Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aditya hrydayam

వైజయంతీ మూవీస్ అధినేత శ్రీ సి. అశ్వనీదత్ గారు
శ్రీకృష్ణుడు వేషధారణలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పాంచజన్యం పూరిస్తున్న షాట్... వెనకే భూగోళం వైజయంతి మూవీస్ అని అక్షరాలు పడగానే, థియేటర్ లో హీరో ఇంట్రడక్షన్ షాట్ కి వచ్చినట్టు విజిల్స్, చప్పట్లు, గాలిలోకి ఎగిరే కాగితాలు. ఒక మహాద్భుత భారీ చిత్రాన్ని చూడబోతున్నామని బ్యానర్ చూడగానే అర్ధమైపోయే నిర్మాణ సంస్థ. దాని అధిపతి మాత్రం చూడటానికి సామాన్య మధ్య తరగతి వ్యక్తిలా, సింపుల్ గా, సన్నగా, కనీసం ఒంటి మీద బంగారం కూడా బిల్డప్ కోసం వేసుకోని వ్యక్తి శ్రీ అశ్వినీదత్ గారు.

జయంత్ గారి దర్శకత్వంలో నాగార్జున గారు హీరోగా "రావోయి చందమామ" చిత్రం షూటింగ్ జరుగుతోంది. అప్పటికే అసోసియేట్ డైరెక్టర్ గా మానేసి దర్శకుడు అవ్వాలని నేను గ్యాప్ తీసుకుని హోంవర్క్ చేస్తున్న రోజులు అప్పుడప్పుడు సరదాకి షూటింగ్ కి వెల్లొస్తుండేవాడిని. తరువాత వాళ్ళు ఫారిన్ వెళ్లారు. పదిహేను రోజులు షెడ్యూలు సింగపూర్ లో షిప్ ఎక్కి మలేషియా, థాయ్ లాండ్ తిరిగి సింగపూర్ వచ్చి ఇండియా వచ్చేశారు. వచ్చాక కబురు చేసారు. ఆఫీస్ కి వెళ్ళాను, ఆ సినిమా దర్శకత్వ శాఖలో పనిచేయమని అడిగారు. నిజానికి దర్శకుడు అడగాలి కాని జయంత్ గారు మాట మాత్రమైన అనలేదు నేను చెయ్యాలా వద్దా, అని ఆలోచించి, నేను ఇంతకు ముందు వర్క్ చేసిన డైరెక్టర్ కాబట్టి ఆయన్ని ఒక మాట అడిగి మీకు చెప్తాను సార్. వేరే డైరెక్టర్ అయితే మీరు అడగగానే చేరేపోయేవాడిని నాకు జయంత్ గారు చాలా క్లోజ్ కాబట్టి, మీ ద్వారా చేరడం నాకు ఇబ్బంది అన్నాను. ఆయన వెంటనే జయంత్ తో మాట్లాడి రేపు చెప్పండి అన్నారు. ఆరాత్రి జయంత్ గారిని కలిసి విషయం చెప్తే... ఆయన హ్యాపీగా ఇన్ వైట్ చేసారు. అలా మధ్యలో చేరాను ఆ సినిమాకి.

దత్తుగారిని కలిసిన రోజు ఒక చిన్న సంఘటన జరిగింది నేను ఆయన రూమ్ లోకి వెళ్లేసరికి ఒక వ్యక్తితో చాలా వినయంగా, మర్యాదగా, అభిమానంగా మాట్లాడుతూ ఉన్నారు. నన్ను కూర్చోమన్నారు. రెండు నిమిషాలు తరువాత ఆవ్యక్తి వెళ్ళిపోయాడు, గుమ్మం దాటాడో లేదో ఆయన స్వస్థలమైన కృష్ణాజిల్లా తిట్లుతిట్టారు ఆవ్యక్తిని నాదగ్గర. నాకు నవ్వు ఆగలేదు, అతను ఎంత విసిగించి ఉంటాడో దత్తుగారిని అనిపించింది.

