Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrydayam

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగు సినిమాల్లో తెలుగు నాయికలేరీ?!

where are telugu heroines in telugu cinemas?

అత్తారింటికి దారేది. సూపర్ హిట్!  హీరో పవన్ కళ్యాణ్!
దూకుడు. సూపర్ హిట్! హీరో మహేష్ బాబు!
గుండెజారి గల్లంతయ్యిందే. సూపర్ హిట్! హీరో నితిన్!

- పై మూడు సినిమాల్లో హీరోయిన్ లు సమంత, ప్రణీత, నిత్యా మీనన్. హీరోలు మనవారు. దర్శకులు, నిర్మాతలు మనవారే. కానీ హీరోయిన్ లు మాత్రం మనవారు కాదు. ఇతర రాష్ట్రాలకు చెందినవార! తెలుగు సినిమాల్లో నటించడానికి తెలుగు నాయికలు లేరా? ఉన్నా పరభాషా హీరోయిన్ ల పాటి నటన రాదా? కానే కాదు! మన నిర్మాతలు, దర్శకులు, హీరోలు మనవారికి అవకాశాలు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా చిన్న చిత్రాల్లో, చిన్నపాత్రలకో, సెకండ్ హీరోయిన్స్ గానో అవకాశం ఇస్తారు. ఎందుకిలా?! ఎందుకంటే మన హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ కు సరిపోరు, పనికిరారు. ఒకసారి గతంలో తెలుగు సినిమాల్లో నటించిన తెలుగు నాయికలను గుర్తుచేసుకుంటే తెలుస్తుంది మన నాయికలు ఎంతబాగా నటిస్తారో! నటించడం కన్నా పాత్రల్లో జీవిస్తారు అని చెప్పవచ్చు.

మొదట్లో కాంచనమాల, ఆ తర్వాత మహానటి కన్నాంబ, సావిత్రి, భానుమతి, షావకారు జానకి, జమున, కృష్ణ కుమారి, విజయనిర్మల, వాణిశ్రీ... ఇలా ఎంతోమంది పాతతరం నటీమణులు నటులతో పాటు సమానంగా నటించి సినిమాలను విజయవంతం చేసేందుకు కృషి చేశారు. 'పల్నాటి యుద్ధం, మాయాబజార్, గుండమ్మకథ, షావకారు, దేవదాసు, మల్లీశ్వరి, విఫ్రనారాయణ, పూలరంగడు, కులగోత్రాలు, మూగ మనసులు, ప్రేమ నగర్, మొదలగు సినిమాలు చూస్తే తెలుస్తుంది వారి నటన ఏంటో, సత్తా ఏంటో!

ఇక శారద, జయసుధ, జయప్రద, మాధవి, విజయశాంతి, భానుప్రియ, రంభ, రోజా, రవళి మొదలైన నాయికలు తమ విజయపరంపరను కొనసాగించారు. వీరి తర్వాత వచ్చిన లయ 'స్వయంవరం, ప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్' లాంటి విజయవంతమైన చిత్రాలతో పాటు కొన్ని చిత్ర అపజయాలతో నటించింది. స్నేహ 'తొలివలపు' తో పలకరించినా ఆ సినిమా పరాజయం పొందింది. ఆ తర్వాత 'సంక్రాంతి, శ్రీ రామదాసు, హనుమాన్ జంక్షన్, వెంకీ' సినిమాలు విజయం సాధించాయి. మన హైదరాబాదీ అమ్మాయి టబూ 'కూలీ నెం.1' సినిమా విజయం సాధించినా తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. 'నిన్నే పెళ్ళాడతా, ఆవిడా మా ఆవిడే, అందరి వాడు, ఇదీ సంగతి, పాండు రంగడు' ఇలా కొన్ని తెలుగు సినిమాలు చేసినా హిందీ చిత్రసీమకు వెళ్ళిపోయింది.

ఇక స్వాతి 'అష్టా చెమ్మా, డేంజర్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, స్వామి రారా, కలవరమాయే మదిలో' లాంటి కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాప్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు మళ్ళీ నిఖిల్ తో ఒక సినిమాలో నటిస్తోంది. స్వాతి చేసిన సినిమాల్లో ఒక 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' సినిమానే పెద్ద సినిమా. మిగతావన్నీ చిన్న సినిమాలే.

