని ఆ దిగులుతోనే గోపాల్ ఇక్కడికొచ్చాడని?"

"లేదు. అలాంటి నష్టం ఏమీ జరగలేదు. ఏదో పొరపాటు జరిగింది. ఇంతకీ గోపాల్, పిల్లలు మా ఇంట్లోనే ఉంటున్నారా?"

(... ఇంకా వుంది)

http://www.suryadevararammohanrao.com/

మరిన్ని సీరియల్స్
duradrustapu dongalu