నటీనటులే కాదు, వ్యాపారవేత్తలు కూడా జీవితంలో నటించాలన్నమాట అనుకున్నాను మనసులో తరువాత నా "బాస్" సినిమాలో అదే సీన్ పెట్టాను నాగార్జున గారు ఫోన్ లో "మూర్తి గారు మీరంటే చాలా ఇష్టం" అంటూ మాట్లాడి ఫోన్ పెట్టేశాకా నయనతారతో ఈ "మూర్తిగాడు మళ్ళీ ఫోన్ చేస్తే నాకు ఇవ్వకు ఇడియట్" అంటారు.

సినిమా మేకింగ్ లో తెరమీద కనపడే ఏచిన్న విషయానికి రాజీపడని నిర్మాత దత్తుగారు. ఒక ఐటెం సాంగ్ కోసం ఐశ్వర్యరాయ్ ని తెచ్చి నటింపచేశారాయన ఆ సినిమాలో సింగపూర్ లో షూటింగ్ చేసిన షిప్ లో మొత్తం ఇంటీరియర్స్ ని పద్మశ్రీ తోట తరణి గారి ఆర్ట్ డైరెక్షన్ లో నాలుగైదు సెట్లు వేయించారాయన. ఈరోజుల్లో ఎవరూ కూడా అలా చేయలేరు అప్పటి తెలుగు సినిమా వ్యాపార స్థాయిని నిర్మాణ విలువల్ని అమాంతం పెంచిన ఘనత నిస్సందేహంగా శ్రీ దత్తుగారిదే అదే దత్తుగారు తెరమీద కనపడని ఖర్చుని ఎలా నియంత్రిస్తారనడానికి ఉదా: చిన్న సంఘటన జర్మనీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చూశాను. యూనిట్ లో పదిహేడుమంది లంచ్ కి పదిహేడు మెక్ డోనాల్డ్ బర్గ్ లు, పదిహేడు కోక్ లు, పదిహేడు ఫ్రెంచ్ ఫ్రైస్ లు, కాంబో అని కాగితం మీద రాసిచ్చాను. అందులో పదిహేడు బర్గర్ లు డబుల్ బర్గర్ లు దత్తుగారి అన్ని యాజిటీజ్ గా తెచ్చి పదకొండు ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చారు. తగ్గాయి సార్  అన్నాను. ఇవి ఎవరు ఎక్కువ తినరమ్మా అక్కడా, ఇక్కడా పడేస్తారు. అన్నీ కలిపి ఒక క్యారీ బ్యాగ్ లో వెయ్యి ఎవరికి కావాల్సింది వాళ్లు తిన్నాక ఇంకా మిగిలిపోకపోతే చూడు అన్నారు. నిజంగానే మిగిలిపోయింది ఆశ్చర్యపోయాను. ఫారిన్ లో అదేపాటికి రోజు పన్నెండు మంది ఫారిన్ డ్యాన్సర్స్ ని మనిషికి మూడొందల అమెరికన్ డాలర్లు ఇచ్చి పెట్టించారాయన మళ్ళీ ఆశ్చర్యపోయాను. ఆయన సినిమాల్లో అద్భుత రసాన్ని చూసి ప్రేక్షకుడిగా అలా ఆశ్చర్యపోయానో, ఆయన నిర్మాణ శైలిని చూసి అలాగే రోజు ఆశ్చర్యపోయేవాడిని ఏదో ఒక విషయంలో.