'ఫోటో' తో పాటు రెండు మూడు సినిమాల్లో నటించినా అదృష్టం కలిసిరాకపోవడంతో తమిళ చిత్రరంగానికి వెళ్ళిన అంజలి తమిళంలో చేసిన 'షాపింగ్ మాల్, జర్నీ, గ్యాంబ్లర్' సినిమాలు విజయం కావడం, ఆ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి విడుదలై విజయం సాధించడంతో తెలుగులో వెంకటేష్ సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రవితేజ తో చేసిన 'బలుపు' సినిమాలు విజయం సాధించాయి. మళ్ళీ వెంకటేష్ సరసన నటించిన 'మసాలా' ఫ్లాపయ్యింది. ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాల్లో నటించిన తెలుగు హీరోయిన్ అంజలినే.

ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని తెలుగు సినిమాల్లో, తెలుగు అమ్మాయిలే నటించారు. అవి - నందిత నటించిన 'నీకు నాకు డాష్ డాష్, ప్రేమకథా చిత్రమ్' సినిమాలు, శ్రీ దివ్య నటించిన 'బస్ స్టాప్, మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు'. ఈషా నటించిన 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాలు. ఇవన్నీ చిన్న సినిమాలే కావడం గమనించాల్సిన విషయం. 'ప్రేమ ఇష్క్ కాదల్' లో నటించిన శ్రీముఖి, వితిక, 'అలియాస్ జానకి' లో నటించిన 'అనీషా' లు కూడా తెలుగు అమ్మాయిలే.

ఇప్పటి అగ్రదర్శకులు అనబడే రాజమౌళి, వి.వి. వినాయక్, కృష్ణవంశీ, గుణశేఖర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల మొదలైన వారు వారు తీసే సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదనే చెప్పవచ్చు. కొంతలో కొంత అప్పటి మన దర్శకులు, సీనియర్ దర్శకులు ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కు అవకాశం ఇచ్చారు. కె. రాఘవేంద్రరావు - 'శ్రీ రామదాసు, పాండురంగడు' సినిమాల్లో స్నేహకు, వంశీ 'దొంగరాముడు అండ్ పార్టీ' లో లయకు, 'కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను' లో అర్చనకు, కె.విశ్వనాధ్ 'స్వరాభిషేకం' లో లయకు, బాపు 'రాధాగోపాళం' స్నేహకు హీరోయిన్స్ గా అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న పెద్ద సినిమాల్లో దాదాపుగా మన తెలుగు కథానాయికలు లేరని చెప్పవచ్చు.

ఏది ఏమైనా మన పాతతరం హీరోలే మేలు. తమ చిత్రాల్లో తప్పనిసరిగా తెలుగు నాయికలే ఉండేటట్లు చేసేవారు. అప్పటి కథానాయికలు కూడా తమ అద్భుతమైన నటనతో చిత్రసీమను ఏలారు. కానీ ఇప్పటి తరం నటులు అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు తీస్తున్నారు. అవికూడా ఫాస్ట్ గానే వెనక్కి వెలుతున్నాయి. హీరోయిన్స్ కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. అయితే తమిళం నుండి, లేదంటే మలయాళం నుండి, లేదా ముంభై నుండో, గుజరాత్ నుండో వస్తారు. చాలా తక్కువ సినిమాలకే వెనుతిరుగుతున్నారు. పాతతరం నటీమణుల మాదిరి పట్టుమని పది సినిమాలు కూడా చేయడం లేదు.

'నచ్చావులే!' లో హీరోయిన్ గా నటించిన మాధవీలత, 'జై చిరంజీవ, అశోక్, నరసింహుడు', సినిమాల్లో నటించిన సమీరారెడ్డి, 'ఆ నలుగురు' లాంటి ఫీల్ గుడ్ మూవీ తీసిన చంద్ర సిద్ధార్ధ తన మొదటి చిత్రం 'అప్పుడప్పుడు' సినిమాలో రాజా సరసన హీరోయిన్ గా నటించిన శ్రేయారెడ్డి (సమీరా రెడ్డి అక్క), చంద్ర సిద్ధార్ధ తీసిన 'అందరి బంధువయ' లో నటించిన పద్మ ప్రియ, ఇలా ఎంతోమంది తెలుగు హీరోయిన్స్ నటించారు. కానీ ఇవన్నీ చిన్న సినిమాలే (సమీరా రెడ్డి నటించినవి అన్నీ పెద్ద సినిమాలే). పెద్దగా నిలబడలేకపోయారు. కారణం పెద్ద దర్శకులు అవకాశాలు ఇవ్వకపోవడం!

మరిన్ని సినిమా కబుర్లు
heights of nudity