Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mekapilla saayam telugu story

ఈ సంచికలో >> కథలు >> గురువింద

guruvinda

"మీరెన్నైనా చెప్పండి మన పిల్లలు మన పట్ల ప్రవర్తించిన తీరు బాగాలేదు. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు వెళ్ళామా వాళ్ళ ఇంటికి అనిపిస్తోంది." అంది, సౌజన్య నా భార్య.

మాకు పెళ్లై ముఫ్ఫై అయిదేళ్ళయింది. మాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. పెద్దమ్మాయి చెన్నైలో ఉంది. అల్లుడూ తనూ ఇద్దరూ ఉద్యోగస్తులు. ఒక అమ్మాయి వాళ్ళకి.

రెండో అమ్మాయి సింగపూర్ లో ఉంటుంది. వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులే. పిల్లల్లేరింకా.

చాలాకాలంగా వాళ్ళింటికి రమ్మంటున్నారు. ఉద్యోగం చేసినన్నాళ్ళూ సెలవులు దొరకవని తప్పించుకున్నాం. రిటైరయి దగ్గర్నించీ వాళ్ళ కోరిక మన్నించక తప్పని పరిస్థితైంది. అలా చెన్నై వెళ్లాం. పదిరోజులున్నాం. అటునించీ సింగపూర్ వెళ్ళాం పది రోజులున్నాం. వాళ్ళింట్లో మా పిల్లలు మాపట్ల ప్రవర్తించిన తీరు నాకు బాధ కలిగించింది. కానీ అది సహజం అనిపించింది.

ఎంతో గారాబంగా పెంచాం. చక్కటి చదువులు చెప్పించాం. గుణవంతులు, స్థితిమంతులైన కుటుంబాల్లో పిల్లలనిచ్చాం. ఆ మేరకు తృప్తిగా ఉన్నాం. వాళ్ళు సుఖంగా ఉన్నారు మాకదే ఆనందం. వాళ్ళతో తరచూ మాట్లాడేందుకు నేను కూడా లాప్ టాప్ కొనుక్కున్నాను. స్కైప్ లో మాట్లాడుకుంటాం. వారానికోసారైనా. అలా ప్రత్యక్షంగా చూస్తుంటాం కాబట్టి తృప్తిగా వుంటుంది. వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడండి అంటారు ఎప్పుడూ. నాకేమో అంతసేపు మాట్లాడేందుకేంవుంటాయి అనిపిస్తుంటుంది. సౌజన్య మాట్లాడుతుంది ఎంతసేపైనా.

***

చెన్నై లో వున్న మా పెద్ద అమ్మాయి దగ్గర వున్న రోజుల్లో మా అల్లుడు బాగానే మాట్లాడేవాడు. అతనికి సెలవు లేక పోవటం వల్ల చెన్నైలో చూడటానికి పాండి చెరి, ఆరో విల్లికి టూరిస్ట్ కేబ్ మాట్లాడేడు గైడ్ తో సహా. మేమిద్దరం అలా వెల్లొచ్చాం. పైసా ఖర్చులేకుండా.

ఇంట్లో వున్నప్పుడు మా అమ్మాయి ప్రవర్తన నచ్చేది కాదు. ఎప్పుడూ డబ్బు ఖర్చు అయిపోతోంది అని బాధపడేది, ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా. చవుకలో వస్తోందని వాళ్ళ ఆఫీసుకి దూరమైనా ఒక అపార్టుమెంటు తీసుకున్నారు. అమ్మాయి పుట్టాక చాలా ఇబ్బంది పడుతున్నారు.

అల్లుడుగారు ఉదయం ఆరుకే లేచి వంట చేసేస్తాడాయన. మా అమ్మాయి లేచి పిల్లపని చూసుకునేందుకు సరిపోతుంది. కొంచెం బద్దకస్తురాలైంది అనిపిస్తుంది. ఆయన ఎనిమిదిన్నరకి ఆఫీసుకి వెళ్ళిపోతాడు బైక్ మీద. మా అమ్మాయి పిల్లని తీసుకుని ఆఫీస్ కేబ్ లో వెళ్తుంది. తన ఆఫీసు దగ్గరలోనే డే కేర్ సెంటర్ లో పిల్లని దించి తన ఆఫీసుకి వెళుతుంది. సాయంత్రం ఇద్దరూ వచ్చేటప్పటికి ఎనిమిదవుతుంది. అప్పుడు వంట చేసుకునే ఓపిక లేకపోతే బైట నించీ తెచ్చేసుకుంటారు. మేముండటం వల్ల సాయంత్రం వంట మా ఆవిడే చేసేది. ఉదయం అల్లుడుగారు కూర అందరికీ చేసేసేవాడు. అన్నం మాత్రం మేము తినేటప్పుడు వండుకో మనేవాడు.

మేము టూర్ కెళ్ళినప్పుడు చిన్న రాద్ధాంతం చేసింది మా అమ్మాయి. ప్రత్యేకంగా కేబ్ దేనికి, టూరిస్ట్ బస్ లో వెళితే చవకగా అవుతుంది కదా అని. పాపం అతని తల్లి తండ్రి వచ్చినప్పుడు వాళ్ళని టూరిస్ట్ బస్ లోనే పంపేడట, మా అమ్మాయి గోలపెడితే, తనే చెప్పిందామాట.