తిరుపతి స్వామి, ఆ సంస్థలో ఆజాద్ చిత్రానికి దర్శకత్వం వహించాక రెండేళ్ళకి చనిపోయారు మరో మూడేళ్ళ తరువాత ఆ చిత్రాన్ని దత్తుగారు వేరే భాషలో రిమేక్ రైట్స్ అమ్మారు. వచ్చిన మొత్తంలో కథకుడిగా, తిరుపతి స్వామికి ముట్టవలసిన 33% వాటా సొమ్ముని తన మనిషిద్వారా తిరుపతి స్వామి భార్యా పిల్లలు తమిళనాడు లో ఏదో మారుమూల సొంత ఊరిలో ఉంటున్న అడ్రస్ కనుక్కొని ఇంటికి పంపించిన అద్భుత వ్యక్తి దత్తుగారు. అదే దత్తుగారికి మనిషి నచ్చకపోతే, అడిగిన డబ్బులు ఇవ్వరు గొడవచేస్తే చెక్ ఇచ్చి పంపుతారు. దానికి స్టాప్ పేమెంట్ నిల్ బ్యాలెన్స్ ఏర్పాటు చేస్తారు. చెక్ బౌన్స్ అయ్యి ఆసదరు వ్యక్తి వెళ్లి "మీ చెక్ బౌన్స్ అయ్యింది సార్" అని అడిగితే "నీ సినిమా కూడా బౌన్స్ అయ్యిందమ్మా ఏం చెయ్యను" అంటారు. "వ్యక్తిత్వంలో రెండు ఎక్స్ ట్రీమ్స్ కాని రెండూ సినిమా బాగా ఉండాలని తపన కలిగినవే" అదే శ్రీ దత్తుగారు.

"సారొచ్చారు" సినిమాకి ముందు మళ్ళీ నన్ను పిలిపించారు ఆఫీస్ కి చాలా ఏళ్ళ తరువాత రవితేజ డేట్స్ ఉన్నాయి. నాకు నీతో చెయ్యాలని ఉంది. నువ్వంటే ఇష్టం కాని నీకు తెలియనిది ఏముంది? హీరో నోటి నుంచి మీ పేరు రాకుండా నేను చెప్పినా ఓకే అవ్వదు కాబట్టి రవిగారిని టచ్ చెయ్ అని చెప్పారాయన. కేవలం నా ముందు సినిమా హిట్ కాకపోవడం వల్ల ఇంత పెద్ద నిర్మాత కూడా నాతో సినిమాలు చెయ్యాలని ఉండి చెయ్యలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాను. మారుతున్న పరిశ్రమ నాకు అర్ధం అవ్వడం మొదలు పెట్టింది అప్పుడే మళ్ళీ సూపర్ హిట్ ఇచ్చి, దత్తుగారిలో నన్ను అభిమానించే నిర్మాతలు హీరోలు దగ్గర నా పేరు ప్రస్తావించి ఒప్పించే స్థాయిలో ఉండాలని ఆరోజే నిర్ణయించుకున్నాను.

ఆయన పిల్లలు స్వప్న దత్, ఆమె ఇద్దరు చెల్లెళ్ళు కూడా నిర్మాతలుగా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు నిర్మిస్తూ ఆయన బాటలో నడుస్తున్నారు. ఆయన పాలసీని కంటిన్యూ చేస్తున్నారు.

దత్తుగారికి అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడు స్వప్నగారు నా "మనసంతా నువ్వే" సినిమా థియేటర్ లో ఆమె ఫ్రెండ్స్ తో పాటు వెళ్లి గంట తరువాత కూడా నాకు ఫోన్ చెయ్యలేదు, సినిమా నచ్చలేదేమో అనుకున్నాను.

"హార్ట్ టచ్చింగ్ గా ఉంది ఆదిత్యా క్లైమాక్స్ లో ఏడ్చేశాను అందులోంచి బయటికి రావడానికి గంట పైనే పట్టింది" అన్నారు తరువాత ఫోన్ చేసి.  సినీ పరిశ్రమలో పుట్టిపెరిగిన అమ్మాయికి ఇది సినిమా అని తెలిసికూడా, తెరమీద పాత్రలని చూసి ఇంత స్పందించే గుణం ఉంటుందా అని మళ్ళీ ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపరచడంలో మరో అశ్విని దత్తుగారు ఇన్ మేకింగ్ అనుకున్నాను. దత్తుగారు చదువుకొని, చెన్నై వెళ్ళిన విజయవాడ నుంచే నేను కూడా చదువు పూర్తిచేసి చెన్నై వెళ్ళడం యాదృశ్చికమే అయినా నాకు చాలా ఆనందకరం. వారికి వారి కుటుంబానికి శుభాభినందనలతో...

(వచ్చేవారం "ఆగిపోయిన నా మొదటి సినిమా అనుభవాలు")
 

మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
where are telugu heroines in telugu cinemas?