దాని మాటలు వింటే మేం రావటం వల్ల ఖర్చు ఎక్కువ అయినట్టు చెప్తున్నట్టు అనిపించేది. అది మా ఇద్దరికీ నచ్చేది కాదు. ఎప్పుడు అక్కడ నించి వెళ్ళిపోతామా అనిపించేది.

ఇక రెండో అమ్మాయి దగ్గరకి వెళ్ళాం చెన్నై నుంచే. మూడు నెలలు ముందే నిర్ణయించుకోవటం వల్ల మా రెండో అల్లుడే రానూ, పోనూ విమానం టిక్కెట్లు బుక్ చేశాడు. సింగపూర్ లో కూడా అతనికి సెలవు లేకపోయినా జీతం నష్టం మీద సెలవు పెట్టి మమ్మల్ని సింగపూర్, మలేషియా చూపించాడు. మలేషియా షిప్ లో తీసుకెళ్ళాడు. మాతో మా అమ్మాయి రానంది. ఇది వరకు చూశాను అంది. అసలు కారణం డబ్బులు దండగ అని. అది కూడా అల్లుడు గారితో అంది ఆయన మాతో వెళ్ళకుండా మమ్మల్ని ఒక్కళ్ళనే టూరిస్ట్ పాకేజీలలో పంపమని. అలా అయితే తక్కువ ఖర్చు అవుతుందని. నిజానికి అక్కడ ప్రతీదీ ఖరీదే మన రూపాయల్లో చూసుకుంటే. అయితే ఆయన అనేవాడు అలా చూడకూడదని. ఇక్కడి ఆదాయం ఎక్కువే కనుక ఇక్కడి డాలర్లతోనే పోల్చుకోవాలి అని. ఏమైనా మాకు బాధగానే వుండేది. వాళ్ళ సంపాదనంతా మాకోసం ఖర్చై పోతోందని. నేను ఖర్చుపెడతాను అంటే వినేవాడు కాదాయన. 'మా అమ్మా, నాన్న వస్తే నేను ఖర్చుపెట్టనా' అనేవాడు. అయినా చివరిలో లక్షరూపాయలు ఒక కవరులో పెట్టి మా అమ్మాయి కిచ్చేసాం మా అల్లుడి ఎదురుగా - ఎందుకంటే అది కూడా గోవా ఖర్చు గురించే మాట్లాడేది మాతో.

అలా ఇవ్వటం మా పెద్దమ్మాయికి తెలిసింది, అది మా ఆవిడని అడిగింది. 'దానికిచ్చేశారు. మరి నాకెందుకు ఇవ్వలేదు. వాళ్ళిద్దరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు కదా' అని. అందువల్ల దానికీ సుమారుగా అక్కడి ఖర్చుగా భావించి ఒక పాతికవేలు పెంపేను. అయినా దానికి తృప్తి కలగలేదు.

ఇలా వాళ్ళ ప్రవర్తన మా ఆవిడకి పూర్తిగా నచ్చలేదు. రోజూ అనేది 'చిన్నప్పటి నించీ ఎలా పెంచాం. వీళ్ళెలా తయారయారు' అని.

అయితే ఈ విషయంలో మా ఆవిడదే తప్పు. ఎందుకంటే చిన్నప్పటి నించీ వాళ్ళని డబ్బు ఎక్కువ ఖర్చుచేయకూడదు అనే పద్ధతిలో పెంచింది. బజారు వెళ్ళినప్పుడు ఎంత దూరమైనా నడిచే వెళ్దాం అనేది. వాళ్ళు సరదా పడితే నేను హోటల్ కి తీసుకెళితే అక్కడ తను తినేది కాదు ఏమీ. ఆ మేరకు ఖర్చు తగ్గుతుందనుకునేది.

మా అమ్మా, నాన్న కానీ, వాళ్ళ అమ్మ, నాన్న కానీ వచ్చినప్పుడు నేనున్న ప్రాంతంలో చూడదగిన వూళ్ళు, పుణ్యక్షేత్రాలు వుంటే తీసుకెళ్ళేవాణ్ణి. మాతో తను వచ్చేది కాదు. ఏవుంది చూడ్డానికి ఎక్కడైనా ఒకటే కదా' అని.

అలాగే ఎప్పుడూ డబ్బు ఖర్చు గురించే మాట్లాడేది. అదీ పిల్లలు వింటూ వుండగా.

నేను పెన్సిళ్ళు పేకెట్టు తెచ్చేవాణ్ణి. తను ఒక పెన్సిల్ ని రెండు చేసి ఇచ్చేది వాళ్ళకి. వాళ్ళకేమో పెద్ద పెన్సిల్ తో రాసుకోవాలని వుండేది. ప్రతిసారీ ఇద్దరికీ పోటీయే పెన్సిల్ క్రింది భాగమే కావాలని.

ఇలా తన పెంపకం వల్లే పిల్లలు కూడా తనకి ప్రతి రూపంగా తయారయారని మా ఆవిడ తెలిసికోలేకపోతోంది గురువింద గింజలా.

***

మరిన్ని కథలు
Mr. vintha manastatvam